వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇ-కామర్స్ వేదికలపై వాకీ టాకీలు సహా రేడియో పరికరాల అక్రమ లిస్టింగ్, అమ్మకాల నిరోధం-నియంత్రణ కోసం నూతన మార్గదర్శకాలు-2025ను నోటిఫై చేసిన కేంద్రం


హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ), టెలికమ్యూనికేషన్ విభాగం (డీవోటీ)లతో సంప్రదింపుల అనంతరం మార్గదర్శకాలను ఖరారు చేసిన వినియోగదారుల వ్యవహారాల విభాగం

నిబంధనలు ఉల్లంఘించిన 16,970 పరికరాల లిస్టింగ్స్ పరిశీలించి, సంబంధిత ఇ-కామర్స్ వేదికలకు నోటీసులు జారీ చేసిన కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థ (సీసీపీఏ)

Posted On: 30 MAY 2025 10:32AM by PIB Hyderabad

ఇ-కామర్స్ వేదికలపై వాకీ టాకీలు సహా రేడియో పరికరాల అక్రమ లిస్టింగ్స్, అమ్మకాల నిరోధం-నియంత్రణ కోసం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థ (సీసీపీఏ) నూతన మార్గదర్శకాలు-2025ను నోటిఫై చేసింది.

వినియోగదారుల భద్రతకు ముప్పు కలిగించే, చట్టపరమైన స్థితి గురించి వినియోగదారులను తప్పుదోవ పట్టించే, చట్టాల అమలు, అత్యవసర సేవల కోసం కీలకమైన కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లలో ఉపయోగించే వైర్‌లెస్ పరికరాల అనధికార అమ్మకాలను అరికట్టడానికి ఈ మార్గదర్శకాలను నోటిఫై చేశారు.

ఈ మార్గదర్శకాలను ఈ కింది లింక్ ద్వారా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

(https://consumeraffairs.nic.in/sites/default/files/file-uploads/latestnews/Guidelines_27052025.pdf).

టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీవోటీ), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) లతో విస్తృతమైన సంప్రదింపుల అనంతరం ఈ మార్గదర్శకాలను ఖరారు చేశారు. సమన్వయంతో కూడిన, సమగ్రమైన విధానాన్ని రూపొందించడం కోసం ఈ రెండు విభాగాలు అందించిన కీలకమైన నియంత్రణ, భద్రతాపరమైన సూచనలను ఈ తుది మార్గదర్శకాల్లో చేర్చారు.

వైర్‌లెస్ ఆపరేటింగ్ లైసెన్స్ అవసరం గురించి.. వర్తించే చట్టాలకు అనుగుణంగా ఉండటం గురించి తప్పనిసరి అయిన, స్పష్టమైన వివరాలను వెల్లడించకుండా వాకీ-టాకీలను ఇ-కామర్స్ వేదికలపై విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వాకీ-టాకీల కోసం ఉత్పత్తి లిస్టింగ్స్‌లో ఆ పరికరాన్ని ఉపయోగించడానికి సంబంధిత అథారిటీ నుంచి లైసెన్స్ పొందాల్సిన అవసరాన్ని గురించి ఎలాంటి సమాచారం పేర్కొనలేదు. ఫ్రీక్వెన్సీ పరిధి, ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం-1885, వైర్‌లెస్ టెలిగ్రఫీ చట్టం-1933 కింద లైసెన్సింగ్ బాధ్యతలు, తక్కువ పవర్ ఉపయోగించుట, చాలా తక్కువ పవర్ గల షార్ట్ రేంజ్ రేడియో ఫ్రీక్వెన్సీ పరికరాల వాడకం (లైసెన్సింగ్ అవసరం నుంచి మినహాయింపు గలవి) నియమాలు-2018, అనధికార వినియోగం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాల వంటి వివరాలను ప్రదర్శించకపోవడం వల్ల వినియోగదారులు ఈ పరికరాలు సాధారణ ప్రజలు స్వేచ్ఛగా ఉపయోగించేవిగా భావించడం ద్వారా అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.

