ప్రధాన మంత్రి కార్యాలయం
బీహార్లోని మోతీహారీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
18 JUL 2025 3:53PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
ఈ పవిత్ర శ్రావణ మాసంలో నేను బాబా సోమేశ్వర నాథ్ పాదాలకు శిరసు వంచి ప్రణమిల్లుతున్నాను. ఆయన ఆశీర్వాదంతో బీహార్ ప్రజలందరికీ సుఖసంతోషాలు, శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తున్నాను.
బీహార్ గవర్నర్ గౌరవ శ్రీ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్ కుమార్, నా కేంద్ర మంత్రివర్గ సహచరులు శ్రీ జితన్ రామ్ మాంఝీ , శ్రీ గిరిరాజ్ సింగ్, శ్రీ లాలన్ సింగ్, శ్రీ చిరాగ్ పాస్వాన్, శ్రీ రామనాథ్ ఠాకూర్, శ్రీ నిత్యానంద్ రాయ్, శ్రీ సతీష్ చంద్ర దూబే, శ్రీ రాజ్ భూషణ్ చౌదరి, బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ సమ్రాట్ చౌదరి, శ్రీ విజయ్ సింహా, నా పార్లమెంట్ సహచరులు, బీహార్‌కు చెందిన దిగ్గజ రాజకీయ నాయకుడు శ్రీ ఉపేంద్ర కుష్వాహా, భారతీయ జనతా పార్టీ – బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ దిలీప్ జైస్వాల్, సభలో ఉన్న ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, నా ప్రియమైన బీహార్ ప్రజలందరికీ నా నమస్కారాలు!
రాధామోహన్ సింగ్ గారి కారణంగా తరచూ చంపారణ్‌ను సందర్శించే అవకాశం నాకు లభిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇది చంపారణ్ భూమి. చరిత్ర సృష్టించిన భూమి. స్వాతంత్య్ర పోరాటంలో, మహాత్మా గాంధీకి కొత్త దిశను ఇచ్చింది ఈ భూమే. ఇప్పుడు అదే చంపారణ్ భూమి బీహార్ భవిష్యత్తుకూ కొత్త ప్రేరణగా మారబోతుంది.
ఈరోజు రూ.7,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిగాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన వారికి, బీహార్ ప్రజలకు నా శుభాకాంక్షలు. ఇక్కడ ఓ యువకుడు శ్రీరామ మందిరపు పూర్తి నమూనాను తీసుకువచ్చాడు. అది ఎంత అద్భుతమైన సృష్టి! అతను ఆ నమూనాను నాకు ఇవ్వాలనుకుంటున్నాడనిపిస్తోంది. ఆ యువకుడు తన పేరు, చిరునామాను దాని కింద రాసేలా చూడమని నా ఎస్‌పీజీ సిబ్బందిని కోరుతున్నా. నేను నీకు లెటర్ రాస్తాను. ఈ నమూనా నువ్వే చేశావా? అవునా? అయితే, మా ఎస్‌పీజీ సిబ్బంది నీ దగ్గరకి వచ్చినప్పుడు దయచేసి వాళ్ల చేతికి అందించు. నీకు తప్పకుండా నా లెటర్ అందుతుంది. నీకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ సీతామాతను నిత్యం స్మరించుకుంటూ జీవించే ఈ భూమిలో, నువ్వు నాకు అయోధ్యలోని మహా మందిరపు సుందర నమూనాను అందించావు. నిజంగా నీకు ధన్యవాదాలు.
స్నేహితులారా,
21వ శతాబ్దంలో ప్రపంచం వేగంగా మారిపోతోంది. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల ఆధిపత్యమే ఉండేది. ఇప్పుడు తూర్పు దేశాల భాగస్వామ్యం, ప్రభావం పెరుగుతోంది. అభివృద్ధిలో తూర్పు దేశాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అంతర్జాతీయంగా తూర్పు దేశాలు అభివృద్ధి చెందుతున్నట్టే.. వాటికి సమాంతరంగా భారత్‌లో తూర్పు రాష్ట్రాల యుగం మొదలైంది. పశ్చిమ భారతదేశానికి ముంబయి ప్రాధాన్య నగరంగా ఎలా ఉందో, రాబోయే కాలంలో తూర్పు భారతదేశానికి మోతీహారిని అలా తీర్చిదిద్దాలన్న కృత నిశ్చయం మాది. గురుగ్రామ్ మాదిరిగానే అవకాశాల పుట్టగా గయను మారుస్తాం. పుణే తరహాలో పాట్నాలోనూ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. సూరత్ కు దీటుగా సంతాల్ పరగణా అభివృద్ధి చెందుతుంది. పర్యాటకంలో జల్పాయ్గురి, జాజ్‌పూర్ ప్రాంతాలు జైపూర్ తరహాలో కొత్త శిఖరాలకు చేరతాయి. బీర్భూమ్ ప్రజలు బెంగళూరులో ఉన్నవారిలా ప్రగతిని సాధించాలని అభిలషిస్తున్నాను.
సోదరసోదరీమణులారా,
తూర్పు భారత్ పురోగమించాలంటే.. బీహార్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చాలి. బీహార్లో వేగంగా సాగుతున్న అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉండటమే కారణం. కొన్ని గణాంకాలు చెబుతా. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్, ఆర్జేడీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న పదేళ్లలో బీహార్‌కు కేవలం రూ. 2 లక్షల కోట్లే అందాయి. ఇది నిస్సందేహంగా నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాజకీయ కక్ష్య సాధింపు చర్యే. 2014లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్‌పై ఇలాంటి ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలికింది. తమ పదేళ్ల పాలనలో ఎన్డీయే ప్రభుత్వం కింద బీహార్ అభివృద్ధికి లెక్కకు మిక్కిలి నిధులు కేటాయించాం. లక్షల కోట్ల రూపాయల నిధులు అందించిన విషయాన్ని సమ్రాట్ చౌదరి గారు ఇప్పుడే వివరంగా చెప్పారు.
స్నేహితులారా,
కాంగ్రెస్-ఆర్జేడీ పాలన కాలంతో పోలిస్తే మా ప్రభుత్వం బీహార్‌కు ఎన్నో రెట్లు ఎక్కువ ఆర్థిక సహాయం అందించిందన్న విషయం అవగతమవుతుంది. ఈ నిధులు ప్రజా సంక్షేమం, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగమవుతున్నాయి.
స్నేహితులారా,
రెండు దశాబ్దాల కిందట బీహార్ ఎదుర్కొన్న నిరాశను నేటి తరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది. పేదవారికి ఉద్దేశించిన నిధులు వారి వరకు చేరలేదు. పేదల సొమ్ముల్ని కాజేయడం పైనే అప్పటి నాయకత్వం దృష్టి సారించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల, నిరంతర శ్రామికులతో కూడిన ధైర్యవంతుల భూమి బీహార్.. కాంగ్రెస్, ఆర్జేడీ కబంధ హస్తాల నుంచి బీహార్ కు విముక్తి కల్పించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఫలితంగా సంక్షేమ పథకాలు పేదలకు నేరుగా అందే అవకాశం కలిగింది. గడచిన 11 ఏళ్లలో దేశ వ్యాప్తంగా పీఎం ఆవాస యోజన కింద 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించాం. వాటిలో 60 లక్షలు బీహార్‌లోనే పేదల కోసమే నిర్మితమయ్యాయి. నార్వే, న్యూజిలాండ్, సింగపూర్ లాంటి దేశాల మొత్తం జనాభా కంటే బీహార్ లో నిర్మించిన ఇళ్ళే ఎక్కువ.
