వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

89వ అంతర్జాతీయ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ (ఐఈసీ) సర్వసభ్య సమావేశానికి భారత్‌ ఆతిథ్యం


· ‘ఓఐఎంఎల్‌’ నమూనా ఆమోద ధ్రువీకరణ పత్రం జారీచేసే 13వ దేశంగా భారత్‌: ఆహార-వినియోగదారు వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్‌ జోషి

· “డిజిటల్ ఇండియా.. పునరుత్పాదక ఇంధనం.. సుస్థిర సాంకేతికతలలో దేశం ముందంజ”

· “దేశవ్యాప్తంగా 474 కేంద్రాల ద్వారా ధరలపై పర్యవేక్షణ... 11 సంవత్సరాల్లో కనిష్ఠ స్థాయికి ద్రవ్యోల్బణం”

· “దాదాపు 24,000 ప్రమాణాలు.. విస్తృత ధ్రువీకరణ పరిధి... హాల్‌మార్కింగ్‌లో కీలక సంస్కరణలతో దేశ
ప్రగతిలో భాగస్వామిగా విస్తరిస్తున్న ‘బీఐఎస్‌’ పాత్ర”

· “ఎలక్ట్రానిక్స్.. కాలుష్య రహిత సాంకేతికతలకు ప్రపంచ కూడలిగా భారత్‌ ఆవిర్భావానికి పీఎల్‌ఐ పథకాలు.. సెమీకాన్ ఇండియా.. గ్రీన్ ఎనర్జీ మిషన్‌ సారథ్యం”

Posted On: 15 SEP 2025 8:57PM by PIB Hyderabad

ప్రపంచవ్యాప్త ‘ఓఐఎంఎల్‌’ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ) నమూనా ఆమోద ధ్రువీకరన పత్రం జారీచేసే 13వ దేశంగా భారత్‌ ఆవిర్భవించిందని కేంద్ర వినియోగదారు వ్యవహారాలు-ఆహార-ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి చెప్పారు. న్యూఢిల్లీలో ఇవాళ మొదలైన 89వ అంతర్జాతీయ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ (ఐఈసీ) సర్వసభ్య సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన ఈ మేరకు ప్రకటించారు. భారత లీగల్‌ మెట్రాలజీ చరిత్రలో ఇదొక కీలక ఘట్టమని పేర్కొంటూ- డిజిటల్ ఇండియా, పునరుత్పాదక ఇంధనం, సుస్థిర సాంకేతికతల పరంగానూ ప్రపంచ దేశాలకన్నా భారత్‌ ముందంజలో ఉందని మంత్రి ప్రకటించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలనలో ఎన్నడూ లేనంత పటిష్ఠ నియంత్రణ వల్ల దేశంలో ద్రవ్యోల్బణం నేడు 11 సంవత్సరాల కనిష్ఠ స్థాయికి దిగివచ్చిందని శ్రీ జోషి తెలిపారు. దేశవ్యాప్తంగా 474 పర్యవేక్షణ కేంద్రాల ఏర్పాటుతో నిత్యావసరాల ధరలపై నిరంతర నిఘా కొనసాగించడమే ఇందుకు కారణమని ఆయన వివరించారు.

‘భారత ప్రామాణిక కాలమానం’ (ఐఎస్‌టీ)లో కచ్చితత్వం విస్తృతి దిశగా తమ శాఖ కృషి చేస్తున్నదని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ (ఎన్‌పీఎల్‌), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో సంయుక్తంగా త్వరలోనే ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలిపారు. దేశంలోని 5 ప్రదేశాల నుంచి ‘ఐఎస్‌టీ’ విస్తృతికి అవసరమైన సాంకేతికతల సృష్టి, మౌలిక సదుపాయాల కల్పన ఈ ప్రాజెక్టు లక్ష్యాలని ఆయన వివరించారు. వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాలకు కచ్చితమైన సమయం నిర్ధారించడం అత్యంత అవశ్యమన్నారు.

ఎలక్ట్రో టెక్నికల్ రంగంలో ప్రపంచ ప్రమాణాలకు ప్రాచుర్యం కల్పించడంలో ‘ఐఈసీ’ గురుతర పాత్ర పోషించిందని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు స్వచ్ఛంద, ఏకాభిప్రాయ ఆధారిత ప్రామాణీకరణపై నిబద్ధతగల ఈ సంస్థ- సాంకేతిక సామర్థ్యం, సమష్టి కృషి, సురక్షిత-సార్వజనీన-సుస్థిరత సహిత ప్రపంచానికి రూపమివ్వడంలో ఎంతగానో తోడ్పడిందని చెప్పారు. ఆవిష్కరణలు, జ్ఞాన భాగస్వామ్యం, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ప్రోత్సహించే వాతావరణంలో ప్రపంచ అగ్రశ్రేణి ఎలక్ట్రోటెక్నికల్ నిపుణులను ఒకే వేదికపైకి తెచ్చే సంప్రదాయాన్ని కొనసాగించడంపై ‘ఐఈసీ’కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది భారత ప్రమాణాల సంస్థ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-బీఐఎస్) ఆధ్వర్యాన సమావేశ నిర్వహణ అవకాశం మన దేశానికి దక్కడం విశేషమన్నారు.

