వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సమీకృత ఆఫ్‌షోర్ ప్రణాళికను సమర్థవంతంగా మార్చేందుకు, భారత నీలి ఆర్థిక వ్యవస్థను పెంచేందుకు ఉద్దేశించిన పీఎం గతిశక్తి - ఆఫ్‌షోర్ ప్రారంభం
వివిధ మంత్రిత్వ శాఖల నుంచి డేటాను ఏకీకృతం చేయటం ద్వారా ప్రభుత్వ ప్రణాళిక,
భారతదేశ ఆఫ్‌షోర్ సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించేలా చూసుకోనున్న గతిశక్తి- ఆఫ్‌షోర్
ప్రమాదాలను తగ్గించటం, అనుమతులను క్రమబద్ధీకరించటం, సమగ్ర తీరప్రాంతేతర అభివృద్ధికి
మద్దతు ఇచ్చేందుకు డేటా ఆధారిత పరిష్కారాలను అందించనున్న గతిశక్తి- ఆఫ్‌షోర్
प्रविष्टि तिथि:
13 OCT 2025 5:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌కు (ఎన్ఎంపీ) నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగంలోని (డీపీఐఐటీ) రవాణా విభాగం ‘పీఎం గతిశక్తి - ఆఫ్‌షోర్’ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్ అధ్యక్షత వహించారు.
పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా ఉన్న పీఎం గతిశక్తి-ఆఫ్‌షోర్‌ను.. సముద్రాలపై అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక, నిర్వహణ కోసం డిజిటల్ వేదికగా అభివృద్ధి చేశారు. ఈ వేదిక సముద్రాలపై పవన విద్యుతుత్పత్తి కేంద్రాలు, సముద్ర వనరుల అన్వేషణ, తీరప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి ప్రాజెక్టుల విషయంలో డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కల్పించనుంది. దీని కోసం వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి కీలకమైన డేటాసెట్‌లను సమీకృతం చేస్తూ ఏకీకృత జియోస్పేషియల్ వేదికను అందిస్తుంది. భారతదేశ నీలి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం.. హరిత విద్యుత్, సుస్థిర తీరప్రాంతాభివృద్ధి వైపు భారత్ పరివర్తన చెందేందుకు తోడ్పాటునందించే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది.
ఈ వేదిక నూతన - పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, పర్యావరణం- అటవీ- వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాల మంత్రిత్వ శాఖ, మత్స్య శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ల శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి డేటాసెట్‌లను ఏకీకృతం చేసే ఏకోన్ముఖ ప్రభుత్వ విధానాన్ని కలిగి ఉంది. వివిధ మంత్రిత్వ శాఖలు ఆటంకం లేకుండా ఏకీకరణతో పనిచేయటం వల్ల భారత్‌కు విస్తృతంగా ఉన్న తీరప్రాంతేతర సామర్థ్యాన్ని సమగ్ర ప్రణాళిక, సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
శక్తి- వనరులు, పర్యావరణం- జీవావరణం, మౌలిక సదుపాయాలు- లాజిస్టిక్స్.. సముద్ర, ప్రమాద డేటా వంటి విభాగాల కింద వర్గీకరించిన భౌగోళిక ప్రాదేశిక అంచెలకు సంబంధించిన విస్తృతమైన డేటా ఈ పోర్టల్‌లో ఉంటుంది. సముద్రాలపై పనవ విద్యుత్, సౌర- ఆటుపోట్లు- అలలు - సముద్ర ఉష్ణ శక్తి ఉత్పత్తి సామర్థ్యం.. చమురు- గ్యాస్ క్షేత్రాలు, పైప్లైన్లు.. సముద్రాల లోతు, అవక్షేపణ బేసిన్లు.. తీరప్రాంత నియంత్రణ మండలాలు.. పగడపు దిబ్బలు, మడ అడవులు, సముద్ర క్షీరదాల కేంద్రాలు.. ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు, చేపల రేవులు.. ఉపరితల ప్రవాహాలు, తరంగాలు ఎత్తు, భూకంప ప్రమాద మండలాలు వంటి సముద్ర, ప్రమాద సూచికలతో పాటు వివరణాత్మక డేటాసెట్‌లు వీటిలో ఉన్నాయి. ఈ డేటా ప్రణాళిక సంస్థలు, నియంత్రణ సంస్థలు, పెట్టుబడిదారులకు స్థిరమైన, సాంకేతికంగా వెసులుబాటు అయ్యే నిర్ణయం తీసుకునేందుకు కావాల్సిన వివరాలను అందిస్తాయి.