మరో ఉదాహరణ చెబుతా.. మోతీహారీ జిల్లాలోనే దాదాపు 3 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు లభించాయి. ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. అంతదాకా ఎందుకు.. ఈ ఒక్కరోజే.. ఈ ప్రాంతంలోని 12,000కు పైగా కుటుంబాలు కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నాయి. వీటికి తోడు మరో 40,000 పేద కుటుంబాలు పక్కా ఇళ్లను నిర్మించుకోవడానికి అవసరమైన నిధులను నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా పొందాయి. వీరిలో ఎక్కువ మంది దళితుల, మహాదళితులు, వెనకబడిన వర్గాలకు చెందిన నా సోదర సోదరీమణులే. కాంగ్రెస్, ఆర్జేడీల పాలనలో ఈ తరహా పక్కా ఇళ్లను పేదలు పొందగలగడం ఊహకు అందని విషయమన్న సంగతి మీకు తెలుసు. వారి పాలనలో ప్రజలు తమ ఇళ్లకు రంగులు వేసుకోవడానికి కూడా భయపడేవారు. ఎప్పుడు ఎవరు వేధిస్తారో, లేదా ఇంటి నుంచి గెంటేస్తారోనన్న భయంతో బతికేవారు. అప్పటి ఆర్జేడీ హయాంలో మీకు పక్కా ఇళ్ళే దక్కలేదు.
స్నేహితులారా,
బీహార్ పురోగతికి ఆ రాష్ట్రానికి చెందిన తల్లులు, సోదరీమణుల సామర్థ్యం, దృఢ సంకల్పమే కారణం. ఈరోజు లక్షలాది మహిళలు మమ్మల్ని ఆశీర్వదించిన విషయాన్ని గమనించా. ఇది నా హృదయాన్ని తాకింది. మా ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్య ప్రాధాన్యాన్ని బీహార్లోని మహిళలు, స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. సమావేశానికి హాజరైన మహిళలను ఉద్దేశించి.. గతంలో రూ.10 సైతం ఇంట్లోనే దాచుకోవాల్సిన రోజులు గుర్తున్నాయి. అప్పుడు చాలామందికి బ్యాంకు ఖాతాలు లేవు. బ్యాంకుల్లోకి అనుమతి లేదు. పేదల గౌరవాన్ని ఈ మోదీ మాత్రమే అర్ధం చేసుకున్నాడు. పేదలను ఎందుకు రానివ్వట్లేదని నేను బ్యాంకుల్ని ప్రశ్నించా. మేం భారీ స్థాయిలో జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించాం. తద్వారా పేద కుటుంబాల మహిళలకు అధిక లబ్ది చేకూరింది. జన ధన్ ఖాతాలను తెరిచేందుకు ప్రారంభించిన ప్రచారం ద్వారా మహిళలే ఎక్కువ లబ్ధి పొందారు. ఒక్క బీహార్లో ఇపుడు 3.5 కోట్ల మంది మహిళలకు జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ పథకాల నిధులు నేరుగా వారి ఖాతాల్లోకే నేరుగా బదిలీ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే నా మిత్రుడు శ్రీ నితీష్ కుమార్ సారథ్యంలోని బీహార్ ప్రభుత్వం వయోధికులు, దివ్యాంగులు, వితంతువులకు అందించే నెలవారీ పెన్షన్ ను రూ. 400 నుంచి 1,100 కు పెంచింది. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ అవుతోంది. గత నెలన్నర వ్యవధిలోనే బీహార్లోని 24,000 స్వయం సహాయక బృందాలు రూ.1,000 కోట్లకు పైగా లబ్ధి పొందాయి. జన్ ధన్ ఖాతాల ద్వారా తల్లులు, సోదరీమణులకు అందించిన ఆర్థిక సాధికారతే ఈ విజయానికి కారణం.
స్నేహితులారా,
మహిళా సాధికారత కోసం తీసుకున్న ఈ చర్యల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగాను, బీహార్‌లోనూ 'లఖ్‌పతి దీదీల' సంఖ్య పెరుగుతోంది. దేశంలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడం మా లక్ష్యం. ఇప్పటికే 1.5 కోట్ల మంది మహిళలు ఈ మైలురాయిని సాధించారు. బీహార్లో 20 లక్షలకు పైగా మహిళలు లఖ్‌పతి దీదీలుగా మారారు. కేవలం చంపారన్‌లోనే 80,000 మందికి పైగా మహిళలు స్వయం సహాయక బృందాల్లో చేరి లక్షాధికారులుగా ఎదిగారు.
