ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్-న్యూజిలాండ్ సంయుక్త ప్రకటన
Posted On:
17 MAR 2025 2:39PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవనీయ క్రిస్టోఫర్ లక్సన్ 2025 మార్చి 16న భారత్‌లో తొలిసారి అధికార పర్యటనకు వచ్చారు. ఈ నెల 20వ తేదీ వరకూ సాగే ఈ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీతోపాటు ముంబయి నగరాన్ని కూడా ఆయన సందర్శిస్తారు. ఆయనతోపాటు పర్యాటక-ఆతిథ్యశాఖ మంత్రి గౌరవనీయ లూయిస్ అప్‌స్టన్, క్రీడలు-వినోదం-జాతి సమూహాల శాఖ మంత్రి గౌరవనీయ మార్క్ మిచెల్, వాణిజ్యం-పెట్టుబడులు-వ్యవసాయం అటవీశాఖల మంత్రి గౌరవనీయ టాడ్ మెక్‌క్లే సహా వివిధ శాఖల అధికారులు, వ్యాపార-సామాజిక సంఘాల సభ్యులు, పత్రికా-సాంస్కృతిక సంఘాల ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాలు పంచుకుంటున్నది.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి లక్సన్‌కు న్యూఢిల్లీలో సాదర-సంప్రదాయ స్వాగతం లభించింది. అనంతరం ప్రధానమంత్రి మోదీ ఆయనతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అటుపైన న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న 10వ విడత ‘రైసినా చర్చల’ను శ్రీ మోదీ ప్రారంభించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధానమంత్రి లక్సన్ ప్రారంభోపన్యాసం చేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచిన ఆయన, ఆ తర్వాత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
భారత-న్యూజిలాండ్ మధ్య విస్తరిస్తున్న ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రులు ఇద్దరూ సంయుక్తంగా ఆకాక్షించారు. ఇది ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య బలమైన సంబంధాలతో పెనవేసుకున్న స్నేహ బంధమని వారు అభివర్ణించారు. ఈ అనుబంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునే దిశగా వివిధ రంగాల్లో విస్తృత సహకారానికి వారిద్దరూ అంగీకరించారు. ఆ మేరకు వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, విద్య-పరిశోధన, శాస్త్రవిజ్ఞానం-సాంకేతికత, వ్యవసాయ సాంకేతికపరిజ్ఞానం, అంతరిక్షం, క్రీడలు, ప్రజల పరస్పర రాకపోకలు వంటి విభిన్న రంగాల్లో భుజం కలిపి సాగాలని నిర్ణయించారు.
పరస్పర ప్రయోజన ప్రాంతీయ-అంతర్జాతీయ పరిణామాలపై ప్రధానమంత్రులు తమ అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు బహుపాక్షిక సహకార విస్తృతికి అంగీకరించారు. నానాటికీ పెరుగుతున్న అనిశ్చితితోపాటు ప్రమాదకర ప్రపంచ పరిస్థితులను మానవాళి ఎదుర్కొంటున్నదని వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. సముద్ర ఆధారిత దేశాలుగా సార్వత్రిక, సమ్మిళిత, సుస్థిర, సుసంపన్న నియమబద్ధ అంతర్జాతీయ క్రమంతో ఇండో-పసిఫిక్ వర్ధిల్లడంపై భారత-న్యూజిలాండ్ దేశాలకు బలమైన, ఉమ్మడి లక్ష్యం ఉన్నదని పేర్కొన్నారు.
అంతర్జాతీయ చట్టాలకు తగినట్లు... ముఖ్యంగా సముద్ర చట్టంపై 1982నాటి ఐక్యరాజ్యసమితి సమావేశం తీర్మానాల ప్రకారం సముద్ర-గగన యానాలతోపాటు ఇతరత్రా అంశాల్లోనూ చట్టబద్ధ వినియోగ స్వేచ్ఛ అవసరాన్ని ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. ఇదే తీర్మానాలకు అనుగుణంగా వివాదాలపై శాంతియుత పరిష్కార మార్గాన్వేషణ ఆవశ్యకత కూడా ఉందని వారిద్దరూ అంగీకరించారు.
