నీతి ఆయోగ్
‘మెగా టింకరింగ్ డే’ ద్వారా చరిత్ర సృష్టించిన నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్
విద్యార్థుల భారీ హాజరుతో ఇండియా బుక్.. ఆసియా బుక్ రికార్డులలో స్థానం
Posted On:
15 SEP 2025 1:22PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఆవిష్కరణ-వ్యవస్థాపన సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో నీతి ఆయోగ్ పరిధిలో గౌరవనీయ ప్రధానమంత్రి ప్రారంభించిన ‘అటల్ ఇన్నోవేషన్ మిషన్’ (ఏఐఎం) ప్రపంచవ్యాప్త క్షేత్రస్థాయి ఆవిష్కరణ విప్లవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం కింద నిర్వహించిన ‘మెగా టింకరింగ్ డే- 2025’లో ఒకే రోజున విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం లభించడం ఒక చారిత్రక ఘట్టం. ఈ మేరకు ‘స్వచ్ఛ భారత్’ కింద పరిష్కారాన్వేషణ లక్ష్యంగా ఆగస్టు 12న ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 9,467 అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్)ల నుంచి 4,73,350 మంది పాఠశాల విద్యార్థులు ప్రత్యక్షంగా, ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. వీరికి దశలవారీగా బోధన తరగతులు నిర్వహించిన అనంతరం సొంతంగా తయీరు చేసుకోగల ‘వాక్యూమ్ క్లీనర్ల’ను వారు రూపొందించారు.
ఈ కార్యక్రమం కొత్త రికార్డు సృష్టించడాన్ని ఇవాళ (2025 సెప్టెంబరు 15) ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ నిర్వాహకులు ధ్రువీకరిస్తూ అధికారిక ప్రకటన జారీచేశారు. దేశ యువతలో ఆవిష్కరణ-శాస్త్రీయ దృక్పథం పెంపొందించే ‘ఏఐఎం’ వినూత్న లక్ష్యసాధన దిశగా కృషికి ఈ గుర్తింపు ఒక నిదర్శనంగా నిలుస్తుంది.
ఈ సందర్భంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ దీపక్ బగ్లా మాట్లాడుతూ- “ఈ కార్యక్రమం గౌరవనీయ ప్రధానమంత్రి వికసిత భారత్ దార్శనికతకు అనుగుణంగా ముందుకెళ్తోంది. ఇందులో ఆవిష్కరణలు, యువశక్తి భారత్ వృద్ధి పయనానికి మూలస్తంభాలుగా నిలుస్తాయి. దేశ భవిష్యత్తు మన తరగతి గదుల్లో రూపొందే విధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ద్వారా విద్యార్థులలో సాంకేతిక నైపుణ్యాన్ని మేం ప్రోదిచేస్తున్నాం. అంతేకాకుండా విభిన్న ఆలోచన దృక్పథంతో వినూత్న స్వప్నాలకు రూపమివ్వగల, వాస్తవిక ప్రపంచ సవాళ్లను పరిష్కరించగల ఆవిష్కర్తలుగా వారిని సన్నద్ధం చేస్తున్నాం” అన్నారు.
అలాగే “మెగా టింకరింగ్ డే కేవలం ఒక రికార్డు కాదు... ఇదొక విప్లవం. మారుమూల ప్రాంతాల నుంచి హడావుడి నిండిన నగరాల దాకా అభ్యసనం, ఆవిష్కరణ, సృష్టి, సహకారం లక్ష్యంగా ఏకమైన మన యువ ఆవిష్కర్తల సమష్టి శక్తికి ఇది సంకేతం. ప్రపంచంలోని మరే దేశంలోనూ పాఠశాల విద్యా వ్యవస్థలో ఈ స్థాయి ఆవిష్కరణలను సంఘటితం చేసిన ఉదాహరణలు లేవు. మనం సరైన సాధనాలు, మార్గదర్శకత్వం, ప్రేరణ, నాయకత్వాలను సమకూర్చినపుడు భారత బాలలు రేపటి ప్రపంచానికి సరికొత్త రూపమివ్వగలరని ఈ రికార్డు రుజువు చేస్తోంది” అని వ్యాఖ్యానించారు.
దేశం నలుమూలలాగల పాఠశాలలకు ‘మెగా టింకరింగ్ డే-2025’ చేరువైంది. ఈ మేరకు లెహ్, లదాఖ్, కార్గిల్ సహా కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలు, తమిళనాడులోని విరుధునగర్ వంటి ఆకాంక్షాత్మక జిల్లాలతోపాటు ఈశాన్య భారతంలోని మణిపూర్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఒక్క మాటలో- దక్షిణాన కన్యాకుమారి నుంచి పశ్చిమాన భుజ్ వరకూ సుదూర ప్రాంతాల వారు భాగస్వాములయ్యారు. తద్వారా భౌగోళిక, మౌలిక సదుపాయాల అడ్డంకులను అధిగమించగల తన సామర్థ్యాన్ని ‘ఏఐఎం’ ఘనంగా చాటింది. ఆ మేరకు పరిశోధన-ఆవిష్కరణల భాగస్వామ్య పయనంలో విద్యార్థులను ఒక్క తాటిపైకి తెచ్చింది.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రారంభంలోనే దేశవ్యాప్తంగా 10,000కుపైగా ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’లు ఏర్పాటయ్యాయి. దీంతో అన్నిచోట్లా ఒక నెట్‌వర్క్ సృష్టితో విద్యార్థులు త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఎలక్ట్రానిక్స్ వంటి అంశాలలో సాంకేతిక నైపుణ్యాన్ని ఆచరణాత్మకంగా సముపార్జించగలరు. విద్యార్థులలో సమస్య పరిష్కారం, రూపకల్పన యోచన, వ్యవస్థాపన స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ భవిష్యత్ ఆవిష్కర్తలుగా వారిని సిద్ధం చేయడమే ఈ ప్రయోగశాలల ఏర్పాటు లక్ష్యం.
***
(Release ID: 2166988)
Visitor Counter : 2