ఆర్థిక మంత్రిత్వ శాఖ
వస్తుసేవల పన్ను మండలి 56వ సమావేశం నిర్ణయాలపై తరచూ తలెత్తే సందేహాలు-సమాధానాలు (FAQs-2)
Posted On:
16 SEP 2025 3:10PM by PIB Hyderabad
1. ప్రశ్న: దేశంలో 2025 సెప్టెంబరు 22కు ముందు మార్కెట్‌లోగల మందులపై గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)ను తొలగించి సవరించిన ధరను చూపాల్సి ఉంటుందా... అయితే, ఎలా చూపాలి?
జవాబు: ఈ అంశంపై జాతీయ ఔషధ ధరల నిర్ణాయక ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) సెప్టెంబరు 12, 13 తేదీలలో అంతర్గత సమాచారం (ఓఎం) ద్వారా కింది విధంగా వివరణ ఇచ్చింది:
· మందులు/ఔషధ సమ్మేళనాల వ్యాపారం చేసే తయారీ/మార్కెటింగ్ సంస్థలన్నీ (వైద్య పరికరాలు సహా) వాటి గరిష్ట చిల్లర ధరను సవరించాలి.
· సవరించిన ‘జీఎస్‌టీ’ శాతాలతోపాటు ‘ఎంఆర్‌పీ’ని కూడా వినియోగదారులకు ప్రత్యక్షంగా ప్రదర్శించాలి. ఇందుకోసం అన్ని తయారీ/మార్కెటింగ్ సంస్థలు తమ డీలర్లు/చిల్లర విక్రేతలు సహా రాష్ట్ర ఔషధ నియంత్రణాధికారులకు, ప్రభుత్వానికి ఫారం V/VI ద్వారా సవరించిన లేదా అనుబంధ ధరల జాబితాను అందజేయాలి.
· చిల్లర విక్రేతల స్థాయిలో సవరించిన ధరలను అమలు చేసేలా తయారీ/మార్కెటింగ్ సంస్థలు పర్యవేక్షించే పక్షంలో సెప్టెంబరు 22కు ముందు మార్కెట్లోగల మందుల (కంటైనర్ లేదా ప్యాక్)పై పాత ధర తొలగింపు, కొత్త ధర చూపడం లేదా స్టిక్కర్ వేయడం తప్పనిసరి కాదు.
దీనికి సంబంధించిన ‘ఓఎం’లను కేంద్ర ఔషధ విభాగం పరిధిలోని ‘ఎన్‌పీపీఏ’ వెబ్‌సైట్లలో చూడవచ్చు.
2. ప్ర: చోదక రహిత విమానాల (డ్రోన్లు)పై లోగడ 5, 18, 28 శాతాల్లో పన్ను ఉండేది. ‘జీఎస్‌టీ’ మండలి 56వ సమావేశం దీన్ని 5 శాతంగా నిర్ణయించిన నేపథ్యంలో అన్ని రకాల డ్రోన్లకూ ఇది వర్తిస్తుందా?
జ: ఇంతకుముందు వ్యక్తిగత వినియోగ డ్రోన్లపై 28 శాతం, డిజిటల్/వీడియో కెమెరా రికార్డర్ సహిత డ్రోన్లపై 18 శాతం, ఇతర అన్నిరకాలపై 5 శాతం వంతున ‘జీఎస్‌టీ’ ఉండేది.
అయితే, 03.09.2025నాటి ‘జీఎస్‌టీ’ మండలి 56వ సమావేశం అన్నిరకాల డ్రోన్లపైనా పన్నును 5 శాతంగా నిర్ణయిస్తూ సిఫారసు చేసింది.
3. ప్ర: ఇటుకలపై ఇప్పుడు జీఎస్‌టీ శాతం ఎంత?
జ: ఉత్పాదక సామర్థ్య ఆధారిత పన్ను, ప్రత్యేక మిశ్రమ పన్ను పథకంపై మంత్రిమండలి ఉపసంఘం నివేదిక సిఫారసులను 2021 సెప్టెంబరు 17నాటి 45వ ‘జీఎస్‌టీ’ మండలి సమావేశం ఆమోదించింది. తదనుగుణంగా ఇటుకలకు (సున్నపు రాయి+ఇసుకతో చేసేవి మినహా) 2022 ఏప్రిల్ 1 నుంచి ప్రత్యేక మిశ్రమ పన్ను పథకాన్ని వర్తింపజేసింది. దీని ప్రకారం- వస్తువులకు వర్తించే రూ.40 లక్షల వార్షిక టర్నోవర్‌కు బదులు రూ.20 లక్షల వార్షిక టర్నోవర్ పరిమితితో ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) లేకుండా 6 శాతం, ‘ఐటీసీ’తో 12 శాతం వంతున పన్ను విధించారు. అయితే, 2025 సెప్టెంబరు 3నాటి 56వ సమావేశం సాధారణ ఇటుకలపై ప్రత్యేక మిశ్రమ పన్ను పథకం కింద పన్ను విధింపులో ఎలాంటి మార్పును ప్రకటించలేదు. కానీ, సున్నపు రాయి+ఇసుకతో చేసే ఇటుకలపై పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ సిఫారసు చేసింది. అందువల్ల, ఇసుకరాయి+సున్నపు ఇటుకలు మినహా ఇతరత్రా అన్ని రకాల ఇటుకలపై రూ.20 లక్షల వార్షిక టర్నోవర్ పరిమితితో ‘ఐటీసీ’ లేకుండా 6 శాతం, ‘ఐటీసీ’తో 12 శాతం పన్ను యథాతథంగా కొనసాగుతుంది.
4. ప్ర: వ్యక్తిగత జీవిత-ఆరోగ్య బీమాపై మినహాయింపు పరిధిలోకి వచ్చే బీమా సేవలు ఏవి?
జ: ఒక బృందంగా కాకుండా వ్యక్తిగతంగా ఆరోగ్య-జీవిత బీమా పాలసీ తీసుకునే వారికి బీమా సంస్థలు అందించే వ్యాపార సేవలు మినహాయింపు పరిధిలోకి వస్తాయి. అలాగే వ్యక్తికి లేదా అతని/ఆమె కుటుంబ సభ్యుల విషయంలోనూ మినహాయింపు వర్తిస్తుంది.
5. ప్ర: వ్యక్తిగత ఆరోగ్య-జీవిత బీమా పాలసీలపై బీమా సంస్థల సేవలకు వర్తించే తరహాలో ఇన్‌పుట్ సేవలకూ ఈ మినహాయింపు లభిస్తుందా?
జ: బీమా సంస్థలు ప్రస్తుతం కమీషన్లు, బ్రోకరేజ్, రీఇన్సూరెన్స్ వంటి అనేక ఇన్‌పుట్‌లు, ఇన్‌పుట్ సేవలపై ‘ఐటీసీ’ ప్రయోజనం పొందుతున్నాయి. ఈ ఇన్‌పుట్ సేవలలో రీఇన్సూరెన్స్ సేవలకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. అయితే, అవుట్‌పుట్ సేవలకు మినహాయింపు లభిస్తుంది కాబట్టి, ఇతరత్రా ఇన్‌పుట్‌లు లేదా ఇన్‌పుట్ సేవలపై ‘ఐటీసీ’ రద్దవుతుంది.
6. ప్ర: రోజుకు రూ.7500/- అంతకన్నా తక్కువ విలువగల వసతిని అందించే హోటళ్లకు ఆ వసతిపై ‘ఐటీసీ’తో 18 శాతం పన్నుకు వీలుందా?
జ: రోజుకు యూనిట్‌పై రూ.7500/- అంతకన్నా తక్కువగల హోటల్ వసతిపై ‘ఐటీసీ’ లేకుండా 5 శాతం జీఎస్‌టీ వసూలు తప్పనిసరి. కాబట్టి, ‘ఐటీసీ’తో 18 శాతం ‘జీఎస్‌టీ’కి అవకాశం ఉండదు.
7. ప్ర: రోజుకు రూ.7500/- అంతకన్నా తక్కువ విలువగల వసతిని అందించే హోటళ్లకు ‘ఐటీసీ’ పొందే అవకాశం ఉంటుందా?
జ: రోజుకు యూనిట్‌పై రూ.7500/- అంతకన్నా తక్కువగల హోటల్ వసతిపై ‘ఐటీసీ’ పొందే అవకాశం లేదు. ఎందుకంటే- అటువంటి వసతిపై 5 శాతం జీఎస్‌టీ విధింపును మండలి తప్పనిసరి చేసింది.
