యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
శ్రీనగర్‌లో ఖేలో ఇండియా జల క్రీడల ఉత్సవానికి సంబంధించిన మస్కట్, లోగో ఆవిష్కరణ
ఆగస్టు 21 నుంచి 23 వరకు ఖేలో ఇండియా ఆధ్వర్యంలో జరగనున్న
మొట్టమొదటి జల క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న శ్రీనగర్‌లోని దాల్ సరస్సు
Posted On:
14 AUG 2025 7:05PM by PIB Hyderabad
2025 ఆగస్టు 21 నుంచి 23 వరకు శ్రీనగర్‌లోని ప్రముఖ దాల్ సరస్సులో జరగనున్న మొట్టమొదటి ఖేలో ఇండియా జల క్రీడల ఉత్సవానికి (కేఐడబ్ల్యూఎస్ఎఫ్) మస్కట్‌గా హిమాలయన్ కింగ్‌ఫిషర్‌ను ఈరోజు శ్రీనగర్‌లో ఆవిష్కరించారు.
ఈ జల క్రీడల ఉత్సవాన్ని ఖేలో ఇండియాలో భాగంగా నిర్వహిస్తున్నారు. మొట్టమొదటి ఖేలో ఇండియా బీచ్ క్రీడలు ఈ సంవత్సరం మే నెలలో డయ్యూలో జరిగాయి. కేఐడబ్ల్యూఎస్ఎఫ్‌ను కేంద్ర యువజన వ్యవహారాలు- క్రీడల మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) సహకారంతో జమ్మూ కాశ్మీర్ క్రీడల మండలి నిర్వహిస్తోంది.
మార్చిలో జరిగిన ఖేలో ఇండియా శీతాకాల క్రీడల్లో మంచులో జరిగే ఆటలకు గుల్మర్గ్ ఆతిథ్యం ఇచ్చింది. దీని తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగే రెండో ఖేలో ఇండియా కార్యక్రమం ఇది. కేఐడబ్ల్యూఎస్ఎఫ్‌లో రోయింగ్, కనోయింగ్, కయాకింగ్‌లకు పతకాలు ఇవ్వనున్నారు. వాటర్ స్కీయింగ్, షికారా రేస్, డ్రాగన్ బోట్ రేస్‌లను కేవలం ప్రదర్శన కోసం నిర్వహించనున్నారు. ఈ ఆటల్లో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా అథ్లెట్లు పాల్గొననున్నారు.
జమ్మూ కాశ్మీర్ యువజన వ్యవహారాలు - క్రీడల మంత్రి శ్రీ సతీష్ శర్మ, శాసనసభ సభ్యులు జాదిబాల్ తన్వీర్ సాదిక్ ఇవాళ మస్కట్, లోగోను విడుదల చేశారు. క్రీడలకు సంబంధించిన అధికారిక కిట్‌లను కూడా ఆవిష్కరించారు.
ఖేలో ఇండియా జల క్రీడల ఉత్సవం - 2025 మస్కట్ అయిన రంగురంగుల ‘హిమాలయన్ కింగ్‌ఫిషర్’ క్రీడల్లోని సాహసం, ప్రకృతి, పోటీ స్ఫూర్తిని సూచిస్తుంది. ఇందులోని ముదురు నారింజ, నీలం రంగులు శక్తి, ప్రశాంతత , కాశ్మీర్ అందాన్ని సూచిస్తాయి. ఇది కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు… ఈ ఉత్సవానికి సంబంధించిన ప్రచారకర్తగా నిలిచిపోనుంది. ఇది పర్యావరణ అనుకూల క్రీడలు, పర్యాటకం, దేశవ్యాప్తంగా యువత పాల్గొనేలా ప్రోత్సహించనుంది.
ఖేలో ఇండియా జల క్రీడల ఉత్సవం లోగో కాశ్మీర్‌ను తెలియజేసేలా ఉంది. ఇది దాల్ సరస్సుపై షికార గ్లైడింగ్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా మంచుతో కప్పిన పర్వతాలు, పైన్ చెట్లు దీనిపై ఉన్నాయి. ఇందులో నీటిపై కనిపించే ప్రతిబింబం ప్రశాంతమైన కాశ్మీర్ అందాన్ని తెలియజేస్తోంది. ఖేలో ఇండియా రంగులు సంప్రదాయం, ప్రకృతి, క్రీడా శక్తిని సూచిస్తాయి.
"గుల్మర్గ్ ఇప్పటికే దేశానికి శీతాకాలపు క్రీడల రాజధానిగా మారింది. ఇప్పుడు దాల్ సరస్సు భారత్‌కు జల క్రీడల కేంద్రంగా మారనుంది" అని శ్రీ సాదిక్ అన్నారు. "ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజలకు గర్వకారణమైన క్షణం" అని పేర్కొన్నారు.
(Release ID: 2156635)