న్యూజిలాండ్ జనాభాలో భారత సంతతి ప్రజలు దాదాపు 6 శాతం కాగా, రెండు దేశాల ప్రజల మధ్య బలమైన సంబంధాలు కొనసాగడంపై ప్రధానమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ పురోగమనంలో భారత ప్రవాసుల గణనీయ కృషిని, ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాల సౌలభ్యంలో వారి సానుకూల పాత్రను ప్రశంసించారు. న్యూజిలాండ్‌లోని విద్యార్థులు సహా భారతీయ సమాజం, భారత్‌లో నివసించే న్యూజిలాండ్ వాసులతోపాటు భారత సందర్శకుల భద్రత-రక్షణకు ప్రాధాన్యంపై వారు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు.
వాణిజ్యం-పెట్టుబడి.. ఆర్థికాంశాలలో సహకారం:
భారత్-న్యూజిలాండ్ మధ్య నిరంతర వాణిజ్యం, పెట్టుబడులపై ప్రధానమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. దీనికి అనుగుణంగా ద్వైపాక్షిక వాణిజ్య విస్తరణ సామర్థ్యాన్ని మరింత సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు. ఆ మేరకు ద్వైపాక్షిక వాణిజ్య సంస్థలు సంబంధాలను పెంచుకోవాలని, రెండు ఆర్థిక వ్యవస్థల పరిపూరకాల సద్వినియోగంలో భాగంగా అందివస్తున్న ఆర్థిక-పెట్టుబడి అవకాశాలను అన్వేషించాలని వారు సూచించారు.
ద్వైపాక్షిక సహకారంలో కొనసాగుతున్న బలమైన ఉత్తేజానికి ప్రతీకగా ద్విముఖ పెట్టుబడులు మరింత పెంచుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
భారత్-న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల విస్తృతితోపాటు నిబిడీకృత సామర్థ్య సద్వినియోగం సహా సమ్మిళిత, సుస్థిర ఆర్థికవృద్ధికి పరస్పరం దోహదపడాలని ప్రధానమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
రెండు దేశాల మధ్య విస్తృత ఆర్థిక ఏకీకరణ దిశగా సమతుల, ఆకాంక్షాత్మక, సమగ్ర, పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందం లక్ష్యంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)పై చర్చలకు శ్రీకారం చుట్టడంపై ప్రధానమంత్రులు హర్షం వెలిబుచ్చారు. సమగ్ర వాణిజ్య ఒప్పందంతో ఉభయపక్షాల మధ్య వాణిజ్యం-ఆర్థిక సహకార విస్తృతికి కీలక అవకాశం అందివస్తుందని నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి దేశం తన బలాలను పటిష్ఠం చేసుకోవడమే కాకుండా సంబంధిత సమస్యల పరిష్కారం, అవరోధాల తొలగింపు ద్వారా పరస్పర ప్రయోజనకర వాణిజ్యం-పెట్టుబడుల వృద్ధికి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తోడ్పడుతుంది. ఆ మేరకు రెండు పక్షాలకూ సమాన ప్రయోజనం, పరిపూరకాలకు భరోసా ఇస్తుంది. అందుకే ఈ చర్చలను వీలైనంత త్వరగా సఫలం చేసేందుకు సీనియర్ ప్రతినిధులను నియమించడంపై నాయకులిద్దరూ కృతనిశ్చయం ప్రకటించారు.
‘ఎఫ్‌టిఎ’పై చర్చల నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల రంగంపై సహకార ఒడంబడిక సత్వర అమలుకు వీలుగా ఉభయ పక్షాల సంబంధిత అధికారుల మధ్య చర్చలపై నాయకులు అంగీకారానికి వచ్చారు.
రెండు దేశాల మధ్య 2024నాటి ‘కస్టమ్స్ కోఆపరేషన్ అరేంజ్‌మెంట్’ (సిసిఎ) పరిధిలో అధీకృత ఆర్థిక నిర్వాహకుల పరస్పర గుర్తింపు ఒప్పందం (ఎఇఒ-ఎంఆర్‌ఎ)పై సంతకాలు పూర్తి కావడంపై ప్రధానమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల కస్టమ్స్ అధికారుల మధ్య సన్నిహిత సహకారంతో రెండు దేశాల మధ్య వస్తు రవాణా సులభతరం కావడంతోపాటు ద్వైపాక్షిక వాణిజ్యం విస్తృతమవుతుంది.
