ఆయుష్
లే...లోని జాతీయ సోవా రిగ్పా జాతీయ సంస్థకు స్కూల్ బస్సును ప్రదానం చేసిన ఎస్‌బీఐ
Posted On:
18 SEP 2025 10:32AM by PIB Hyderabad
లే ప్రాంతంలోని జాతీయ సోవా రిగ్పా సంస్థ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోవా రిగ్పా..ఎన్ఐఎస్ఆర్)కు ఒక స్కూల్ బస్సును భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) బహూకరించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)గా ఎస్‌బీఐ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ స్కూల్ బస్సును అందించింది. ఎస్‌బీఐ చండీగఢ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ కృషన్ శర్మ ఈ బస్సును ఎన్ఐఎస్ఆర్ డైరెక్టరు డాక్టర్ పద్మా గుర్మేత్ కు ఈ రోజు లేలో లాంఛనంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ జమ్మూకాశ్మీర్ జోన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (బిజినెస్, కార్యకలాపాలు) శ్రీ జయంత్ మణి, ఎస్‌బీఐ లే బ్రాంచి చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ అనిల్ టాండన్, బ్యాంకుకు చెందిన ఇతర సీనియర్ అధికారులతో పాటు ఎన్ఐఎస్ఆర్ ఫేకల్టీ సభ్యులు, సిబ్బంది, ఎన్ఐఎస్ఆర్ విద్యార్థులు పాల్గొన్నారు.
లే లోని ఎన్ఐఎస్ఆర్ విద్యార్థుల కోసం స్కూల్ బస్సును ఇచ్చినందుకు ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ కృషన్ శర్మకు ఎన్ఐఎస్ఆర్ డైరెక్టరు డాక్టర్ పద్మా గుర్మేత్ కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ సోవా రిగ్పా సంస్థ కార్యకలాపాలను, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను డాక్టర్ పద్మా గుర్మేత్ సంక్షిప్తంగా వివరించారు.
ఆహూతులను ఉద్దేశించి ఎస్‌బీఐ చండీగఢ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ కృషన్ శర్మ ప్రసంగిస్తూ, దేశవ్యాప్తంగా ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఎస్‌బీఐ అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రజాసేవకూ, ప్రాంతీయ అభివృద్ధికీ కట్టుబడి పనిచేసే సంస్థలతో భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేసుకోవాలని ఎస్‌బీఐ నిబద్ధతతో ఉందని ఆయన స్పష్టం చేశారు.
స్టేట్ బ్యాంకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలను అమలుచేస్తూ, లద్దాఖ్ సామాజిక- ఆర్థిక ప్రగతికి తోడ్పడే దిశగా నిరంతరంగా కృషి చేస్తోందని ఈ కార్యక్రమం చాటి చెబుతోంది.
***
(Release ID: 2168266)