హోం మంత్రిత్వ శాఖ
2025, జూలై 31 వరకు పొడిగించిన పద్మ పురస్కారాలు-2026 నామినేషన్ల గడువు
Posted On:
02 JUL 2025 4:15PM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సం సందర్భంగా ప్రకటించే పద్మ పురస్కారాలు-2026కు నామినేషన్లు/సిఫార్సులు 2025, మార్చి 15న ప్రారంభమయ్యాయి. పద్మ పురస్కారాల నామినేషన్లకు చివరి తేదీ 2025, జూలై 31. ఆన్‌లైన్ విధానంలో రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in ) ద్వారా మాత్రమే పద్మ పురస్కారాలకు నామినేషన్లు/సిఫార్సులు స్వీకరిస్తారు.
పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలు. 1954 నుంచి ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం రోజున ఈ పురస్కారాలను ప్రకటిస్తున్నారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ప్రజా వ్యవహారాలు, ప్రజాసేవ, వ్యాపారం, పరిశ్రమలు సహా అన్ని రంగాలు/విభాగాల్లో ‘అత్యుత్తమ సేవలు’ అందించిన వారికి గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. జాతి, వృత్తి, స్థాయి, లింగ వివక్ష లేకుండా అందరూ ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి అర్హులే. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వైద్యులు, శాస్త్రవేత్తలు మినహా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ పద్మ పురస్కారాలకు అనర్హులు.
పద్మ పురస్కారాలను ‘‘ప్రజల పద్మ’’గా’ మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందుకే స్వీయ నామినేషన్‌తో సహా అర్హులైన వారిని నామినేట్/సిఫార్సు చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మహిళలు, బలహీన వర్గాలకు చెందిన వారు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగుల్లో నిస్వార్థంగా సమాజ సేవ చేస్తున్న ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.
పైన పేర్కొన్న పోర్టల్ లో సూచించిన విధానంలో నామినేషన్/ సిఫార్సు చేయాలనుకున్న వ్యక్తి వివరాలతో పాటుగా వారి విశిష్టతను, సంబంధిత రంగం/విభాగంలో సాధించిన విజయాలు/సేవను స్పష్టంగా కథన రూపంలో ( 800 పదాలకు మించకుండా) వివరించాలి
కేంద్ర హోంమంత్రిత్వ వ్యవహారాల వెబ్ సైటు (https://mha.gov.in) లో ‘‘అవార్డ్స్ అండ్ మెడల్స్’’ శీర్షికలోనూ, పద్మ పురస్కారాల పోర్టల్ (https://padmaawards.gov.in ) లోనూ ఈ వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ పురస్కారాలకు సంబంధించిన నిబంధనలు, నియమాలు https://padmaawards.gov.in/AboutAwards.aspx లింక్ లో ఉన్నాయి.
***
(Release ID: 2141627)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam