లోక్‌సభ సచివాలయం
ప్రజాస్వామ్య స్ఫూర్తికి, సమానత్వానికి సజీవ సాక్ష్యమే భారత్: లోక్‌సభ స్పీకర్
వాతావరణ మార్పులు, మహమ్మారులు, ఆహార అభద్రత లాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచమంతా ఏకమవ్వాలి : లోక్‌సభ స్పీకర్
ఆహారం, పోషకాహార భద్రతలో ప్రపంచానికి భారతే విశ్వసనీయ భాగస్వామి: లోక్‌సభ స్పీకర్
గత 75 ఏళ్లుగా రాజ్యాంగం దేశానికి మార్గనిర్దేశం చేస్తోంది: లోక్‌సభ స్పీకర్
ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, వ్యక్తుల ఆత్మ గౌరవమనే దీపమే కామన్వెల్త్ దేశాల పౌరులకు వెలుగులు అందిస్తోంది: లోక్‌సభ స్పీకర్
68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ సాధారణ అసెంబ్లీలో లోక్‌సభ స్పీకర్ ప్రసంగం: 2026 జనవరిలో న్యూఢిల్లీలో జరిగే సీఎస్‌పీవోసీలో పాల్గొనాలని ప్రిసైడింగ్ అధికారులకు ఆహ్వానం
Posted On:
11 OCT 2025 6:23PM by PIB Hyderabad
గత 75 ఏళ్లుగా రాజ్యాంగం అందిస్తున్న మార్గదర్శకత్వంతో ప్రజాస్వామ్యం, సమానత్వానికి భారత్ సజీవ సాక్ష్యంగా నిలుస్తోందని లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా అన్నారు. ప్రజాస్వామ్యమే భారత్ ఆత్మ అని, సమానత్వమే సంకల్పమని, న్యాయమే దేశ గుర్తింపు అని ఆయన వివరించారు. ‘‘ది కామన్వెల్త్ - ఎ గ్లోబల్ పార్టనర్’’ అనే ఇతివృత్తంపై నిర్వహించిన 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ సాధారణ అసెంబ్లీలో ప్రతినిధులను ఉద్దేశిస్తూ శ్రీ బిర్లా ప్రసంగించారు. 2026 జనవరి 7 నుంచి 9 మధ్య జరిగే కామన్వెల్త్ దేశాల స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సదస్సు (సీఎస్‌పీఓసీ)కు హాజరవ్వాలని కామన్వెల్త్ పార్లమెంటరీ ప్రిసైడింగ్ అధికారులను ఆహ్వానించారు.
వాతావరణ మార్పు, మహమ్మారులు, ఆహార అభద్రత, అసమానత్వం లాంటి అంతర్జాతీయ సంక్షోభాలు సరిహద్దులను దాటి విస్తరిస్తాయని, వాటికి సమష్టి పరిష్కారాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సంయుక్తంగా కృషి చేయాలని కోరుతూ.. వీటికి ఒంటరిగా పరిష్కారం కనుక్కోవడం అసాధ్యమని శ్రీ బిర్లా అన్నారు.
ఆహారం, పోషకాహర భద్రతలో విశ్వసనీయైన ప్రపంచ భాగస్వామిగా భారత్ పోషిస్తున్న కీలక పాత్ర గురించి వివరిస్తూ.. ఆహారం,ఆరోగ్య భద్రతకు ఉన్న ప్రాధాన్యాన్నిస్పష్టం చేశారు. ఒకప్పుడు ఆహారం కోసం ఇతర దేశాలపై భారత్ ఆధారపడేదని గుర్తు చేసుకుంటూ ఆ పరిస్థితుల నుంచి అంతర్జాతీయ శక్తిగా ప్రస్తుత స్థాయికి చేరుకున్న ప్రయాణం అద్భుతమన్నారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో భారత్ అందించిన గణనీయమైన సహకారాన్ని ప్రస్తావిస్తూ.. 150కి పైగా దేశాలకు ఔషధాలు, టీకాలను సరఫరా చేసిందని, ఇది ఆరోగ్యం హక్కు అని.. అది ప్రత్యేకమైనది కాదనే నమ్మకాన్ని స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ స్థాయిని శ్రీ బిర్లా వివరించారు. నిర్దేశించిన సమయానికంటే ముందుగానే.. ప్యారిస్ ఒప్పందాన్ని పూర్తిచేసిన మొదటి దేశంగా భారత్ నిలిచిందని గర్వంగా వెల్లడించారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తులను తట్టుకొనే మౌలిక సదుపాయాల కల్పన సమితి తదితర కార్యక్రమాల ద్వారా ఈ గ్రహం పట్ల ప్రపంచ బాధ్యతను భారత్ తెలియజెప్పింది.
