రైల్వే మంత్రిత్వ శాఖ
భారత రైల్వేల ద్వారా ఏటా 720 కోట్ల మందికిపైగా ప్రయాణికులకు చౌక రవాణా సౌలభ్యం
· ప్రపంచ స్థాయిలోనేగాక పొరుగు దేశాలతో పోల్చిచూసినా భారత రైల్వేల్లో చార్జీలు అతి తక్కువ: మంత్రి అశ్వినీ వైష్ణవ్ · ప్రతి అవసరానికీ ఒక రైలు: ‘నమో భారత్’- ప్రాంతీయ ప్రయాణం వేగవంతం... ‘అమృత భారత్’- స్వల్ప వ్యయం... ‘వందే భారత్’- భద్రత సహా మెరుగైన ప్రయాణానుభవం · భారత రైల్వేల్లో 2004–14 మధ్య కాలంతో పోలిస్తే నేడు 3.33 లక్షల జీరో-డిశ్చార్జ్ బయో-టాయిలెట్లతో 34 రెట్లు పెరిగిన పరిశుభ్రత.. వ్యక్తిగత శుభ్రత · రైలుమార్గాలు.. సిగ్నళ్లఉన్నతీకరణతో 2025–26లో రైళ్ల సమయపాలన 80 శాతం మెరుగు... 27 డివిజన్ల పరిధిలో 90 శాతానికిపైగా నమోదు · భారత రైల్వేల్లో రోజువారీగా 16.5 లక్షల భోజనాల సరఫరా... ఆహార నాణ్యతపై ఫిర్యాదులు కేవలం 0.003 శాతమే!
Posted On:
08 AUG 2025 6:21PM by PIB Hyderabad
రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా రైల్వే మంత్రిత్వ శాఖ ‘అమృత భారత్ స్టేషన్’ పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికింద దీర్ఘకాలిక విధానంతో నిరంతర ప్రాతిపదికన దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల పునర్నవీకరణ చేపట్టింది.
స్టేషన్లలో సౌకర్యాల మెరుగుకు సంబంధించి బృహత్ ప్రణాళిక రూపకల్పన, దశలవారీగా వాటి అమలులో భాగంగా చేపట్టే పనులు కిందివిధంగా ఉన్నాయి:
· స్టేషన్లకు సులువుగా చేరే వీలు, పరిసర ప్రదేశాల మెరుగుదల
· స్టేషన్ భవనం మెరుగుదల
· వేచి ఉండే గదులు, మరుగుదొడ్ల మెరుగుదల
· లిఫ్టులు/ఎస్కలేటర్ల ఏర్పాటు
· ప్రయాణిక హిత ప్లాట్‌ఫామ్ల నిర్మాణం, పైకప్పు ఏర్పాటు
· మెరుగైన శుభ్రతకు భరోసా
· ‘ఒక స్టేషన్-ఒక ఉత్పత్తి’ వంటి పథకాలతో స్థానిక ఉత్పత్తుల కోసం విక్రయ కేంద్రాలు
· బహుళ రవాణా సాధానాల ఏకీకరణ
· దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు
· ప్రయాణిక సమాచార వ్యవస్థల మెరుగుదల
· ప్రతి స్టేషన్‌లో అవసరం మేరకు ఎగ్జిక్యూటివ్ లాంజ్, వాణిజ్య సమావేశ ప్రదేశాలతోపాటు ఆహ్లాదకర పరిసరాలు వంటి ఏర్పాట్లు
ఈ పథకం కింద నగరాల్లో రెండు వైపులా పరిసరాలతో స్టేషన్ అనుసంధానం, సుస్థిర, పర్యావరణ హిత ఏర్పాట్లు, అవసరం మేరకు కంకర రహిత రైలు పట్టాల నిర్మాణం, దశలవారీగా, సాధ్యాసాధ్యాలను బట్టి దీర్ఘకాలంలో స్టేషన్‌లో నగర కేంద్రం సృష్టి వంటివి కార్యక్రమాలు చేపడతారు.
అమృత భారత్ స్టేషన్ పథకం కింద పునర్నవీకరణ కోసం ఇప్పటిదాకా 1,337 స్టేషన్లను ఎంపిక చేయగా, తొలిదశలో భాగంగా నేటివరకూ 105 స్టేషన్ల ఆధునికీకరణ పూర్తియింది.
అత్యంత ముఖ్యమైన ప్రాథమిక అవసరాల్లో ఒకటైన నీటి సదుపాయం కల్పనలో భాగంగా అన్ని స్టేషన్లలో ఉచితంగా సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పించాలన్నది భారత రైల్వే కట్టుబాటు. వినియోగంపై అంచనా ప్రకారం నీటి సరఫరా, లోటుపాట్ల సవరణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉంటాయి. తదనుగుణంగా నీటి కొరత రాకుండా పురపాలికలు, స్థానిక ట్యాంకర్ నీటి సరఫరాదారుల సహకారం సహా ఇతరత్రా వనరుల ద్వారా జాగ్రత్తలు తీసుకుంటారు. రైల్వే స్టేషన్లలో తాగునీటి నాణ్యతకు భరోసా దిశగా ఫిర్యాదులపై తక్షణ స్పందనతో, నిర్దిష్ట వ్యవధి ప్రకారం క్రమబద్ధంగా తనిఖీ నిర్వహిస్తూ అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపడతారు.
కోచ్‌లలో పరిశుభ్రత... వ్యక్తిగత శుభ్రత దిశగా బయో టాయిలెట్ల ఏర్పాటు
ప్రయాణిక కోచ్‌లలో పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత మెరుగు లక్ష్యంగా బయో-టాయిలెట్లను ఏర్పాటు చేశారు. మానవ వ్యర్థాలు నేరుగా రైలు పట్టాలపై విసర్జితం కావడాన్ని ఇవి నిరోధిస్తాయి. ప్రతి రైలులో ఇలాంటి ‘జీరో డిశ్చార్జ్ బయో-టాయిలెట్ వ్యవస్థ’ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఉద్యమ తరహాలో భారత రైల్వేలు కొనసాగిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రధాన మార్గాల్లో నడిచే రైళ్లన్నిటిలో బయో-టాయిలెట్ల ఏర్పాటు పూర్తయింది. వీటి వివరాలను (30.06.2025 నాటికి) కింది పట్టికలో చూడవచ్చు:
వ్యవధి
|
బయో టాయిలెట్ల సంఖ్య
|
2004-14
|
9,587 మాత్రమే
|
2014-25
|
3,33,191 (34 రెట్లకుపైగా అధికం)
|
కొత్త డిజైన్‌తో రైళ్లు
అన్నివర్గాల ప్రజలకు స్వల్ప ధరతో నాణ్యమైన సేవా ప్రదానంపై భారత రైల్వేలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా సరికొత్త రూపంతో కింద పేర్కొన్న రైళ్లను తయారుచేశారు.
వందే భారత్:
ఇది సెమీ-హై స్పీడ్ రైలు... ప్రయాణికులకు మెరుగైన భద్రత సహా ఆహ్లాదకర ప్రయాణానుభవం లక్ష్యంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు. వీటిలో కింద తెలిపిన విధంగా పటిష్ఠ భద్రత, అత్యాధునిక సౌకర్యాలు లభిస్తాయి:-
· ‘కవచ్’ వ్యవస్థ
· త్వరగా వేగం పుంజుకునే సామర్థ్యం
· కోచ్‌లు మారేందుకు సురక్షిత మార్గం
· కోచ్‌లకు స్వయంచలిత ప్లగ్ డోర్లు
· మెరుగైన ప్రయాణ సదుపాయం
· హాట్ కేస్ సౌకర్యంతో మినీ ప్యాంట్రీ
· బాటిల్ కూలర్
· డీప్ ఫ్రీజర్-హాట్ వాటర్ బాయిలర్
· విశ్రాంత భంగిమకు తగిన జారుడు సీట్లు
· ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ఎటువైపైనా తిరిగే సీట్లు
· ప్రతి సీటుకు ఫోన్ ఛార్జింగ్ సదుపాయం
· వెనుకవైపుగల డ్రైవింగ్ కార్ (డీటీసీ)లో దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్.
· సీసీ టీవీల సదుపాయం వగైరాలుంటాయి.
ఈ ఏడాది ఆగస్టు 7 నాటికి విద్యుదీకరించిన బ్రాడ్‌గేజ్ రైలు మార్గాల నెట్‌వర్క్‌లో 144 వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి.
అమృత భారత్:
ఇది చౌక ధరతో అల్పాదాయ, మధ్యతరగతి వర్గాల అవసరాలను తీర్చగల రైలు. ఇవి పూర్తిగా ఏసీ రహిత ఆధునిక రైళ్లు.
ఈ ఏడాది ఆగస్టు 7 నాటికి ఈ తరహా రైళ్లు 14 ఉండగా, వీటికి 11 జనరల్ కోచ్‌లు, 8 స్లీపర్ కోచ్‌లు, 1 ప్యాంట్రీ కార్, 2 లగేజ్-కమ్- దివ్యాంగుల కోచ్‌లు ఉంటాయి.
ఈ రైళ్లకు అత్యధిక వేగం (హై-స్పీడ్), మెరుగైన భద్రత ప్రమాణాలు కీలక విశిష్టతలు. వీటిలో కింది మెరుగైన ప్రమాణాలు-సదుపాయాలు ఉంటాయి:
· వందే భారత్ స్లీపర్ తరహాలో వీటిలోని సీట్లు, బెర్తులు మెరుగైన రూపంతో సౌకర్యవంతంగా ఉంటాయి.
· కుదుపులకు అవకాశంలేని స్వయంచలిత సంధానం (కప్లర్)
· క్రాష్ ట్యూబ్ ఏర్పాటు ద్వారా కోచ్‌లలో ప్రమాద తీవ్రత తట్టుకోగల శక్తి మెరుగుదల
· అన్ని కోచ్‌లు, లగేజ్ రూమ్‌లలో సీసీటీవీ వ్యవస్థ ఏర్పాటు.
· మెరుగైన రూపంలో టాయిలెట్లు.
· బెర్త్‌పైకి సులభంగా ఎక్కగలిగేలా మెరుగైన రూపంతో నిచ్చెన.
· ఎల్‌ఈడీ లైట్లు, ఫోన్ చార్జింగ్ సాకెట్లు
· విద్యుత్-వాయు పీడన (ఈపీ) ఆధారిత బ్రేకింగ్ వ్యవస్థ.
· టాయిలెట్లు, ఎలక్ట్రికల్ క్యూబికళ్లలో ఏరోసోల్ ఆధారిత అగ్ని నిరోధక వ్యవస్థ.
· యూఎస్‌బీ-ఎ, టైప్-సి మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు.
· ప్రయాణికులు, గార్డు లేదా ట్రైన్ మేనేజర్ మధ్య పరస్పర సమాచారం కోసం అత్యవసర టాక్ బ్యాక్ వ్యవస్థ.
· మెరుగైన హీటింగ్ సామర్థ్యంతో నాన్-ఏసీ ప్యాంట్రీ కార్.
· కోచ్‌ల సులభ జోడింపు-విడదీత ‘క్విక్ రిలీజ్ మెకానిజం’తో పూర్తిగా మూసివేయబడిన గ్యాంగ్‌వే.
