ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జీఎస్టీ ప్రయోజనాలు వినియోగదారులకు అందేలా కృషి చేస్తూ.. ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేసిన పరిశ్రమ ప్రముఖులు #GSTBACHATGRAHAKTAK
తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలపై సీఈవోల సమావేశాన్ని
నిర్వహించిన ఎంవోఎఫ్‌పీఐ, సీఐఐ
Posted On:
11 SEP 2025 5:48PM by PIB Hyderabad
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సహకారంతో ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంవోఎఫ్‌పీఐ) ఈరోజు ఆహార శుద్ధి రంగానికి చెందిన ప్రముఖ సంస్థల సీఈవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఆహార శుద్ధి పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ చిరాగ్ పాస్వాన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశం.. ప్రభుత్వం, పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల మధ్య అర్థవంతమైన చర్చకు వేదికైంది. చారిత్రక జీఎస్టీ సంస్కరణలకు నేతృత్వం వహించిన ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రికి కృతజ్ఞతలు చెబుతూ పరిశ్రమ ప్రతినిధులు ఈ సమావేశాన్ని ప్రారంభించారు.
అమూల్, బ్రిటానియా, కోకా-కోలా, డాబర్, డీఎస్ గ్రూప్, ఐటీసీ, పెప్సికో, రస్నా, మార్స్, ఓర్క్లా ఫుడ్స్, మోండెలెజ్, బిస్లెరీ, క్రెమికా ఫుడ్స్, మిసెస్ బెక్టార్, శ్రీనివాసా ఫామ్స్, హైఫన్ ఫుడ్స్ వంటి కంపెనీల అధినేతలు జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందేలా కృషి చేస్తామని స్వచ్ఛందంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ రంగంలోని చిన్న సంస్థలను చైతన్యం చేయడం.. రైతులకు మెరుగైన విలువ లభించేలా చేయడం.. దిగుమతి ప్రత్యామ్నాయాలు, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం పట్ల వారి నిబద్ధతను స్పష్టం చేశారు. ఈ సంస్కరణలు ధరలను తగ్గించడమే కాకుండా డిమాండ్‌ను కూడా ప్రేరేపిస్తాయనీ.. దీంతో ఈ రంగం అభివృద్ధి మెరుగవుతుందని పరిశ్రమ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
ఇటీవల ప్రకటించిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల గురించి ప్రధానంగా చర్చించారు. ఇవి పన్ను విధానాన్ని 5 శాతం, 18 శాతం అనే కేవలం రెండు స్లాబుల వ్యవస్థగా సరళీకరించాయి. సంక్లిష్టతను తగ్గించడం, ఇన్వర్టెడ్ పన్ను విధానాలను పరిష్కరించడం, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ సంస్కరణలు ఆహార శుద్ధి రంగానికి గణనీయ ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు. కీలకమైన ఆహార పదార్థాలు, పాడి ఉత్పత్తులు, బేకరీ, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు ఇప్పుడు 5 శాతం పన్ను పరిధిలోకి రావడంతో పాటు మరికొన్నింటిపై పూర్తిగా పన్ను రద్దయిన క్రమంలో ఈ రంగం వినియోగదారుల కొనుగోలు సామర్థ్యాన్ని పెంచడం, వ్యాపార సంస్థలకు మెరుగైన నగదు లభ్యతని అందించడంతో పాటు.. దేశీయ, ప్రపంచ మార్కెట్లలో బలమైన పోటీతత్వాన్ని ఇవ్వనున్నది.
ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రి శ్రీ చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ.. ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలు, సమ్మిళిత వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. వాణిజ్య కార్యకలాపాల్లో జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను రైతులు, ఎమ్ఎస్ఎమ్ఈల నుంచి వినియోగదారుల వరకు అందరికీ సమానంగా అందించాలని పరిశ్రమ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి సూచించిన "సంస్కరణ, పనితీరు, పరివర్తన" దార్శనికతను ఉటంకిస్తూ.. జీఎస్టీ సంస్కరణలు పన్ను విధానాన్ని సంస్కరించడం.. దీర్ఘకాలిక హెచ్చుతగ్గులను సరిదిద్దడం, వృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించిన తీరును కేంద్ర మంత్రి వివరించారు. ఈ సంస్కరణల అతిపెద్ద లబ్ధిదారుల్లో ఆహార శుద్ధి రంగం ఒకటని ఆయన స్పష్టం చేశారు. విలువను మెరుగుపరచడాన్ని ప్రోత్సహిస్తూనే.. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే సామర్థ్యం ఉన్న ఈ రంగానికి ఒక పరివర్తనాత్మక దశగా దీనిని ఆయన అభివర్ణించారు.
