కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో ఈరోజు “నివేశక్ శిబిరం” నిర్వహించిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ)


పెండింగ్‌ క్లెయిమ్‌ల పరిష్కారం, పెట్టుబడిదారు సేవల క్రమబద్ధీకరణ, ఆర్థిక అక్షరాస్యత ప్రోత్సాహం కోసం
సింగిల్-విండో ఫెసిలిటేషన్ ప్లాట్‌ఫామ్‌గా సేవలందించిన ఒక రోజు శిబిరం

प्रविष्टि तिथि: 30 AUG 2025 7:30PM by PIB Hyderabad

భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)ల సహకారంతో ఈరోజు హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ హర్యానా భవన్‌లో నివేశక్ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ ఒకరోజు శిబిరంలో తెలంగాణకు చెందిన పెట్టుబడిదారులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. క్లెయిమ్ చేయని డివిడెండ్లు, షేర్లు, ఇతర పెట్టుబడిదారు సేవలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం సింగిల్ విండో ఫెసిలిటేషన్ ప్లాట్‌ఫామ్‌గా సేవలందించింది.

ఐఈపీఎఫ్ఏ సీఈవో, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి అనితా షా అకెల్లా, సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీ జీవన్ సోన్‌పరోట్, శ్రీ సునీల్ జయవంత్ కదమ్, ఐఈపీఎఫ్ఏ జనరల్ మేనేజర్ లెఫ్టినెంట్ కల్నల్ ఆదిత్య సిన్హా, సెబీ జనరల్ మేనేజర్ శ్రీ వినోద్ శర్మ, సీడీఎస్ఎల్ ఐపీఎఫ్ సెక్రటేరియట్ హెడ్ శ్రీ సుధీష్ పిళ్లై, బీఎస్ఈ ఐపీఎఫ్ శ్రీ కిరణ్ పాటిల్‌లతో పాటు ఐఈపీఎఫ్ఏ, సెబీ, మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఎమ్ఐఐల)లకు చెందిన ఇతర సీనియర్ అధికారులు, రిజిస్ట్రార్లు-ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లు (ఆర్‌టీఏలు) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

360 మందికి పైగా క్లెయిమ్‌దారులతో పాటు హైదరాబాద్, సమీప ప్రాంతాల నుంచి పెట్టుబడిదారులు, వాటాదారులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో పూణేలో విజయవంతమైన తొలి కార్యక్రమం తర్వాత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌ వేదికైంది. దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల-కేంద్రితమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే ఐఈపీఎఫ్ఏ దార్శనికతను ఈ కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్లింది. పెట్టుబడిదారులు తమ ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించుకోవడమే కాకుండా వారి హక్కులు, బాధ్యతల గురించి మరింత అవగాహన పొందేందుకు ఈ శిబిరం ఒక ప్రధాన వేదికగా నిలిచింది.

ఆరు నుంచి ఏడు సంవత్సరాలకు పైగా పెండింగ్‌లో ఉన్న చెల్లించని డివిడెండ్ ఖాతాలను నేరుగా పరిష్కరించడానికి, అక్కడికక్కడే కేవైసీ, నామినేషన్ నవీకరణలను అందించడానికి, దీర్ఘకాలిక ఐఈపీఎఫ్ఏ క్లెయిమ్ సమస్యలు పరిష్కరించడానికి ఈ నివేశక్ శిబిరం వీలు కల్పించింది. వాటాదారుల కంపెనీలు, రిజిస్ట్రార్లు-ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లు (ఆర్‌టీఏలు) ఇక్కడ ప్రత్యేక కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పెట్టుబడిదారులు నేరుగా అధికారులతో సంభాషించేందుకు వీలు కల్పించారు. ఆర్థిక అక్షరాస్యత సమావేశాల్లో సురక్షితమైన పెట్టుబడి మార్గాలు, మోసాల నివారణ గురించి అవగాహన కలిగించారు.

ఈ కార్యక్రమంలో క్లెయిమ్‌ ప్రక్రియకు సంబంధించిన ప్రశ్నలను పరిష్కరించడంలో పెట్టుబడిదారులకు సహాయం చేయడానికి సీడీఎస్ఎల్ ఇన్‌సైట్‌ఫుల్ ఇన్వెస్టర్‌ను ప్రారంభించింది.

ఐఈపీఎఫ్ఏ కుశల్ నివేశక్ కార్యక్రమం కింద ప్రారంభించిన అర్థ్ చిత్ర పోటీలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అర్థ్ చిత్ర ఒక జాతీయ స్థాయి ఆన్‌లైన్ పోస్టర్ రూపకల్పన పోటీ. అన్ని వయస్సుల వారు పొదుపు, పెట్టుబడి, బడ్జెటింగ్, మోసాల నివారణ వంటి ఆర్థిక అక్షరాస్యత సంబంధిత కీలక భావనలను సృజనాత్మకంగా వ్యక్తీకరించడానికి.. ఆర్థిక అవగాహనను మరింత ఆకర్షణీయంగా, అందుబాటులో ఉండేలా, ప్రభావవంతంగా మార్చడానికి అర్థ్ చిత్ర పోటీ వీలు కల్పించింది.

కంపెనీ ప్రతినిధులు, ఆర్‌టీఏలు, ఐఈపీఎఫ్ఏ, సెబీ అధికారులతో సంభాషించి సందేహ నివృత్తి చేసుకోవడం ద్వారా వందలాదిమంది పెట్టుబడిదారులు ప్రయోజనం పొందారు. పెండింగ్‌ ఫిర్యాదుల పరిష్కారంలో, సాధారణంగా పరిష్కారం కోసం నెలలకొద్ది సమయం తీసుకునే ప్రక్రియలను సులభతరం చేయడంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది.

ముందుచూపు

క్లెయిమ్ చేయని పెట్టుబడులు ఎక్కువగా ఉన్న నగరాల్లో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఔట్‌రీచ్ కార్యక్రమాల శ్రేణిలో భాగంగా హైదరాబాద్‌లో ఈ నివేశక్ శిబిరాన్ని నిర్వహించారు. పెట్టుబడిదారుల అవగాహనను పెంపొందించడం, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడం, భారత ఆర్థిక వ్యవస్థ పారదర్శకంగా, అందుబాటులో, విశ్వసనీయంగా ఉండేలా చేయడం పట్ల ఐఈపీఎఫ్ఏ నిబద్ధతను ఈ శిబిరాలు స్పష్టం చేస్తాయి.

ఐఈపీఎఫ్ఏ గురించి

ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) నిరంతర ఔట్‌రీచ్, విద్య, వ్యూహాత్మక సహకారాల ద్వారా పెట్టుబడిదారుల అవగాహన, భద్రతను ప్రోత్సహించడం లక్ష్యంగా పని చేస్తుంది. ప్రారంభమైన నాటి నుంచి పెట్టుబడిదారులను శక్తిమంతం చేయడం, సమర్థమైన క్లెయిమ్ పరిష్కార విధానాలను అందించడం వంటి బహుళ కార్యక్రమాలకు ఐఈపీఎఫ్ఏ నాయకత్వం వహిస్తోంది.

మరిన్ని వివరాల కోసం, సందర్శించండి: www.iepf.gov.in

 

***


(रिलीज़ आईडी: 2162551) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese