కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
తపాలా సేవల్లో కొత్త డిజిటల్ శకానికి శ్రీకారం చుట్టిన కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
డిజిటల్ ఇండియా దిశగా ఇండియా పోస్ట్ ప్రయాణంలో అధునాతన తపాలా సాంకేతికత - ఐటీ 2.0 అమలు
ఒక కీలక విజయం
Posted On:
19 AUG 2025 6:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత, కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మార్గదర్శకత్వంలో తపాలా శాఖ (డీఓపీ) ఐటి 2.0 - తపాలా సేవల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (ఏపీటీ) విజయవంతంగా ప్రారంభించింది. ఈ విప్లవాత్మక డిజిటల్ నవీకరణ భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా దృష్టికోణాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఉన్న 1.65 లక్షల తపాలా కార్యాలయాలను ఆధునికీకరించే దిశగా తపాలా శాఖ ప్రయాణంలో కీలకమైన దశను సూచిస్తుంది. ఐటీ 2.0 ద్వారా, వేగవంతమైన, మరింత నమ్మకమైన, పౌర కేంద్రీకృత తపాలా, ఆర్థిక సేవలు దేశంలోని ప్రతి మూలకు చేరతాయి. దీని ద్వారా ఇండియా పోస్ట్ అందరికీ నాణ్యమైన సేవలు అందించడం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకుంది.
ఐటీ ఆధునికీకరణ ప్రాజెక్ట్ 1.0 విజయం ఆధారంగా కొత్తగా ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ (ఏపీటీ) వేదిక మైక్రో సర్వీసుల ఆధారిత అప్లికేషన్‌ను పరిచయం చేస్తోంది. ఇది వేగవంతమైన, మరింత నమ్మకమైన, పౌరులకు సులభంగా ఉపయోగపడే సేవలను అందిస్తుంది. పోస్టల్ టెక్నాలజీ ఎక్సలెన్స్ సెంటర్ (సీఈపీటీ) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, అభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్, భారత ప్రభుత్వ మేఘ్‌రాజ్ 2.0 క్లౌడ్ ప్లాట్‌ఫామ్ లో ఉంది. దీనికి బీఎస్ఎన్ఎల్ జాతీయ స్థాయిలో కనెక్టివిటీ మద్దతు అందిస్తోంది.
కేంద్ర మంత్రి శ్రీ సింధియా ఈసందర్భంగా మాట్లాడుతూ... “ఏపీటీ ఇండియా పోస్ట్ ను ప్రపంచ స్థాయి పబ్లిక్ లాజిస్టిక్స్ సంస్థగా మారుస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఇది పూర్తి సామర్థ్యంతో ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి, బలమైన, స్వయం సమృద్ధిగల డిజిటల్ ఇండియాకు మార్గం సుగమం చేస్తుంది” అని అన్నారు.
ఏపీటీ ముఖ్యాంశాలు
-
మైక్రో-సర్వీసులు, ఓపెన్ ఏపీటీ ఆధారిత నిర్మాణం
-
ఏకీకృత వినియోగదారు ఇంటర్‌ఫేస్
-
క్లౌడ్-రెడీ డిప్లాయ్‌మెంట్
-
బుకింగ్ నుంచి నుండి డెలివరీ వరకు ఎండ్-టు-ఎండ్ డిజిటల్ సొల్యూషన్
-
కొత్త తరం సేవలు - క్యూఆర్-కోడ్ చెల్లింపులు, ఓటీపీ ఆధారిత డెలివరీ మొదలైనవి.
-
ఓపెన్ నెట్‌వర్క్ సిస్టమ్ - గ్రామీణ ప్రాంతాలలో కూడా నమ్మకమైన కనెక్టివిటీ
-
డెలివరీ కచ్చితత్వాన్ని పెంపొందించడానికి 10-అంకెల డిజిపిన్
-
మెరుగైన రిపోర్టింగ్, విశ్లేషణ
ఈ ప్రణాళికను దశలవారీగా, ఒక నిర్మాణాత్మక పద్ధతిలో అమలు చేశారు. కర్ణాటక పోస్టల్ సర్కిల్‌లో (మే-జూన్ 2025) ప్రయోగాత్మక అమలు విజయవంతమైన తర్వాత, ఆ అనుభవాల నుంచి నేర్చుకున్న అంశాలను విషయాలను వ్యవస్థను, వ్యూహాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దశలవారీగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. మొత్తం 23 తపాలా సర్కిళ్లను కవర్ చేస్తూ, ఆగస్టు 4, 2025 నాటికి 1.70 లక్షలకు పైగా కార్యాలయాలు, అన్ని పోస్ట్ ఆఫీసులు, మెయిల్ కార్యాలయాలు, పరిపాలనా విభాగాలు ఏపీటీలో అందుబాటులోకి వచ్చాయి.
సాంకేతిక మార్పు సత్ఫలితాలు ఇవ్వడం అనేది ఉద్యోగులపై ఆధారపడి ఉంటుందని గుర్తించిన ఇండియా పోస్ట్ “ట్రైన్ – రీట్రైన్ – రిఫ్రెష్” సూత్రం కింద మాస్టర్ ట్రైనర్లు, యూజర్ ఛాంపియన్లు, ఎండ్-యూజర్లను కలుపుకొని ఒక వరస క్రమంలో 4.6 లక్షలకు పైగా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చింది. ఇది ప్రతి స్థాయిలో సంసిద్ధతకు, , దేశవ్యాప్తంగా సాఫీగా ఈ సాంకేతికత అన్వయానికి దోహదపడింది.
ఈ వ్యవస్థ తన సుస్థిరతాన్ని, సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకుంది. ఒక్కరోజులోనే 32 లక్షలకు పైగా బుకింగ్‌లు, 37 లక్షల డెలివరీలను విజయవంతంగా నిర్వహించింది.
ఐటీ 2.0 అమలుతో, ఇండియా పోస్ట్ ఆధునిక, సాంకేతిక ఆధారిత సేవా సంస్థగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. అదే సమయంలో అనాదిగా ఉన్న నమ్మకాన్ని, పోటీ లేని పరిధిని నిలబెట్టుకుంది. ఉద్యోగులలో సామర్ధ్యం పెంచడం, గ్రామీణ. పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, ఆర్థిక సమ్మిళిత్వాన్ని పెంపొందించడం, ప్రతి పౌరునికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సేవలు అందించడం పట్ల ఇండియా పోస్ట్ దృఢమైన నిబద్ధతకు ఏపీటీ విజయం నిదర్శనం.
***
(Release ID: 2158192)