ప్రపంచ ప్రామాణీకరణ పయనంలో భాగంగా భారత్‌ పరిణామశీల ప్రగతి సాధించడంలో ‘బీఐఎస్’ కీలక పాత్ర పోషించిందని శ్రీ జోషి కొనియాడారు. జాతీయ ప్రమాణాల సంస్థగా సాంకేతిక చట్రాలను బలోపేతం చేస్తూ, స్థిరత్వం లక్షిత ప్రామాణీకరణను కూడా దానితో ఏకీకృతం చేసిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై చురుకైన భాగస్వామ్యంతో ప్రమాణాల మధ్య సమన్వయం ఇనుమడించేందుకు ‘బీఐఎస్’ కృషి చేసిందని చెప్పారు. ఈ క్రమంలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, అన్ని రంగాలలో గ్రీన్ టెక్నాలజీ అభివృద్ధికి దోహదం చేసిందని వివరించారు.

గడచిన 11 సంవత్సరాల దేశ పురోగమనంలో ఒక సాంకేతిక నియంత్రణ సంస్థ నుంచి నిజమైన భాగస్వామి స్థాయికి ‘బీఐఎస్‌’ తన పాత్రను విస్తృతం చేసిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో నేడు దాదాపు 24,000 భారతీయ ప్రమాణాలు అమలులో ఉన్నాయని తెలిపారు. అన్ని రకాల ఉత్పత్తుల భద్రత, పనితీరు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేవిధంగా ఈ ప్రమాణాలు నిర్దేశిస్తాయని చెప్పారు. ఈ సంస్థ ధ్రువీకరణ పరిధి 2014లో 14 నాణ్యత నియంత్రణ ఉత్తర్వుల (క్యూసీఓ) ద్వారా కేవలం 106 ఉత్పత్తులకు పరిమితమని మంత్రి గుర్తుచేశారు. అయితే, నేడు 186 ‘క్యూసీఓ’లతోపాటు 2 సమాంతర ‘క్యూసీఓ’లు, ఒక ఏకీకృత సాంకేతిక నియంత్రణ చట్రం కింద 769 ఉత్పత్తులకు విస్తరించిందని వెల్లడించారు. అలాగే బంగారు ఆభరణాల నాణ్యతకు సంబంధించి 2021 జూలైలో ‘హెచ్‌యూఐడీ ఆధారిత హాల్‌మార్కింగ్’ విధానాన్ని అమలులోకి తేవడాన్ని ఒక కీలక సంస్కరణగా ఆయన పేర్కొన్నారు. అప్పటినుంచీ నేటిదాకా దీనికింద 48 కోట్లకుపైగా వస్తువులకు ‘హాల్‌మార్క్’ గుర్తింపు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రమాణం జారీచేసే కేంద్రాల సంఖ్య 2014లో 285 కాగా, నేడు 1,600కు చేరిన నేపథ్యంలో దేశంలోని 373 జిల్లాల్లో 2 లక్షలకుపైగా నమోదిత ఆభరణ వ్యాపార సంస్థలు ఇందులో భాగంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ముందడుగు ప్రాతిపదికన వెండి ఆభరణాలు, కళాఖండాల హాల్‌మార్కింగ్ ప్రక్రియను కూడా ప్రవేశపెట్టామని చెప్పారు.

దేశంలోని ‘బీఐఎస్’ ప్రయోగశాలల సామర్థ్యం అనేక రెట్లు పెరిగిందని, దీంతోపాటు గుర్తింపుగల ప్రయోగశాలల నెట్‌వర్క్ 2014–15లో 81 నుంచి 2025కల్లా 382కు విస్తరిస్తే- ప్రభుత్వ జాబితాలోని ప్రైవేటు ప్రయోగశాలల సంఖ్య 62 నుంచి 287కు పెరిగిందని మంత్రి తెలిపారు. మరోవైపు శిక్షణ, చైతన్యం పెంపు కార్యకలాపాల క్రమబద్ధ నిర్వహణలో భాగంగా 600కుపైగా జిల్లాల్లో నాణ్యత ప్రమాణాల ప్రాధాన్యంపై సంబంధిత సంస్థలు, అధికారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు.

