ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’ తాజా సమాచారం
*దేశమంతటా 1.78 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల (ఏఏఎంల) సేవలు
*ప్రజల ఇళ్లకు దగ్గర్లో సమగ్ర ప్రాథమిక చికిత్స సేవలు లభించే 12 ప్యాకేజీల్ని అందిస్తున్న ఏఏఎమ్‌లు
*ఎన్‌హెచ్ఎం పరిధిలో ‘ఉచిత రోగనిర్ధారణ సేవా కార్యక్రమం’.. ఉప కేంద్రాల్లో 14 పరీక్షలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 63 పరీక్షలు సహా ప్రజారోగ్య కేంద్రాల్లో అన్ని స్థాయుల్లోనూ ఉచిత రోగనిర్ధారణ సేవలందించడమే ధ్యేయం
*నివారణ ప్రధాన ఆరోగ్యసంరక్షణను ప్రోత్సహిస్తూ ఏఏఎంలలో యోగ, సైకిలింగ్, ధ్యానం తదితర వెల్‌నెస్ సంబంధిత శిక్షణ...ఇంతవరకు 5.73 కోట్లకు పైగా వెల్‌నెస్ కార్యక్రమాల నిర్వహణ
*ఇప్పటికే 79.75 కోట్ల ఏబీహెచ్ఏ ఐడీల ఏర్పాటు... వివిధ ఆరోగ్య పోర్టళ్లకు లింక్ చేసిన 65.34 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు
Posted On:
01 AUG 2025 2:31PM by PIB Hyderabad
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (ఏఏఎం) పోర్టల్లో నమోదు చేసిన సమాచారం ప్రకారం, కిందటి నెల 15 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 1,78,154 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు సేవల్ని అందిస్తున్నాయి. ఇదివరకటి ఆయుష్మాన్ భారత్ హెల్త్-వెల్‌నెస్ సెంటర్లు (ఏబీ-హెచ్‌డబ్ల్యూసీస్)నే ప్రస్తుతం ఏఏఎంలుగా వ్యవహరిస్తున్నారు.
సబ్ హెల్త్ సెంటర్లను (ఎస్‌హెచ్‌సీ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్‌సీ) బలోపేతం చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల రూపంలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్యసంరక్షణను అందిస్తున్నారు. ఈ ఏఏఎంలు నివారణ, ప్రోత్సాహం, పునరావాసం, చికిత్స అనంతర సంరక్షణ సేవలను అందిస్తున్నాయి. అంటురోగాలు, ఇతరులకు సోకని రోగాలు (ఎన్‌సీడీస్), సంతానోత్పత్తి సంబంధిత, బాలల ఆరోగ్యసంరక్షణ సేవలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వీటి పరిధిలోకి వస్తున్నాయి.
పన్నెండు ప్యాకేజీలతో కూడిన ప్రాథమిక ఆరోగ్యసంరక్షణ సేవలను అందజేయడానికి ఉన్నతీకరించిన మౌలిక సదుపాయాలను కల్పించడం, అదనపు సిబ్బందిని సమకూర్చడం, అత్యవసర మందులు, రోగనిర్ధారణ, ఐటీ వ్యవస్థల వంటివి సహా అవసరమైన ఇతర సాధనాలను కూడా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు సమకూర్చారు. ప్రజల ఇళ్లకు దగ్గర్లోనే ప్రాథమిక స్వాస్థ్య సంరక్షణ సేవలను అందించడానికి ఏఏఎంకు చెందిన ప్రాథమిక ఆరోగ్యసంరక్షణ బృంద సభ్యులకు శిక్షణ ఇస్తున్నారు.