నమో భారత్ రాపిడ్ రైలు:
భారత రైల్వేలు ‘నమో భారత్ రాపిడ్ రైళ్ల’ను ప్రవేశపెట్టాయి. నగర శివారు-ప్రాంతీయ స్థాయిలో స్వల్పదూర ప్రయాణానుభవం మెరుగు లక్ష్యంగా వీటిని నడుపుతున్నాయి. ప్రస్తుతం గుజరాత్, బీహార్ రాష్ట్రాల పరిధిలోని రెండు మార్గాల్లో ఈ రకం రైళ్లు 4 నడుస్తున్నాయి:
(i) 94801/02 అహ్మదాబాద్-భుజ్
(ii) 94803/04 జయనగర్-పాట్నా
నమో భారత్ రాపిడ్ రైలు విశిష్టతలు:
· కేంద్రీకృత నియంత్రణగల ‘డబుల్ లీఫ్ ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు’
· భద్రత, ప్రయాణిక నిఘా కోసం సీసీటీవీలు
· మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు, అగ్ని గుర్తింపు వ్యవస్థ
· ఇంధన పొదుపు వ్యవస్థతో నిరంతర ఎల్‌ఈడీ లైటింగ్
· అత్యవసర సంభాషణ వ్యవస్థ
· మెత్తని సీట్లు, పూర్తిగా కప్పబడిన సరళ గ్యాంగ్‌వే సహా మాడ్యులర్ ఇంటీరియర్
· వాక్యూమ్ క్లీనింగ్ సదుపాయంతో ఎఫ్‌ఆర్‌పీ మాడ్యులర్ టాయిలెట్లు
· డ్రైవర్ క్యాబ్ సహా పూర్తిగా ఏసీతో నడిచే రైళ్లు
రైళ్ల సమయపాలన:
రైళ్ల రాకపోకలలో సమయపాలన దిశగా భారత రైల్వేలు అన్నివిధాలా కృషి చేస్తున్నాయి. సమయాన్ని ప్రభావితం చేసే అంశాలపై అంచనాల ఆధారంగా స్వల్ప-దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రైలు నెట్‌వర్క్ సామర్థ్యం పెంపు, రైలుమార్గాలు- సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నతీకరణ, నిర్వహణపరమైన అవరోధాల పరిష్కారం, యార్డుల పునర్నిర్మాణం వంటివి చేపడుతుంది. దీనివల్ల 2025-26లో రైళ్ల దేశం మొత్తంమీద దాదాపు 80 శాతం నమోదవగా, 90 శాతానికిపైగా సమయపాలనతో 27 డివిజన్లు అగ్రస్థానంలో నిలిచాయి.
భోజన సేవలు:
ప్రయాణిక డిమాండ్లు తీర్చడానికి తగిన కేటరింగ్ సౌకర్యాన్ని స్టేషన్లలో అందుబాటులో ఉంచేందుకు రైల్వేలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఇందుకోసం ప్రతి స్టేషన్‌లో శాశ్వత యూనిట్టు- జన్ ఆహార్, రిఫ్రెష్మెంట్ రూమ్, ఫుడ్ ప్లాజా, ఫాస్ట్ ఫుడ్ యూనిట్, కేటరింగ్/వెండింగ్ స్టాళ్లు వంటివి ఏర్పాటు చేస్తుంది.
స్టేషన్లలో ప్లాట్‌ఫారాలపైగల ఈ ప్రత్యేక ఆహార సేవల కౌంటర్ల ద్వారా ప్రయాణికులకు చౌక ధరతో పరిమిత స్థాయి భోజనం అందుబాటులో ఉంచుతుంది.
భారత రైల్వే నెట్‌వర్క్‌లో సగటున రోజుకు 16.5 లక్షల భోజనాలు సరఫరా చేస్తుండగా, ఆహార నాణ్యత సంబంధిత ఫిర్యాదుల సంఖ్య సగటున 46 అంటే- 0.003 శాతం మాత్రమే.
ప్రయాణికులకు ఇంత భారీ స్థాయిలో సజావుగా, అంతరాయం లేకుండా భోజన సరఫరా కొనసాగాలన్నది రైల్వేల యోచన. దీనికి అనుగుణంగా సేవల మెరుగుకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుంది.
