రక్షణ మంత్రిత్వ శాఖ
సైబర్ భద్రత మరింత బలోపేతం: జాతీయ స్థాయిలో కసరత్తు ప్రారంభించిన డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ
Posted On:
16 JUN 2025 2:40PM by PIB Hyderabad
‘సైబర్ సురక్ష’ పేరిట ఒక సమగ్ర సైబర్ భద్రత కసరత్తును డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ ఈ రోజున ప్రారంభించింది. హెడ్‌క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఆధ్వర్యంలో ఆరంభించిన ఈ కార్యక్రమం అనేక దశలలో కొనసాగి, ఈ నెల 27న ముగియనుంది. సైబర్ జగతిలో జరిగే దాడులకు ఎదురొడ్డి నిలిచే శక్తిని బలపరచే దిశగా ఇది ఒక ముందస్తు క్రియాత్మక చర్య. దీనిలో భాగంగా కొన్ని లక్షిత వర్గాలకు శిక్షణ కార్యక్రమాల్ని నిర్వహించడం, మూల్యాంకనం చేయడంతో పాటు నాయకత్వం వహించడానికంటూ కొంతమందిని భాగస్వాములుగా చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి ఏజెన్సీలతో పాటు రక్షణ రంగంలో వివిధ విభాగాలకు చెందిన ఆసక్తిదారులు 100 మందికి పైగా పాలుపంచుకొంటున్నారు.
ఈ కసరత్తులో పాల్గొంటున్న వారిని ఉత్తుత్తి సైబర్ బెదరింపులకు (సిమ్యులేటెడ్ రియల్-వరల్డ్ సైబర్ త్రెట్స్) గురి చేసి, అలాంటి పరిస్థితుల్లో ఏయే భద్రతా చర్యలు తీసుకోవాలో వారికి సూచించడంతో పాటు, తక్కువ సమయంలో మీద పడే సవాళ్లను తక్షణం విశ్లేషించి, తగిన రక్షణ చర్యలను ఆచరణలో పెట్టే దిశగా వారి సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఈ కసరత్తులో భాగంగా, నాయకత్వ పాత్రను పోషించవలసిన వారి కోసం చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ (సీఐఎస్ఓస్) రహస్య సమావేశాన్ని కూడా ‘సైబర్ సురక్ష’లో భాగంగా నిర్వహిస్తున్నారు. నాయకత్వం వహించవలసిన వారికి సాంకేతిక అంశాలను సైతం బోధించనున్నారు. ప్రముఖ వక్తలు ఈ రహస్య సమావేశంలో పాల్గొని, మెలకువలను చెప్పడంతో పాటు వాటిని శిక్షణార్థులు ఆచరణలో పెట్టేటట్లుగా కూడా చూస్తారు.
సైబర్ బెదరింపులు వస్తే వాటిని నిర్ణయాత్మక రీతిన నిర్వీర్యం చేయడానికి అవసరమయ్యే శక్తియుక్తులను సంతరించుకొనే అవగాహనను అందించడంతోపాటు, అనుభవ పూర్వక అభ్యాసాన్ని అందించనున్నారు. అన్ని స్థాయుల్లో భద్రతకు పెద్దపీట వేసే సంస్కృతిని అలవరచడంతో పాటు సర్వదా సన్నద్ధంగా ఉండే స్థితిని నెలకొల్పేందుకు ఇలాంటి కసరత్తులను క్రమం తప్పక నిర్వహించాలని డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ భావిస్తోంది.
***
(Release ID: 2136655)