సహకార మంత్రిత్వ శాఖ
‘‘త్రిభువన్’’ సహకారి విశ్వవిద్యాలయానికి గుజరాత్‌లోని ఆనంద్‌లో భూమి పూజ చేయనున్న కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా: ఇది దేశంలోనే మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం
* ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా మార్గనిర్దేశంలో సహకార రంగంలో సామర్థ్య నిర్మాణానికి ‘‘త్రిభువన్’’ సహకారి విశ్వవిద్యాలయం ఏర్పాటు - ఇది చారిత్రకం, దూరదృష్టితో చేపట్టిన కార్యక్రమం
* సహకారం, ఆవిష్కరణ, ఉద్యోగాల ‘త్రివేణి’ని సాకారం చేసే దిశగా వేసిన ముఖ్యమైన అడుగుగా ఈ విశ్వవిద్యాలయం నిలుస్తుంది
* సహకార సూత్రాలను, భారత్‌లో సహకార ఉద్యమ ప్రభావాన్ని విద్యార్థులకు తెలియజేసేలా ఎన్‌సీఈఆర్‌టీ సిద్ధం చేసిన పాఠ్యాంశాలను శ్రీ అమిత్ షా ఆవిష్కరిస్తారు
* పెరుగుతున్న సహకార సంస్థల అవసరాలను తీర్చడానికి నిర్వహణ, ఆర్థికం, చట్టం, గ్రామీణాభివృద్ధిలో విద్య, శిక్షణ, పరిశోధన అవకాశాలను అందించడమే ‘‘త్రిభువన్’’ సహకారి విశ్వవిద్యాలయం ఏర్పాటు ముఖ్యోద్దేశం
Posted On:
04 JUL 2025 2:46PM by PIB Hyderabad
‘‘త్రిభువన్’’ సహకారి విశ్వవిద్యాలయం (టీఎస్‌యూ)కు గుజరాత్‌లోని ఆనంద్‌లో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా 2025 జులై 5న భూమి పూజ చేస్తారు. ఇది దేశంలోనే మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, అసెంబ్లీ స్పీకర్ శ్రీ శంకర్ చౌదరి హాజరవుతారు. కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రులు శ్రీ కృషన్ పాల్ గుర్జర్, శ్రీ మురళీధర్ మొహోల్, గుజరాత్ విద్యాశాఖ మంత్రి శ్రీ హృషికేష్ పటేల్, సహకార మంత్రి శ్రీ జగదీశ్ విశ్వకర్మ, సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశీష్ కుమార్ భుటానీ, టీఎస్‌యూ ఉపకులపతి డాక్టర్ జేఎం వ్యాస్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మార్గనిర్దేశకత్వంలో ‘‘త్రిభువన్’’ సహకార విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. అలాగే సహకార రంగంలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ‘సహకార్ సే సమృద్ధి’ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సహకరించే దార్శనిక కార్యక్రమం. సహకారం, ఆవిష్కరణ, ఉపాధికల్పన అనే త్రివేణిని సాకారం చేయడంలో ఈ విశ్వ విద్యాలయం ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపుతో ప్రజా ఉద్యమంగా మారిన ‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మొక్కలు నాటుతారు. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక విలువల పట్ల బాధ్యతను పెంచుతుంది. అలాగే సహకార సూత్రాలు, దేశంలో సహకార ఉద్యమ ప్రభావంపై విద్యార్థులకు అవగాహన పెంచేందుకు నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చి అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) రూపొందించిన పాఠ్యాంశాలను కూడా శ్రీ ఆవిష్కరిస్తారు.
సహకార రంగంలో పెరుగుతున్న అవసరాలకు తగినట్టుగా నిపుణులు, శ్రామిక శక్తిని సిద్ధం చేయడమే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ‘త్రిభువన్’ సహకారి విశ్వవిద్యాలయం లక్ష్యం. సహకార నిర్వహణ, ఆర్థికం, చట్టం, గ్రామీణాభివృద్ధి లాంటి రంగాల్లో ప్రత్యేక విద్య, శిక్షణ, పరిశోధన అవకాశాలను ఈ విశ్వవిద్యాలయం అందిస్తుంది. అలాగే ఆవిష్కరణలను, సామర్థ్య నిర్మాణాన్ని, ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడం, పరిపాలనను మెరుగుపరచడం, సమ్మిళిత, సుస్థిర గ్రామీణ ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరచడం ద్వారా సహకార సంస్థలను ఈ విశ్వవిద్యాలయం సాధికార పరుస్తుంది.
జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా ఈ విశ్వవిద్యాలయం కోర్సులను అందిస్తోంది. పీహెచ్‌డీ, మేనేజర్ స్థాయిలో డిగ్రీలు, సూపర్వైజర్ స్థాయిలో డిప్లొమాలు, ఆపరేషనల్ స్థాయిలో సర్టిఫికెట్ లాంటి బహుళ కోర్సులను అందిస్తోంది. తన క్యాంపస్‌తో పాటుగా ఇతర రాష్ట్రాల్లో సబ్జెక్టుల వారీగా పాఠశాలలను ఏర్పాటు చేస్తుంది. అలాగే సహకార విద్య, శిక్షణను ప్రామాణీకరించడానికి, విస్తరించడానికి జాతీయ స్థాయిలో వ్యవస్థను రూపొందిస్తుంది. దీన్ని ఏర్పాటు చేయడానికి వచ్చే ఐదేళ్లలో ఇప్పటికే ఉన్న 200 సహకార సంస్థలను అనుసంధానిస్తుంది.
నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య నిర్మాణంలో భారత్‌కు 40 లక్షల సహకార సిబ్బంది, 80 లక్షల బోర్డు సభ్యులు అవసరమని అంచనా. వచ్చే ఐదేళ్లలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), డైరీ, ఫిషరీస్, తదితర సహకార సంఘాలకు అవసరమైన 20 లక్షల మంది సిబ్బందికి ఈ విశ్వవిద్యాలయం శిక్షణ ఇస్తుంది.
అర్హులైన ఉపాద్యాయుల కొరతను తీర్చడానికి సహకార విద్య ఆధారంగా పీహెచ్‌డీ కార్యక్రమాలు చేపట్టి బలమైన టీచర్ల వ్యవస్థను విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తుంది. ప్రస్తుతం సహకార విద్య కొన్ని రాష్ట్రాలు, విద్యాసంస్థలకు మాత్రమే పరిమితమైంది. ఇది ఈ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి సరిపోదు.
సహకార వ్యవస్థలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలు, చౌకగా లభించే సాంకేతికతలపై దృష్టి సారించే పరిశోధనాభివృద్ధికి తోడ్పాటును అందించే సంస్థాగత వ్యవస్థ ప్రస్తుతం భారత్‌లో లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా పరిశోధన, అభివృద్ధి మండలిని విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తారు. ఇది సహకార రంగంలో పరిశోధన, అభివృద్ధికి కృషి చేస్తుంది. అనుబంధ సంస్థల్లో జరిగే పరిశోధనలు ఈ మండలి ప్రోత్సహిస్తుంది. ఇవే కాకుండా.. భారత్‌లో ఉత్తమ పద్ధతులను అవలంబించడానికి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలను ఏర్పాటు చేస్తుంది.
***
(Release ID: 2142478)