జీఎస్టీ సంస్కరణలు సజావుగా అమలు చేయడంలో సమష్టి బాధ్యతను పెంపొందించడమే నేటి సమావేశ లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వినియోగదారులకు ప్రయోజనాలను అందించడం, ఉత్పత్తి నాణ్యతను పెంచడం, అసంఘటిత రంగానికి సాధికారత కల్పించడం, రైతులకు ఎక్కువ ఆదాయ భద్రత కల్పించే లక్ష్యం కోసం పరిశ్రమ చురుగ్గా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పరిశ్రమ సకాలంలో పరిష్కారం కోసం కలిసి పనిచేయడానికి వీలుగా వారి సమస్యలు, అవరోధాలను ఎలాంటి సంకోచం లేకుండా పంచుకోవాలని ఆయన సీఈవోలను కోరారు. నమ్మకం, ఉద్దేశాల ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ.. "నిజాయితీతో కూడిన ఉద్దేశం... నిజమైన నిబద్ధతతో మనం అంకితభావంతో పనిచేస్తూ కలిసికట్టుగా వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకుందాం" అని శ్రీ చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు.
అనేక వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారత్ స్థానాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. విలువను మెరుగుపరచడంలో తక్కువ స్థాయి ఇప్పటికీ ఒక సవాలుగా ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడులు పెట్టడం, వివిధ రకాల ఉత్పత్తులను అందించడం, ప్రపంచ మార్కెట్లలోకి విస్తరించడం కోసం ఈ సంస్కరణలను పరిశ్రమ ఒక అవకాశంగా భావించాలన్నారు.
ఎమ్ఓఎఫ్‌పీఐ కార్యదర్శి శ్రీ ఏ.పీ. దాస్ జోషి మాట్లాడుతూ.. పన్ను విధానం హేతుబద్దీకరణ, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో సంస్కరణల ప్రాముఖ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. సంస్కరణలు సజావుగా అమలు చేయడంలో పరిశ్రమ అభిప్రాయం కీలకమని స్పష్టం చేసిన ఆయన.. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంఘాలు, వ్యాపార సంస్థలకు ఖచ్చితమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడం కోసం సమష్టి కృషి అవసరమన్నారు. భవిష్యత్ వృద్ధికి కీలకమైన చోదకాలుగా ఆవిష్కరణలకు, విలువ మెరుగుపరచేందుకు ప్రాధాన్యమివ్వాలని ఈ రంగానికి చెందిన ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు.
ఎగుమతుల రంగంలో గల అవకాశాలు, వివిధ రకాల ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం గురించి పరిశ్రమ ప్రముఖులు తమ దృక్పథాలను పంచుకున్నారు. మరింత సులభతరం చేయాల్సిన అంశాలను కూడా వారు ప్రస్తావించారు. ఈ రంగం పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడంలో ప్రభుత్వం-పరిశ్రమ భాగస్వామ్య ఆశ్యకతను పునరుద్ఘాటిస్తూ సమావేశాన్ని ముగించారు.
ఈ నెల 25 నుంచి 28 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో వరల్డ్ ఫుడ్ ఇండియా 4వ ఎడిషన్ నిర్వహించనున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆహార శుద్ధి రంగం కోసం భారత ప్రధాన ప్రపంచస్థాయి వేదికగా.. ఈ కార్యక్రమంలో నిర్వహించే బీ2బీ, బీ2జీ సమావేశాలు, రంగాలవారీగా రౌండ్‌టేబుల్ సమావేశాలు, అంతర్జాతీయ ప్రదర్శనలు, కొనుగోలుదారు-అమ్మకందారుల సమావేశాలు సహా మరెన్నో కార్యక్రమాలు పెట్టుబడి, ఆవిష్కరణ, భాగస్వామ్యాలకు అనేక అవకాశాలను అందించనున్నాయి.
***
(Release ID: 2165891)
Visitor Counter : 4