వ్యవసాయ మంత్రిత్వ శాఖ
'వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్' లో భాగంగా తెలంగాణ ప్రాంత రైతులతో సంభాషించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
'వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్' కి 12 రోజులు పూర్తయ్యాయి, లక్షలాది మంది రైతులు ప్రచారంలో చేరారు*
వ్యవసాయం లో వైవిధ్యీకరణ, సమీకృత వ్యవసాయం చేస్తోన్న తెలంగాణ రైతులకు అభినందనలుః శ్రీ శివరాజ్ సింగ్
భారతీయ శ్రీ అన్నా పరిశోధనా సంస్థ తన ప్రపంచ గుర్తింపును స్థాపించనుంది: శ్రీ శివరాజ్ సింగ్
తెలంగాణలో పామాయిల్ సాగును మరింత ప్రోత్సహించడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగించాలి - శ్రీ శివరాజ్ సింగ్
టమోటా, బంగాళాదుంప, ఉల్లి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) ప్రయోజనం చేకూరుస్తుందిః శ్రీ చౌహాన్
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో వ్యవసాయ పురోగతి కోసం నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయిః శ్రీ శివరాజ్ సింగ్
Posted On:
09 JUN 2025 8:20PM by PIB Hyderabad

'వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్' లో భాగంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు తెలంగాణలో రైతులతో సంభాషించారు. మొదట ఆయన తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లాలోని మన్సన్పల్లి గ్రామంలో రైతులను కలుసుకున్నారు. తరువాత రామచంద్రగుడా గ్రామానికి వెళ్లి కిసాన్ చౌపాల్ వద్ద రైతులను కలిశారు. తమ వ్యవసాయం లో వైవిధ్యీకరణ, సమీకృత వ్యవసాయం పద్ధతులను అవలంబిస్తున్నామని, ఇవి తమ ఉత్పత్తి, ఆదాయం రెండింటినీ పెంచడంలో సహాయపడతాయని మంత్రికి తెలియజేశారు. కిసాన్ చౌపాల్ తరువాత, శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళపల్లి, ఇబ్రహీంపట్నం లో జరిగిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అని, రైతులు దాని ఆత్మ అని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ తనకు అప్పగించిన పనిని అత్యంత నిజాయితీతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని అన్నారు. ఈరోజు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3.0 మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అభినందినలు తెలియజేశారు.

రైతుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని ఆయన స్పష్టం చేశారు. ఆధునిక వ్యవసాయం, ఆర్థికంగా సాధికారిత కలిగిన రైతులు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో కీలకమని ఆయన చెప్పారు. దేశ జనాభాలో దాదాపు సగం మందికి వ్యవసాయం ప్రధాన జీవనోపాధిగా కొనసాగుతోంది. జాతీయ జిడిపిలో ఇది 18% వాటా కలిగి ఉంది. ఈ సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ రంగం 5.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. ఇది భారతీయ రైతుల అంకితభావం, కృషికి నిదర్శనం. "మన రైతులు అసాధారణమైన పనితీరును కనబరచారు, కానీ మనం ఇంకా ఎక్కువ విజయాల కోసం కృషి చేస్తూనే ఉండాలి" అని ఆయన అన్నారు.

నాలుగు ప్రధాన లక్ష్యాలను సాధించడానికి మనం చర్యలు తీసుకోవాలి. ముందుగా, దేశ ఆహార భద్రతను నిర్ధారించడానికి మనం బలంగా పనిచేయాలి. దేశంలోని ఆహార నిల్వలను పూర్తిగా ఉంచడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ దిశలో మనం ఆశించిన ఫలితాలను సాధిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. మీ అందరి కృషి కారణంగా, ఈ సంవత్సరం గోధుమలు, బియ్యం ఉత్పత్తిలో రికార్డు పెరుగుదల ఉంది. రెండవది, మన రైతులు తమ ఉత్పత్తులకు న్యాయమైన ధర పొందేలా చూసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మూడవది, దేశంలోని 145 కోట్ల జనాభాకు పోషకమైన ఆహారాన్ని అందించాలి చివరగా, రాబోయే తరానికి భూమిని సురక్షితంగా ఉంచాలి, దాని సారవంతమైన స్థితిని కాపాడుకోవాలి, తద్వారా వ్యవసాయం ఔచిత్యం భవిష్యత్ తరానికి కూడా ఉంటుంది.

