వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన


అమల్లోకి వచ్చిన ఇండియా-ఈఎఫ్‌టీఏ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2025 9:55PM by PIB Hyderabad

భారత్, ఈఎఫ్‌టీఏ దేశాలు (ఐస్‌లాండ్, లీచ్టెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్) మధ్య కీలకమైన వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ)-2025 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇరు పక్షాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలలో ఒక ముఖ్యమైన ముందడుగుగా ఇది నిలుస్తోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తోంది. ఈఎఫ్‌టీఏ దేశాలన్ని కలిసి వస్తువులు, సేవల వాణిజ్యం..  రెండింటిలోనూ ప్రపంచ నాయకత్వ స్థానంలో ఉన్నాయి. భారత్, ఈఎఫ్‌టీఏ దేశాలు కలిస్తే సుమారు 5.4 ట్రిలియన్ డాలర్ల జీపీడీ ఉంది. ఇది ఇరు పక్షాల మధ్య మరింత ధృడమైన సంబంధాలకు ఉన్న అవకాశాలను తెలియజేస్తోంది. 

ఈ సందర్భంగా ఢిల్లీలో సమృద్ధి సదస్సు (ప్రోస్పెరిటీ సమ్మిట్) పేరుతో భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఉన్నత స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్విట్జర్లాండ్ దేశ ఆర్థిక వ్యవహారాల కార్యాలయం స్టేట్ సెక్రటరీ హెలీన్ బడ్లిగర్ ఆర్టీడా, ఐస్లాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్యం- ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ రాగ్నార్ క్రిస్ట్‌జాన్సన్, లీచ్టెన్‌స్టెయిన్ విదేశాంగ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ క్రిస్టీన్ లింగ్, భారతదేశంలో నార్వే రాయబారి మే-ఎలిన్ స్టెనర్, ఈఎఫ్‌టీఏ డిప్యూటీ సెక్రటరీ జనరల్ మార్కస్ ష్లాగెన్‌హాఫ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి, ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి అవకాశాన్ని అందించిన ఈ కార్యక్రమం.. అన్ని దేశాల వ్యాపార ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఇక్కడ చేపట్టిన వాణిజ్యపరమైన చర్చలు..  ప్రిసిషన్ తయారీ, హరిత సాంకేతికతలో సహోత్పత్తిని సులభతరం చేయటంతో పాటు అంచనా వేయదగిన చలనశీలత, అర్హతల గుర్తింపు ద్వారా సేవలను పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. 

పదిహేను సంవత్సరాల్లో భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టాలన్న ఉమ్మడి లక్ష్యాన్ని ప్రతినిధులు స్వాగతించారు. ఇది 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఈ పెట్టుబడులను పర్యవేక్షించేందుకు, సులభతరం చేసేందుకు యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. 

టీఈపీఏ అమలవ్వటం.. ఈఎఫ్‌టీఏ దేశాలు, భారత్ మధ్య సంబంధాలను మరింతగా పెంచడం, భాగస్వామ్యాలను ఏర్పాటు చేయటంతో పాటుగా వాణిజ్యం- పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ఒక నిర్ణయాత్మక పురోగతిగా నిలుస్తుంది. ప్రమాణాల విషయంలో భాగస్వామ్యం, నియంత్రణకు సంబంధించిన చర్చల సహకారంతో వస్తు సేవలు, పెట్టుబడులలో వాణిజ్యాన్ని విస్తరించడం, వాణిజ్యపరమైన కార్యకలాపాల్లో ఏకీకరణను బలోపేతం చేయడం ద్వారా అన్ని పక్షాలు సమతుల్య, స్థిరమైన ఫలితాలను అందుకోనున్నాయి. 

ఈ ఒప్పందం మరింత ధృడమైన, మెరుగైన సమీకృత సరఫరా వ్యవస్థ వాణిజ్యం- పెట్టుబడులు పెంపు, కొత్త ఉద్యోగ అవకాశాలు, సుస్థిర ఆర్థిక వృద్ధితో సహా గణనీయమైన దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేందుకు సిద్ధంగా ఉంది. ఇది మార్కెట్‌ అందుబాటును మరింత మెరుగుపరచటంతో పాటు కస్టమ్స్ విధానాలను క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా భారతీయ, ఈఎఫ్‌టీఏ దేశాల వ్యాపార సంస్థలు కార్యకలాపాలను వర్థమాన మార్కెట్లకు విస్తరించటాన్ని సులభతరం చేస్తుంది.

ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించటంతో పాటు సులభతరం చేస్తుంది. భారతీయ, ఈఎఫ్‌టీఏ దేశాల వ్యాపార సంస్థల విషయంలో నూతన ఆవిష్కరణల, విస్తరణకు అవకాశం ఇస్తూ అభివృద్ధి చెందేందుకు వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యాన్ని ఈ ఒప్పందం పెట్టుకుంది. గత దశాబ్దంలో వస్తు వాణిజ్యం క్రమంగా పెరిగిందని, సేవల విషయంలో వాణిజ్యం దాదాపు రెట్టింపు అయిందని అన్ని పక్షాలు తెలియజేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం గణనీయంగా పెంచేందుకు కృషి చేయనున్నట్లు దేశాలు ప్రకటించాయి. 

భారత్-ఈఎఫ్‌టీఏ... టీఈపీఏ‌పై 2024 మార్చి 10న ఢిల్లీలో సంతకం చేశారు. ధృడత్వంతో కూడిన విశ్వసనీయమైన ప్రపంచ సరఫరా వ్యవస్థలను తయారుచేసేందుకు, విశ్వసనీయ భాగస్వాములుగా ఒప్పందంలోని దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలన్న దేశాల ఆలోచనను అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉంది. 

 

****


(రిలీజ్ ఐడి: 2174134) సందర్శకుల సూచీ సంఖ్య : : 53
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Malayalam