బొగ్గు మంత్రిత్వ శాఖ
సుస్థిర మైనింగ్ పద్ధతులు, పర్యావరణ నిర్వహణ
Posted On:
11 AUG 2025 2:50PM by PIB Hyderabad
సుస్థిర మైనింగ్ పద్ధతులను ప్రోత్సహించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) తదితర బొగ్గు, లిగ్నైట్ ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు సుస్థిర మైనింగ్ పద్ధతులను అనుసరిస్తున్నాయి. వీటిలో భూగర్భ, భూ ఉపరితల గనుల కోసం మైనర్, ఎక్సెంట్రిక్ రిప్పర్లు, కంటిన్యుయస్ మైనర్, హై వాల్ మైనింగ్ తదితర అధునాతన సాంకేతికతలు ఉన్నాయి. అదనంగా, రోడ్డు రవాణాను తగ్గించడానికి ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి నీటి స్ప్రింక్లర్లు, ఫాగ్ కెనాన్లు, దుమ్మును నియంత్రించడానికి వెట్ డ్రిల్లింగ్, డస్ట్ ఎక్స్‌ట్రాక్టర్లు బిగించిన డ్రిల్స్ ఉపయోగిస్తున్నారు.
ఆమోదించిన మైనింగ్, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక ప్రకారం జీవ పునరుద్ధరణ, అటవీకరణ కార్యక్రమాలను సైతం పీఎస్‌యూలు చేపడుతున్నాయి. మైనింగ్ పూర్తయిన ప్రాంతాలు, ఓవర్ బర్డెన్ (ఓబీ) డంపులు, మైనింగ్ పరిసర ప్రాంతాల్లోని ఇతర భూములను క్రమంగా స్వాధీనం చేసుకొని అడవులను పెంచుతున్నారు. బహుళ అంచెల్లో మొక్కలు పెంచడం, విత్తన బంతులు, విత్తనాలు వెదజల్లడానికి డ్రోన్లను ఉపయోగించడం లాంటి వినూత్న విధానాలతో సహా శాస్త్రీయమైన పద్ధతులను పీఎస్‌యూలు అమలు చేస్తున్నాయి. మైనింగ్ చేపట్టిన పరిసర ప్రాంతాల్లో లక్షల కొద్దీ మొక్కలను నాటడం ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు సుమారుగా 13,400 హెక్టార్ల భూమిని ఈ పీఎస్‌యూలు అటవీకరణ చేశాయి.
బొగ్గు సంస్థల్లో అధునాతన సుస్థిర సాంకేతికతలను అనుసరించడమనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. 2025-26 ఆర్థిక సంవత్సరానికి, ఉపరితల గనుల నుంచి 537.92 మిలియన్ టన్నుల బొగ్గును, పేలుడు రహిత మైనింగ్ సాంకేతికతలను ఉపయోగించి భూగర్భ గనుల నుంచి 23.63 మిలియన్ టన్నుల బొగ్గును సేకరించాలని సీఐఎల్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అదనంగా, అదే ఏడాదికి బొగ్గు, లిగ్నైట్ మైనింగ్ ప్రాంతాల్లో 2,800 హెక్టార్లలో మొక్కలు నాటాలని కోల్, లిగ్నైట్ పీఎస్‌యూలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో అందించారు.
***
(Release ID: 2155077)