సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
పారదర్శకత, డిజిటల్ సంస్కరణలకు ప్రాధాన్యమిస్తూ.. ఐఏఎస్ అధికారుల ఇ-సివిల్ జాబితాను విడుదల చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్
ఇ-సివిల్ జాబితాలో సమాచారాన్ని సులభంగా పొందేందుకు ఏఐ ఆధారిత శోధన విధానాన్ని తీసుకురావాలని మంత్రి ప్రతిపాదన
Posted On:
19 MAY 2025 4:01PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర సాంకేతిక, భౌగోళిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయం, అణు ఇంధనం, అంతరిక్షం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఎలక్ట్రానిక్ సివిల్ జాబితా - 2025ను ఆవిష్కరించారు. ఈ-బుక్ రూపంలో ఉన్న ఈ జాబితాలో దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారుల వివరాలు డిజిటల్ రూపంలో ఉంటాయి
ఇ-పుస్తకం 70వ సివిల్ జాబితా కావడంతో పాటు.. పూర్తిగా డిజిటల్ విధానంలో ప్రదర్శితమవుతున్న అయిదో సంచిక అవడంతో ఈ ప్రచురణ ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
ఇ-పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. దేశంలో అత్యంత తెలివైన వారిని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆకర్షిస్తోందని, అలాగే భారతదేశ సమాఖ్య పాలనను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోందని మంత్రి అన్నారు. పారదర్శకతను తీసుకురావడంలో సివిల్ జాబితా ముఖ్యమైన అంశమని ఆయన పేర్కొన్నారు. ఇది దేశ పరిపాలన నాయకత్వానికి సంబంధించిన నిర్మాణాత్మక దృక్పథాన్ని అందిస్తుందని తెలిపారు.
ఇ-సివిల్ జాబితాలో కృత్రిమ మేధ ఆధారిత శోధన లాంటి అంశాలను భాగం చేయాలని మంత్రి ప్రతిపాదించారు. ఇవి త్వరితగతిన నిర్దేశిత అధికారుల వివరాలను, ప్రభుత్వ ప్రాజెక్టులను గుర్తించడంలో తోడ్పడతాయని, అదే సమయంలో నిర్ధిష్ట అంశాలకే శోధనను పరిమితం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ డిజిటల్ జాబితా ప్రాముఖ్యాన్ని, ప్రయోజనాన్ని కొనసాగించడానికి దాన్ని క్రమం తప్పకుండా నవీకరించాల్సిన అవసరాన్ని సైతం మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ప్రచురించిన ఇ-పుస్తకంలో ఈ ఏడాది జనవరి నాటికి నవీకరించిన సమాచారాన్ని అందించారు. దీనిలో ఐఏఎస్ అధికారుల పేరు, బ్యాచ్, క్యాడర్, ప్రస్తుత పోస్టింగు, జీతాలు, విద్యార్హతలు, పదవీ విరమణ తేదీలతో సహా సమగ్ర వివరాలు ఉంటాయి. ఇది క్యాడర్ వారీగా అధికారుల సంఖ్యను, వచ్చే ఐదేళ్లలో పదవీ విరమణ చేయనున్న అధికారుల సంఖ్య, 1969 నుంచి నియామకాల సమాచారాన్ని కూడా అందిస్తుంది. అయితే, మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ డాక్యుమెంట్‌లో అధికారుల ఛాయాచిత్రాలను సైతం జత చేశారు.
ఎంబడెడ్ హైపర్‌లింకులతో, అధికారుల వివరాలను శోధించేందుకు అనువుగా పీడీఎఫ్ రూపంలో తయారు చేసిన ఈ జాబితా మనకు కావాల్సిన సమాచారాన్ని వెంటనే అందిస్తుంది. ‘‘ఈ సివిల్ జాబితా అడ్మినిస్ట్రేటర్లు, నిర్ణయాధికారం ఉన్నవారికి మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు సైతం ముఖ్యమైన వనరుగా పనిచేస్తుంది’’ అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. డిజిటల్ పరిపాలనను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా చేపడుతున్న చర్యలను ఇది తెలియజేస్తోందని పేర్కొన్నారు.
వ్యవస్థలను ఆధునికీకరించడం, పౌర కేంద్రక సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా రూపొందించిన డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా భారత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఒకటిగా దీనిని మంత్రి వర్ణించారు. హార్డ్ కాపీల ముద్రణను ఆపేయడం ద్వారా కూడా ప్రభుత్వ ధనం ఆదా అవడంతో పాటు పర్యావరణహిత ప్రభుత్వ విధానాలకు దోహదపడుతోంది. డిజిటల్ రూపంలో ఇ-పుస్తకాన్ని విజయవంతంగా తీసుకొచ్చిన డీఓపీటీ కార్యదర్శి, మొత్తం సిబ్బందిని మంత్రి ప్రశంసించారు.
ఐఏఎస్ అధికారుల క్యాడర్ నియంత్రణ సంస్థ అయిన డీవోపీటీ.. కేంద్ర రికార్డులు, రాష్ట్రాల క్యాడర్ల నుంచి సేకరించిన సమాచారం ఆదారంగా ఏటా సివిల్ జాబితాను రూపొందిస్తుంది. తాజాగా విడుదలైన 2025 సంచిక 6,877 మంది అధికారుల అధీకృత వివరాలను అందిస్తుంది. వీరిలో 5,577 మంది అధికారులు 25 రాష్ట్రాల క్యాడర్లలో పనిచేస్తున్నారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్. త్రిపాఠి, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్‌బీఎస్ఎన్ఏఏ) డైరెక్టర్, ఛైర్‌పర్సన్, శ్రీరామ్ తరణికంటి, ఐఏఎస్, సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) కార్యదర్శి రచనా షాతో సహా ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఇ-బుక్ సివిల్ జాబితా, 2025 డీవోపీటీ వెబ్‌సైట్ https://dopt.gov.in లో ప్రజలకు అందుబాటులో ఉంది.
***
(Release ID: 2129779)