నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యమిస్తూ పర్యావరణ హిత నైపుణ్యాలపై సంయుక్త శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ), షెల్ ఇండియా
· ఈ భాగస్వామ్యం కింద ఎంపిక చేసిన ఐటీఐలు, ఎన్ఎస్టీఐలలో ఎలక్ట్రిక్ వాహన నైపుణ్య ప్రయోగశాలల ఏర్పాటు: విద్యార్థులకు ప్రయోగాత్మక శిక్షణ
· షెల్ భాగస్వామి ఎడ్యునెట్ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమం అమలు.. ఎలక్ట్రిక్ రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యాలతో 5 రాష్ట్రాల్లో వేలాది విద్యార్థుల సాధికారత లక్ష్యం
· పర్యావరణ హితంగా ఆర్థికాభివృద్ధి అన్న భారత్ లక్ష్యానికి అనుగుణంగా ధ్రువీకరణ, నియామక చేయూత: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన రంగంలో పర్యావరణ హిత పద్ధతిలో ఉద్యోగావకాశాలు
Posted On:
13 JUN 2025 11:10AM by PIB Hyderabad
నైపుణ్యాభివృద్ది, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (ఎంఎస్డీఈ) పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) షెల్ ఇండియా సహకారంతో పర్యావరణ హిత నైపుణ్యాలు (గ్రీన్ స్కిల్స్), ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పర్యావరణ హిత ఇంధనం, ఎలక్ట్రిక్ రవాణా విషయాల్లో విద్యార్థులు, అధ్యాపకులను భవిష్యత్ సన్నద్ధులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం. శిక్షణలో షెల్ భాగస్వామి అయిన ఎడ్యునెట్ ఫౌండేషన్ ద్వారా 2025 జూన్ 12న ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలోని ఎంపిక చేసిన పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐలు), జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలు (ఎన్ఎస్టీఐ)లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.
డీజీటీ-షెల్ ఇండియా భాగస్వామ్యంలో ఎంపిక చేసిన ఎన్ఎస్టీఐలు, ఐటీఐల్లో నిర్మాణాత్మక బహుళ అంచెల నమూనాతో ఈ శిక్షణ అందించనున్నారు. తొలి దశలో- ఈ కార్యక్రమంలో 4 ఎన్ఎస్టీఐలలో 240 గంటల అడ్వాన్స్డ్ ఈవీ టెక్నిషియన్ కోర్సు, షెల్ మద్దతుతో ప్రయోగశాలలున్న 12 ఐటీఐలలో 90 గంటల ఉద్యోగ ఆధారిత ఈవీ నైపుణ్యాల కోర్సు, అదనంగా ప్రయోగశాలలు లేని ఐటీఐలలో 50 గంటల ప్రాథమిక హరిత నైపుణ్యాల మాడ్యూల్ ఉంటాయి. ఈ పాఠ్య ప్రణాళికను షెల్, ఎడ్యునెట్ ఫౌండేషన్, డీజీటీ సంయుక్తంగా రూపొందించాయి. ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థలు, సమస్యల గుర్తింపు, బ్యాటరీ సాంకేతికత, డిజిటల్ సాధనాలు, భద్రతాపరమైన నియమాలు ఇందులో ఉన్నాయి. 250 మందికి పైగా అధ్యాపకులకు శిక్షణ (టీవోటీ), షెల్, డీజీటీ సంయుక్త ధ్రువీకరణ, వ్యవస్థాగతమైన నియామక మద్దతుతో పారిశ్రామిక సన్నద్ధతను పెంచడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.
ఎంపిక చేసిన ఐటీఐలు, ఎన్ఎస్టీఐలలో ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహన నైపుణ్యాలకు సంబంధించి ప్రయోగశాలలను నెలకొల్పడం ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశం. పారిశ్రామిక ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యక్ష శిక్షణ, నిపుణుల నేతృత్వంలో సదస్సుల నిర్వహణ కోసం ఈ ప్రయోగశాలలను రూపొందించారు. ప్రయోగశాలల్లో అభ్యసనానికే పరిమితం కాకుండా.. నియామకాల విషయంలోనూ చేయూతనిస్తుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన వారికి సంయుక్తంగా బ్రాండెడ్ ధ్రువీకరణను కూడా అందిస్తారు. హరిత ఇంధనం, ఎలక్ట్రిక్ వాహన రంగాల్లో వారి ఉపాధి అవకాశాలను ఇది మెరుగుపరుస్తుంది.
నికర శూన్య ఉద్గార లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం హరిత ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల త్వరిత స్వీకరణ (ఎఫ్ఏఎంఈ- ఫేమ్) పథకం వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, నిర్దేశిత ప్రోత్సాహకాలను అందించడంలో కీలక పాత్ర పోషించాయి. జాతీయ స్థాయిలో ఈ కృషికి తోడుగా.. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు సొంత ఎలక్ట్రిక్ వాహన విధానాలను రూపొందించాయి. తద్వారా ఎలక్ట్రిక్ విధానం దిశగా రవాణా రంగాన్ని మరింత వేగంగా మళ్లించడం, స్థానికంగా ఆ వ్యవస్థలను పెంపొందించడం, పర్యావరణానికి నష్టం కలగకుండా ఉద్యోగ అవకాశాలను సృష్టించడం సాధ్యమవుతుంది. ఈ పరిణామాలు హరిత ఇంధనం, ఎలక్ట్రిక్ వాహన రంగాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు అవకాశాలు పెరుగుతుండడాన్ని సూచిస్తున్నాయి.