స్నేహితులారా,
ఈరోజు రూ.400 కోట్ల కమ్యూనిటీ ఇన్వెస్టుమెంటు ఫండ్ ను విడుదల చేశాం. ఈ ఫండ్ మహిళా సాధికారతను పెంచుతుంది. శ్రీ నితీష్ కుమార్ ప్రారంభించిన "జీవికా దీదీ" పథకం బీహార్లోని లక్షలాది మంది మహిళలు స్వావలంబన సాధించేందుకు మార్గం సుగమం చేసింది.
స్నేహితులారా,
బీహార్ పురోగమించినప్పుడు మాత్రమే భారత్ ముందుకు సాగుతుందన్న విజన్ లో బీజేపీ, ఎన్డీయేలకు స్పష్టత ఉంది. అలాగే బీహార్ యువత పురోగమిస్తేనే బీహార్ అభివృద్ధి చెందుతుంది. యువతకు ఉద్యోగావకాశాల కల్పన, అభివృద్ధి చెందిన బీహార్‌ను నిర్మించే విషయంలో మా సంకల్పం స్పష్టంగా ఉంది! బీహార్‌లోనే ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఇటీవలి సంవత్సరాల్లో గణనీయమైన ప్రయత్నాలు జరిగాయి. శ్రీ నితీష్ కుమార్ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో లక్షలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించింది. బీహార్ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నితీష్ సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయత్నాలకు అండగా ఉంటుంది.
స్నేహితులారా,
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఒక ప్రధాన పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం కింద ప్రైవేట్ కంపెనీలో తొలిసారిగా నియామకం పొందే యువతకు కేంద్ర ప్రభుత్వం రూ. 15,000 అందజేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. యువతకు కొత్త ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో ప్రారంభిస్తున్న ఈ పథకం అమలుకు కేంద్రం రూ. 1 లక్ష కోట్ల ఖర్చు చేస్తుంది. ఇది బీహార్ యువతకు గణనీయ ప్రయోజనం చేకూరుస్తుంది.
స్నేహితులారా,
బీహార్‌లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడంలో ముద్ర యోజన వంటి పథకాలు దోహదపడుతున్నాయి. గత రెండు నెలల్లోనే బీహార్‌లో ముద్ర యోజన కింద లక్షలాది రుణాలు పంపిణీ అయ్యాయి. ప్రత్యేకించి చంపారన్‌లో 60,000 మంది యువత తమ స్వయం ఉపాధి ప్రణాళికల కోసం ముద్ర రుణాలు పొందారు.
స్నేహితులారా,
ఆర్జేడీ ఈ తరహా ఉపాధి ఎప్పుడూ కల్పించలేదు. ముఖ్యంగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశజూపి భూముల్ని తమ పేరిట రాయించుకునే నాయకులు ఎప్పటికీ ఉపాధి కల్పించలేరు. లాంతర్ల యుగానికీ.. కొత్త ఆశలతో ప్రకాశించే నేటి బీహార్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మర్చిపోవద్దు. ఈ మార్పు బీహార్ సంకీర్ణ ప్రభుత్వం సాధించిన ఘనతే. తమ సంకీర్ణ ప్రభుత్వానికి బీహార్ ప్రజలు గట్టి మద్దతునివ్వడంతో పాటు, మా ప్రభుత్వంపై అచంచలమైన విశ్వాసం ఉంచారు.
స్నేహితులారా,
ఇటీవల నక్సలిజం నిర్మూలన కోసం చేపట్టిన నిర్ణయాత్మక చర్యలతో బీహార్ యువతకు ఎంతో మేలు జరిగింది. ఒకప్పుడు మావోయిస్టు ప్రభావంతో వెనకబడిన చంపారన్, ఔరంగాబాద్, గయ, జముయి వంటి జిల్లాలు ప్రస్తుతం హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాయి. మావోయిస్టు హింస కారణంగా అభివృద్ధికి దూరమైన ప్రాంతాల యువత ఇప్పుడు పెద్ద కలలు కంటున్నారు. నక్సలిజం నుంచి దేశానికి పూర్తి విముక్తి కల్పించడానికి కట్టుబడి ఉన్నాం.
స్నేహితులారా,
ఇది నవ భారతం. శత్రువులకు తగిన బుద్ధి చెప్పేందుకు భరతమాత ఎలాంటి ప్రయత్నానికైనా వెనుకాడదు. ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నది బీహార్ గడ్డ మీదే. ఈ రోజు ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రపంచమంతా చూస్తోంది.