ఈ మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు:

అనుమతించిన ఫ్రీక్వెన్సీల పరిధిలో పనిచేసే అధీకృత, చట్టబద్ధత గల వాకీ-టాకీ పరికరాలు మాత్రమే ఆన్‌లైన్ వేదికలపై అమ్మకం కోసం లిస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఉత్పత్తి ఫ్రీక్వెన్సీ పరిధులను, ఇతర సాంకేతిక వివరాలను స్పష్టంగా పేర్కొనాలి, రెగ్యులేటరీ ఆమోదం (పరికర రకం ఆమోదం) రుజువును ఆ ఉత్పత్తి లిస్టింగ్స్ ప్రదర్శించాలి.
ఇ-కామర్స్ సంస్థలు ఇటువంటి ఉత్పత్తుల విషయంలో తగిన శ్రద్ధ వహించి, అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా, వర్తించే సందర్భాల్లో లైసెన్సింగ్ కలిగి ఉన్నాయా ధ్రువీకరించుకోవాలి. అలాగే ఫ్రీక్వెన్సీ సమాచారం, అవసరమైన సర్టిఫికేషన్స్ లేని ఉత్పత్తులను లిస్టింగ్ నుంచి తొలగించాలి.
అటువంటి పరికరాల చట్టబద్ధ వినియోగం గురించి వినియోగదారులకు తప్పుడు సమాచారం అందించే, వారిని తప్పుదోవ పట్టించే ప్రకటనలను, ఉత్పత్తి వివరణలను నిషేధించాలి.
అమ్మకం కోసం లిస్ట్ చేసిన పరికరాలు డీవోటీ కేటాయించిన, అధికారం కల్పించిన ఫ్రీక్వెన్సీ నుంచి మినహాయింపు పొందని ఫ్రీక్వెన్సీలపై పనిచేయడం లేదనీ, ఉత్పత్తి వివరణలో ఫ్రీక్వెన్సీ శ్రేణులను స్పష్టంగా లేబుల్ చేశారని విక్రేతలు నిర్ధారించుకోవాలి.
వినియోగదారుల భద్రత చట్టం-2019 అమలు విధానాలను, దాని ఉల్లంఘనలకు విధించే జరిమానాలను వివరంగా పేర్కొనాలి.
ఈ మార్గదర్శకాల ద్వారా, విభాగం కింది లక్ష్యాలను నిర్దేశించుకుంది:

అటువంటి ఉత్పత్తులను లిస్ట్ చేయడానికి ముందే వేదికలు తగిన శ్రద్ధ వహించడం
విక్రేత ఆధారాలు, సర్టిఫికేషన్స్ తప్పనిసరిగా ధ్రువీకరించుకోవడం
అనధికార లిస్టింగ్స్ కోసం స్వయంచాలక పర్యవేక్షణ, తొలగింపు విధానాలను ప్రవేశపెట్టడం
వివరాలను సరైన విధంగా వెల్లడించడం ద్వారా వినియోగదారుల అవగాహనను ప్రోత్సహించడం
నిబంధనలను పాటించని సందర్భాల్లో జరిమానాలు విధించడం, వేదికలను బాధ్యులను చేయడం
సరైన ఫ్రీక్వెన్సీని వెల్లడించకుండా, లైసెన్సింగ్ సమాచారం, పరికరాల రకం ఆమోదం (ఈటీఏ) ప్రదర్శించకుండా ఇ-కామర్స్ వేదికలపై వాకీ-టాకీలను లిస్ట్ చేయడం, విక్రయించడం ద్వారా వినియోగదారుల భద్రత చట్టం-2019ని ఉల్లంఘించిన 16, 970 ఉత్పత్తి లిస్టింగ్స్ కోసం ప్రముఖ డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌లకు కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థ (సీసీపీఏ) ఇప్పటికే పదమూడు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శకాలను జారీ చేయడంతో పాటు, ఈ వేదికలపై నిరంతర పర్యవేక్షణ, పరిశీలన కొనసాగించనున్నారు.


 

****


(Release ID: 2132743)