ప్రజా ప్రతినిధులు, కేటరింగ్ సంఘాలు, వ్యక్తులు తదితర వర్గాల నుంచి అనేక విజ్ఞప్తులు, సూచనలు, సలహాలు, ఫిర్యాదులు అందుతుంటాయి. వీటిలో పేర్కొన్న అంశాల విశ్వసనీయత ఆధారంగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు 2024-25లో అందిన ఫిర్యాదులపై విచారణ అనంతరం అక్రమాలకు పాల్పడిన వారికి రూ.13.2 కోట్ల దాకా జరిమానా విధించారు. అంతేగాక మెరుగైన సేవల ప్రదానం లక్ష్యంగా ఫిర్యాదులను నిరంతరం పర్యవేక్షిస్తారు.
భారత రైల్వేల ద్వారా చౌక ధరతో రవాణా
భారత రైల్వేలు ఏటా 720 కోట్ల మందికిపైగా ప్రయాణికులకు చౌకధరతో రవాణా సేవను అందిస్తున్నాయి. ప్రపంచ స్థాయిలోనే కాకుండా పొరుగు దేశాలతో పోల్చినా మన రైల్వే చార్జీలు అతిస్వల్ప స్థాయిలోనే ఉన్నాయి.
ప్రయాణికులకు 2023-24లో ఇచ్చిన మొత్తం రాయితీ తాత్కాలిక లెక్కల మేరకు రూ.60,466 కోట్లుగా నమోదైంది.
ప్రయాణికుల మొత్తం వ్యయంపై ఈ రాయితీ 45 శాతం. ఒక్కమాటలో- ప్రయాణ సేవ విలువను రూ.100గా భావిస్తే ప్రతి ప్రయాణికుడికీ టికెట్ ధర అందులో రూ.55 మాత్రమే! ఇక దివ్యాంగులు, 11 కేటగిరీ రోగులు, 8 కేటగిరీల విద్యార్థులకు దీనిపై అదనపు రాయితీ కూడా లభిస్తోంది.
ఈ రాయితీ 2013-14లో రూ.31,049 కోట్లు కాగా, 2023-24 నాటికి దాదాపు రెట్టింపైంది.
ఈ నేపథ్యంలో 5 సంవత్సరాలకుపైగా విరామం అనంతరం 2025 జూలై 1 నుంచి చార్జీల హేతుబద్ధీకరణ చేపట్టారు. ఈ పెరుగుదల కూడా అత్యంత స్వల్పమే. ఉన్నత తరగతి ప్రయాణికుల స్థాయిలో ప్రతి కిలోమీటరుకు అర పైసా నుంచి 2 పైసల వరకే పెంచారు.
అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలకు చౌక సేవల కొనసాగింపులో భాగంగా ‘ఎంఎస్‌టీ’, సబర్బన్ ప్రయాణ చార్జీలను సవరించలేదు. ఇక చార్జీల సవరణ మొత్తం రాయితీపై చూపే ప్రభావం కూడా చాలా తక్కువ. ఎందుకంటే- సవరణలో కిలోమీటరు ప్రయాణానికి అరపైసా నుంచి 2 పైసల వరకూ మాత్రమే పెంపు ఉంటుంది. మరోవైపు సగంకన్నా తక్కువ ప్రయాణాలకు చార్జీ పెరుగుదల స్వల్పంగానే ఉంటుందని అంచనా. ఉదాహరణకు॥ అల్పాదాయ ప్రయాణికులకు జనరల్ కోచ్‌లో 500 కిలోమీటర్ల వరకూ చార్జీ పెంచలేదు.
ఈ విధంగా భారత రైల్వేలు చేపట్టిన చర్యలతో ప్రయాణికులలో సంతృప్తి వ్యక్తమైంది. నిర్వహణ సామర్థ్యం, ఆధునికీకరణ, డిజిటలీకరణపై ప్రధానంగా దృష్టి సారిస్తూ, వినియోగదారులకు చౌకధర ప్రయాణ ఛార్జీల కొనసాగింపు సహా సేవా ప్రదాన నాణ్యత మెరుగు లక్ష్యంగా కృషి చేస్తున్నాయి.
కేంద్ర సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక, రైల్వే శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఇవాళ ఒక ప్రశ్నపై రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
***
(Release ID: 2154694)
|