స్నేహితులారా,
సామర్థ్యం, వనరులు లేని రాష్ట్రంగా బీహార్ ఉండేది. నేడు ఇక్కడి వనరులే ఈ రాష్ట్ర పురోగతికి సాధనాలుగా మారుతున్నాయి. తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా మఖానా ధరలు పెరిగాయి. మఖానా రైతులను పెద్ద మార్కెట్లతో అనుసంధానించడమే దీనికి కారణం. మఖానా బోర్డు ఏర్పాటును ఏర్పాటుచేశాం. అరటి, లిచీ, మర్చా బియ్యం, కతర్నీ బియ్యం, జర్దాలు మామిడి, మాఘాహి పాన్ వంటి పంటలు, అనేక ఇతర ఉత్పత్తులు బీహార్ రైతులను, స్థానిక యువతను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానిస్తున్నాయి.
రైతుల దిగుబడిని, ఆదాయాన్ని పెంచడం మా ప్రభుత్వ ప్రాథమ్యం. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశవ్యాప్తంగా రైతులకు సుమారు రూ. 3.5 లక్షల కోట్లు పంపిణీ చేశాం. ఒక్క మోతీహారీలోనే 5 లక్షలకు పైగా రైతులు ఈ పథకం ద్వారా రూ. 1,500 కోట్లకు పైగా మొత్తాన్ని అందుకున్నారు.
సోదరసోదరీమణులారా,
మా ప్రభుత్వం కేవలం నినాదాలు.. వాగ్దానాలకే పరిమితం కాదు. కార్యాచరణ ద్వారా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. వెనకబడిన, అత్యంత వెనకబడిన వర్గాల అభ్యున్నతి పట్ల మా ప్రభుత్వ నిబద్ధత.. మా విధానాలు, నిర్ణయాల్లో ప్రతిబింబిస్తుంది. ప్రతీ వెనకబడిన వర్గానికీ ప్రాధాన్యమివ్వడం మా ఎన్డీయే లక్ష్యం. అది సామాజికంగా వెనుకబడిన ప్రాంతం కావొచ్చు, లేదా వెనుకబడిన వర్గాలు కావొచ్చు. ప్రభుత్వ పథకాలన్నింటిలోనూ వారికి ప్రాధాన్యం ఉంటుంది. దశాబ్దాలుగా 110కి పైగా జిల్లాలు వెనకబడి, నిర్లక్ష్యానికి గురయ్యాయి. మా ప్రభుత్వం ఈ జిల్లాలను వెనుకబడిన వాటిగా కాక ఆకాంక్షాత్మక జిల్లాలుగా ప్రకటించి, అభివృద్ధి దిశగా నడిపించడం ద్వారా తగిన ప్రాధాన్యమిచ్చింది. "వెనుకబాటు నిర్మూలనకు మేమిచ్చిన ప్రాధాన్యమది". భారత సరిహద్దు గ్రామాలు కూడా చాలా కాలంగా "మారుమూల గ్రామాలు"గా పరిగణించడంతో వెనకబడ్డాయి. తమ ప్రభుత్వం వాటిని "మొదటి ప్రాధాన్య గ్రామాలు"గా గుర్తించి ఆయా గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. మళ్ళీ చెబుతున్నా... "వెనుకబాటు నిర్మూలనకు ప్రాధాన్యం" ఇస్తాం. ఓబీసీ వర్గం చాలా కాలంగా ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కావాలని కోరుతోంది. మా సంకీర్ణ ప్రభుత్వం వారి కోరికను నెరవేర్చింది. గిరిజన వర్గాల్లో అత్యంత అణగారిన వర్గాల కోసం జన్‌మన్ యోజనను ప్రారంభించి, వారి అభివృద్ధి కోసం రూ. 25,000 కోట్లు కేటాయించాం. అందుకే చెబుతున్నా.. వెనుకబడ్డవారే మా ప్రాధాన్యం.
