వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పత్తి దిగుబడిపై కోయంబత్తూరులో నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
హాజరైన కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, హర్యానా, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు
పత్తి దిగుబడి పెంపు గురించి సంబంధిత వ్యక్తులతో విస్తృత చర్చలు
"మంచి నాణ్యమైన పత్తి ఉత్పత్తి కోసం మనమంతా కలిసి పని చేద్దాం"
“జీవితంలో ఆహారం తరువాత అసరమైనవి వస్త్రాలే” – శ్రీ చౌహాన్
Posted On:
11 JUL 2025 7:19PM by PIB Hyderabad
తమిళనాడులోని కోయంబత్తూరు ఐసీఏఆర్-చెరకు బ్రీడింగ్ సంస్థ వేదికగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో పత్తి దిగుబడి పెంపు లక్ష్యంపై ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పత్తి చరిత్ర, ప్రస్తుత పరిస్థితి, సవాళ్లు, దేశంలో పత్తి దిగుబడిని పెంచేందుకు భవిష్యత్తు వ్యూహాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, హర్యానా వ్యవసాయ మంత్రి శ్రీ శ్యామ్ సింగ్ రాణా, మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి శ్రీ మాణిక్‌రావ్ కోకటే, వివిధ రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంఎల్ జాట్, అధికారులు, సంబంధిత వ్యక్తులు, శాస్త్రవేత్తలు, రైతులూ పాల్గొన్నారు.
సమావేశానికి ముందు, కేంద్ర వ్యవసాయ మంత్రి పత్తి పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన కేంద్ర మంత్రి వారి సమస్యలు, ఆందోళనలను తెలుసుకున్నారు. శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగంతో సమావేశం ప్రారంభమైంది. దేశంలోని అత్యంత పురాతన రాష్ట్రాల్లో ఒకటి, 5000ల సంవత్సరాల అపూర్వ వారసత్వం గల తమిళ భాషకు పవిత్ర భూమి అయిన తమిళనాడులో ఈ సమావేశం జరుగుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు గడ్డపైనే కొత్త పత్తి విప్లవం ఆరంభమయ్యిందన్న ఆయన.. నేటి ఈ సమావేశం కేవలం లాంఛనప్రాయం కాదనీ అంతకంటే చాలా ఎక్కువ ప్రాముఖ్యంగలదని పునరుద్ఘాటించారు.
ఆహారం తర్వాత, ఒక వ్యక్తికి అత్యంత ముఖ్యమైన అవసరం వస్త్రాలేనని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. “ఆహారం లేకుండా జీవించలేనట్లే.. వస్త్రాలు లేకుండా జీవించడమూ అంతే అసాధ్యం. వస్త్రాలు పత్తి నుంచి వస్తాయి అయితే ఈ పత్తిని పండించేది మన రైతులే. వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయితే రైతులు దానికి ఆత్మ. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇతర దేశాలతో పోల్చితే భారత్ ఉత్పాదకత- వెనుకబడిన నేపథ్యంలో.. మన దేశంలో పత్తి ఉత్పత్తిలో గల సవాళ్లే దీనికి కారణమని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఒకప్పుడు దిగుబడిని పెంచడానికి అభివృద్ధి చేసిన బీటీ పత్తి రకం ఇప్పుడు వ్యాధుల ముప్పును ఎదుర్కొంటోందనీ, ఫలితంగా ఉత్పాదకత తగ్గుతోందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి, వైరస్ నిరోధకత గల, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను అభివృద్ధి చేయడం ద్వారా పత్తి ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఇతర దేశాల మాదిరిగానే భారత్ సాధ్యమైన చర్యలన్నీ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మెరుగైన విత్తనాలను రైతులకు సకాలంలో అందించడమూ ముఖ్యమనీ.. దీనిని సాకారం చేయడానికి శాస్త్రవేత్తలు పూర్తి నిబద్ధతతో పనిచేయాలని కోరారు.
వివిధ రాష్ట్రాల రైతులు లేవనెత్తిన సమస్యలు, వారి డిమాండ్లకు అనుగుణంగా భవిష్యత్ వ్యూహాన్ని రూపొందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. మంచి నాణ్యమైన వస్త్రాన్ని తయారు చేయడానికి అంతే మంచి నాణ్యత గల పత్తి చాలా అవసరమనీ, దీనిని సాధించడమే జాతీయ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత కీర్తి, శ్రేయస్సు, శక్తి నిరంతరం మెరుగవుతోందన్నారు. “వికసిత్ భారత్ సాకారమైతే మనం పత్తిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దేశీయంగా అధిక-నాణ్యత గల పత్తిని ఉత్పత్తి చేసి దేశపు పత్తి అవసరాలను తీర్చడం మన ముందున్న సవాలు.. లక్ష్యమూ రెండూ” అని శ్రీ చౌహాన్ తెలిపారు.
చవకైన విదేశీ పత్తిని అనుమతించడానికి దిగుమతి సుంకాలను రద్దు చేయాలని వస్త్ర పరిశ్రమ తరచుగా డిమాండ్ చేస్తుండగా.. ఇది స్థానిక పత్తి ధరలకు విఘాతం కలిగిస్తుందని రైతులు వాదిస్తున్నారని శ్రీ చౌహాన్ తెలిపారు. అందువల్ల, రైతులు, పరిశ్రమలు ఇరువురి ప్రయోజనాలను ప్రభుత్వం సమతుల్యం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
తన 'వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్' గురించి శ్రీ చౌహాన్ ప్రస్తావిస్తూ.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోయాబీన్ పంటను గురించి గతంలో ఒక కీలక సమావేశం నిర్వహించిన సంగతిని గుర్తుచేసుకున్నారు. కోయంబత్తూరులో పత్తి పంట దిగుబడి పెంపు గురించి విస్తృతంగా చర్చించిన నేటి సమావేశమూ, వ్యవసాయ అభివృద్ధికి పంటల వారీ, రాష్ట్రాల వారీ వ్యూహాలపై దృష్టి సారిస్తూ సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిద్దామని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
***
(Release ID: 2144245)