పంచాయతీ రాజ్, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అందించే నిబంధనల గురించి వివరిస్తూ.. మహిళా సాధికారత దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలను శ్రీ బిర్లా ప్రస్తావించారు. పంచాయతీ రాజ్ సంస్థల్లో ఎన్నికైన 3.1 మిలియన్ల మంది ప్రజాప్రతినిధుల్లో 1.4 మిలియన్లకు పైగా మహిళలున్నారని వెల్లడించారు. అలాగే.. పార్లమెంట్, శాసనసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ చట్టం గురించి తెలియజేశారు. భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో యువత, మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు.
ప్రజాస్వామ్యంలో పారదర్శకతను, ప్రభావాన్ని ప్రధానంగా కృత్రిమ మేధ, డిజిటల్ వేదికలు వంటి సాంకేతిక పరిజ్ఞానాలు పెంపొందిస్తాయని శ్రీ బిర్లా అన్నారు. మానవాళికి సేవలందించే విధంగా సాంకేతికత ఉండాలని.. దీనికి విరుద్ధంగా ఉండకూడదని స్పష్టం చేశారు. దీన్ని సాధించాలంటే... నష్టాన్ని నివారిస్తూ ఆవిష్కరణలను ప్రోత్సహించే అంతర్జాతీయ ప్రమాణాలను ఏర్పాటు చేయాలని, ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తూనే.. సాంకేతికత ప్రయోజనాలను అందరికీ చేరువ చేయాలని సూచించారు.
భారతీయ పురాతన ప్రజాస్వామ్య వారసత్వం గురించి వివరిస్తూ.. ప్రాచీన నాగరికత, సంస్కృతి, గ్రామ పంచాయతీ వ్యవస్థలో భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి వేళ్లూనుకొందని శ్రీ బిర్లా అన్నారు. చర్చ, ఏకాభిప్రాయం, సమష్టి నిర్ణయాల సంప్రదాయమే.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తిగా భారత్ అవతరించడానికి దోహదపడిందని చెప్పారు. భారతీయ సంప్రదాయ విజ్ఞానం, ఈ ప్రపంచమంతా ఒక్కటే అని చెప్పే ‘వసుధైవ కుటుంబకం’ అనే ప్రాచీన మంత్రం.. దేశానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయని శ్రీ బిర్లా తెలియజేశారు.
కామన్వెల్త్ దేశాల వైవిధ్యం గురించి చర్చిస్తూ.. వేర్వేరు భాషలు మాట్లాడుతున్నప్పటికీ, వివిధ సంప్రదాయాలు అనుసరిస్తున్నప్పటికీ.. వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితులున్నప్పటికీ కామన్వెల్త్ దేశాలన్నీ.. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, వ్యక్తుల ఆత్మ గౌరవం అనే ఉమ్మడి విలువలతో ఏకమై ఉన్నాయన్నారు. కామన్వెల్త్ అంటే దేశాల సమూహం మాత్రమే కాదని.. ఉమ్మడి చరిత్ర, సంయుక్త విలువలు, ఉమ్మడి భవిష్యత్తు సమష్టి లక్ష్యంతో కలిసి ఉన్న కుటుంబమని వర్ణించారు. ఈ ప్రయాణంలో క్రియాశీలక భాగస్వామిగా భారత్ కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
***
(Release ID: 2177964)
Visitor Counter : 2