సమష్టి భాగస్వామ్యంతో 'వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్' ప్రారంభించబడిందని శ్రీ శివరాజ్ సింగ్ అన్నారు. ప్రయోగశాలను భూమికి అనుసంధానించడానికి ప్రయత్నాలు జరిగాయి. శాస్త్రవేత్తలు పల్లెలు పర్యటించి రైతులకు పరిశోధన గురించి సరైన సమాచారాన్ని అందిస్తున్నారు. దీని కోసం 16 వేల మంది శాస్త్రవేత్తలతో కూడిన 2,170 బృందాలను ఏర్పాటు చేశారు. నిర్దిష్ట ప్రాంతం, వాతావరణం సారవంతమైన నేల అవసరాలకు అనుగుణంగా సరైన వ్యవసాయ పద్ధతి, పంట రకాల గురించి సమాచారం అందించబడుతోంది. రైతులే నిజమైన శాస్త్రవేత్తలు. అందువల్ల, రైతుల ఆచరణాత్మక సమస్యలను విని, తదనుగుణంగా తదుపరి పరిశోధన మార్గాన్ని నిర్ణయించుకోవాలని నేను శాస్త్రవేత్తలకు సూచించాను.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ధాన్యంగా చిరుధాన్యాలను (శ్రీ అన్నా) స్థాపించడానికి ప్రభుత్వం నిబద్ధతను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. "ఈ ప్రపంచ చొరవకు నాయకత్వం వహించడంలో తెలంగాణలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ కీలక పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను" అని ఆయన అన్నారు. తెలంగాణలో పామాయిల్ సాగును ప్రోత్సహించడానికి మెరుగైన పరిశోధనలు అవసరమని కూడా ఆయన పిలుపునిచ్చారు.
రంగారెడ్డి జిల్లాలో అనుసరిస్తున్న వినూత్న వ్యవసాయ పద్ధతుల పట్ల శ్రీ చౌహాన్ తన ప్రశంసలను వ్యక్తం చేశారు. తాటి, బొప్పాయి పంటల అంతర పంటలు, టమోటాలు, పూల సాగు, స్థానిక రైతులు నర్సరీల అభివృద్ధి వంటి విజయవంతమైన కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఒక ఎకరానికి 3 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతున్నట్లు ఒక రైతు తెలిపారు. మీ శ్రేయస్సు మార్గంలో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించడానికి మేము శ్రద్ధగా కృషి చేస్తున్నాము" అని ఆయన అన్నారు.
విజయవంతమైన అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనలను భారతీయ రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) కింద రాష్ట్ర సరిహద్దుల్లో విక్రయించే టమోటా, బంగాళాదుంప, ఉల్లి ఉత్పత్తుల రవాణా ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అంతేకాకుండా తగినంత నిల్వ సౌకర్యాలను కూడా అందిస్తుంది. చిన్న, సన్న కారు రైతులు గరిష్ట ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. వారి ఉత్పాదకత, ఆదాయాన్ని పెంచడానికి వినూత్న వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతోంది.
చివరగా, శ్రీ శివరాజ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి యుద్ధ ప్రాతిపదికన రాత్రింబవళ్లు పని జరుగుతోందని అన్నారు. మన రైతు సోదర సోదరీమణులకు ప్రయోజనం చేకూర్చే విధానాలు రూపొందించబడతాయి.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌదరి; తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమల నాగేశ్వర రావు; పార్లమెంటు సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి; శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి; ఈ కార్యక్రమంలో DARE కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ (ICAR), శాస్త్రవేత్తలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు కూడా పాల్గొన్నారు..
***
(Release ID: 2135264)