రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వర్షాకాలంలో జాతీయ రహదారుల నిర్వహణకు నడుం బిగించిన ఎన్‌హెచ్ఏఐ

Posted On: 23 JUN 2025 8:06PM by PIB Hyderabad

వానాకాలంలో జాతీయ రహదారులను వర్షం నీళ్లు ముంచెత్తే సమస్యను పరిష్కరించడానికీ, అలాగే దేశంలో వివిధ ప్రాంతాల్లో వరదలు సంభవిస్తే తీసుకోవాల్సిన ముందస్తు చర్యల విషయంలో భారత జాతీయ హైవేల ప్రాధికరణ సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) అప్రమత్తమైంది.

బహు విధ చర్యలను ఎన్‌హెచ్ఏఐ అనుసరించదలచి, 15 రోజుల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ఎన్‌హెచ్ఏఐ అధికారులు, గుత్తేదారులు, కన్సల్టెంట్లు రంగంలోకి దిగారు. వారు వేరు వేరు ప్రాంతాల్లో వాననీళ్లు రోడ్లను ముంచెత్తే ప్రమాదం ఎదురుకాగల, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉండే ప్రదేశాల్ని తనిఖీ చేస్తున్నారు. జాతీయ రహదారుల వెంబడి నిర్మించిన వంతెనలు, తూముల గుండా వాననీళ్లు పారేటట్టు చూడటానికే వారు ఈ జాగ్రత్త చర్యను చేపట్టారు.

దీనికి అదనంగా, వాననీటి ఇంకుడు గుంతలను పూడికలు తీసి శుభ్రపరిచే పనులు జరుగుతున్నాయి. వాననీళ్లను సాఫీగా పారించడానికి మురుగు కాలవలను, నీళ్లు బయటికి పోయే దారులను (స్లిప్ రోడ్లు) బాగుచేస్తున్నారు. వరద భయం ఉన్న, గతంలో వాననీళ్లు నిలిచిపోయిన ప్రాంతాల్లో మళ్లింపు దారులు, నీరు జారిపోవడం కోసమే నిర్మించిన రోడ్లు, ప్రధాన మార్గాల్లో నీరు పోవడానికి ఏర్పాటు చేసిన గుంటల మరమ్మతు పనులు, వంతెనలు, క్రాస్ డ్రెయిన్లను శుభ్రం చేసే పనులు, రిటెయినింగ్ వాల్ (ఆర్ఈ వాల్) వీప్ హోల్స్, నీళ్లను బయటికి పంపించే తూములను శుభ్రం చేసే పనులు జోరుగా సాగుతున్నాయి. వానల వేళ రాకపోకలు సురక్షితంగా, సాఫీగా సాగేందుకు జలమయానికి గురి కాగల ప్రాంతాల్లో నేలను తవ్వే యంత్రాలు, ఇసుక బస్తాలు, సూచికల వంటి అత్యవసర యంత్రాలను, ఉపకరణాలను సమీకరిస్తున్నారు.    

వీటికి తోడు... వరదలు, కొండచరియలు విరిగిపడే ముప్పు పొంచి ఉందని ముందస్తుగా అందే సమాచారంపై సత్వరం స్పందించేందుకు ఎన్‌హెచ్ఏఐ సిద్ధమైంది. వర్ష బీభత్సానికి లోనవగల ప్రాంతాలకు యంత్రసామగ్రినీ, సిబ్బందినీ సాధ్యమైనంత త్వరగా రంగంలోకి దించేందుకు సంబంధిత కార్యనిర్వహణ ఏజెన్సీలతో, స్థానిక అధికారులతో,  పాలనాయంత్రాంగంతో సన్నిహిత సమన్వయాన్ని ఏర్పరుచుకొంటోంది. అంతేకాకుండా, జాతీయ రహదారులపై వరద, జలమయ స్థితి ఎదురయ్యే పక్షంలో సహాయక కార్యకలాపాలను వేగంగా చేపట్టడానికిగాను వివిధ స్థలాల్లో రోజులో 24 గంటలూ సేవలను అందించే అత్యవసర ప్రతిస్పందన దళాలను వారికి అవసరమయ్యే ఉపకరణాలను, యంత్రాలను సమకూర్చి  మరీ మోహరించనున్నారు. ఆపద ఎదురవగల ప్రాంతాల్లో సూక్ష్మ స్థాయి పర్యవేక్షణ కోసం ఎన్‌హెచ్ఏఐకి చెందిన వివిధ క్షేత్రీయ కార్యాలయాల్లో శీఘ్ర స్పందన దళాలను ఏర్పాటు చేశారు.

పర్యవేక్షణకు సాంకేతికతను దన్నుగా తీసుకొంటూ, అలర్టులను పంపిస్తూ, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను ఎన్‌హెచ్ఏఐ సద్వినియోగపరచుకోనుంది. జాతీయ రహదారులను ఉపయోగించుకొనే వారికి ‘రాజమార్గ్‌ యాత్ర’ యాప్  (Rajmargyatra app)లోనూ, భారత వాతావరణ అధ్యయన విభాగం (ఐఎండీ) ‘మేఘ్‌దూత్’ యాప్ లోనూ మొబైల్ అలర్టుల ద్వారా వాస్తవిక సమయ ప్రాతిపదికన వాతావరణం, ట్రాఫిక్.. వీటికి సంబంధించిన తాజా సమాచారాన్ని (అప్‌డేట్స్)ను ఎన్‌హెచ్ఏఐ అందించనుంది. సమస్యలను గుర్తించడానికీ, దిగుడు దారులను సరి అయిన విధంగా నిర్వహిస్తుండటంతో పాటు బాట పక్క కాలిదారులలో బీటలను కనుగొని వాటిని పూడ్చటానికీ డ్రోన్లను వాడుతున్నారు.

భారత్‌లో వర్షరుతువు మొదలు కావడంతోనే ఎన్‌హెచ్ఏఐ వరద సన్నద్ధత చర్యలతో పాటు అత్యవసర ప్రతిస్పందన సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక చొరవలను తీసుకోవడం మొదలుపెట్టింది. ఈ చర్యలు వానాకాలంలో జాతీయ రహదారుల మీదుగా రాకపోకలు జరిపే వారు నిరంతరాయంగా సాఫీగా తమ ప్రయాణాలను ముగించుకోవడానికి సాయపడనున్నాయి.


 

***


(Release ID: 2139154)