ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం: అంతర్జాతీయ పాలనలో సంస్కరణ

Posted On: 06 JUL 2025 9:44PM by PIB Hyderabad

అధ్యక్షులు,

ప్రముఖులకు,
నమస్కారం!

17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న అధ్యక్షుడు లూలాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రెజిల్ నాయకత్వంలో మన బ్రిక్స్ సహకారం కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని సంతరించుకుంది. మనలో నిండిన ఈ శక్తి ఎస్‌ప్రెసో కాదు.. డబుల్ ఎస్‌ప్రెసో షాట్ లాంటిది. ఈ విషయంలో నేను అధ్యక్షుడు లూలా దార్శనికతను, ఆయన అచంచలమైన విశ్వాసాన్ని అభినందిస్తున్నాను. బ్రిక్స్ కుటుంబంలో ఇండోనేషియా చేరిన నేపథ్యంలో నా స్నేహితుడు, ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవోకు భారత్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

స్నేహితులారా,

గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాలు) తరచుగా ద్వంద్వ ప్రమాణాలను ఎదుర్కొంటోంది. అది అభివృద్ధిలోనైనా, వనరుల పంపిణీలోనైనా లేదా భద్రతా సంబంధమైన అంశాల్లోనైనా.. గ్లోబల్ సౌత్ ఆసక్తులకు తగిన ప్రాధాన్యం లభించడం లేదు. పర్యావరణ పరిరక్షణకు ఆర్థికసాయం, సుస్థిరాభివృద్ధి, సాంకేతికత లభ్యత లాంటి అంశాల్లో కంటితుడుపు చర్యలు తప్ప గ్లోబల్ సౌత్‌కు ఏమీ దక్కడం లేదు.

స్నేహితులారా,

20వ శతాబ్దంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థల్లో మూడింట రెండొంతుల మందికి ఇప్పటికీ సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న చాలా దేశాలకు నిర్ణయాలు తీసుకొనే అధికారం దక్కడం లేదు. ఇది ప్రాతినిధ్యం గురించి మాత్రమే కాదు.. విశ్వసనీయత, ప్రభావశీలతకు సంబంధించినది. గ్లోబల్‌సౌత్ లేకపోతే.. ఈ సంస్థలు సిమ్ కార్డ్ ఉన్నప్పటికీ నెట్వర్క్ లేని మొబైల్ ఫోన్ల లాంటివి. 21వ శతాబ్ధపు సవాళ్లను ఈ సంస్థలు పరిష్కరించలేకపోతున్నాయి. అవి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలైనా, మహమ్మారి, ఆర్థిక సంక్షోభాలు, సైబర్ లేదా అంతరిక్షంలో తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కొనే పరిష్కారాలను అందించడంలో ఈ సంస్థలు విఫలమయ్యాయి.

స్నేహితులారా,
ప్రస్తుత ప్రపంచానికి బహుళధ్రువ సమ్మిళిత వ్యవస్థలు అవసరం. అంతర్జాతీయ సంస్థల్లో సమగ్ర సంస్కరణలతోనే ఇది ప్రారంభమవ్వాలి. ఈ సంస్కరణలు పేరుకే పరిమితం కాకుండా.. వాటి వాస్తవ ప్రభావం కూడా కనిపించాలి. పాలనా వ్యవస్థలు, ఓటింగ్ హక్కులు, నాయకత్వ స్థానాల్లో మార్పులు రావాలి. విధాన రూపకల్పనలో గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలకు ప్రాధాన్యమివ్వాలి.

స్నేహితులారా,

కొత్త భాగస్వాములను చేర్చుకోవడం ద్వారా బ్రిక్స్ విస్తరిస్తోంది. ఇది కాలానుగుణంగా తనను తాను మార్చుకోగల సత్తాను తెలియజేస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, డబ్ల్యూటీవో, బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులు తదితర సంస్థల్లోనూ ఇదే తరహా నిబద్ధతను మనం ప్రదర్శించాలి. ప్రస్తుత కృత్రిమ మేధ యుగంలో.. ప్రతివారం సాంకేతికతలు మారుతున్న తరుణంలో.. అంతర్జాతీయ సంస్థల్లో ఎనభై ఏళ్లుగా ఎలాంటి సంస్కరణలు చేపట్టకపోవడం ఆమోదయోగ్యం కాదు. 20వ శతాబ్ధపు టైపు రైటర్లపై 21వ శతాబ్ధపు సాఫ్ట్‌వేర్ నడపలేం.

స్నేహితులారా,

స్వప్రయోజనాలకు అతీతంగా మానవాళి క్షేమం కోసం పనిచేయడం తన బాధ్యతగా భారత్ ఎల్లప్పుడూ భావిస్తుంది. అన్ని అంశాల్లోనూ బ్రిక్స్‌తో కలసి పని చేయడానికి, నిర్మాణాత్మక సహకారాన్ని అందించడానికి మేం కట్టుబడి ఉంటాం.

ధన్యవాదాలు.

సూచన: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.


 

****


(Release ID: 2142855)