వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎస్ఈజడ్ సంస్కరణలను నోటిఫై చేసిన ప్రభుత్వం... సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ఊతాన్ని ఇవ్వడానికే


* సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ ఎస్ఈజడ్‌లకు కనీస భూమి ఆవశ్యకత 10 హెక్టార్లకు తగ్గింపు..
రుణభారం నియమాల్లోనూ సడలింపు

Posted On: 09 JUN 2025 4:10PM by PIB Hyderabad

ప్రత్యేక ఆర్థిక మండలాలు (స్పెషల్ ఎకనామిక్ జోన్స్...‘ఎస్ఈజడ్స్)కు నిర్దేశించిన నియమాల్లో ప్రభుత్వం మార్గదర్శక సంస్కరణలను ప్రవేశపెట్టింది. సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు నిర్ణయించింది. ఈ రంగాల్లో తయారీకి భారీ పెట్టుబడులు అవసరమవుతూ ఉండడం, ఈ రంగాలు దిగుమతులపై ఆధారపడి ఉన్న రంగాలు కావడం, ఈ రంగాల్లో పనిచేసే కంపెనీలు లాభాల బాట పట్టడానికి దీర్ఘకాలం వేచి ఉండవలసి రావడం.. ఈ స్థితిలో ఉన్నత సాంకేతికత ప్రధానమైన ఈ రంగాల్లో తయారీకి ఊతాన్నివ్వడానికీ, ముందస్తు పెట్టుబడులను ప్రోత్సహించడానికీ నియమాల్లో సవరణలు తీసుకువచ్చారు.

ఎస్ఈజడ్ రూల్స్-2006లోని 5వ నియమంలో సవరణలు చేసిన తరువాత, అచ్చంగా సెమీకండక్లర్లు, ఎలక్ట్రానిక్ కాంపొనంట్స్‌ తయారీ కోసమే ఏర్పాటు చేసే ఎస్ఈజడ్‌కు ఇదివరకటిలా 50 హెక్లార్లకు బదులు కేవలం 10 హెక్టార్ల అవిచ్ఛిన్న భూమి (కంటిగ్యువస్ ల్యాండ్) ఉంటే సరిపోతుంది. ఇదే నియమావళిలోని 7వ నియమంలో చేసిన సవరణతో, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా వాటి అధికృత ఏజెన్సీలకు తాకట్టు పెట్టిన లేదా కౌలుకిచ్చిన సందర్భాల్లో ఎస్ఈజడ్‌కు భూమి అనేది రుణగ్రస్థం కానిది అయ్యుండాలన్న షరతును సడలించేటందుకు ఎస్ఈజడ్‌ల ఆమోద మండలికి ఇక వీలు చిక్కనుంది.  

53వ నియమాన్ని సవరించడంతో, అందుకున్న వస్తువుల విలువతో పాటు ఖర్చంటూ లేని ప్రాతిపదికన సరఫరా చేసిన వస్తువులను నెట్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ (ఎన్ఎఫ్ఈ) లెక్కల్లో కలపవచ్చు. వర్తించే కస్టమ్స్ గణన నియమాల ప్రకారం మూల్యాంకనం చేయడానికీ వీలు ఉంటుంది. దీనికి అదనంగా, ఎస్ఈజడ్ నియమావళిలోని 18వ నియమంలోనూ సవరణలు చేశారు. సెమీకండక్టర్ తయారీ, ఎలక్ట్రానిక్ కాంపొనంట్స్‌ తయారీ రంగంలోని ఎస్ఈజడ్ యూనిట్లకువర్తించే సుంకాలను చెల్లించిన తరువాత దేశీయ టారిఫ్ ఏరియాకు కూడా స్వదేశీ సరఫరాలను చేసేందుకు అవకాశం కల్పించడానికి వీలుగా ఈ చర్యను చేపట్టారు.

ఈ సవరణలు దేశంలో ఉన్నత సాంకేతికతతో కూడిన తయారీకి దన్నుగా నిలవడం, సెమీకండక్టర్ తయారీ అనుబంధ విస్తారిత వ్యవస్థ (ఇకోసిస్టమ్) వృద్ధికి తోడ్పడటం తో పాటు దేశంలో అధిక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలను కూడా కల్పించనున్నాయి.

ఈ సవరణలను వాణిజ్య విభాగం ఈ నెల 3న నోటిఫై చేసింది. ఆ తరువాత, సెమీకండక్లర్లను తయారు చేయదలుస్తూ మైక్రాన్ సెమీకండక్లర్ టెక్నాలజీ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ (ఎంఎస్‌టీఐ) సమర్పించిన ప్రతిపాదనను, ఎలక్ట్రానిక్ కాంపొనంట్స్‌ తయారీకి హుబ్బళ్లి డ్యూరబుల్ గూడ్స్ క్లస్టర్ (ఏక్వస్ గ్రూపు) చేసిన ప్రతిపాదనను ఎస్ఈజడ్‌ల ఆమోద మండలి ఆమోదించింది.

మైక్రాన్ గుజరాత్‌లోని సాణంద్‌లో 37.64 హెక్టార్ల ప్రాంతంలో రూ.13,000 కోట్ల అంచనా పెట్టుబడితో ఎస్ఈజడ్‌ను ఏర్పాటు చేయనుంది. కాగా ఏక్వస్ (Aequs) కర్నాటకలోని ధార్వాడ్‌లో ఎస్ఈజడ్‌ను 11.55 హెక్టార్ల ప్రాంతంలో రూ.100 కోట్ల అంచనా పెట్టుబడితో ఎస్ఈజడ్‌ను ఏర్పాటు చేయనుంది.


 

***


(Release ID: 2135193) Visitor Counter : 4