కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో అక్టోబర్ 6 నుంచి 7 వరకు నిర్వహించనున్న 2వ ‘కార్పోరేట్ సామాజిక బాధ్యతపై జాతీయ సమావేశం, ప్రదర్శన (ఎన్‌సీసీఎస్ఆర్)’కు ఆతిథ్యం ఇవ్వనున్న ఐఐసీఏ
'గిరిజన అభివృద్ధి కోసం సీఎస్‌ఆర్ ఉపయోగాన్ని పెంచడం' అనే ఇతివృత్తంతో జరగనున్న సమావేశం
సీఎస్ఆర్ విషయంలో చర్చ, భాగస్వామ్యాలకు జాతీయ వేదికగా పనిచేయనున్న ఎన్‌సీసీఎస్ఆర్
సమ్మిళిత, స్థిరమైన వృద్ధి కోసం వినూత్న సీఎస్ఆర్ నమూనాలను ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎన్‌సీసీఎస్ఆర్-2025
प्रविष्टि तिथि:
05 OCT 2025 12:54PM by PIB Hyderabad
అక్టోబర్ 6-7 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న 2వ ‘కార్పోరేట్ సామాజిక బాధ్యతపై జాతీయ సమావేశం, ప్రదర్శన (ఎస్‌సీసీఎస్ఆర్)’కు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) ఆతిథ్యం ఇవ్వనుంది. "గిరిజన అభివృద్ధికి సీఎస్‌ఆర్ ఉపయోగాన్ని పెంచటం" అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ కార్యక్రమాన్ని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో ఐఐసీఏకు చెందిన స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమానికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ, రోడ్డు రవాణా- జాతీయ రహదారుల శాఖల సహాయ మంత్రి.. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి.. ప్రభుత్వ రంగ సంస్థల శాఖ కార్యదర్శి, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఐఐసీఏ డైరెక్టర్- సీఈఓ, భారత్‌కు సంబంధించిన యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్, ఇతర ప్రముఖ నిపుణులు హాజరవుతారు. ఈ సమావేశం ఐఐసీఏ డైరెక్టర్ జనరల్ - సీఈఓ శ్రీ జ్ఞానేశ్వర్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. ఐఐసీఏకు చెందిన స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ హెడ్ డాక్టర్ గరిమా దధిచ్ మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్నారు.
ధర్మకర్త, బాధ్యతాయుతమైన వ్యాపారం అనే మహాత్మగాంధీ ఆలోచనల నుంచి ప్రేరణ పొందిన ఐఐసీఏ.. అక్టోబర్ 2న సీఎస్ఆర్ దినోత్సవాన్ని చేసుకుంటోంది. ప్రస్తుతం నిర్వహించనున్న సమావేశం మూలాలు ఈ సీఎస్‌ఆర్ దినోత్సవంలో ఉన్నాయి. భారత సీఎస్ఆర్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో చర్చ, గుర్తింపు, సహకారానికి జాతీయ వేదికను అందిస్తూనే గాంధేయ విలువలను ఈ సమావేశం నిలబెడుతోంది.
దేశవ్యాప్తంగా ఉపయోగించేందుకు వీలున్న వినూత్న సీఎస్ఆర్ నమూనాలను ప్రదర్శిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు, కార్పొరేట్ వ్యూహాలు, స్వదేశీ జ్ఞానం మధ్య సమన్వయాన్ని పెంపొందించాలని ఎన్‌సీసీఎస్ఆర్- 2025 లక్ష్యంగా పెట్టుకుంది.
ఎన్‌సీసీఎస్ఆర్- 2025లో ఆరు ఉన్నత స్థాయి నిపుణుల ప్యానెల్ చర్చలు, సామాజిక ఆవిష్కరణల ప్రత్యక్ష ప్రయోగశాల, గిరిజన సాంస్కృతిక ప్రదర్శన, 30–35 స్టాళ్లతో కూడిన ప్రత్యేక ప్రదర్శనలు ఉండనున్నాయి. సామాజిక ప్రభావాన్ని చూపించే ఆదర్శవంతమైన ప్రాజెక్టులను గుర్తిస్తూ సీఎస్‌ఆర్ ఉత్తమ పద్ధతులను తెలిపే జాతీయ సంకలనాన్ని కూడా విడుదల చేయనున్నారు. ట్రైఫెడ్, హెచ్‌సీఎల్ ఫౌండేషన్, యూనిసెఫ్, ఐఓసీఎల్, గేల్, స్పార్క్ మిండా, పార్టనర్స్ ఇన్ చేంజ్, అమ్రితా విశ్వ విద్యాపీఠం తదితతర ప్రముఖ సంస్థలు చేపడుతోన్న మార్గదర్శక సీఎస్‌ఆర్ కార్యక్రమాలను క్రియాశీలకంగా ప్రదర్శించనున్నాయి.
ఎన్‌సీసీఎస్ఆర్- 2025లో పాల్గొనే ప్రతినిధులు జాతీయ సీఎస్ఆర్ ప్రాధాన్యతనలను రూపొందించేందుకు దోహదపడటమే కాకుండా పరివర్తనాత్మక కార్యక్రమాలను ప్రదర్శించటం, విభిన్న రంగాల భాగస్వామ్యాలను తయారుచేయటం, గిరిజన కేంద్రీకృత సమ్మిళిత వృద్ధికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంలో సహాయపడే అవకాశాన్ని పొందుతారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న దిశగా చేస్తోన్న ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే శక్తిమంతమైన ఉద్యమంలో పాలుపంచుకునేందుకు ఇదొక అరుదైన అవకాశంగా ఉంటుంది.
***
(रिलीज़ आईडी: 2175001)
आगंतुक पटल : 37