సహకార మంత్రిత్వ శాఖ
రూ. 2,000 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ పథకం "గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు నేషనల్ కోపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ)కు కేబినెట్ ఆమోదం
प्रविष्टि तिथि:
31 JUL 2025 3:01PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం "గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు నేషనల్ కోపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) ’ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రూ. 2,000 కోట్ల వ్యయంతో 2025-26 నుంచి 2028-29 వరకు నాలుగేళ్ల కాలానికి (ఏటా రూ. 500 కోట్లు) అమలు చేయనున్నారు.
2025-26 నుంచి 2028-29 వరకు అందించే రూ.2000 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ తో ఈ సంస్థ బహిరంగ మార్కెట్ నుంచి నాలుగేళ్లలో రూ.20,000 కోట్ల నిధులను సమీకరిస్తుంది. సహకార సంఘాలు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు/ ప్లాంట్ల విస్తరణకు రుణాల మంజూరీకి, సంస్థల నిర్వహణ మూలధన అవసరాలను తీర్చేందుకు ఎన్‌సీడీసీ ఈ నిధులను ఉపయోగిస్తుంది.
ఆర్థిక ఇబ్బందులు:
ప్రభుత్వం నుంచి బడ్జెట్ మద్దతు రూపేణా 2025-26 నుంచి 2028-29 వరకు ఎన్‌సీడీసీకి రూ. 2,000 కోట్ల (ఏటా రూ. 500 కోట్లు) గ్రాంటును భారత ప్రభుత్వం అందిస్తుంది. దీంతో ఎన్సీడీసీ నాలుగేళ్లలో బహిరంగ మార్కెట్ నుంచి రూ.20,000 కోట్లు సమీకరించే అవకాశం కలుగుతుంది.
ప్రయోజనాలు:
పాడి, పశుసంవర్ధక, మత్స్య, చక్కెర, జౌళి, ఫుడ్ ప్రాసెసింగ్, స్టోరేజీ, కోల్డ్ స్టోరేజీ, కార్మిక, మహిళా నేతృత్వంలోని సంఘాలు సహా వివిధ రంగాల్లో ఉన్న 13,288 సహకార సంఘాల్లో ఉన్న దాదాపు 2.9 కోట్ల మంది సభ్యులు లబ్ధి పొందే అవకాశముంది.
అమలు వ్యూహం, లక్ష్యాలు:
(i) నిధుల పంపిణీ, పరిశీలన, ప్రాజెక్టు అమలును పర్యవేక్షించడం, నిధుల ద్వారా పంపిణీ చేసిన రుణాల రికవరీ కోసం.. ఈ పథకానికి అమలు సంస్థగా ఎన్సీడీసీ వ్యవహరిస్తుంది.
(ii) రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా, లేదా నిర్ణీత మార్గదర్శకాల మేరకు నేరుగా సహకార సంఘాలకు ఎన్సీడీసీ రుణాలు ఇస్తుంది. ఎన్సీడీసీ ప్రత్యక్ష నిధుల మార్గదర్శక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సహకార సంఘాలను.. ఆమోదయోగ్యమైన సెక్యూరిటీ, లేదా రాష్ట్ర ప్రభుత్వ హామీ ద్వారా నేరుగా ఆర్థిక సాయమందించేందుకు పరిగణనలోకి తీసుకుంటారు.
(iii) ఎన్సీడీసీ సహకార సంఘాలకు రుణాలను అందిస్తుంది. వివిధ రంగాల్లో ప్రాజెక్టు కేంద్రాల ఏర్పాటు/ ఆధునికీకరణ/ సాంకేతిక ఉన్నతీకరణ/ విస్తరణ కోసం దీర్ఘకాలిక రుణాన్ని, అలాగే వర్తకాన్ని లాభదాయకంగానూ సమర్థంగానూ నడిపించేందుకు నిర్వహణ మూలధనాన్ని ఎన్సీడీసీ అందిస్తుంది.
ప్రభావం, ఉపాధి కల్పన సామర్థ్యం:
i. ఈ సహకార సంఘాలకు అందించే నిధులు ఆదాయాన్ని సృష్టించే మూలధన ఆస్తుల సమీకరణకు ఉపయోగపడుతుంది. అలాగే, నిర్వహణ మూలధన రూపంలో సహకార సంఘాలకు అవసరమైన ఆర్థిక చేయూతను అందిస్తుంది.
ii. ఆర్థిక ప్రయోజనాలే కాకుండా.. సామాజిక-ఆర్థిక అంతరాలను పరిష్కరించడానికి, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి సహకార సంఘాలు ముఖ్య సాధనాలు. వాటి ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక భద్రతా సూత్రాలు ఇందుకు ఎంతగానో దోహదపడతాయి.
iii. సామర్థ్యాభివృద్ధి, ఆధునికీకరణ, వివిధ రకాల కార్యకలాపాలను చేపట్టడం, వాటి లాభదాయకతను పెంచడంతోపాటు ఉత్పాదకతను పెంచేలా వాటిని ఉపయోగించుకోవడం, సభ్యులుగా ఉన్న రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తూ ఎక్కువ ఉపాధి అవకాశాలను కల్పించడం... రుణ లభ్యత ద్వారా ఇలాంటి అనేక అంశాల్లో సహకార సంఘాలకు చేయూత లభిస్తుంది.
iv. అంతేకాకుండా, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం టర్మ్ రుణాలు కూడా వివిధ నైపుణ్యాలున్నవారికి విస్తృతమైన ఉపాధి అవకాశాలను అందిస్తాయి.
నేపథ్యం:
భారత ఆర్థిక వ్యవస్థకు సహకార రంగం ఎంతగానో దోహదపడుతోంది. గ్రామీణ రంగంలో సామాజిక, ఆర్థిక అభ్యున్నతి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని అన్ని రంగాల్లో ఆయా ఉత్పత్తులకు సంబంధించి సహకార రంగం గణనీయంగా దోహదపడుతుంది. రుణాలు, బ్యాంకింగ్, ఎరువులు, చక్కెర, పాడి, మార్కెటింగ్, వినియోగ వస్తువులు, చేనేత, హస్తకళలు, మత్స్య పరిశ్రమ, గృహనిర్మాణం సహా అనేక రకాల కార్యకలాపాలను దేశంలోని సహకార సంఘాలు నిర్వహిస్తున్నాయి. భారత్‌లో 8.25 లక్షలకు పైగా సహకార సంఘాలుండగా, వాటిలో 29 కోట్లకు పైగా సభ్యులున్నారు. 94 శాతం మంది రైతులకు ఏదో ఒక రూపంలో సహకార సంఘాలతో అనుబంధం ఉంది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బలమైన సామాజిక-ఆర్థిక సహకారాన్ని అందిస్తున్న పాడి, పౌల్ట్రీ, పశువులు, చేపల పెంపకం, చక్కెర, వస్త్రం, ప్రాసెసింగ్, నిల్వ, కోల్డ్ స్టోరేజీ, కార్మిక సహకార సంఘాలు, మహిళా సహకార సంఘాల వంటి బలహీన రంగాలకు దీర్ఘకాలిక, నిర్వహణ మూలధన రుణాల మంజూరు ద్వారా అండగా నిలవడం అత్యావశ్యకం.
****
(रिलीज़ आईडी: 2150905)
आगंतुक पटल : 11