ఆర్థిక మంత్రిత్వ శాఖ
పాకిస్తాన్‌లో తయారైన వస్తువులను రవాణా చేస్తున్న 39 కంటైనర్లను సీజ్ చేసిన డీఆర్ఐ
‘ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్’లో భాగంగా రూ. 9 కోట్ల విలువైన 1,115 మెట్రిక్ టన్నుల వస్తువులు స్వాధీనం – ఒకరి అరెస్ట్
పహల్గామ్ ఉగ్రవాద దాడుల తర్వాత.. దుబాయ్, యూఏఈ సహా పలు దేశాల మీదుగా రవాణా చేసే పాకిస్తాన్ వస్తువుల దిగుమతులను నిషేధించిన భారత్
పాకిస్తాన్ తయారు చేసిన వస్తువులను పలు దేశాల మీదుగా తరలించి దిగుమతి చేసుకోవడం.. దిగుమతి విధానం నిబంధనలను, అలాంటి వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతి, రవాణాలపై గల నిషేధాన్ని ఉల్లంఘించడమే
Posted On:
26 JUN 2025 6:19PM by PIB Hyderabad
అక్రమ దిగుమతులను అరికట్టే లక్ష్యంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) "ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్" పేరుతో విస్తృత తనిఖీలు చేపట్టింది. ప్రధానంగా దుబాయ్, యూఏఈ సహా పలు దేశాల మీదుగా తరలించిన పాకిస్తాన్ వస్తువుల అక్రమ దిగుమతులు లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటివరకు సుమారు రూ. 9 కోట్ల విలువైన 1,115 మెట్రిక్ టన్నుల వస్తువులను తరలిస్తున్న 39 కంటైనర్లను సీజ్ చేశారు. దిగుమతి విధాన నిబంధనలను, పాకిస్తాన్‌లో తయారైన వస్తువుల ప్రత్యక్ష..పరోక్ష దిగుమతి, రవాణాలపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఈ దిగుమతులు ఉల్లంఘిస్తున్నాయి. దీంతో ఈ వస్తువులను దిగుమతి చేసుకుంటున్న సంస్థ భాగస్వాముల్లో ఒకరిని ఈరోజు అరెస్టు చేశారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడుల అనంతరం ప్రభుత్వం.. పాకిస్తాన్‌లో తయారయ్యే , ఆ దేశం ఎగుమతి చేసే వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతి, రవాణాలపై సమగ్ర నిషేధం విధించింది. ఈ నిషేధం మే 2 నుంచి అమలులోకి వచ్చింది. గతంలో, అటువంటి వస్తువుల దిగుమతిపై 200 శాతం కస్టమ్స్ సుంకం వసూలు చేసేవారు. అయితే ప్రస్తుతం ఈ వస్తువుల దిగుమతిపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ కొందరు దిగుమతిదారులు ఈ వస్తువులు తయారైన దేశాన్ని తప్పుగా చూపిస్తూ.. సంబంధిత షిప్పింగ్ పత్రాలను తారుమారు చేస్తూ వాటిని అక్రమంగా దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
రెండు వేర్వేరు ఘటనల్లో నవా షెవా ఓడరేవు వద్ద ఈ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులు యూఏఈలో తయారైనట్లు రవాణాదారులు తప్పుడు పత్రాలు చూపారు. అయితే ఇవి నిజానికి పాకిస్తాన్‌లో తయారైనవనీ, భారత్లో దిగుమతి కోసం వీటిని దుబాయ్ మీదుగా తరలిస్తున్నారని దర్యాప్తులో తేలింది.
మొదట ఈ వస్తువులను పాకిస్తాన్ నుంచి దుబాయ్‌కి ఒక ఓడలో ఉంచిన కంటైనర్ల ద్వారా తరలించి.. ఆ తర్వాత వేరొక ఓడలోని కంటైనర్లకు బదిలీ చేసి భారత్‌కు తరలిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో పట్టుబడిన వస్తువులను మరింత లోతుగా పరిశీలించి, పత్రాలను విశ్లేషించి.. పాకిస్తాన్‌లోని కరాచీ ఓడరేవు నుంచి ఈ వస్తువులు దుబాయ్‌లోని జాబెల్ అలీ ఓడరేవు మీదుగా భారత ఓడరేవులకు తరలిస్తున్నట్లు కనుగొన్నారు. అంతేగాకుండా పాకిస్తాన్ సంస్థలతో జరిపిన నగదు లావాదేవీలు, ఆర్థిక సంబంధాల వివరాలనూ గుర్తించారు. ఇది అక్రమ ఆర్థిక లావాదేవీల వ్యవహారాన్నీ వెలుగులోకి తెచ్చింది. పాకిస్తాన్, యూఏఈలకు చెందిన పలువురు మోసపూరిత ప్రణాళికలతో పాకిస్తాన్‌లో తయారైన ఈ వస్తువులను వేరే చోట తయారైనవిగా చూపి అక్రమంగా భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
"ఆపరేషన్ సిందూర్" నేపథ్యంలో పెరిగిన భద్రతా చర్యల్లో భాగంగా పాకిస్తాన్ నుంచి వచ్చే సరుకులే లక్ష్యంగా డీఆర్ఐ తనిఖీలు చేపట్టింది. ఇంటెలిజెన్స్ సమాచారం, డేటా విశ్లేషణల ద్వారా నిఘాను మరింత పటిష్టం చేసింది. ఈ చర్యల ఫలితంగా అధిక మొత్తంలో వస్తువులను సీజ్ చేసింది.
ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ విధానాలు, కస్టమ్స్..ఇతర సంబంధిత చట్టాల పరిరక్షణ పట్ల డీఆర్ఐ దృఢమైన నిబద్ధతకు "ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్" నిదర్శనంగా నిలుస్తుంది. జాతీయ-ఆర్థిక భద్రతను కాపాడటం, పాకిస్తాన్‌లో తయారైన వస్తువులను అక్రమంగా దిగుమతి చేసుకోవడం కోసం వాణిజ్య మార్గాల దుర్వినియోగాన్ని నిరోధించడం ఈ ఆపరేషన్ లక్ష్యం. వ్యూహాత్మక నిఘా, లక్ష్యాల అమలు, వివిధ సంస్థలతో సమన్వయం ద్వారా భారత ఆర్థిక సరిహద్దుల భద్రత విషయంలో డీఆర్ఐ కీలక పాత్ర పోషిస్తోంది.
***
(Release ID: 2140135)