పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ట్రక్కు డ్రైవర్ల కోసం ‘అప్నా ఘర్’ విశ్రాంతి కేంద్రాలు

Posted On: 31 JUL 2025 5:10PM by PIB Hyderabad

ట్రక్కు డ్రైవర్లకు మెరుగైన భద్రతను అందించడంతోపాటు వారి సంక్షేమానికి పాటుపడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా.. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ‘అప్నా ఘర్’ అనే ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సుదూర ప్రయాణాలు చేసే ట్రక్కు డ్రైవర్లకు సదుపాయాలను మెరుగుపరచడం దీని లక్ష్యం. ఈ ఏడాది జూలై 1 నాటికి.. దేశవ్యాప్తంగా హైవేలను ఆనుకుని ఉన్న రిటైల్ అవుట్ లెట్ల (ఆర్‌వోలు) వద్ద ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) 368 ‘అప్నా ఘర్’ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. వాటిలో 4611 పడకలతోపాటు ఇతర సదుపాయాలూ ఉన్నాయి.

‘అప్నా ఘర్’లో సౌకర్యాలు:

వసతి గృహాలు (10-30 పడకలు)
రెస్టారెంట్లు/దాబాలు
సొంతంగా వంట చేసుకునే సదుపాయాలు
పరిశుభ్రమైన టాయిలెట్లు
స్నానం కోసం ప్రత్యేక ఏర్పాట్లు (హౌడాలు)
శుద్ధి చేసిన తాగునీటి సదుపాయం
‘అప్నా ఘర్’ కార్యక్రమానికి ట్రక్కు డ్రైవర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. అప్నాఘర్ యాప్ లో ట్రక్కు డ్రైవర్ల బుకింగులు, డౌన్లోడ్/ నమోదులు పెరగడంతోపాటు వారి నుంచి సానుకూలంగా వ్యక్తమైన అభిప్రాయాలను బట్టి ఇది స్పష్టమవుతోంది.

పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ సురేశ్ గోపి ఈరోజు లోక్‌సభకు ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.  

 

***


(Release ID: 2150925)