వృత్తిపరమైన శిక్షణకు సంబంధించి అత్యున్నత జాతీయ సంస్థగా.. విద్యార్థులు, శిక్షకులను సమీకరించడంతోపాటు జాతీయ విద్య, నైపుణ్యాభివృద్ధి ప్రమాణాలకు అనుగుణంగా సంస్థాగత ఏర్పాట్ల ద్వారా ఈ కార్యక్రమంలో డీజీటీ కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ కార్యక్రమ ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. “షెల్ ఇండియాతో మా సహకారం నైపుణ్యాన్నీ సుస్థిరతనూ అనుసంధానించడంపట్ల ప్రభుత్వ దృఢమైన నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. హరిత ఇంధనం, ఎలక్ట్రిక్ రవాణా, కర్బనోద్గారాలను విస్తృతంగా తగ్గించడం మొదలైన అంశాలు కేవలం పర్యావరణపరంగా అనివార్యతలు మాత్రమే కాదు.. ఆవిష్కరణ, ప్రతిభ, సాహసోపేతమైన కృషి ద్వారా పురోగమనం దిశగా అవి భారత్లో యువత ఉపాధికి అవరోధాలను తొలగిస్తాయి. కేవలం ఉద్యోగ సన్నద్ధత మాత్రమే కాకుండా, పర్యావరణపరంగా కూడా సంసిద్ధులైన శ్రామిక శక్తిని సృష్టించే మా విస్తృత లక్ష్యంలో ఈ కార్యక్రమం అంతర్భాగం. పర్యావరణ హిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కేవలం భాగస్వామిగానే ఉండడం కాదు, దానిని తీర్చిదిద్దే నైపుణ్యాలతో భారత యువతను మేం సన్నద్ధులను చేస్తున్నాం’’ అని నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి పేర్కొన్నారు.
నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) డైరెక్టర్ జనరల్ శ్రీమతి త్రిశాల్ జిత్ సేథీ మాట్లాడుతూ.. “మన ఐటీఐలు, ఎన్ఎస్టీఐలలో అత్యాధునిక శిక్షణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమ సంబంధిత పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడంపై షెల్ ఇండియాతో భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఎలక్ట్రిక్ వాహన సాంకేతికతను వృత్తిపరమైన శిక్షణతో మిళితం చేయడం ద్వారా పరిశ్రమలో వాస్తవిక అవసరాలకు తగినట్టుగా మన విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాన్ని పొందేలా చూస్తున్నాం. ఉమ్మడి ధ్రువీకరణ, అధ్యాపకుల నైపుణ్యాలను మెరుగుపరచడం, నియామకాల విషయంలో చేయూతనివ్వడం వంటి అంశాలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. ఈ కార్యక్రమం పర్యావరణ హిత రవాణా రంగంలో మన యువతకు విశేషంగా ఉపాధి అవకాశాలను పెంచుతుంది’’ అన్నారు.
ఈ భాగస్వామ్యంపై భారత్లో షెల్ గ్రూప్ కంపెనీల చైర్పర్సన్, షెల్ లూబ్రికెంట్స్ ఆసియా పసిఫిక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాన్సీ మదన్ త్రిపాఠి మాట్లాడుతూ.. “షెల్లో భవిష్యత్తు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా స్థానిక సమూహాలకు చేయూతనివ్వాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. భవిష్యత్తులో కర్బనోద్గారాలను తగ్గించే దిశగా పర్యావరణ హిత ఇంధన నైపుణ్యలతో యువతను సన్నద్ధులను చేయడం అత్యంత ముఖ్యమైన అంశం. డీజీటీ, ఎడ్యునెట్ ఫౌండేషన్ సహకారంతో హరిత ఇంధనం, ఎలక్ట్రిక్ రవాణాల్లో ప్రయోగాత్మక, భవిష్యత్ సన్నద్ధ నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న ఇంధన రంగంలో యువత సాధికారతను పెంచడానికి, ఉద్గారాల్లో నికర శూన్యతను సాధించాలన్న భారత ఆశయాలకు ఇది దోహదం చేస్తుంది” అన్నారు.
పర్యావరణ హితంగా ఆర్థికాభివృద్ధి దిశగా భారత యువత కెరీర్ను సన్నద్ధం చేసుకోవడంలో- డీజీటీ, షెల్ ఇండియా మధ్య ఈ సహకారం శక్తిమంతమైన చర్య. సమగ్ర పాఠ్యప్రణాళిక, ప్రత్యేక ప్రయోగశాలలు, ఈ రంగంలో చేయూతనివ్వడం ద్వారా.. ప్రయోగాత్మక నైపుణ్యాలు, ధ్రువీకరణల ద్వారా ఈ కార్యక్రమం విద్యార్థులను సన్నద్ధులను చేస్తుంది. వారి ఉపాధి అవకాశాలను పెంచడంతోపాటు సుస్థిరమైన, సృజనాత్మక ఆధారిత భవితకు నేతృత్వం వహించేలా వారిని నిలుపుతుంది.
***
(Release ID: 2136211)