హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2026-పద్మ అవార్డుల నామినేషన్లకు చివరి తేదీ 2025 జూలై 31

Posted On: 15 JUL 2025 5:14PM by PIB Hyderabad

2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబోయే 2026-పద్మ అవార్డులకు సంబంధించి నామినేషన్లు, సిఫార్సులు 2025 మార్చి 15న ప్రారంభమయ్యాయి. పద్మ అవార్డుల నామినేషన్లకు చివరి తేదీ 2025 జూలై 31. నామినేషన్లు/సిఫార్సులను రాష్ట్రీయ పురస్కార్  పోర్టల్ (https://awards.gov.in) ద్వారా  ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు.

పద్మ అవార్డులు, అనగా... పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీలు దేశ అత్యున్నత పౌర పురస్కారాల కోవకు చెందినవి. శ్రేష్ఠతను గుర్తించాలన్న ఉద్దేశంతో 1954లో ప్రారంభించిన ఈ అవార్డులను ప్రతి ఏటా  రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారు. కళ, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, విజ్ఞానం, ఇంజినీరింగ్, ప్రజా వ్యవహారాలు, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమలు తదితర రంగాల్లో చేసిన 'విశిష్ట కృషి లేదా సేవ’కు గుర్తింపుగా వీటిని అందిస్తారు. జాతి, వృత్తి, స్థాయి, లింగ భేదం ఊసు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ అవార్డులకు అర్హులే. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేసే వారు (డాక్టర్లు, సైంటిస్టులు మినహా) ఈ అవార్డులకు అర్హులు కాదు.

పద్మ అవార్డులను “ప్రజల పద్మా”లుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది... ప్రజలందరూ స్వీయ నామినేషన్లు సహా నామినేషన్లు, సిఫార్సులు చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు, సమాజ సంక్షేమం కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్న ప్రతిభావంతులను గుర్తించేందుకు సమష్టి కృషి చేయవలసిందిగా కోరుతోంది.

నామినేషన్లు, సిఫార్సులు అవసరమైన అన్ని వివరాలతో, పద్మ పోర్టల్ లో సూచించిన విధానాన్ని అనుసరించి సమర్పించవలసి ఉంటుంది.  నామినేట్ చేస్తున్న వ్యక్తి  ఎంచుకున్న రంగంలో చేస్తున్న, లేదా చేసిన విశేష కృషి, సాధించిన విజయాలు, చూపిన ప్రభావాన్ని ప్రతిబింబించే విధంగా 800 పదాల లోపు చిరు వ్యాసాన్ని కూడా సమర్పించాలి.

ఇందుకు సంబంధించిన వివరాలు హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ (https://mha.gov.in), పద్మ అవార్డుల  వెబ్‌సైట్‌ (https://mha.gov.in), పద్మ అవార్డుల పోర్టల్‌లోని (https://padmaawards.gov.in), 'అవార్డులు, పతకాలు' శీర్షిక కింద కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ అవార్డులకు సంబంధించిన నియమ నిబంధనలు https://padmaawards.gov.in/AboutAwards.aspx లింక్‌ ద్వారా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.


 

***


(Release ID: 2145106)