ఉద్యాన, అటవీ రంగాలపై కొత్త సహకారాన్ని నాయకులు స్వాగతించారు. విజ్ఞానం-పరిశోధనల ఆదానప్రదానాన్ని ప్రోత్సహించడం ద్వారా ద్వైపాక్షిక సహకారం పెంచే ఉద్యాన సహకార ఒప్పందంపై సంతకాలు, పంటకోత అనంతర-మార్కెటింగ్ మౌలిక సదుపాయాల కల్పన, విధానాంశాలపై చర్చలు-సాంకేతిక ఆదానప్రదానాన్ని ప్రోత్సహించే అటవీ సహకార ఒడంబడికపై సంతకాలు ఇందులో భాగంగా ఉంటాయి.
ఆర్థిక వృద్ధి సృష్టి, వ్యాపార సంబంధాల పెంపు, రెండు దేశాల ప్రజల మధ్య మరింత అవగాహన సృష్టిలో పర్యాటక రంగం పోషించగల సానుకూల పాత్రను నాయకులు గుర్తించారు. భారత్-న్యూజిలాండ్ మధ్య పర్యాటకుల రాకపోకలు పెరుగుతుండటంపై వారు హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వైమానిక సేవల ఒప్పందం నవీకరణను అభినందించారు. అలాగే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష (నాన్-స్టాప్) విమాన కార్యకలాపాల దిశగా తమతమ పౌర విమానయాన సంస్థలను ప్రోత్సహించేందుకు అంగీకరించారు.
రాజకీయ... రక్షణ-భద్రత సహకారం:
పార్లమెంటరీ ప్రతినిధి బృందాల రాకపోకల ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రధానమంత్రులు రెండు దేశాల మధ్య పార్లమెంటరీ ప్రతినిధి బృందాల సందర్శనలను క్రమం తప్పకుండా కొనసాగేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు.
గత శతాబ్దంలో ప్రపంచవ్యాప్త సంఘర్షణల సందర్భంగా పరస్పరం భుజం కలిపి పోరాటాల్లో పాల్గొన్న భారత-న్యూజిలాండ్ సాయుధ సిబ్బంది త్యాగాల ఉమ్మడి చరిత్రను ప్రధానమంత్రులు గౌరవపురస్సరంగా గుర్తుచేసుకున్నారు.
సైనిక విన్యాసాలలో పాల్గొనడం, స్టాఫ్ కాలేజ్ పరంగా ఆదానప్రదానం, నావికాదళం నౌకల ద్వారా క్రమం తప్పకుండా రేవుల సందర్శనతోపాటు ఉన్నత స్థాయి రక్షణ రంగ ప్రతినిధుల రాకపోకల వంటి రక్షణ కార్యకలాపాలలో సుస్థిర ప్రగతిపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లోని లిట్టెల్టన్ ఓడరేవును డిసెంబర్ 2024లో భారత నావికాదళ సెయిలింగ్ నౌక తరిణి సందర్శించడాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాయల్ న్యూజిలాండ్ నావికాదళ నౌక ‘హెచ్‌ఎంఎన్‌జడ్‌ఎస్ టె కహా’ త్వరలో ముంబయి రేవు సందర్శనకు రానుండటాన్ని కూడా వారు ప్రస్తావించారు.
రక్షణ రంగంలో సహకారంపై భారత్-న్యూజిలాండ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. దీంతో ద్వైపాక్షిక రక్షణ సహకారం మరింత బలోపేతం కావడంతోపాటు ద్వైపాక్షిక రక్షణపై నిరంతర చర్చలకు దోహదం చేస్తుంది. సముద్ర మార్గాల కమ్యూనికేషన్ భద్రత, రక్షణకు భరోసా అవసరాన్ని గుర్తించిన నేపథ్యంలో దాంతోపాటు సముద్ర భద్రత పెంపుపై క్రమం తప్పకుండా చర్చల కొనసాగింపునకు నిర్ణయించారు.
సంయుక్త సముద్ర బలగాల్లో భారత్ భాగస్వామి కావడంపై న్యూజిలాండ్ హర్షం ప్రకటించింది. ఈ మేరకు కమాండ్ టాస్క్ ఫోర్స్-150 కార్యక్రమం సందర్భంగా రక్షణ సంబంధాల్లో ప్రగతిని నాయకులిద్దరూ స్వాగతించారు.
పరస్పర ప్రతిస్పందన ప్రాతిపదికన రక్షణ కళాశాలల అధికారుల క్రమం తప్పని రాకపోకలతోపాటు శిక్షణ కార్యకలాపాల ఆదానప్రదానాన్ని వారిద్దరూ అభినందించారు. ఈ మేరకు మెరుగైన సామర్థ్య వికాసం దిశగా సహకారానికి ఉభయ పక్షాలు అంగీకరించాయి.
ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమం (ఐపిఒఐ)లో భాగస్వామ్యానికి తాము సిద్ధమని న్యూజిలాండ్ ప్రధానమంత్రి లక్సాన్ ఆసక్తి వ్యక్తం చేశారు. సముద్ర ప్రాంత నిర్వహణ, సంరక్షణ, నిలకడకు కృషి చేయడంపై సారూప్య దృక్పథంగల దేశాలుగల ఈ భాగస్వామ్యంలోకి న్యూజిలాండ్‌ను ప్రధానమంత్రి మోదీ స్వాగతించారు. కాగా, గుజరాత్‌లోని లోథాల్‌లో ఏర్పాటయ్యే జాతీయ సముద్ర వారసత్వ సముదాయం (ఎన్‌ఎంహెచ్‌సి)పై నిపుణుల మధ్య చర్చల నేపథ్యంలో సముద్ర దేశాలుగా భారత్-న్యూజిలాండ్ మధ్య మరింత సహకారం దిశగా మార్గాన్వేషణ సాగాల్సి ఉంది.
శాస్త్రవిజ్ఞానం-సాంకేతికత.. విపత్తు నిర్వహణలో సహకారం:
పరిశోధన, శాస్త్రవిజ్ఞాన సంబంధాలు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఆవిష్కరణల ప్రాధాన్యాన్ని ద్వైపాక్షిక భాగస్వామ్యంలో కీలక మూలస్తంభంగా నాయకులిద్దరూ గుర్తించారు. పరస్పర ప్రయోజనం దిశగా ఇలాంటి అవకాశాలను అన్వేషించాలని వారు పిలుపునిచ్చారు. వాణిజ్య, పారిశ్రామిక రంగాల మధ్య సన్నిహిత సహకారం ద్వారా నిర్దిష్ట అంశాల్లో సాంకేతికతల రూపకల్పన, వాణిజ్యీకరణకు బలమైన సహకారం ఆవశ్యకతను ఉభయ పక్షాలు స్పష్టం చేశాయి.
వాతావరణ మార్పుతోపాటు దాన్ని ఎదుర్కొనడంలో స్వల్ప ఉద్గారాల దిశగా ఆర్థిక వ్యవస్థల రూపాంతరీకరణలో వాటికి ఎదురయ్యే సవాళ్లను ఉభయ పక్షాలూ గుర్తించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఎ)కి భారత్ నాయకత్వాన్ని ప్రధానమంత్రి లక్సాన్ స్వాగతించారు. ఈ కూటమిలో సభ్యత్వం ద్వారా 2024 నుంచి న్యూజిలాండ్ బలమైన మద్దతునిస్తుందని పునరుద్ఘాటించారు. సుస్థిర ప్రగతి లక్ష్యాలు, పారిస్ వాతావరణ ఒప్పందం, విపత్తుల ముప్పు తగ్గింపు దిశగా ‘సెండాయ్’ చట్రం నిర్దేశాల సాధన, వ్యవస్థలు-మౌలిక సదుపాయాలను పునరుత్థాన శక్తిసహితం చేయడం లక్ష్యంగాగల ‘విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల సంకీర్ణం (సిడిఆర్‌ఐ)లో న్యూజిలాండ్ చేరడంపై ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.
భూకంపాలను ఎదుర్కొనే సన్నద్ధత, తక్షణ ప్రతిస్పందన యంత్రాంగం, సామర్థ్య పెంపులో అనుభవాల మార్పిడికి వీలు కల్పించే భూకంప నష్టాల తగ్గింపు సహకారంపై భారత్, న్యూజిలాండ్ దేశాల సంబంధిత సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కోసం జరుగుతున్న కృషిని ఇద్దరు నాయకులు స్వాగతించారు.
విద్య, రాకపోకలు, క్రీడలు, ప్రజల మధ్య సంబంధాలు
భారత్, న్యూజిలాండ్ మధ్య పెరుగుతున్న విద్య, కమ్యూనిటీ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయని ఇరువురు ప్రధానులు అంగీకరించారు. సైన్స్, ఆవిష్కరణలు, నూతన, కొత్తగా ఉద్భవిస్తున్న సాంకేతికతలు వంటి రంగాలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న రంగాలపై దృష్టి సారించే భవిష్యత్తు ఆధారిత భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రెండు దేశాల విద్యా సంస్థలకు సూచించారు.
న్యూజీలాండ్ లో నాణ్యమైన విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు మరిన్ని అవకాశాలను సృష్టించాలని నాయకులు కోరారు. సైన్స్, ఆవిష్కరణ, కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో సహా వివిధ రంగాలలో విస్తృత భాగస్వామ్యానికి మద్దతు ఇవ్వడానికి నైపుణ్య అభివృద్ధి, నైపుణ్యం కలిగిన సిబ్బంది రాకపోకల అవసరాన్ని వారు గుర్తించారు. వాణిజ్య ఒప్పందం చర్చల ప్రారంభానికి అంగీకరించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వృత్తినిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికుల తరలింపును సులభతరం చేసే ఏర్పాటుపై కూడా చర్చలు ప్రారంభించాలని, అదే సమయంలో అక్రమ వలసల సమస్యను పరిష్కరించాలని ఇరువురు నేతలు అంగీకరించారు.
భారత విద్యా మంత్రిత్వ శాఖ, న్యూజిలాండ్ విద్యా మంత్రిత్వ శాఖ మధ్య పునరుద్ధరించిన విద్యా సహకార ఒప్పందంపై సంతకం జరగడాన్ని నాయకులు స్వాగతించారు. ద్వైపాక్షిక విద్యా సంబంధాల బలోపేతానికి ప్రాతిపదికగా భారత్, న్యూజిలాండ్ విద్యావిధానాలపై నిరంతర సమాచార మార్పిడికి ఈ ఒప్పందం దోహదపడుతుంది.
భారత్, న్యూజిలాండ్ మధ్య క్రీడల్లో ముఖ్యంగా క్రికెట్, హాకీ, ఇతర ఒలింపిక్ క్రీడల్లో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నేతలు పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలు, సహకారాన్ని మరింత పెంపొందించడానికి క్రీడలకు సంబంధించి సహకార ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని వారు స్వాగతించారు. భారత్, న్యూజిలాండ్ మధ్య 100 ఏళ్ల క్రీడా సంబంధాలకు గుర్తుగా 2026లో నిర్వహించనున్న 'స్పోర్టింగ్ యూనిటీ' ఈవెంట్లను వారు స్వాగతించారు.
భారత్, న్యూజిలాండ్ లలో సంప్రదాయ వైద్యానికి సంబంధించిన బలమైన వ్యవస్థల ప్రాముఖ్యతను ప్రధానమంత్రులు అంగీకరించారు. అలాగే, సమాచారం, ఉత్తమ పద్ధతుల మార్పిడి, నిపుణుల సందర్శనల ద్వారా సహకారానికి గల అవకాశాలను అర్థం చేసుకోవడానికి, అన్వేషించడానికి రెండు వైపులా సైన్స్, పరిశోధన రంగాల నిపుణుల మధ్య చర్చలను స్వాగతించారు.
యోగా, భారతీయ సంగీతం, నృత్యం పట్ల న్యూజిలాండ్ వాసుల్లో పెరుగుతున్న ఆసక్తిని, అలాగే భారతీయ పండుగలను స్వేచ్ఛగా జరుపుకోవడాన్ని ఇరువురు ప్రధానులు ప్రస్తావించారు. సంగీతం, నృత్యం, నాటకం, సినిమాలు, పండుగల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకోవాలని ఆకాంక్షించారు.
ప్రాంతీయ,బహుపాక్షిక రంగాలలో సహకారం
సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించే బహిరంగ, సమ్మిళిత, స్థిరమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్ కు మద్దతు ఇవ్వడానికి తమ నిబద్ధతను ఇరువురు ప్రధానులు పునరుద్ఘాటించారు.
తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు, ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్, ఆసియాన్ ప్రాంతీయ ఫోరం వంటి ఆసియాన్ ఆధ్వర్యంలోని వివిధ ప్రాంతీయ వేదికల్లో భారత్, న్యూజిలాండ్ ల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని నేతలు ప్రస్తావించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం భద్రతను, శ్రేయస్సును మరింత పెంపొందించడానికి ఈ ప్రాంతీయ సంస్థల ప్రాముఖ్యతను, ఆసియాన్ కేంద్ర భూమికను నాయకులు పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతను కాపాడుకోవడం అన్ని పక్షాల బాధ్యత అని స్పష్టం చేశారు. సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించే విధంగా ఐక్యరాజ్యసమితి కేంద్రబిందువుగా సమర్థవంతమైన బహుపాక్షిక వ్యవస్థ అవసరాన్ని ఇరువురు నాయకులు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇది కీలకమైన అంశమని వారు చెప్పారు. భద్రతా మండలిని మరింత ప్రాతినిధ్యంతో విశ్వసనీయంగా, సమర్థవంతంగా మార్చేందుకు దాని సభ్యత్వాన్ని విస్తరించడం సహా ఐక్యరాజ్యసమితి సంస్కరణల అవసరాన్ని ఇరు పక్షాలు ఉద్ఘాటించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థిత్వాన్ని న్యూజిలాండ్ సమర్థించింది. బహుళపక్ష కూటమిలో ఒకరి అభ్యర్థిత్వానికి ఒకరు పరస్పరం మద్దతు ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధ నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానానికి కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని ఇరువురు నాయకులు అంగీకరించారు. పరిశుభ్ర ఇంధన లక్ష్యాలు, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక నిబద్ధతకు అనుగుణంగా భారత్ అణు సరఫరా దేశాలతో చేరడం ప్రాముఖ్యతను అంగీకరించారు.
మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతకు తమ దృఢమైన మద్దతును ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. బందీల విడుదల ఒప్పందాన్ని, 2025 జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించారు. బందీలందరినీ విడుదల చేయడం, గాజా అంతటా వేగవంతమైన, సురక్షితమైన అంతరాయం లేని మానవతా సహాయాన్ని అందించే అవకాశాన్ని కల్పించడం ద్వారా శాశ్వత శాంతిని సాధించడానికి చర్చలు కొనసాగించాలని వారు మరోసారి పిలుపు ఇచ్చారు. పాలస్తీనాలో సార్వభౌమ, ఆచరణీయమైన, స్వతంత్ర రాజ్య స్థాపనకు దారితీసే చర్చల ప్రాముఖ్యతను వారు పేర్కొన్నారు. అదే సమయంలో, ఇజ్రాయెల్‌తో కలిసి శాంతి, భద్రత కలిగిన, పరస్పరం గుర్తింపు పొందిన సరిహద్దుల్లో నివసించడానికి వీలు కల్పించే “రెండు దేశాల పరిష్కారం” అవసరాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు.
ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి హక్కుల సూత్రాలు, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం ఆధారంగా న్యాయసమ్మతమైన, సుస్థిరమైన శాంతికి మద్దతు తెలిపారు.
అన్ని రూపాలలోని ఉగ్రవాదాన్ని, సీమాంతర ఉగ్రవాదంలో ఉగ్రవాద ప్రాక్సీలను ఉపయోగించడాన్ని ఇద్దరు నాయకులు ఖండించారు. ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులకు వ్యతిరేకంగా అన్ని దేశాలు తక్షణ, స్థిరమైన, గుర్తించదగిన పటిష్ట చర్యలు తీసుకోవడం అత్యవసరం అని వారు స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందించే వ్యవస్థలు, వారి సురక్షిత స్థావరాలను అడ్డుకోవాలని, ఆన్ లైన్ సహా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మూలించాలని, ఉగ్రవాదానికి పాల్పడిన వారిని సత్వరమే శిక్షించాలని వారు పిలుపునిచ్చారు. ద్వైపాక్షిక, బహుపాక్షిక యంత్రాంగాల ద్వారా ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పరస్పరం సహకరించుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు.
ద్వైపాక్షిక సహకారంలో పురోగతిపై ఇరువురు ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరస్పర ప్రయోజనంతో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంత ప్రయోజనం కోసం ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టంగా, లోతుగా చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాలని, హరిత, వ్యవసాయ సాంకేతిక రంగాల్లో సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించాలని వారు పిలుపునిచ్చారు.
భారత పర్యటన సందర్భంగా తనకు, తన ప్రతినిధి బృంద సభ్యులకు అందించిన సాదర స్వాగతానికి, ఆతిథ్యానికి గాను ప్రధాని మోదీకి, భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి లక్సన్ ధన్యవాదాలు తెలిపారు. న్యూజిలాండ్ పర్యటనకు రావాలని ప్రధాని మోదీని... లక్సన్ ఆహ్వానించారు.
(Release ID: 2158701)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam