ప్రధాన మంత్రి కార్యాలయం
ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహరాజ్ శత జయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగం
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికత గలది భారత్
సేవ, మానవత్వం భారత మూలసిద్ధాంతాలు
మా ప్రభుత్వం ప్రాకృత భాషకు ప్రాచీన హోదా కల్పించింది
భారత ప్రాచీన గ్రంథాల డిజిటలైజేషన్ ప్రచారాన్ని మేం నిర్వహిస్తున్నాం
మన సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసే ఇలాంటి గొప్ప పనులు అవసరం
‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్’ మంత్రం.. ‘జన్ భాగీధారీ’ స్ఫూర్తి మా ప్రయత్నాలన్నింటికీ ప్రేరణ: ప్రధానమంత్రి
Posted On:
28 JUN 2025 1:18PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు జరిగిన ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక చిరస్మరణీయమైన సందర్భాన్ని నేడు మనమంతా చూస్తున్నాం.. ఇది ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ శతాబ్ది ఉత్సవాల పవిత్రతను స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు. పూజ్య ఆచార్య అమర స్ఫూర్తితో నిండిన ఈ కార్యక్రమం అపూర్వమైన స్ఫూర్తిదాయక వాతావరణాన్ని కల్పిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి.. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం దక్కడం తనకూ సంతోషం కలిగించిందన్నారు.
ఈ రోజుకు మరో ప్రత్యేక ప్రాముఖ్యం కూడా ఉందన్న ప్రధానమంత్రి.. 1987 జూన్ 28న ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ అధికారికంగా 'ఆచార్య' బిరుదు అందుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఇది కేవలం ఒక బిరుదు మాత్రమే కాదనీ, జైన సంప్రదాయాన్ని ఆలోచన, క్రమశిక్షణ, కరుణతో అనుసంధానించే పవిత్ర ప్రవాహానికి ప్రారంభంగా దీనిని అభివర్ణించారు. దేశం ఆచార్య విద్యానంద్ జీ మునిరాజ్ శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంలో ఈ తేదీ ఆనాటి చరిత్రాత్మక క్షణాన్ని మనకు గుర్తుచేస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్‌కు నివాళులు అర్పిస్తూ, అందరికీ ఆచార్య ఆశీస్సులు అందాలని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
"శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ శతజయంతి ఉత్సవాలు సాధారణ కార్యక్రమం కాదు.. ఇవి ఒక యుగపు జ్ఞాపకాలను కలిగి ఉండడమే కాకుండా ఒక గొప్ప రుషి జీవితాన్ని మనకు తెలియజేస్తాయి" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా ప్రత్యేక స్మారక నాణేలు.. తపాలా బిళ్ళలు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. లక్షలాది మంది అనుచరులకు మార్గదర్శనం చేస్తూ సన్మార్గంలో వారిని నడిపిస్తున్న ఆచార్య శ్రీ ప్రజ్ఞా సాగర్ జీని ప్రత్యేకంగా ప్రశంసించిన శ్రీ నరేంద్ర మోదీ.. ఈ సందర్భంగా ఆయనకు నమస్కరించారు. తనకు లభించిన 'ధర్మ చక్రవర్తి' బిరుదును గురించి ప్రస్తావిస్తూ.. సాధువుల నుంచి స్వీకరించినది ఏదైనా దానిని గొప్ప ఆశీర్వాదంగా భావించాలని భారతీయ సంప్రదాయం మనకు బోధిస్తున్నదని పేర్కొన్నారు. అందుకే ఆ బిరుదును సవినయంగా స్వీకరించి భరతమాత పాదాలకు అంకితం చేశానని తెలిపారు.
యావత్ జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా పనిచేసే బోధనలు చేసిన గొప్ప వ్యక్తితో ఉన్న భావోద్వేగ సంబంధాన్ని ప్రస్తావిస్తూ.. అటువంటి మహనీయుల గురించి మాట్లాడటం సహజంగానే లోతైన భావోద్వేగాలను కలిగిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ గురించి మాట్లాడే అవకాశానికి బదులు, ఈరోజు కూడా ఆయన మాటలు వినే భాగ్యం మనకు కలిగి ఉంటే బాగుండేదన్నారు. అంత గొప్ప వ్యక్తి జీవిత ప్రయాణాన్ని మాటల్లో చెప్పడం అంత సులభం కాదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 1925 ఏప్రిల్ 22న కర్ణాటక పవిత్ర భూమిలో ఆ మహనీయుడు జన్మించారని తెలిపిన శ్రీ నరేంద్ర మోదీ.. ఆయనకు ఆధ్యాత్మికంగా విద్యానంద్ అనే పేరు వచ్చిందన్నారు. ఆయన జీవితాన్ని జ్ఞానం, ఆనందాల ప్రత్యేక సంగమంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. ఆయన ప్రసంగంలో లోతైన జ్ఞానం ఉంటుందనీ, అయితే ఆ మాటలు చాలా సరళంగా, అందరూ అర్థం చేసుకోగలిగేలా ఉంటాయన్నారు. 150కి పైగా గ్రంథాలు రాస్తూ.. వేల కిలోమీటర్లు నడిచి.. లక్షలాది మంది యువతను క్రమశిక్షణ, సంస్కృతితో అనుసంధానించిన ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ ఒక యుగపురుషులు, దార్శనికులు అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆయన ఆధ్యాత్మిక ప్రకాశాన్ని నేరుగా అనుభవించే అవకాశం లభించడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఆయన తనకు మార్గదర్శనం చేసేవారనీ, ఆయన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తనపై ఉన్నాయని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేడు ఆయన శత జయంతి వేదికపై కూడా ఆయన ప్రేమ, ఆప్యాయతల అనుభూతిని పొందుతున్నానని ప్రధానమంత్రి తెలిపారు.
"ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికతను భారత్ కలిగి ఉంది.. మన దేశం వేల సంవత్సరాలుగా మనుగడ సాగించడానికి కారణం మన ఆలోచనలు, తాత్విక భావన, ప్రపంచ దృక్కోణం శాశ్వతమైనవి" అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ శాశ్వత దృక్పథం మన రుషులు, మునులు, సాధువులు, ఆచార్యుల జ్ఞానంతోనే ముడిపడి ఉందన్నారు. ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ ఈ శాశ్వత సంప్రదాయానికి ఆధునిక మార్గదర్శిగా నిలిచారని ప్రధానమంత్రి వివరించారు. ఆచార్య అనేక విషయాల్లో లోతైన నైపుణ్యాన్ని కలిగి ఉన్నారనీ, అనేక రంగాల్లో రాణించారని పేర్కొన్నారు. ఆచార్య ఆధ్యాత్మిక శక్తి.. విస్తృత జ్ఞానం.. కన్నడ, మరాఠీ, సంస్కృతం, ప్రాకృతం సహా అనేక భాషలపై ఆయనకు గల పట్టు.. ఆయన పాండిత్యం అసాధారణమని ప్రశంసించారు. సాహిత్యం, ఆధ్యాత్మిక రంగాలకు ఆచార్య చేసిన కృషిని, శాస్త్రీయ సంగీతం పట్ల ఆయన అంకితభావాన్ని, దేశ సేవ పట్ల ఆయన దృఢ నిబద్ధతను ప్రధానంగా ప్రస్తావించారు. జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ ఆచార్య ఆదర్శప్రాయమైన ప్రమాణాలను నిర్దేశించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆచార్య విద్యానంద్ జీ గొప్ప సంగీతకారుడు మాత్రమే కాదు, ఒక గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంపూర్ణ నిర్లిప్తత గల దృఢమైన దిగంబర ముని అని పేర్కొన్నారు. ఆయనను జ్ఞాననిధిగా, ఆధ్యాత్మిక ఆనందానికి మూలంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. సురేంద్ర ఉపాధ్యాయ్ నుంచి ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ వరకు సాగిన వారి జీవిత ప్రయాణం ఒక సాధారణ మనిషి నుంచి అతీంద్రియ శక్తిగా పరివర్తన చెందిందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుత మన జీవిత పరిమితుల ఆధారంగా భవిష్యత్తు ఉండదనీ, మన దిశ.. మన లక్ష్యం.. మన సంకల్పం మన భవిష్యత్తును రూపొందించేందుకు ప్రేరణగా నిలుస్తాయని ప్రధానమంత్రి వివరించారు.
ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ తన జీవితాన్ని కేవలం ఆధ్యాత్మిక సాధనకే పరిమితం చేయకుండా.. సామాజిక-సాంస్కృతిక పునర్నిర్మాణ మాధ్యమంగా మార్చుకున్నారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ప్రాకృత భవన్, మరెన్నో పరిశోధనా సంస్థల స్థాపన ద్వారా ఆచార్య భావి తరాలకు విజ్ఞానాన్ని అందించారని ప్రధానమంత్రి తెలిపారు. జైన చరిత్రకూ ఆచార్య ఎంతో గుర్తింపునిచ్చారని ఆయన పేర్కొన్నారు. 'జైన్ దర్శన్'.. 'అనేకాంత్వాద్' వంటి ప్రముఖ గ్రంథాలను రచించిన ఆచార్య తాత్విక ఆలోచనను మరింతగా పెంపొందించారన్నారు. సమగ్రత, అవగాహనల విస్తృతిని ఆయన ఎంతో ప్రోత్సహించారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆలయ పునరుద్ధరణ నుంచి అణగారిన వర్గాల పిల్లలకు విద్యనందించడం, విస్తృత సామాజిక సంక్షేమం వరకూ ఆచార్య చేసిన ప్రతి ప్రయత్నం స్వీయ-సాక్షాత్కారం, ప్రజా శ్రేయస్సుల సమ్మిళిత్వాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
నిస్వార్థ సేవ సాధనంగా మారినప్పుడే జీవితం నిజమైన ఆధ్యాత్మిక శక్తిని పొందుతుందని ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ చెప్పిన మాటను ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ ఆలోచన జైన తత్వ ప్రాథమిక స్ఫూర్తితో.. భారతదేశ చైతన్యంతో అంతర్గతంగా అనుసంధానమై ఉందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. "భారత్ సేవ, మానవత్వం ఆధారితమైనది" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రపంచం శతాబ్దాలుగా హింసను హింసతో అణచివేయడానికి ప్రయత్నించినప్పటికీ, భారత్ మాత్రం ప్రపంచానికి అహింసా శక్తిని పరిచయం చేసిందని ఆయన స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతి ఎల్లప్పుడూ మానవాళికి సేవ చేసే స్ఫూర్తికి ప్రాధాన్యమిస్తుందని ఆయన తెలిపారు.
"భారత సేవా స్ఫూర్తి షరతులు లేనిది.. స్వార్థానికి అతీతమైనది.. నిస్వార్థం నుంచి ప్రేరణ పొందినది" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ సూత్రమే నేటి దేశ పాలనను నడిపిస్తోందని స్పష్టం చేశారు. సమాజంలోని అణగారిన వర్గాలను ఉద్ధరించే ఈ తత్వానికి ప్రతిబింబాలుగా.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ యోజన, పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ వంటి కార్యక్రమాలను ఆయన ఉదహరించారు. ఎవరూ వెనుకబడి ఉండకుండా.. అందరూ సమానంగా పురోగతి సాధించేలా ప్రభుత్వం అన్ని పథకాల్లో సంతృప్తిని సాధించడానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సంకల్పం ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ ఆదర్శాల నుంచి ప్రేరణ పొందినదేననీ.. ఇది యావత్ దేశపు సమష్టి నిబద్ధతగా మారిందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
"తీర్థంకరులు, సన్యాసులు, ఆచార్యుల బోధనలు.. మాటలు ప్రతి యుగంలోనూ సమయోచితంగా మనకు దారిచూపుతూ ఉంటాయి. నేడు జైన మత సూత్రాలైన.. అయిదు మహావ్రతాలు, అనువ్రతం, త్రిరత్నాలు, ఆరు ఆవశ్యకాలు గతంలో కంటే ఎక్కువ ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. శాశ్వతమైన వారి బోధనలు కూడా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సామాన్యులకూ అందుబాటులో ఉంచాలని ఆయన పేర్కొన్నారు. ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ తన జీవితాన్ని, కృషిని ఈ లక్ష్యానికి అంకితం చేశారని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. "జైన గ్రంథాలను వ్యావహారిక భాషలో అందించడానికి ఆచార్య జీ 'వచనామృతం' ఉద్యమాన్ని ప్రారంభించారు. లోతైన ఆధ్యాత్మిక భావనలను ప్రజలకు సరళంగా, సులభంగా అర్థమయ్యేలా తెలియజేయడానికి భక్తి సంగీతాన్ని కూడా ఉపయోగించారు" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆచార్య భజనల్లో ఒకదానిని ఉటంకిస్తూ.. ఇటువంటి కూర్పులు జ్ఞానమనే ముత్యాలను గుచ్చి తయారు చేసిన ఆధ్యాత్మిక మాలలుగా అభివర్ణించారు. అమరత్వంపై ఈ అప్రయత్న విశ్వాసం, అనంతం వైపు చూసే ధైర్యం భారతీయ ఆధ్యాత్మికతనూ, సంస్కృతిని అసాధారణమైనవిగా చేస్తాయన్నారు.
ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ శతజయంతి సంవత్సరాన్ని నిరంతర స్ఫూర్తిని అందించే సంవత్సరంగా అభివర్ణించిన శ్రీ నరేంద్ర మోదీ.. ఆచార్య బోధనలను వ్యక్తిగత జీవితంతో అనుసంధానించుకుని వాటిని ఆచరించాలని సూచించారు. సమాజం, దేశ సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. తన సాహిత్యం, ఆధ్యాత్మిక రచనల ద్వారా ప్రాచీన ప్రాకృత భాషను పునరుద్ధరించడంలో ఆచార్య విద్యానంద్ జీ కీలక పాత్ర పోషించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలోని అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైన ప్రాకృతం.. జైన ఆగమాలు కూర్చిన భగవాన్ మహావీర్ బోధనల అసలు మాధ్యమంగా ఉందన్నారు. సాంస్కృతిక నిర్లక్ష్యం కారణంగా ఈ భాష సాధారణ ఉపయోగం నుంచి క్రమంగా దూరమవుతూ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆచార్య విద్యానంద్ జీ వంటి సాధువుల ప్రయత్నాలు ఇప్పుడు జాతీయ ప్రయత్నాలుగా మారాయని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వం 2024 అక్టోబరులో ప్రాకృతానికి ప్రాచీన భాష హోదాను మంజూరు చేసిందని ఆయన గుర్తుచేశారు. భారత ప్రాచీన గ్రంథాలను సంరక్షించడానికి ప్రారంభించిన డిజిటలైజేషన్ ప్రచారాన్నీ ఆయన ప్రస్తావించారు. ఇందులో ఆచార్యులకు సంబంధించిన అనేక జైన గ్రంథాలు, రచనలు ఉన్నాయన్నారు. ఉన్నత విద్యలో మాతృభాష వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రసంగాన్ని పునరుద్ఘాటిస్తూ, దేశాన్ని వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి చేసి, అభివృద్ధి-వారసత్వం రెండింటినీ కలిపి ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ నిబద్ధత భారత సాంస్కృతిక-ఆధ్యాత్మిక క్షేత్రాల నిరంతర అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తోందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2024లో భగవాన్ మహావీర్ 2,550వ నిర్వాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించిందనీ, ఆచార్య విద్యానంద్ జీ మునిరాజ్ ప్రేరణ.. ఆచార్య శ్రీ ప్రజ్ఞా సాగర్ జీ వంటి సాధువుల ఆశీస్సులతోనే అది సాధ్యమైందని ఆయన గుర్తు చేసుకున్నారు. రాబోయే కాలంలో దేశం తన సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ఇలాంటి గొప్ప ప్రయత్నాలు అవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత కార్యక్రమం మాదిరిగానే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్ మంత్రంతో.. జన్ భాగీదారీ స్ఫూర్తితో కొనసాగిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం సహజంగానే తనకు నవకార్ మంత్ర దివస్ జ్ఞాపకాలను గుర్తు చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో తొమ్మిది తీర్మానాలను కూడా పంచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రతిజ్ఞలను నెరవేర్చడానికి పౌరులంతా హృదయపూర్వకంగా కృషి చేస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ బోధనలు ఈ నిబద్ధతలను బలోపేతం చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తొమ్మిది తీర్మానాలను పునరుద్ఘాటిస్తూ, వాటిలో నీటిని సంరక్షించడం మొదటి తీర్మానమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి నీటి చుక్క విలువనూ గుర్తించాలని, దానిని భూమాత పట్ల తమ బాధ్యత, విధిగా భావించాలని ఆయన ప్రతి ఒక్కరినీ కోరారు. రెండో తీర్మానం 'ఏక్ పేడ్ మా కే నామ్' అంటే తమ తల్లి పేరు మీద ఒక చెట్టును నాటి.. అమ్మ ప్రేమగా మనల్ని పోషించినట్లుగానే దానినీ పెంచి పెద్దచేయాలని సూచించారు. ప్రతి చెట్టునూ తల్లి ఆశీర్వాదంలా భావించాలన్నారు. మూడో తీర్మానం పరిశుభ్రత. ఇది ప్రదర్శన కోసం కాదు - ఇది అంతర్గత అహింసను ప్రతిబింబిస్తుంది అని స్పష్టం చేశారు. ప్రతి వీధి, పరిసరాలు, నగరాన్ని సమష్టి భాగస్వామ్యంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. 