ఈ దార్శనికతకు అనుగుణంగా మరో ప్రధాన పథకమైన ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజనను ప్రారంభించాం. కేంద్ర మంత్రివర్గం రెండు రోజుల క్రితమే ఈ పథకానికి ఆమోదం తెలిపింది ఈ పథకం కింద వ్యవసాయంలో వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ప్రాధాన్యం ఇస్తుంది. ఈ జిల్లాలు మంచి వ్యవసాయ సామర్థ్యం ఉన్నప్పటికీ దిగుబడి, రైతుల ఆదాయం విషయంలో బాగా వెనకబడి ఉన్నాయి. ఈ జిల్లాలకు ప్రాధాన్యమిచ్చి ఈ పథకం కింద మద్దతిస్తాం. వెనుకబాటుకు మేమిచ్చే ప్రాధ్యాన్యమదీ.. దీని వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 1.75 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందే అధిక సంఖ్యాకులు బీహార్ రైతులే.
స్నేహితులారా,
ఈ రోజు వేల కోట్ల విలువైన రైల్వే, రహదారుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. శంకుస్థాపనలు జరిగాయి. ఈ ప్రాజెక్టులు బీహార్ ప్రజల సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరుస్తాయి. దేశంలో వివిధ మార్గాల మీదుగా ప్రయాణించేలా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాం. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు మోతీహరి-బాపూధామ్ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ వరకు నేరుగా నడుస్తుంది. మోతీహరి రైల్వే స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలు, కొత్త హంగులతో పునరభివృద్ధి చేస్తున్నాం. దర్భాంగా-నర్కటియాగంజ్ రైలు మార్గం డబ్లింగ్ వల్ల ఈ మార్గంలో ప్రయాణ సౌలభ్యం బాగా మెరుగవుతుంది.
స్నేహితులారా,
భారత సంస్కృతి, విశ్వాసాలతో చంపారన్‌కు ఉన్న లోతైన అనుబంధం ఉంది. రామ్-జానకి మార్గం మోతీహారిలోని సత్తార్‌ఘాట్, కేసరియా, చకియా, మధుబన్ మీదుగా వెళ్తుంది. సీతామర్హి నుంచి అయోధ్య వరకు ఉన్న కొత్త రైల్వే మార్గం చంపారన్ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇవన్నీ బీహార్లో అనుసంధానతను గణనీయంగా పెంచుతాయి. ఇక్కడ కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.
కాంగ్రెస్, ఆర్జేడీ ప్రభుత్వాలు పేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజన వర్గాల పేరుతో చాలా కాలం రాజకీయాలు చేశాయి. వారికి సమాన హక్కులు కల్పించక పోగా తమ కుటుంబాలు మినహా ఇతరులకు గౌరవాన్ని ఇవ్వటంలో కూడా అవి విఫలమయ్యాయి. వారి అహంకారాన్ని బీహార్ నేడు స్పష్టంగా తెలుసుకుంటోంది. దురుద్దేశంతో కూడిన వారి ఆలోచనల నుంచి బీహార్‌ను రక్షించాలి. నితీశ్ బృందం, బీజేపీ బృందం, యావత్ ఎన్డీఏ ఏళ్లతరబడి నిరంతరం శ్రమిస్తున్నాయి. శ్రీ చంద్ర మోహన్ రాయ్ వంటి ప్రముఖులు మాకు మార్గనిర్దేశనం చేశారు. అందరూ సమష్టిగా బీహార్ అభివృద్ధిని వేగవంతం చేయాలి. మంచి భవిష్యత్తు వైపు పయనించాలి. బనాయేంగే నయా బీహార్, ఫిర్ ఏక్ బార్ ఎన్డీయే సర్కార్ (సరికొత్త బీహార్‌ను నిర్మించేందుకు మరోమారు ఎన్డీయేతో కలిసి ముందుకు సాగుదాం) అని ప్రతిజ్ఞ చేద్దాం.
ఇవాళ ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు రెండు చేతులూ పైకి ఎత్తి గట్టిగా చెప్పండి…
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
అనేకానేక ధన్యవాదాలు.
గమనిక – ఇది ప్రధాని చేసిన ప్రసంగానికి దాదాపు అనువాదం. ప్రధాని హిందీలో మాట్లాడారు.
***
(Release ID: 2146097)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada