బొగ్గు మంత్రిత్వ శాఖ
12వ రౌండ్ వాణిజ్య వేలంలో ఏడు బొగ్గు బ్లాకుల వేలం
Posted On:
01 AUG 2025 2:38PM by PIB Hyderabad
వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ ఏడాది మార్చి 27న 12వ రౌండ్ బొగ్గు బ్లాకుల వేలాన్ని ప్రారంభించింది. జూలై 28 నుంచి 31 వరకు నిర్వహించిన ఫార్వర్డ్ ఆక్షన్లలో మొత్తం ఏడు బొగ్గు బ్లాకులను విజయవంతంగా వేలం వేశారు. వీటిలో మూడు పూర్తి స్థాయిలో అన్వేషించిన బ్లాకులు కాగా, నాలుగు పాక్షిక అన్వేషిత బొగ్గు బ్లాకులు.
ఈ ఏడు బ్లాకుల్లో కలిపి దాదాపు 1,761.49 మిలియన్ టన్నుల నిల్వలున్నాయి. ఈ బ్లాకుల మొత్తం గరిష్ట సామర్థ్యం (పీఆర్సీ) ఏడాదికి 5.25 మిలియన్ టన్నులు (పాక్షిక అన్వేషిత బొగ్గు బ్లాకులు మినహా).
ఈ వేలంలో తీవ్ర పోటీ నెలకొంది. 26.70 శాతం సగటు రెవెన్యూ వాటా లభించింది. బొగ్గు రంగంలో పరిశ్రమల నిరంతర ఆసక్తినీ, అలాగే విధానపరంగా స్థిరమైన, పారదర్శకమైన ఏర్పాట్ల దిశగా మంత్రిత్వ శాఖ కృషినీ ఇది ప్రతిబింబిస్తుంది. వీటి ద్వారా ఏటా దాదాపు రూ.719.90 కోట్ల ఆదాయం సమకూరనుంది (పాక్షిక అన్వేషిత బొగ్గు బ్లాకులు మినహా). దీని ద్వారా దాదాపు రూ.787.50 కోట్ల మూలధన పెట్టుబడులను ఆకర్షించి.. 7,098 ఉపాధి అవకాశాలు లభించే అవకాశముంది.
2020లో వాణిజ్యపరమైన బొగ్గు తవ్వకం ప్రారంభమైనప్పటి నుంచి, మొత్తం 131 బొగ్గు బ్లాకులను విజయవంతంగా వేలం వేశారు. వీటి ఉత్పత్తి సామర్థ్యం ఏటా 277.31 మిలియన్ టన్నులు. ఈ బ్లాకుల కార్యకలాపాలు మొదలైతే.. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి, బొగ్గు రంగంలో దేశ స్వావలంబనకు అవెంతగానో దోహదపడతాయి. వీటి ద్వారా రూ. 39,359 కోట్ల వార్షిక ఆదాయం, రూ. 41,597 కోట్ల మూలధన పెట్టుబడులు, బొగ్గు ఉత్పత్తి ప్రాంతాల్లో 3,74,916 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
బొగ్గు రంగాన్ని ఆర్థిక వృద్ధికి కీలక చోదక శక్తిగా మార్చడంలో మంత్రిత్వ శాఖ అంకితభావాన్ని ఈ వ్యూహాత్మక కార్యక్రమాలు పునరుద్ఘాటించాయి. ఈ కార్యక్రమాలు దేశ ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా.. ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించి, ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. తద్వారా ‘ఆత్మ నిర్భర భారత్’ లక్ష్యానికి దోహదపడతాయి.
***
(Release ID: 2151595)