'వోకల్ ఫర్ లోకర్' అనేది నాలుగో తీర్మానం, దేశంలోని ప్రజల కష్టం.. దేశపు మట్టితో ముడిపడి ఉన్న తోటి భారతీయులు తయారు చేసిన ఉత్పత్తులనే ఎంచుకుని దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాలని శ్రీ నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. అయిదో తీర్మానం భారతదేశాన్ని అన్వేషించడం.. అర్థం చేసుకోవడం. ప్రపంచాన్ని చూడటం మంచిదే అయినా, మన దేశం గురించి మనం లోతుగా తెలుసుకోవడం, అనుభవాలను పొందడం, గౌరవించుకోవడం కూడా అవసరమేనన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని స్వీకరించాలనే ఆరో తీర్మానాన్నీ ప్రధానమంత్రి వివరించారు. భూమి తల్లిని హానికరమైన రసాయనాల నుంచి విముక్తి చేసి, గ్రామాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం ఏడో తీర్మానంగా పేర్కొన్న ప్రధానమంత్రి, మనసు పెట్టి తినడం.. సంప్రదాయిక భారతీయ భోజనంలో చిరు ధాన్యాలను చేర్చడం.. స్థూలకాయాన్ని ఎదుర్కోవడం, శక్తిని పెంచుకోవడం కోసం కనీసం పది శాతం నూనె వినియోగాన్ని తగ్గించడం గురించి పలు సూచనలు చేశారు. ఎనిమిదో తీర్మానం యోగా, క్రీడలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. పేదలకు సహాయం చేయడం తొమ్మిదో తీర్మానంగా శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదల అభివృద్ధిలో వారికి అండగా ఉంటూ.. వారు పేదరికాన్ని జయించడంలో సహాయం చేయడమే నిజమైన సేవ అవుతుందన్నారు. ఈ తొమ్మిది తీర్మానాల కోసం పని చేయడం ద్వారా పౌరులు ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ బోధనలను బలపరుస్తారని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
"భారతదేశ చైతన్యం, మన సాధువుల అనుభవాలు ఆలంబనగా దేశం కోసం అమృతకాల దార్శనికతను ముందుకు తెచ్చాం" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 140 కోట్ల మంది దేశ ప్రజలు ఈ అమృత సంకల్పాన్ని నెరవేర్చడం ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ అనే కల అర్థం ప్రతి భారతీయుని ఆకాంక్షలను నెరవేర్చడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దార్శనికత ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ బోధనల ప్రేరణేననీ, ఆయన చూపిన మార్గంలో నడవడం, ఆయన బోధనలను అనుసరించడం, దేశ నిర్మాణాన్ని జీవితంలో ప్రధాన కర్తవ్యంగా చేసుకోవడం మనందరి సమష్టి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భం పవిత్రత.. ఈ నిబద్ధతలను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్‌కు శ్రీ నరేంద్ర మోదీ మరోసారి గౌరవపూర్వకంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, గౌరవ సాధువులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
జైన మత ఆధ్యాత్మిక గురువు, సామాజిక సంస్కర్త అయిన ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ 100వ జయంతిని పురస్కరించుకుని, భగవాన్ మహావీర్ అహింసా భారతి ట్రస్టు సహకారంతో భారత ప్రభుత్వం ఏడాది పొడవునా నిర్వహిస్తున్న కార్యక్రమాల అధికారిక ప్రారంభంగా ఈ ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ శతాబ్ది ఉత్సవ సభను నిర్వహించారు. ఆ మహనీయుని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఆయన సందేశాన్ని వ్యాప్తి చేయడం లక్ష్యంగా ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ వేడుకల్లో సాంస్కృతిక, సాహిత్య, విద్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భాగంగా ఉంటాయి.
ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ జైన తత్వం, నైతిక విలువలపై 50కి పైగా రచనలు చేశారు. దేశవ్యాప్తంగా పురాతన జైన దేవాలయాల పునరుద్ధరణ, పునరుజ్జీవనంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ప్రాకృత భాష, జైన తత్వం, ప్రాచీన భాషల్లో విద్య కోసం కృషి చేశారు.
(Release ID: 2140511)
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam