రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
పారాసెటమాల్, ఇతర సాధారణ మందులపై నిషేధం
పారాసెటమాల్ మందుపై నిషేధం అంశంలో వదంతుల సమాచారమేదీ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు అందలేదు: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
* ఫార్మాస్యూటికల్స్ విభాగం ఆధీనంలో పనిచేసే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) నేతృత్వంలో ఔషధాల (ధరల నియంత్రణ) ఉత్తర్వు-2013 ప్రకారం... ఓటీసీతో సహా అన్ని మందుల ధరలపై నియంత్రణ
Posted On:
05 AUG 2025 5:01PM by PIB Hyderabad
పారాసెటమాల్ ఔషధంపై నిషేధం విధించినట్లుగా వస్తున్న వదంతుల గురించిన ఎలాంటి సమాచారం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు (సీడీఎస్ఓ)కు అందలేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. పారాసెటమాల్ మందుపై ఎలాంటి నిషేధాన్నీ విధించలేదని, అయితే ఇటీవలి కాలంలో పారాసెటమాల్ కాంబినేషన్ మందులతో సహా నిర్ణీత మోతాదు కాంబినేషన్లను నిషేధం విధించినట్లు తెలిపింది. ఇలా నిషేధించిన కాంబినేషన్ల వివరాలు సీడీఎస్ఓ వెబ్‌సైట్ (www.cdsco.gov.in)లో చూడవచ్చని పేర్కొంది.
ఫార్మాస్యూటికల్స్ విభాగం అధీనంలో పనిచేస్తున్న నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ఔషధాల (ధరల నియంత్రణ) ఉత్తర్వు-2013 లో భాగంగా ఓటీసీ సహా ఇతర ఔషధాల ధరలను ఈ కింద తెలిపిన విధంగా ఖరారు చేసి, పర్యవేక్షిస్తోంది:
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగం జారీ చేసిన అత్యవసర మందుల జాతీయ జాబితాలోనూ, ఔషధాల (ధరల నియంత్రణ) ఉత్తర్వు ‘డీపీసీఓ’-2013 తొలి షెడ్యూలులోనూ చేర్చిన ఓటీసీ ఫార్ములేషన్లు సహా ఔషధాలకు గరిష్ఠ ధరలను ఎన్‌పీపీఏ నిర్ధారిస్తుంది. దీంతో పాటు ఆ ధరలను అన్ని సరకుల టోకు ధరల సూచీని ఆధారంగా తీసుకుని, ఏటా సవరణలు చేస్తుంది. షెడ్యూలులో ప్రస్తావించిన మందుల ఉత్పత్తిదారు సంస్థలు, దిగుమతిదారు సంస్థలు, విక్రేతలు తమ ఉత్పత్తులను స్థానికంగా వర్తించే పన్నులను కూడా కలిపి నిర్ణయించిన గరిష్ఠ ధర లోపే విక్రయించాలి.
ఓటీసీ ఔషధాలు సహా కొత్త ఔషధాలకు (ఎన్ఎల్ఈఎంలో నమోదు చేసిన ఏదైనా మందు ప్రస్తుత తయారీదారు సంస్థల ద్వారా మరేదైనా మందుతో కలిపి గాని, లేదా ఇలాంటి మందుకుండే శక్తిని లేదా మోతాదును లేదా ఈ రెండిటిలోనూ మార్పు చేసిగాని ప్రవేశపెట్టిన ఫార్ములేషన్లు) చిల్లర ధరను ఎన్‌పీపీఏ నిర్ణయిస్తుంది. దరఖాస్తు పెట్టుకున్న తయారీదారు సంస్థ, విక్రేతలకు.. ఈ చిల్లర ధర వర్తిస్తుంది. వీరు ఉభయులూ ఈ మందులను నిర్ణీత చిల్లర ధర లోపే అమ్మాలి.
షెడ్యూలులో చేర్చని ఇతర ఫార్ములేషన్ల విషయంలో, (నాన్-షెడ్యూల్డ్ ఓటీసీ ఫార్ములేషన్లు సహా) తయారీదారు సంస్థలు వెనుకటి 12 నెలల్లో తాము ప్రవేశపెట్టిన ఈ తరహా ఫార్ములేషన్ల గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)ను.. ఎంఆర్‌పీ కంటే 10 శాతానికి మించి పెంచరాదు. ఈ నియమాన్ని పాటిస్తున్నదీ లేనిదీ ఎన్‌పీపీఏ పర్యవేక్షిస్తుంది.
అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉండేటట్లు చూడడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా సార్వజనిక ఆరోగ్య సదుపాయాలకు తరలివచ్చే రోగులు తమ జేబులో డబ్బును ఖర్చు పెట్టుకోవాల్సి రావడాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఉచిత ఔషధ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దీనిలో భాగంగా, సార్వజనిక ఆరోగ్య సదుపాయాలలో అత్యవసర మందులను ఉచితంగా ఇవ్వడానికి గాను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పైన ప్రస్తావించిన మిషన్... సమగ్ర వనరుల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ కార్యక్రమ అమలు ప్రణాళికలలో పేర్కొన్న అవసరాలను పరిగణనలోకి తీసుకుంటారు. పైన పేర్కొన్న కార్యక్రమంలో భాగంగా ఔషధాల కొనుగోలు, నాణ్యత విషయంలో హామీ, సరఫరా సంస్థలతో పాటు గిడ్డంగుల నిర్వహణ, ఆడిటింగ్, ఫిర్యాదుల పరిష్కారం కోసం బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి కూడా సహాయాన్ని అందిస్తారు. దీంతో పాటు, ప్రామాణిక చికిత్స మార్గదర్శకాల ప్రచారం, ఔషధాలు-టీకామందు పంపిణీ నిర్వహణ వ్యవస్థ (డీవీడీఎంఎస్) పేరిట సమాచార సాంకేతికత ఆధారిత వేదికను ఏర్పాటు చేయడానికీ సహాయాన్ని అందిస్తారు. దీనిని అత్యవసర మందుల కొనుగోలు, లభ్యతల వాస్తవ స్థితిని పర్యవేక్షించడానికి ఉపయోగిస్తారు. జాతీయ స్థాయిలో సరఫరా సంస్థల కార్యకలాపాల పర్యవేక్షణను సులభతరంగా మార్చడానికి ఒక కేంద్రీయ డ్యాష్‌బోర్డును రూపొందించారు. అత్యవసర మందుల కొనుగోలు, లభ్యత స్థాయులను పర్యవేక్షించడానికి కొన్ని రాష్ట్రాలు సబ్ సెంటర్ల అంచె వరకు డీవీడీఎంఎస్ పోర్టల్‌ను కూడా మొదలుపెట్టాయి.
ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సదుపాయాల్లో వివిధ అత్యవసర మందుల జాబితాను అందుబాటులో ఉంచాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సిఫారసు చేసింది. సిఫారసు చేసిన అత్యవసర మందుల జాబితాలో సబ్ సెంటర్లకు గాను 106 మందులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (పీహెచ్‌సీలు) 172, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు 300, సబ్-డిస్ట్రిక్ట్ హాస్పిటళ్లకు 318, జిల్లా ఆసుపత్రుల కోసం 381 డ్రగ్స్ ఉన్నాయి. ఈ జాబితాలో మరిన్ని మందులను చేర్చే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇచ్చారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలకు అత్యవసర ఔషధాలు నిరంతరాయంగా సరఫరా అవుతూ ఉండేటట్లు చూసేందుకు 697 డ్రగ్ ఫార్ములేషన్స్ విషయంలో యాక్టివ్ రేట్ కాంట్రాక్టులను మెడికల్ స్టోర్స్ ఆర్గనైజేషన్ (ఎంఎస్ఓ), ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపోలు (జీఎంఎస్డీలు) కుదుర్చుకున్నాయి. ఎంఎస్ఓకు కావలసిన వస్తువులను సమకూర్చే నమోదిత సరఫరాదారు సంస్థలు దేశవ్యాప్తంగా 1,152 ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా ఈ 1,152లో కలిసి ఉన్నాయి. ఇవి మందులు కావాలంటూ ఒక ఆర్థిక సంవత్సరంలో నాలుగు సార్లు ఎంఎస్ఓ, లేదా జీఎంఎస్‌డీలను కోరవచ్చు. దీనికోసం ఎంఎస్ఓ-డీవీడీఎంఎస్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2153379)