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం)లో భాగంగా ‘ఉచిత రోగనిర్ధారణ సేవా కార్యక్రమాన్ని’ (ఎఫ్‌డీఎస్ఐ) 2015లో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రారంభించింది. ప్రజలకు చేరువలో రోగలక్షణాలను తెలుసుకోవడానికి సంబంధించిన, రేడియోలాజికల్ డయాగ్నసిస్ సంబంధిత సేవలను సులభ పద్ధతిలో, తక్కువ ధరలకు అందజేయడమే ఈ కార్యక్రమం ధ్యేయం. పీహెచ్‌సీలలో అన్ని స్థాయుల్లో ఉచిత రోగనిర్ధారణకు సంబంధించిన అనేక సేవలను ఉచితంగా అందజేయాలన్నది ఎఫ్‌డీఎస్ఐ లక్ష్యం. దీనిలో సబ్ సెంటర్లలో నిర్వహించే 14 పరీక్షలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నిర్వహించే 63 పరీక్షలు కలిసి ఉంటాయి.
రోగాలను నయం చేయడానికి తోడు, ప్రోత్సాహక ప్రధాన, నివారణ ప్రధాన ఆరోగ్య సేవల లభ్యత సమగ్ర ప్రాథమిక ఆరోగ్యసంరక్షణలో ఓ విడదీయలేని భాగం. వెల్‌నెస్‌కు సంబంధించిన యోగ, సైకిలింగ్, ధ్యానం వంటి కార్యకలాపాలను కూడా ఏఏఎంలలో నిర్వహిస్తున్నారు. గత జూన్ 30 నాటికి మొత్తం 5.73 కోట్ల వెల్‌నెస్ కార్యక్రమాలను ఈ ఏఏఎంలలో నిర్వహించారు.
ఆరోగ్య రంగ అనుబంధ విస్తారిత వ్యవస్థ (హెల్త్ ఇకోసిస్టమ్) పరిధిలో స్వాస్థ్య సమాచారాన్ని వివిధ విభాగాలు ఉపయోగించుకొనేందుకు వీలుగా ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాన్ని రూపొందించడం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) ఉద్దేశం. దీంతో పౌరులందరికి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డును సిద్ధం చేయడం సాధ్యపడుతుంది. పౌరులకు ఆరోగ్య సేవలు సులభంగా అందజేయడానికి కూడా వీలవుతుంది. సంరక్షణకయ్యే ఖర్చును తగ్గించడంతో పాటు ప్రయివేటు, ప్రభుత్వ ఆరోగ్యసంరక్షణ సంస్థలలో సేవల లభ్యతను మరింత మెరుగుపరచవచ్చు. ఏబీడీఎమ్ ఏర్పాటు చేసిన డిజిటల్ హెల్త్ ఇకోసిస్టమ్ ప్రాథమిక, రెండో, మూడో స్థాయుల ఆరోగ్యసంరక్షణ సేవల్లో ఎలాంటి ఆటంకం ఎదురవకుండా సేవలు నిరంతరాయంగా అందేటట్లు తోడ్పడుతుంది. ఇంతవరకు ఆరోగ్య సంబంధిత వివిధ పోర్టళ్లలో 79.75 కోట్ల ‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ) ఐడీ’లను రూపొందించడమే కాకుండా, 65.34 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను (ఈహెచ్‌ఆర్) లింక్ చేశారు.
ఒక్కో ఏఏఎంను ఏర్పాటు చేసి, నిర్వహించడానికి దాదాపు రూ.17.03 లక్షలు ఖర్చవుతుందని అంచనా. దీనిలో ఒకసారి పెట్టే ఖర్చుతో పాటుచ ఒక సంవత్సర కాలం వరకు మళ్లీ మళ్లీ పెట్టాల్సిన ఖర్చులు కూడా కలిసి ఉంటాయి. ఎన్‌హెచ్ఎంలో భాగంగా ఏఏఎంను ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి అయ్యే మొత్తం బడ్జెటును రాష్ట్రాలుగాని, కేంద్ర పాలిత ప్రాంతాలు గాని దాఖలు చేసే కార్యక్రమ అమలు ప్రణాళిక (పీఐపీ)లో పేర్కొన్న ప్రకారం ఎన్‌హెచ్‌ఎం రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ (ఆర్‌ఓపీ) కింద ఆమోదిస్తారు.
ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ లోక్‌సభలో ఈ రోజు రాతపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2151592)