తీరప్రాంతేతర అభివృద్ధిపై పనిచేస్తోన్న భిన్న భాగస్వాములకు ఈ వేదిక గణనీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇది ప్రణాళిక దశలోనే తీరప్రాంతాల మౌలిక సదుపాయాల విషయంలో సంఘర్షణ, నియంత్రణ సవాళ్లను తెలుసుకోవటాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా ప్రాజెక్ట్ జాప్యాలు, నష్టాలను తగ్గిస్తుంది. ఇది ఆఫ్‌షోర్ ప్రాంత నిర్వహణ, వనరుల కేటాయింపుకు సమగ్రమైన, డేటా-ఆధారిత విధానాన్ని అవలంభించేందుకు అనుమతించటంతో పాటు పర్యావరణ ప్రభావ అంచనా, అనుమతుల ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ధ్రువీకరించిన ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చిన ప్రామాణికమైన భౌగోళిక ప్రాదేశిక డేటా కేంద్రీకృత సమాచార కేంద్రంగా పనిచేస్తుంది.
సముద్రాలపై విద్యుత్ ప్రసార మార్గాలను ఉదాహరణగా తీసుకుంటే.. ప్రణాళిక సమయంలోనే ఈ వేదిక విద్యుత్ మంత్రిత్వ శాఖ, పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ, పర్యావరణం- అటవీ- వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ల శాఖతో సహా బహుళ మంత్రిత్వ శాఖల నుంచి సమాచారాన్ని ఏకీకృతం చేసి అందిస్తుంది. భారత ప్రధాన భూభాగాన్ని అండమాన్ నికోబార్ దీవులతో అనుసంధానించే ప్రతిపాదిత హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ (హెచ్వీడీసీ) సముద్రాంతర లింక్ విషయంలో తక్కువ ఖర్చుతో కేబుళ్లను వేసేందుకు సరిపోయే సముద్రగర్భ లోతులను గుర్తించడానికి బాతిమెట్రీ డేటాను విశ్లేషించవచ్చు. దీనితో పాటు పగడపు దిబ్బలు, మడ అడవులు, తాబేలు గూడు కట్టే ప్రాంతాలు తదితర వంటి సున్నితమైన ప్రాంతాలను తాకకుండా ఉండేందుకు కూడా ఇది సహాయపడుతుంది. హైడ్రోకార్బన్ అన్వేషణ బ్లాక్లు, ఆప్టికల్ ఫైబర్ మార్గాలు, సముద్ర ట్రాఫిక్ కారిడార్‌ల డేటా.. సాంకేతికంగా సాధ్యమయ్యే పర్యావరణ అనుకూల అమరికలను ఎంచుకునే విషయంలో మార్గనిర్దేశం చేస్తుంది.
బహుళ స్థాయి విశ్లేషణ, చిత్రీకరణను అందించటం ద్వారా పీఎం గతిశక్తి - ఆఫ్‌షోర్.. జాతీయ తీరప్రాంతేతర ప్రణాళికలో ఖచ్చితత్వం, పారదర్శకత, స్థిరత్వం ఉండేలా చూసుకుంటుంది. వ్యూహాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భౌగోళిక ప్రాదేశిక నిఘాను పెంచటం, నీలి ఆర్థిక వ్యవస్థ సమతుల్య వృద్ధిని ప్రోత్సహించడం, 2047 నాటికి వికసిత్ భారత్ జాతీయ దార్శనికతను ముందుకు తీసుకెళ్లే విషయంలో పెరుగుతోన్న భారతదేశ సామర్థ్యానికి ఈ వేదిక నిదర్శనంగా పనిచేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2178749)
आगंतुक पटल : 29