నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
‘ఇరెడా’ బాండ్లకు సెక్షన్ 54ఈసీ పన్ను ప్రయోజనాల హోదాను మంజూరు చేసిన కేంద్రం
Posted On:
10 JUL 2025 12:57PM by PIB Hyderabad
ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ..‘ఇరెడా’) జారీ చేసిన బాండ్లను ఆదాయపు పన్ను చట్టం-1961 లోని 54ఈసీ సెక్షను ప్రకారం ‘దీర్ఘకాలిక స్పెసిఫైడ్ అసెట్’గా ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. సీబీడీటీ కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంలో పనిచేస్తోంది. తాజా నోటిఫికేషన్ బుధవారం (ఈ నెల 9) నుంచి అమలులోకి వచ్చింది.
నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం, అయిదు సంవత్సరాల తరువాత నగదుగా మార్చుకోవడానికి అవకాశం ఉన్న బాండ్లతో పాటు నోటిఫికేషన్ తేదీన గాని లేదా ఆ తరువాత గాని ఇరెడా జారీ చేసే బాండ్లు ఆదాయపు పన్ను చట్టం-1961 లోని 54ఈసీ సెక్షన్‌లో భాగంగా పన్ను మినహాయింపునకు నోచుకొంటాయి. ఈ సెక్షను, నిర్దిష్ట బాండ్లలో పెట్టుబడులపై సంపాదించే మూలధన లాభాలపై విధించే పన్నులో మినహాయింపునకు అనుమతిని ఇస్తోంది. ఈ తరహా బాండ్ల నుంచి వచ్చే డబ్బును అచ్చంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసమే వినియోగిస్తారు. అయితే, ఆయా ప్రాజెక్టులు రుణాల తిరిగి చెల్లింపు బాధ్యతల్ని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడకుండా ప్రాజెక్టు రాబడుల నుంచే రుణాలను తిరిగి చెల్లించగల సామర్థ్యం కలిగినవి అయి ఉండాలి.
అర్హులైన పెట్టుబడిదారులు, ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ బాండ్లలో సొమ్మును పెట్టుబడి పెట్టినట్లయితే రూ.50 లక్షల వరకు దీర్ఘకాల మూలధన లాభం (ఎల్‌టీసీజీ)పై పన్నును ఆదా చేసుకోవడానికి వీలు ఉంటుంది. మరోవైపు, తక్కువ ఖర్చుతో నిధులను సమీకరించడానికి అవకాశం ‘ఇరెడా’కు లభిస్తుంది. ఇది పునరుత్పాదక ఇంధన రంగం (ఆర్ఈ) అభివృద్ధి పథంలో పయనించడానికి దోహదం చేసే ఒక ముఖ్య పరిణామం. అంతేకాదు, ఆర్ఈ రంగం శరవేగంగా దూసుకుపోవడానికి కూడా ఊతాన్నిచ్చే చర్య ఇది.
నోటిఫికేషనును ‘ఇరెడా’ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ స్వాగతించారు. ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ చక్కని విధానపరమైన నిర్ణయాన్ని తీసుకొన్నందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు, నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖతో పాటు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ)కి మేం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఈ విధమైన గుర్తింపునివ్వడం దేశంలో ఆర్ఈ రంగానికి ఆర్థిక సహాయాన్ని అందించడాన్ని వేగవంతం చేయడంలో ‘ఇరెడా’ పోషిస్తున్న కీలక పాత్రను బలపరుస్తుంది. మా బాండ్లకు పన్ను మినహాయింపు హోదాను కల్పించడం వల్ల ఈ బాండ్లు ఓ ఆకర్షణీయ పెట్టుబడి మార్గంగా మారుతాయి. అంతేకాదు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు మూలధన లభ్యత కూడా పెరుగుతుంది. దీంతో, శిలాజేతర ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030కల్లా 500 జీడబ్ల్యూ (గిగావాట్)కు విస్తరించాలని భారత్ నిర్దేశించుకొన్న లక్ష్యాన్ని సాధించడానికి కూడా ఇది తోడ్పడుతుంది’’ అన్నారు.
పన్నును ఆదా చేసుకోవడానికి వీలున్న పెట్టుబడి సాధనాలను కోరుకొనే వారిని ఈ నిర్ణయం పెద్ద ఎత్తున ఆకట్టుకొంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు, దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి ఆర్థిక సహాయాన్ని అందించే అనుబంధ విస్తారిత వ్యవస్థను కూడా బలోపేతం చేయగలదన్న అంచనా ఉంది.
***
(Release ID: 2143718)
Visitor Counter : 5