ఆయుష్
ఐడీవై-2025 సమాచారం కోసం పెరిగిన ఆసక్తి... అధికారుల సంసిద్ధత కోసం కార్యశాల
ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సంస్థలకు చెందిన 400 మందికిపైగా భాగస్వామ్యం
Posted On:
06 JUN 2025 11:37AM by PIB Hyderabad
పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)- 2025ను అందరికీ చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఒక ఉన్నత స్థాయి కార్యశాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ నిన్న (జూన్ 5న) దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించింది. ఈ కార్యశాల నిర్వహణలో సమాచార, ప్రసార శాఖ సహకారాన్ని అందించింది. ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల నుంచి 400 మందికిపైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నిర్వహించనున్న యోగా దినోత్సవాలకు సంబంధించి తాజా సమాచారం ఎప్పటికప్పుడు లభించాలన్న ప్రజల కోరిక మేరకు ఈ అంశంపై కార్యశాల ప్రధానంగా దృష్టి సారించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2014లో ఐక్యరాజ్యసమితి గుర్తించి ఇప్పటికి పదేళ్లు పూర్తికావడం చరిత్మాత్మక సందర్భం. ఆయుష్ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కొటేచా ఈ కార్యశాలకు అధ్యక్షత వహించారు. వేర్వేరు మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 400 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు. ‘‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’’ అనే ఆశయాన్ని సాధించుకొందామనే ఈ సంవత్సరం ఇతివృత్తానికి భారత ప్రభుత్వం సమష్టిగా కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం చాటింది. కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి సమాచార, ప్రసార శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సి. సెంథిల్ రాజన్, ఆయుష్ శాఖ సంయుక్త కార్యదర్శి మోనాలిసా దాస్ సహా ఉన్నతాధికారులు ప్రసంగించడం, చర్చలకు సారథ్యం వహించడంతో పాటు వివిధ ప్రసార మాధ్యమాలు ఏయే తరహా వ్యూహాలను పరస్పర సహకారంతో అమలుచేయాలన్నదీ చర్చించారు.
కార్యశాలలో మొదట ఆయుష్ కార్యదర్శి శ్రీ వైద్య కొటేచా ప్రసంగించారు. ఆయన ప్రధానమంత్రి విశాల దృష్టికోణాన్ని గురించీ, అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దేశ విదేశాల్లో ఆదరణ అంతకంతకు పెరుగడం గురించీ చెప్పారు. ‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇక క్యాలండర్‌లో ఒక తేదీగానే మిగిలిపోవడం లేదు.. అది మానవ శ్రేయస్సు, ఐకమత్యం, సద్భావనలను పెంపొందించడానికి పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఉద్యమంగా మారింది. దేశంలో నలుమూలలా పౌరులందరినీ కలుపుకొని ముందుకు సాగిపోతూ, శారీరక పటుత్వాన్ని ఓ పండుగగా అందరం జరుపుకోవాలని చాటిచెప్పేందుకు మనకు లభిస్తున్న ఒక సావకాశమే ఐడీవై- 2025. మొత్తం ప్రభుత్వం కదిలివస్తూ, ప్రసార మాధ్యమాలన్నీ ఒక్క తాటి మీద నిలబడితే, ఈ ప్రపంచ స్థాయి ఉద్యమంలో దేశంలోని పౌరులంతా ఏకం అయ్యేటట్లుగా మనం చూడవచ్చును’’ అని శ్రీ కొటేచా అన్నారు. ప్రజారోగ్యంలో మార్పును తీసుకురావడానికీ, సాంస్కృతిక దౌత్యానికి సైతం ఒక సాధనంగా యోగా ఉపయోగపడుతోందని, ఈ క్రమంలో నివారణ ప్రధాన ఆరోగ్యసంరక్షణ, సంపూర్ణ శ్రేయస్సులను సాధించాలంటే యోగాను అనుసరించాలన్న భావన బలపడుతోందని కూడా ఆయన వివరించారు.
కార్యక్రమంలో శ్రీ సి. సెంథిల్ రాజన్ మాట్లాడుతూ, విభిన్న ప్రసార మాధ్యమాలు కలిసికట్టుగా వాటి వంతు పాత్రను పోషించడం ముఖ్యమని, ప్రజలంతా ఉత్సాహంగా ముందుకు వచ్చి యోగా దినోత్సవంలో పాలుపంచుకొనేటట్లు వారిలో చైతన్యాన్ని కలిగించడానికి ఆసక్తికరమైన కథలను చెప్పే పద్ధతిలోనూ, పౌరులు వారంతట వారు చొరవ తీసుకొనే లాగానూ, దృశ్య మాధ్యమాన్ని వినియోగిస్తూనూ జాగృతపరచడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని సూచించారు. ఐడీవై సందేశాన్ని వీలయినంత ఎక్కువ మందికి చేరవేయడానికి రక రకాలైన పద్ధతుల్లో, సమన్వయ ప్రణాళికలతో సాగాలని మోనాలిసా దాస్ ప్రధానంగా చెప్పారు.
వివిధ మంత్రిత్వ శాఖలు అమలుచేస్తున్న కార్యక్రమాలతోపాటు యోగాను జనబాహుళ్యం వద్దకు చేర్చడానికి ఎలాంటి వ్యూహాలను అవలంబించవచ్చో తీర్మానించుకొనేందుకు నిర్వహించిన మేధోమధన సమావేశాల తాలూకు పురోగతిని సమీక్షించడానికీ, జూన్ 21 లోపల దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ప్రచార ఉద్యమం ఏకరీతిన సాగేటట్లు చూడటానికీ ఒక వేదికగా ఈ కార్యశాల ఉపయోగపడింది. యోగాభ్యాసాన్ని సమాజంలో అంతిమ వరుసలో ఉన్న వారి వద్దకు కూడా తీసుకుపోవాలనీ, గిరిజన ప్రాంతాలు, పట్టణాలకు చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, ఇతరత్రా సముదాయాలకు చెందిన వారు యోగా పట్ల శ్రద్ధ పెట్టేలా ఇటు క్షేత్ర స్థాయి లంకెలు, అటు డిజిటల్ మాధ్యమం.. వీటి ద్వారా యోగా సంబంధిత కార్యక్రమాలు, యోగా వల్ల కలిగే ప్రయోజనాల సారాన్ని ప్రచారం చేయాలనీ ఈ కార్యశాలలో ప్రధానంగా చెప్పారు.
ఈ నెల 21కి ఇంకా రెండు వారాలే మిగిలాయి..యోగాను చరిత్రాత్మకంగా, సమాజంలో అందరినీ కలుపుకొని, చక్కని ఫలితాన్ని పొందే ఉత్సవంలా జరుపుకోవడానికి అనువుగా రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రపంచానికి భారత్ అందించిన కానుకే యోగా. యోగాభ్యాసం ఆరోగ్యాన్ని, శాంతిని, సద్భావనను కోరుకొనే లక్షలాది ప్రజానీకాన్ని ఏకతాటి మీదకు తెచ్చింది.
***
(Release ID: 2134714)