8. ప్ర: సౌందర్య, శారీరక శ్రేయస్సు సేవలపై ఐటీసీ లేకుండా 5 శాతం పన్ను తప్పనిసరిగా వసూలు చేయాలా? సేవా ప్రదాతలు ‘ఐటీసీ’తో 18 శాతం పన్ను వసూలు చేసే వీలుందా?
జ: సౌందర్య, శారీరక శ్రేయస్సు సేవలపై ఐటీసీ లేకుండా 5 శాతం పన్ను వసూలు తప్పనిసరి. సేవా ప్రదాతలు ‘ఐటీసీ’తో 18 శాతం పన్ను వసూలు చేసే వీల్లేదు.
9. ప్ర: ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సిన సందర్భాల్లో సేవా ప్రదాతలు ‘ఐటీసీ’ విషయంలో ఎలా వ్యవహరించాలి?
జ: అలాంటి సందర్భాల్లో
ఎ. సదరు సేవల ప్రదానానికి ప్రత్యేకంగా ఉపయోగించే వస్తువులు లేదా సేవలపై విధించే ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను సేవా ప్రదాతలు పొందే వీల్లేదు.
బి. సేవల ప్రదానం కోసం పాక్షికంగా వాడే వస్తుసేవలకు, ఇతరత్రా పన్ను విధించగల సేవల కోసం పాక్షికంగా వాడే వస్తుసేవలకు చెల్లించే పన్నుపై సేవా ప్రదాతలు పొందే ఐటీసీని వాపసు చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు ‘సీజీఎస్‌టీ చట్టం-2017’లోని సెక్షన్ 17(2)తోపాటు దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ఐటీసీ లేకుండా 5 శాతం పన్ను విధింపును పూర్తి మిహాయింపుగా పరిగణిస్తూ ఆ నిష్పత్తిలో ఐటీసీని వాపసు చేయాలి.
10. ప్ర: బస్సుల బాడీ బిల్డింగ్ సంబంధిత సేవలపై విధించే జీఎస్‌టీ శాతం ఎంత?
జ: బస్సుల బాడీ బిల్డింగ్ సంబంధిత సేవలపై ‘ఐటీసీ’ లేకుండా 18 శాతం జీఎస్‌టీ విధిస్తారు. ఇంతకుముందు ఈ సేవలు ఒక నిర్దిష్ట పద్దు [హెడింగ్ 9988 పూర్వపు ప్రత్యేక పద్దు (ic] కిందకు వస్తాయి కాబట్టి, ‘ఐటీసీ’తో 18 శాతం పన్ను విధించేవారు. అయితే, ఇటీవలి పన్ను హేతుబద్ధీకరణ కసరత్తులో ఇలాంటి సేవలతోపాటు లేదా ఇతరత్రా అన్నిరకాల తయారీ సేవలను ప్రత్యేక పద్దుతో నిమిత్తం లేకుండా ‘ఐటీసీ’తో 18 శాతం పన్ను పరిధిలోకి చేర్చారు.
11. ప్ర: ఇటుకల సంబంధిత సేవలకు వర్తించే జీఎస్‌టీ శాతం ఎంత?
జ: జీఎస్‌టీ 5 శాతం వర్తించే (ఉదా॥ సున్నపు రాయి+ఇసుకతో చేసే) ఇటుకల సంబంధిత సేవలపై ఇప్పుడు అదే 5 శాతం పన్ను ‘ఐటీసీ’ సహితంగా వర్తిస్తుంది.
12. ప్ర: బహుళ వాహన వస్తు రవాణాకు వర్తించే జీఎస్‌టీ ఎంత?
జ: బహుళ వాహన (కనీసం రెండు వేర్వేరు వాహనాలను వినియోగించే) వస్తు రవాణాదారులకు పన్ను విధింపు కింది విధంగా ఉంటుంది:
ఎ. పరిమిత ‘ఐటీసీ’తో 5 శాతం- అంటే... ఏ దశలోనూ విమాన మార్గంలో వస్తు రవాణా లేనట్లయితే ఇన్‌పుట్ సేవలపై మొత్తం విలువలో 5 శాతం పరిమితితో మాత్రమే ‘ఐటీసీ’ లభిస్తుంది.
