కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కనెక్టివిటీ, ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించడం ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్న భారత్, బ్రిటన్
అధునాతన టెలికమ్యూనికేషన్లలో ఆవిష్కరణలను ఏకం చేసి, వాణిజ్య అవకాశాలను ప్రోత్సహించనున్న కనెక్టివిటీ, ఇన్నోవేషన్ సెంటర్
టెలికమ్యూనికేషన్లలో పరిశోధన, ఆవిష్కరణ, అంతర్జాతీయ ప్రమాణాలను ప్రోత్సహించడానికి £24 మిలియన్లను కేటాయించిన భారత్, బ్రిటన్
యూకే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ (యూకేఆర్ఐ), భారత టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్) భాగస్వామ్యంతో భారత్, బ్రిటన్ టెక్నాలజీ సెక్యూరిటీ కార్యక్రమం కింద కొత్త కనెక్టివిటీ సెంటర్ ఏర్పాటు
Posted On:
10 OCT 2025 6:50PM by PIB Hyderabad
డిజిటల్ సమ్మిళిత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, సురక్షితమైన, వినూత్నమైన కమ్యూనికేషన్‌ల భవిష్యత్తును రూపుదిద్దడానికి భారత్, బ్రిటన్ ఈ రోజు ఒక చారిత్రాత్మక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా, భారత్, బ్రిటన్ కనెక్టివిటీ, ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించాయి. ఈ కేంద్రం రెండు దేశాల ఆవిష్కరణలలోని పరస్పర సామర్ధ్యాలను ఒకచోట చేర్చడం ద్వారా, అనుసంధానతలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. విశ్వవిద్యాలయాలలోని ఆధునిక పరిశోధనలను ల్యాబ్ టెస్టింగ్‌లు, క్షేత్రస్థాయి పరిశీలనలు (ఫీల్డ్ ట్రయల్స్), మార్కెట్ అమలు దశలతో అనుసంధానిస్తుంది. ఈ కార్యక్రమం పరిశ్రమ భాగస్వాములకు ఆవిష్కరణలు చేయడం, ఉత్పత్తులను పరీక్షించడం, వాటిని విస్తరించడం ద్వారా మార్కెట్‌లోకి ప్రవేశించే మార్గాన్ని సుగమం చేస్తూ కొత్త వాణిజ్య అవకాశాలను సృష్టిస్తుంది.
వచ్చే నాలుగు సంవత్సరాల్లో అంటే 6జీ సాంకేతిక, వాణిజ్య ప్రమాణాలు రూపుదిద్దుకునే కీలక సమయంలో ఈ కేంద్రం మూడు ప్రధాన రంగాల్లో పురోగతికి దోహదం చేస్తుంది.
-
కృత్రిమ మేధతో టెలికాం రంగంలో మార్పు - అధునాతన ఏఐ సాధనాలను ఉపయోగించి నెట్‌వర్క్‌లను మెరుగుపరచడం, సామర్థ్యాన్ని పెంచడం, కొత్త సేవలను ప్రారంభించడం.
-
నాన్-టెర్రెస్ట్రియల్ నెట్‌వర్క్స్ (ఎన్టీఎన్ఎస్) - గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు నమ్మకమైన, అధిక వేగం కలిగిన కనెక్టివిటీ అందించేందుకు ఉపగ్రహ, వైమానిక వ్యవస్థలను అభివృద్ధి చేయడం.
-
టెలికాం సైబర్‌సెక్యూరిటీ - నెట్‌వర్క్ భద్రతను బలోపేతం చేయడం, పరస్పర పరిష్కారాలను అభివృద్ధి చేయడం, తద్వారా సమాచార వ్యవస్థలను వ్యాపారాలు, వినియోగదారుల కోసం మరింత స్థిరమైన, నమ్మదగినవిగా తీర్చిదిద్దడం.
కనెక్టివిటీ, టెలికమ్యూనికేషన్ టెక్నాలజీలు మన ఆర్థిక వ్యవస్థలకు, సమాజాలకు కీలకాధారం. వాటిని ఒకే వేదికపై కలిపి అభివృద్ధి చేయడం వల్ల రెండు దేశాలకు ఆర్థిక, భద్రతా ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత్, బ్రిటన్ వచ్చే నాలుగేళ్లకాలానికి ఉమ్మడిగా £24 మిలియన్ల ప్రారంభ నిధిని కేటాయించాయి. ఈ నిధులు రెండు దేశాలలోని ప్రసిద్ధ పరిశోధనా కేంద్రాల మధ్య పరిశోధనకు, పరిశ్రమ - విద్యా భాగస్వామ్యాలకు, ఉమ్మడి టెస్ట్‌బెడ్‌లకు ప్రపంచ సాంకేతిక ప్రమాణాల అభివృద్ధిలో నిర్దేశిత సహకారాన్ని అందిస్తాయి.
ఈ కార్యక్రమాన్ని యూకేఆర్ఐ (యుకె రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్), డాట్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్) సంయుక్తంగా అమలుచేస్తాయి. బ్రిటన్ - ఇండియా టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ లో భాగంగా ఈ కార్యక్రమం యుకె-ఇండియా పరిశోధన, ఆవిష్కరణలకు ఉదాహరణగా నిలుస్తుంది ఇది ప్రధానమంత్రుల 2035 విజన్లో నిర్దేశించిన ఉమ్మడి ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది.
***
(Release ID: 2177737)
Visitor Counter : 19