నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
భూఉష్ణ శక్తి సాంకేతికత దిశగా జాతీయ విధానాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
2070 నాటికి ‘నికర సున్నా ఉద్గారాలు’ సాధించాలన్న భారతదేశ లక్ష్యానికి
అనుగుణంగా స్వచ్ఛ ఇంధన మార్పును వేగవంతం చేయనున్న జాతీయ విధానం
పరిశోధన, ఆవిష్కరణ, సాంకేతికత, వ్యవస్థల అభివృద్ధి, సామర్థ్యాల పెంపు,
భాగస్వామ్యాల ద్వారా సరికొత్త సాంకేతికతను వాడుకలోకి తీసుకురావాలన్నది లక్ష్యం
స్వచ్ఛ ఇంధనం, సామూహిక తాపనం, వ్యవసాయ వినియోగం, ఆక్వాకల్చర్, భూ ఆధారిత ఉష్ణ పంపుల సాంకేతికత (జీఎస్‌హెచ్‌పీ) ద్వారా నిజ వాతావరణ విధానం
సాధ్యాసాధ్యాలతో పాటు సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు దేశవ్యాప్తంగా
అయిదు పైలట్ ప్రాజెక్టుల మంజూరు
प्रविष्टि तिथि:
17 SEP 2025 5:34PM by PIB Hyderabad
2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలన్న భారతదేశ ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని చేరుకోవడం, వైవిధ్యభరితమైన పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయాలన్న నిబద్ధతకు అనుగుణంగా జాతీయ భూఉష్ణ శక్తి విధానాన్ని (2025) ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
భూఉష్ణ శక్తి స్వచ్ఛమైనదే కాకుండా విశ్వసనీయమైనది. భారతదేశం ఇప్పటి వరకూ వినియోగంలో లేని భూఉష్ణ వనరులను.. విద్యుతుత్పత్తితో పాటుగా సామూహిక తాపనం (డిస్ట్రిక్ట్ హీటింగ్), వ్యవసాయం, ఆక్వాకల్చర్, భూ ఆధారిత ఉష్ణ పంపుల సాంకేతికత (జీఎస్‌హెచ్‌పీ- గ్రౌండ్ సోర్స్ హీట్ పంప్స్) ద్వారా గదులను చల్లబరచటం- వేడిగా చేయటం వంటి ప్రత్యక్ష ప్రయోజనాలకు ఉపయోగించనుంది. కొత్తగా ప్రకటించిన ఈ విధానం.. దేశంలో భూఉష్ణ శక్తి అన్వేషణ, అభివృద్ధి, వినియోగాన్ని ప్రోత్సహించడానికి సమగ్ర విధివిధానాలను అందిస్తోంది.
జాతీయ విధానంలోని ముఖ్యాంశాలు
* పరిశోధన, ఉత్తమ పద్ధతులు: భూఉష్ణ శక్తి అభివృద్ధి విషయంలో పరిశోధన, మంత్రిత్వ శాఖల మధ్య సహకారం, ప్రపంచ ఉత్తమ పద్ధతులను అవలంభించటాన్ని ప్రోత్సహిస్తుంది. భూఉష్ణ శక్తి విషయంలో నియంత్రణ, పర్యవేక్షణ బాధ్యతలను మంత్రిత్వ శాఖనే నిర్వహించనుంది.
* జాతీయ లక్ష్యాలతో ఏకీకరణ: పునరుత్పాదక ఇంధన లక్ష్యాలతో పాటు 2070 సంవత్సరం వరకు నికర సున్నా ఉద్గారాలను సాధించాలన్న భారతదేశ లక్ష్యంతో భూఉష్ణ శక్తిని ఏకీకృతం చేయాలని ఈ విధానం లక్ష్యంగా పెట్టుకుంది.
* విభిన్న అనువర్తనాలు: విద్యుతుత్పత్తి, గదులను వేడి చేయటం లేదా చల్లబరచటం, వ్యవసాయం (గ్రీన్‌హౌస్‌లు, శీతలీకరణ కేంద్రాలు), పర్యాటకం, ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చటంపై (డీశాలినేషన్) దృష్టి సారించనుంది.
* సాంకేతిక ఆవిష్కరణ: భూ ఉష్ణం- సౌర విద్యుత్‌తో కూడిన హైబ్రిడ్ కేంద్రాలు, వాడుకలో లేని చమురు బావులను తిరిగి ఉపయోగించేందుకు సిద్ధం చేయటం, మెరుగైన లేదా అధునాతన భూఉష్ణ వ్యవస్థలు (ఈజీఎస్ లేదా ఏజీఎస్) వంటి అత్యాధునిక సాంకేతికతలపై పరిశోధన- అభివృద్ధిని ఇది ప్రోత్సహిస్తుంది.
* స్థానిక ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు: స్థానిక ఆవిష్కరణలు, జాయింట్ వెంచర్లు, ఇప్పటికే ఉన్న చమురు- గ్యాస్ మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి ఇది ప్రాధాన్యతనిస్తుంది.
* భాగస్వామ్యాలు: భూఉష్ణానికి సంబంధించిన అంతర్జాతీయ సంస్థలు, ఈ రంగంలో మార్గదర్శక స్థాయిలో ఉన్న దేశాలతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవటం.. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, చమురు- గ్యాస్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేయటం.
* భూఉష్ణ రంగ వ్యవస్థను అభివృద్ధి చేయటం: భూఉష్ణ రంగ దీర్ఘకాలిక అభివృద్ధి కోసం బలమైన ప్రభుత్వ-ప్రైవేట్ వ్యవస్థను తయారుచేయటం.
* సామర్థ్య నిర్మాణం: ఈ రంగంలో విజ్ఞానానికి సంబంధించిన భాగస్వామ్యం, మానవ వనరుల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
భూఉష్ణ శక్తి అన్వేషణలో మొదటి మెట్టుగా మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన అయిదు ప్రాజెక్టులను మంజూరు చేసింది. దేశంలో భూఉష్ణ శక్తి సాధ్యాసాధ్యాలతో పాటు సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టులతో పాటు వనరులను అంచనా వేసే ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుల పురోగతిని నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) సమీక్షిస్తుంది. ప్రాజెక్టులను చేపట్టే సంస్థలతో పాటు పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో చురుకుగా పాల్గొనడానికి అనుకూలమైన వాతావరణం ఉండేలా చూసుకోవటాన్ని కొనసాగిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2167916)
आगंतुक पटल : 27