వ్యవసాయ మంత్రిత్వ శాఖ
‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ కింద పరిహారం చెల్లింపు
Posted On:
01 AUG 2025 4:33PM by PIB Hyderabad
‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ను 2016లో ప్రవేశపెట్టినప్పటి నుంచి 2024-25 వరకు, గత జూన్ 30 నాటికి మొత్తం 78.407 కోట్ల మంది రైతులు పెట్టుకున్న దరఖాస్తులు బీమా రక్షణ పరిధిలోకి వచ్చాయి. ఈ దరఖాస్తులకు సంబంధించి అదే కాలంలో 22.667 కోట్ల మంది రైతులు క్లెయిముల రూపంలో మొత్తం రూ.1.83 లక్షల కోట్లు అందుకొన్నారు.
ఈ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయడానికి ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. ఇది పారదర్శకత్వానికి పెద్దపీట వేయడంతో పాటు క్లెయిములను సకాలంలో పరిష్కరించడానికి తోడ్పడింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో కొన్ని:
• సమాచారాన్ని తెలుసుకోవడానికి ఒకే మూలం (సింగిల్ సోర్స్)గా ఉపయోగపడేందుకు నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ (ఎన్‌సీఐపీ)ని రూపొందించారు. ఇది సబ్సిడీ చెల్లింపు, సమన్వయం, పారదర్శకత, సమాచారం చేరవేత.. వీటితో పాటు, రైతులను నేరుగా ఆన్‌లైన్ పద్ధతిలో చేర్చుకోవడం, మెరుగైన పర్యవేక్షణ కోసం బీమా పథకంలో చేరిన రైతుల వివరాలను అందుకోవడం, అప్‌లోడ్ చేయడంతో పాటు క్లెయిం సొమ్మును రైతుకు చెందిన బ్యాంకు ఖాతాకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో బదలాయించడం వంటి అనేక సేవలను సులభతరం చేస్తోంది.
• క్లెయిం చెల్లింపు ప్రక్రియను పక్కాగా పర్యవేక్షించడానికి ‘డిజిక్లెయిమ్ మాడ్యూల్’ (‘Digiclaim Module’) పేరుతో ఒక మాడ్యూల్‌ను ప్రత్యేకంగా 2022 ఖరీఫ్ సీజన్ నుంచి ప్రారంభించారు. దీని సాయంతో నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ (ఎన్‌సీఐపీ)ను పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీఎఫ్ఎంఎస్)తోనూ, బీమా కంపెనీల అకౌంటింగ్ సిస్టమ్‌తోనూ కలిపారు.
• రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీని, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీని వేర్వేరుగా చూసే పద్ధతి (డీలింకింగ్)ని అమల్లోకి తీసుకువచ్చారు. దీంతో రైతులు తమ క్లెయిములలో కేంద్ర ప్రభుత్వ వాటాకు సంబంధించిన భాగం వరకు పొందేందుకు వీలు చిక్కుతోంది.
• పథకం నిబంధనల ప్రకారం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్క్రో (ESCROW) ఖాతాను తెరిచి దానిలో తన వంతు ప్రీమియం సొమ్మును ముందస్తుగా డిపాజిట్ చేయడాన్ని ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి తప్పనిసరి చేశారు.
• ఈ పథకాన్ని అమలుచేయడంలో టెక్నాలజీని వినియోగించుకొనే దిశగా వివిధ చర్యలను ఇప్పటికే తీసుకున్నారు. వాటిలో.. దిగుబడి సమాచారం, పంట కోతల ప్రయోగాలకు (సీసీఈ) సంబంధించిన డేటాను ‘సీసీఈ-అగ్రీ యాప్’ (CCE-Agri App) ద్వారా సేకరించి, నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ (ఎన్‌సీఐపీ)లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇది బీమా కంపెనీలు సీసీఈల తీరుతెన్నులను గమనించుకొనేందుకు, రాష్ట్ర భూ రికార్డులను ఎన్‌సీఐపీతో ఏకీకరించడానికి అవకాశాన్నిస్తోంది. రైతులకు క్లెయిములను సకాలంలో చెల్లించేందుకు ఈ చర్యలు తోడ్పడుతున్నాయి.
• క్లెయిములను చెల్లించడంలో బీమా కంపెనీ జాప్యం చేస్తే 12 శాతం జరిమానాను ఎన్‌సీఐపీలో ఆటోమేటిక్‌గా లెక్కించే పద్ధతిని తీసుకువచ్చారు.
మరింత మంది రైతులను, ప్రత్యేకించి ఎలాంటి రుణాలూ తీసుకోని రైతులను బీమా రక్షణ పరిధిలోకి తీసుకురావడానికి, పంటల బీమా రంగంలో ఇప్పటి కంటే ఎక్కువ పోటీని ప్రవేశపెట్టి తద్వారా మంచి రేట్లకు రైతులకు అత్యుత్తమ సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ బీమా కంపెనీలతో పాటు ప్రయివేటు రంగ బీమా కంపెనీలను కూడా భాగస్వాముల్ని చేశారు. పోటీ పెరిగినందువల్ల, యాక్చువరియల్-బిడ్డెడ్ ప్రీమియం రేట్లు కూడా తగ్గాయి. ఇదివరకటి పంట బీమా పథకాలతో పోలిస్తే, రైతుల దరఖాస్తుల సంఖ్య 2014-15లో 3 కోట్ల 71 లక్షల స్థాయి నుంచి 2024-25లో 15 కోట్ల 10 లక్షలకు పెరిగింది. రుణాలు తీసుకోని రైతులు పెట్టుకున్న దరఖాస్తులు కూడా 2014-15లో 20 లక్షల స్థాయి నుంచి 2024-25లో 5 కోట్ల 22 లక్షలకు పెరిగాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రాంనాథ్ ఠాకూర్ రాజ్యసభలో ఈ రోజు రాతపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2151588)