జౌళి మంత్రిత్వ శాఖ
పరిశోధక విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్
Posted On:
05 AUG 2025 4:35PM by PIB Hyderabad
ఎన్ఐఎఫ్‌టీ చట్టం- 2006 కింద జౌళీ మంత్రిత్వ శాఖ నెలకొల్పిన చట్టబద్ధమైన సంస్థ జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ (ఎన్ఐఎఫ్‌టీ). జౌళి, వస్త్ర రంగాల్లో పరిశోధన, విద్యాపరంగా పురోగతిని క్రియాశీలకంగా ప్రోత్సహిస్తోంది. ఇది పీహెచ్‌డీ కోర్సులను నిర్వహించడంతోపాటు టీచింగ్ ఫెలోషిప్ ద్వారా పూర్తిస్థాయి పరిశోధకులకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఇందులో భాగంగా నాలుగేళ్ల వరకు నెలవారీ స్టయిపెండ్, కంటింజెన్సీ గ్రాంట్, హెచ్ఆర్ఏ అందిస్తారు. అయితే, ఈ ఫెలోషిప్ అందని పరిశోధకులు బయటి వనరుల నుంచి అందే సహకారంతో ప్రాజెక్టు ఫెలోలు లేదా ఇండస్ట్రీ చైర్ ఫెలోషిప్‌లు పొందవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చివరి సెమిస్టర్ విద్యార్థులకు ప్రాయోజిత, పరిశ్రమ ఆధారిత పరిశోధన ప్రాజెక్టులను చేపట్టే అవకాశాన్ని కూడా ఎన్ఐఎఫ్‌టీ అందిస్తుంది. ప్రతి విద్యార్థికీ విద్యాపరంగా ఎన్ఐఎఫ్‌టీ నుంచి, పారిశ్రామికంగా ప్రాయోజిత సంస్థ నుంచి ఒక్కో మెంటార్ ఉంటారు. తద్వారా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయుల్లో అనువర్తిత పరిశోధన, పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందిస్తారు.
అంతేకాకుండా.. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన/నిధులను పొందే టెక్స్‌టైల్ సంస్థల్లో 3/4 సంవత్సరాల డిప్లొమా/అండర్ గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చదువుకోవడానికి చేనేత కార్మికులు/కార్మికుల పిల్లలకు (ఇద్దరు పిల్లల వరకు) స్కాలర్‌షిప్ (ఒకరికి ఏడాదికి గరిష్టంగా రూ.2 లక్షల వరకు) లభిస్తుంది.
ఇంకా, నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్ (ఎన్‌టీటీఎం)లో భాగస్వామ్యం వహించేందుకు టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగంలో పాఠ్యాంశాల రూపకల్పన కోసం ప్రతిపాదనలు సమర్పించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అన్ని ఉన్నత విద్యా సంస్థలకు మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ రోజు లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో జౌళీ శాఖ సహాయ మంత్రి శ్రీ పబిత్ర మార్గరిటా ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2152989)