దేశంలో నేడు సాంకేతిక, పారిశ్రామిక రూపాంతరీకరణ భారీ స్థాయిలో సాగుతున్నదని శ్రీ జోషి అన్నారు. ఉత్పాదకత పెంపు లక్ష్యంగా తయారీ రంగంలో ఆటోమేషన్, కచ్చితత్వాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు “స్మార్ట్ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీ 4.0, సైబర్-ఫిజికల్ సిస్టమ్‌” వంటివి పారిశ్రామిక రంగ భవిష్యత్తును పునర్నిర్వచించాయని పేర్కొన్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారు స్థాయి నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి సాంకేతికతలలో శరవేగంగా పురోగమించే మార్కెట్లలో ఒకటిగా భారత్‌ రూపొందిందని గుర్తుచేశారు. ప్రగతిపై ప్రగాఢ ఆకాంక్షకు విధానపరమైన మద్దతు లభించడమేగాక సమష్టి కృషితో వాటి అమలు ద్వారా దేశ పురోగమనం వేగం పుంజుకున్నదని చెప్పారు.

సుస్థిర ప్రగతి, వాతావరణ మార్పుపై పునరుత్థాన శక్తిపై జాతీయ దృక్పథమే ఎలక్ట్రోటెక్నికల్‌, ఇంధన రంగాల్లో భారత్‌ ముందంజకు కారణమని మంత్రి వివరించారు. శిలాజ ఇంధనాల పరాధీనత నుంచి పునరుత్పాదక ఇంధనం, కాలుష్యరహిత సాంకేతికత, స్వల్ప కర్బన ఉద్గార మౌలిక సదుపాయాల దిశగా మన దేశం వినూత్న మార్పులు సాధించిందన్నారు. జి-20 కూటమికి 2023లో అధ్యక్షత వహించినపుడు కూడా ఇంధన మార్పిడి, సార్వజనీన మౌలిక సదుపాయాలను ప్రాధాన్య రంగాలుగా పరిగణించి నిశితంగా దృష్టి సారించిందని గుర్తుచేశారు.

ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగంలో భారత్‌ ప్రపంచ కూడలిగా ఆవిర్భవించే దిశగా ఉత్పత్తి సంధానిత ప్రోత్సాహక పథకాలు, భారీ పారిశ్రామిక కారిడార్లు, సెమీకాన్ ఇండియా కార్యక్రమం, బహుముఖ ఫలితాధారిత పెట్టుబడులు వంటివి ఎంతగానో తోడ్పడుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. అలాగే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ‘పీఎం-కుసుమ్‌’, ‘పీఎం సూర్య ఘర్ యోజన’, ‘ఫేమ్‌ ఇండియా’ పథకం వంటివి కాలుష్యరహిత సాంకేతికతల ద్వారా భారత రూపాంతరీకరణకు బాటలు వేస్తున్నాయని చెప్పారు.

అంకుర భారత్‌ (స్టార్టప్ ఇండియా), డిజిటల్‌ భారత్‌ వంటి ప్రగతిశీల కార్యక్రమాల చేయూత ద్వారా దేశ యువత ఎలక్ట్రోటెక్నికల్ రంగంలో ఆవిష్కరణ-పర్యావరణ స్పృహ కలగలసిన సుస్థిర సాంకేతిక పరిజ్ఞానాలకు మార్గనిర్దేశం చేస్తున్నదని శ్రీ జోషి చెప్పారు. ఈ సమావేశంలో భాగంగా నిర్వహించే ప్రదర్శనలో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ నుంచి అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఏఐ సహా డిజిటల్ పరిష్కారాల దాకా ఆయా రంగాల్లో సుస్థిర భవిష్యత్తు లక్ష్యంగా సాంకేతికతను వినియోగించుకునే అంకుర సంస్థలు, పారిశ్రామిక సంఘాలు కృషి ప్రస్ఫుటం అవుతుందని తెలిపారు. ఇది కేవలం ప్రదర్శన కాదని, అర్థవంతమైన చర్చలతోపాటు సహకారం, భాగస్వామ్యాలకు వేదికని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమాన్ని భారత ఉమ్మడి మానవాళి స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక వేడుకగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు మన సుసంపన్న వారసత్వం, వైవిధ్యం, సాదర ఆతిథ్యాన్ని ప్రస్ఫుటం చేసే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. స్థిరత్వంతో పురోగమిస్తున్న శక్తిగానే కాకుండా ఐక్యత, సృజనాత్మకత, సంప్రదాయాలతో పరిఢవిల్లే నాగరకత దృష్టితో చూడాలని వీక్షకులకు సూచించారు.

డిజిటల్ ఆవిష్కరణలు, పునరుత్పాదక ఇంధనం, సుస్థిర సాంకేతికతల పరంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ముందంజ వేసిందని మంత్రి సగర్వంగా ప్రకటించారు. ఆలోచనలు, చర్చలు, సహకారం, ఎలక్ట్రోటెక్నికల్ ప్రామాణీకరణ, సుస్థిర ఆవిష్కరణలపై ప్రపంచవ్యాప్త కార్యాచరణ రూపకల్పనలో ప్రస్తుత 89వ ‘ఐఈసీ’ సర్వసభ్య సమావేశం కీలక పాత్ర పోషించగలదని ఆశాభావం వ్యక్తం చేస్తూ మంత్రి తన ప్రసంగం ముగించారు.

 

***


(Release ID: 2167044) Visitor Counter : 2