ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా పాఠశాలల్లో 5 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లల ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌ (ఎంబీయూ) లను సకాలంలో పూర్తి చేయాలని కోరిన యూఐడీఏఐ

పాఠశాలల్లో శిబిరాలను నిర్వహించడం ద్వారా పెండింగ్‌లో ఉన్న తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌లను పూర్తి చేయాలని కోరుతూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసిన యూఐడీఏఐ సీఈఓ

దాదాపు 17 కోట్ల మంది పిల్లల కోసం యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) వేదికపై ఆధార్ పెండింగ్ ఎంబీయూను సులభతరం చేయడానికి చేతులు కలిపిన యూఐడిఏఐ, విద్యా శాఖ

Posted On: 27 AUG 2025 5:29PM by PIB Hyderabad

దేశంలోని పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న దాదాపు 17 కోట్లమంది పిల్లల ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌ (ఎంబీయూ) లను గుర్తించి, పూర్తి చేయడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ), పాఠశాల విద్య,  అక్షరాస్యత శాఖ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) వేదికపై కలసి పనిచేస్తున్నాయి.

ఆధార్‌లో ఎంబీయూ సమయానుగుణంగా పూర్తిచేయడం అనేది పిల్లల ఐదేళ్ల వయసులోనూ, మళ్ళీ పదిహేను సంవత్సరాల వయసులోనూ తప్పనిసరి అవసరం. ఇది ఆధార్‌లో పిల్లల బయోమెట్రిక్ డేటా కచ్చితత్వం,  నమ్మకాన్ని కాపాడటంలో కీలకమైనది. ప్రస్తుతం, దాదాపు 17 కోట్ల మంది పిల్లల ఆధార్ నంబర్లలో తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ పెండింగ్‌లో ఉంది.

ఆధార్‌లో పిల్లల బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. లేకపోతే, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందడానికి, అలాగే నీట్,  జేఈఈ,  సీయూఈటీ  వంటి పోటీ పరీక్షలకు, విశ్వవిద్యాలయ పరీక్షలకు నమోదు చేసుకునేటప్పుడు వారికి ఇబ్బందులు తలెత్తవచ్చు.పాఠశాల విద్యార్థులు,  వారి తల్లిదండ్రులు తరచుగా చివరి నిమిషంలో ఆధార్ అప్‌డేట్‌ల కోసం హడావిడి పడుతుంటారు, ఇది ఆందోళనకు దారితీస్తుంది. సకాలంలో బయోమెట్రిక్ అప్‌డేట్‌లను పూర్తి చేయడం ద్వారా దీనిని నివారించవచ్చు.

ఈ అవసరం గురించి  వివరిస్తూ రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు యూఐడీఏఐ సీఈఓ శ్రీ భువనేష్ కుమార్ లేఖ రాశారు. పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించడం ద్వారా  తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని వారిని కోరారు.

“పాఠశాలల ద్వారా శిబిరాలను నిర్వహించడం వల్ల పెండింగ్‌లో ఉన్న ఎంబీయూలను పూర్తి చేయడం వీలవుతుందనే అభిప్రాయం ఉంది. అయితే,  విద్యార్థుల్లో ఎవరు బయోమెట్రిక్ అప్‌డేట్‌లను చేయించుకోలేదో పాఠశాలలకు ఎలా తెలుస్తుందనేది ప్రధాన ప్రశ్నగా మారింది. దీనికి యూఐడీఏఐ, భారత ప్రభుత్వ పాఠశాల విద్య,  అక్షరాస్యత శాఖలకు చెందిన సాంకేతిక బృందాలు కలిసి పనిచేసి, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) అప్లికేషన్‌లో ఒక పరిష్కారాన్ని విజయవంతంగా అమలు చేశాయి. ఇప్పుడు అన్ని పాఠశాలలు పెండింగ్‌లో ఉన్న ఎంబీయూల వివరాలను చూడగలవు" అని యూఐడీఏఐ  సీఈఓ  తన లేఖలో పేర్కొన్నారు.

యూడీఐఎస్ఈ+ గురించి

యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) అనేది పాఠశాల విద్య,  అక్షరాస్యత విభాగం కింద పనిచేసే ఒక విద్యా నిర్వహణ సమాచార వ్యవస్థ. ఇది పాఠశాల విద్యకు సంబంధించిన అనేక గణాంకాలను సేకరిస్తుంది.

యూఐడీఏఐ,పాఠశాల విద్య,  అక్షరాస్యత విభాగాల ఈ ఉమ్మడి ప్రయత్నం పిల్లల బయోమెట్రిక్స్ ను అప్‌డేట్ చేయడంలో సౌలభ్యాన్ని కల్పించడానికి ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.



 

***


(Release ID: 2161389)