బి. కనీసం ఒక దశలో విమాన మార్గం సహా వస్తు రవాణాపై పూర్తి ‘ఐటీసీ’తో 18 శాతం పన్ను విధింపు ఉంటుంది.
13. ప్ర: ఏ దశలోనూ విమాన రవాణా లేకుండా బహుళ వాహన రవాణా సేవలపై 5 శాతం పన్నుతో ‘ఐటీసీ’ పొందవచ్చా?
జ: వస్తు రవాణాలో ఇన్‌పుట్ సేవల మొత్తం విలువలో 5 శాతానికి పరిమితం. సదరు సేవల సరఫరాదారు అధిక శాతం పన్ను వసూలు చేసినప్పటికీ ఇందుకు అనుమతి ఉంటుంది. అయితే, ఇతర ఇన్‌పుట్‌లు లేదా ఇన్‌పుట్ సేవలపై ‘ఐటీసీ’ పొందే వీల్లేదు.
ఉదాహరణ: న్యూఢిల్లీ నుంచి గయ నగరానికి వస్తు రవాణా కోసం ‘ఎ’ విమాన మార్గ రవాణా లేకుండా రూ.1200 కిరాయితో ‘బి’ (బహుళ వాహన రవాణాదారు)ని ఏర్పాటు చేసుకుంటాడు. అటుపైన ‘బి’ రూ.600 అద్దెతో 18 శాతం పన్ను వసూలు చేసే వస్తు రవాణా సంస్థ (జీటీఏ) ‘సి’కి బాధ్యత అప్పగిస్తాడు. అలాగే రూ.400 అద్దెతో 5 శాతం పన్ను వసూలు చేసే కంటైనర్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్ (సీటీఓ) ‘డి’ని ఏర్పాటు చేసుకుంటాడు.
ఇక్కడ ‘బి’ అందించే రవాణా సేవలకు జీఎస్‌టీ : 5 శాతం
‘బి’కి లభించే ఐటీసీ:
ఎ. ‘జీటీఏ’ ఇన్‌పుట్: రూ.108 కాదు (రూ.600పై 18 శాతం); కేవలం రూ.30 (రూ.600పై 5 శాతం) మాత్రమే
బి. ‘సీటీవో ఇన్‌పుట్: రూ.20 (రూ.400పై 5 శాతం).
14. ప్ర: బహుళ వాహన వస్తు రవాణాలో విమాన మార్గం కూడా ఒకటైతే పన్ను విధింపు ఎలా ఉంటుంది?
జ: కనీసం ఒక దశ రవాణాకు విమాన మార్గం వినియోగంపై 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. అటువంటి సందర్భాల్లో మొత్తం ఇన్‌పుట్‌లు లేదా ఇన్‌పుట్ సేవలపై ‘ఐటీసీ’ వర్తిస్తుంది.
ఉదాహరణ: న్యూఢిల్లీ నుంచి గయ నగరానికి వస్తు రవాణా కోసం ‘ఎ’ విమాన మార్గ రవాణా సహా రూ.1200 కిరాయితో ‘బి’ (బహుళ వాహన రవాణాదారు)ని ఏర్పాటు చేసుకుంటాడు. అటుపైన ‘బి’ కూడా రూ.800 అద్దెతో విమాన మార్గం సహా రవాణా సేవలందించే ‘సి’తోపాటు రూ.200 అద్దెతో ‘డి’ని ‘జీటీఏ’గా ఏర్పాటు చేసుకుంటాడు. వీరు 18 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తారు.
‘బి’ అందించే సేవపై జీఎస్‌టీ 18 శాతం కాగా, అతనికి ‘ఐటీసీ’ లభిస్తుంది.
‘బి’ కి లభించే ఐటీసీ:
ఎ. ‘జీటీఏ’ ఇన్‌పుట్: రూ.36 (రూ.200పై 18 శాతం)
బి. విమాన మార్గంలో వస్తు రవాణాపై ఇన్‌పుట్: రూ.144 (రూ.800పై 18 శాతం).
15. ప్ర: ఈ-కామర్స్ ఆపరేటర్ (ఈసీఓ) ద్వారా స్థానిక బట్వాడా సేవలపై జీఎస్‌టీ చెల్లింపు బాధ్యత ఎవరిది?
జ: ఈసీవో ద్వారా స్థానిక బట్వాడా సేవలందించే వ్యక్తిపై జీఎస్‌టీ చట్టంలోని 22(1) కింద నమోదు చేసుకోవాల్సిన బాధ్యత లేని పక్షంలో వారి సేవలు సీజీఎస్‌టీ చట్టంలోని సెక్షన్ 9(5) కిందకు వస్తాయి. అలాంటి సందర్భాల్లో జీఎస్‌టీ చెల్లింపు బాధ్యత ‘ఈసీఓ’దే.
16. ప్ర: స్థానిక బట్వాడా సేవలపై విధించే పన్ను శాతం ఎంత?
జ: స్థానిక బట్వాడా సేవలపై పన్ను 18 శాతంగా ఉంటుంది.
నమోదిత వ్యక్తి స్థానిక బట్వాడా సేవలను నేరుగా అందిస్తే: 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలి.
నమోదు అవసరం లేని వ్యక్తి ‘ఈసీఓ’ ద్వారా బట్వాడా సేవలందిస్తే: సెక్షన్ 9(5) కింద ‘ఈసీఓ’ 18 శాతం వంతున జీఎస్‌టీ చెల్లించాలి.
నమోదిత వ్యక్తి ‘ఈసీఓ’ ద్వారా స్థానిక బట్వాడా సేవలందిస్తే: ఆ వ్యక్తే స్వయంగా 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలి.
17. ప్ర: స్థానిక బట్వాడా సేవలందించే ‘ఈసీఓ’ వస్తు రవాణా సంస్థ (జీటీఏ) కిందకు వస్తుందా? ఈ సేవలను ‘ఈసీఓ’ ద్వారా అందిస్తే దాని ప్రభావం ఏమిటి?
జ: కింద పేర్కొన్నవి వస్తు రవాణా సంస్థ (జీటీఏ) పరిధిలోకి రావు:
ఎ. నేరుగా స్థానిక బట్వాడా సేవలందించే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ (ఈసీఓ)
బి. ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ద్వారా స్థానిక బట్వాడా సేవలందించే వారు.
బి. విమాన
18. ప్ర: ఆపరేటర్ లేని లీజింగ్ లేదా అద్దె సేవలపై పన్ను విధానం ఏమిటి?
జ: ఆపరేటర్ లేని లీజింగ్ లేదా అద్దె సేవలలో అధిక భాగం వస్తు సరఫరాపై విధించే పన్ను శాతం పరిధిలోకి వస్తాయి. దీనికి సంబంధించి జీఎస్‌టీ మండలి ఎలాంటి మార్పునూ ప్రతిపాదించలేదు. అందువల్ల అటువంటి సేవలపై పన్ను వస్తు సరఫరాకు వర్తించే శాతంతో సమానంగా కొనసాగుతుంది.
· ఉదాహరణకు॥ కార్లు లేదా యంత్రాలపై 18 శాతం పన్ను విధించిన పక్షంలో వాటిని (ఆపరేటర్ లేని) అద్దె లేదా లీజుకు ఇచ్చినపుడు కూడా పన్ను 18 శాతంగానే ఉంటుంది. అదేవిధంగా ఏదైనా మోటారు వాహనం సరఫరాపై 40 శాతం లేదా 5 శాతం పన్ను విధించినట్లయితే, లీజు లేదా అద్దె సేవల (ఆపరేటర్ లేని) టర్ లేకుండా)పైన కూడా పన్ను 40 శాతం లేదా 5 శాతంగానే ఉంటుంది.
19. ప్ర: ఆపరేటర్ ద్వారా కారును లీజుకు లేదా అద్దెకు ఇస్తే పన్ను శాతం ఎంత?
జ: ఆపరేటర్ ద్వారా (ఉదాహరణకు డ్రైవర్) కారు లీజుకు/అద్దెకు ఇచ్చే సేవాప్రదాత అదే కార్యకలాపాలు నిర్వహించేవారి ఇన్‌పుట్ సేవలపై ‘ఐటీసీ’తో 5 శాతం లేదా పూర్తి ఐటీసీతో 18 శాతం వంతున జీఎస్‌టీ వసూలు చేసే వీలుంటుంది.
***
(Release ID: 2167783)
Visitor Counter : 7