రక్షణ మంత్రిత్వ శాఖ
దక్షిణ చైనా సముద్రం, ఇండో-పసిఫిక్ ప్రాంతాలకు కార్యాచరణ విస్తరణ కోసం మలేషియాలోని కెమామన్‌ను సందర్శించిన భారత నావికాదళ నౌక సహ్యాద్రి
Posted On:
05 OCT 2025 12:39PM by PIB Hyderabad
దక్షిణ చైనా సముద్రం, ఇండో-పసిఫిక్ ప్రాంతాలకు తూర్పు నౌకాదళ కార్యాచరణ విస్తరణలో భాగంగా భారత నావికాదళానికి చెందిన స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ సహ్యాద్రి ఈ నెల 2వ తేదీన మలేషియాలోని కెమామన్ ఓడరేవును సందర్శించింది. ఇరు దేశాల మధ్య శాశ్వత సాంస్కృతిక సంబంధాలు, ఉమ్మడి నౌకా వాణిజ్య సంప్రదాయాలను గౌరవిస్తూ రాయల్ మలేషియన్ నేవీ ఈ నౌకకు హృదయపూర్వక స్వాగతం పలికింది.
2012లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, నిర్మించి, విధుల్లో నియమించిన ఐఎన్ఎస్ సహ్యాద్రి శివాలిక్ క్లాస్ గైడెడ్ మిస్సైల్ స్టీల్త్ ఫ్రిగేట్స్‌లో మూడో నౌకగా ఉంది. ఈ నౌక 'ఆత్మనిర్భర్ భారత్' దార్శనికతకు ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. అనేక ద్వైపాక్షిక, బహుపాక్షిక ప్రక్రియల్లోనూ, కార్యాచరణ విస్తరణల్లోనూ ఇది పాలుపంచుకుంది.
ఐఎన్ఎస్ సహ్యాద్రి మలేషియాను సందర్శించడం ఇది మూడోసారి. ఈ నౌక గతంలో 2016లో గుడ్‌విల్ మిషన్‌లో భాగంగా పోర్ట్ క్లాంగ్‌ను సందర్శించింది. ఆ తర్వాత 2019లో కోట కినాబాలులో జరిగిన 'సముద్ర లక్సమాన' ప్రక్రియలోనూ పాల్గొంది. ఈ సందర్శనలు ఇరు దేశాల మధ్య బలమైన, అభివృద్ధి చెందుతున్న నావికా సంబంధాలను స్పష్టం చేస్తున్నాయి.
దక్షిణ చైనా సముద్రం, ఇండో-పసిఫిక్ ప్రాంతాలకు ఐఎన్ఎస్ సహ్యాద్రి కార్యాచరణ విస్తరణ కొనసాగింపు.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బాధ్యతాయుతమైన నౌకా వాణిజ్య భాగస్వామిగా, ప్రాధాన్య భద్రతా భాగస్వామిగా భారత్ స్థాయిని సూచిస్తుంది. కెమామన్ ఓడరేవు వద్ద ఈ నౌక పోర్ట్ కాల్.. భారత్-మలేషియా నౌకా వాణిజ్య సైనిక సహకారాన్ని, రెండు నౌకాదళాల పరస్పర సామర్థ్యాన్ని, ఉత్తమ నావికా పద్ధతులను పంచుకోవడం లక్ష్యంగా సాగింది.
మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ షిప్ కమాండింగ్ ఆఫీసర్.. మలేషియా డిప్యూటీ కమాండర్ నావల్ రీజియన్ ఫస్ట్ అడ్మిరల్ అబ్ద్ హలీమ్ బిన్ కమరుదిన్‌తో పాటు రాయల్ మలేషియన్ నేవీ సీనియర్ అధికారులతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్శనలో భాగంగా వృత్తిపరమైన అనుభవాలను పంచుకోవడంతో పాటు భారత నావికాదళం, ఆర్‌ఎంఎన్ అధికారుల క్రాస్ విజిట్లు, క్రాస్-ట్రైనింగ్, రెండు నావికాదళాల మధ్య క్రీడా మ్యాచ్లు, అలాగే ఐఎన్ఎస్ సహ్యాద్రి సిబ్బంది వినోదం కోసం నగర సందర్శనలు కూడా జరిగాయి.
ఆరోగ్యం, కరుణ, భారత్-మలేషియా స్నేహాన్ని బలోపేతం చేయడంల పట్ల భారత నావికాదళ నిబద్ధతను ప్రతిబింబిస్తూ, సిబ్బంది యోగా, వితరణ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
భారత్-మలేషియాలు వేల సంవత్సరాలుగా విస్తరిస్తూ ఉన్న లోతైన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక సంబంధాల ద్వారా రూపొందిన గొప్ప, బహుముఖ సంబంధాలను పంచుకుంటున్నాయి. భౌగోళిక రాజకీయ సముద్ర దృశ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంత ప్రాముఖ్యం పెరుగుతున్నందున, పరస్పర ప్రయోజనాల ఆధారంగా ప్రాంతీయ భాగస్వామ్యాలను నిర్మించాల్సిన ప్రాముఖ్యతను ఇరు దేశాలు ప్రధానంగా ప్రస్తావించాయి. భారత్ చేపట్టిన మహాసాగర్ కార్యక్రమం, ఏషియాన్స్ ఇండో-పసిఫిక్ ఔట్‌లుక్ (ఏఓఐపీ)తో మలేషియా సమన్వయం నౌకా వాణిజ్య భాగస్వామ్యంలో ఇరు దేశాలకు శ్రేయస్సును అందిస్తున్నాయి.
ద్వైవార్షిక ఎల్ఐఎమ్ఏ ప్రదర్శన, ఎమ్ఐఎల్ఏఎన్ ప్రక్రియల ద్వారా భారత్-మలేషియా నావికా దళాల మధ్య సంబంధాలు సంవత్సరాలుగా క్రమంగా మెరుగవుతూ ఉన్నాయి. భారత నావికాదళం, ఆర్ఎమ్ఎన్ నౌకల మధ్య 2024లో జరిగిన మూడో ఎడిషన్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ (ఎఫ్‌టీఎక్స్) - 'సముద్ర లక్సమాన' విజయవంతమవడం ఈ ప్రాంతంలో నౌకా వాణిజ్య భద్రతను, సహకారాన్ని బలోపేతం చేయడం పట్ల ఇరు దేశాల నిబద్ధతను స్పష్టం చేసింది.
***
(Release ID: 2175003)
Visitor Counter : 2