సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
జాతీయతా స్ఫూర్తిని ప్రేరేపించేలా ఒకే దేశం, ఒకే హృదయ స్పందన
· సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం
Posted On:
16 MAY 2025 8:50PM by PIB Hyderabad
మొక్కవోని దేశభక్తిని ప్రదర్శించిన స్ఫూర్తిని కీర్తిస్తూ, భారత వీరుల గౌరవార్థం.. ‘ఏక్ దేశ్ ఏక్ దడ్కన్’ (ఒకే దేశం, ఒకే హృదయ స్పందన) అనే శక్తిమంతమైన, బాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
దేశ ప్రతిష్ఠను ముక్తకంఠంతో చాటుతూ అందరినీ ఏకం చేయడం కోసం రూపొందించిన ఈ కార్యక్రమ స్ఫూర్తి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో బలంగా ప్రతిధ్వనిస్తోంది. ఐక్యతా స్ఫూర్తిని, దేశభక్తి భావనను, మువ్వన్నెల జెండాపై గౌరవాన్ని పెంపొందించే విధంగా #EkDeshEkDhadkan (#ఒకదేశం ఒకే హృదయస్పందన) అనే నినాదం డిజిటల్ వేదికల్లో విశేష ప్రాచుర్యాన్ని పొందుతోంది.
మన విస్మృత వీరులు, పరాక్రమశీలుర ధైర్యసాహసాలకు ప్రణమిల్లుతూ.. దేశం వారిపట్ల కృతజ్ఞతతో ఉందన్న సమష్టి భావనను ఇది ప్రతిబింబిస్తుంది.
సమన్వయంతో కూడిన జాతీయ భాగస్వామ్యం
గత 48 గంటల్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 43 సంస్థలు కలిసికట్టుగా, ఉత్సాహంగా పాల్గొన్నాయి.
· మనల్ని కలిపి ఉంచే మువ్వన్నెలతోపాటు సాయుధ బలగాలు, వీరులకు వందనం చేస్తూ.. ఆ సంస్థలన్నీ తమ ముఖచిత్రాలను (డీపీ) మూడురంగులతో మార్చి ఈ కార్యక్రమంలో తమ భాగస్వామ్యాన్ని వ్యక్తీకరించాయి.
జెండా రంగుల్లో వెలుగులీనిన ఏఎస్ఐ ఆధ్వర్యంలోని స్మారక కట్టడాలు
ప్రముఖ సాంస్కృతిక కట్టడాలు, వారసత్వ ప్రదేశాలు భారతీయ జెండా రంగుల్లో మురిసిపోయాయి:
· విక్టోరియా మెమోరియల్ (పశ్చిమ బెంగాల్), సాలార్జంగ్ మ్యూజియం (ఆంధ్రప్రదేశ్), ఎన్జీఎంఏ- ఢిల్లీ, ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, లక్నో.
· భారత జాతీయ ప్రాచీన పత్ర భాండాగారం కూడా అద్భుతమైన తన భవనానికి వెలుగులు దిద్దుతూ కార్యక్రమంలో భాగమైంది.
భారత పురావస్తు సర్వే సంస్థ (ఏఎస్ఐ) పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా 60కి పైగా వారసత్వ కట్టడాలు మూడు రంగులతో మెరిసిపోయాయి. వాటిలో కొన్ని:
· ఢిల్లీలోని ఎర్రకోట, ఖిలా రాయ్ పితోరా, సఫ్దర్‌జంగ్ సమాధి, పురానా ఖిలా.
· రాజస్థాన్‌లోని కుంభాల్‌ఘర్, చిత్తోర్ఘర్, ఘంటా కోట. ఉత్తరప్రదేశ్‌లోని గులాబ్ బాదీ.
· ఉదయగిరి గుహలు (ఒడిశా), అశోక స్తంభం (బీహార్), రహత్‌ఘర్ కోట (మధ్యప్రదేశ్), బల్లార్‌పూర్ కోట (మహారాష్ట్ర), తదితర కట్టడాలు.
· అస్సాంలోని రంగ్ ఘర్, కర్ణాటలోని చిత్రదుర్గ కోట, లేహ్ ప్యాలెస్.
ఐక్యతను ప్రతిబింబించేలా, కృతజ్ఞతను చాటేలా.. సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మే 14న కుతుబ్ మినార్‌ను సందర్శించారు. అక్కడ ప్రత్యేక తిరంగా ప్రదర్శన నిర్వహించారు. మన సాయుధ బలగాలను కీర్తిస్తూ, జాతీయతా స్ఫూర్తిని రగిల్చిన మన విస్మృత వీరులు, పరాక్రమశీలుర ధైర్యసాహసాలకు ప్రణమిల్లుతూ మంత్రి నివాళి అర్పించారు.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థలు ప్రత్యేక కథనాలు, చిత్రలేఖనాలు, ప్రత్యేక ప్రదర్శనలు, సంగీతంతో నివాళి, క్విజ్లు, బ్యాడ్జిలు/ రిస్ట్ బ్యాండ్ల పంపిణీ, ప్రజలతో తిరంగా ర్యాలీల వంటి కార్యక్రమాలను చేపడుతున్నాయి. తద్వారా భారతీయులందరికీ గర్వకారణమైన ఈ ఉత్సవాన్ని ప్రజలంతా సమష్టిగా చేసుకునేలా కృషిచేస్తున్నారు.
***
(Release ID: 2129300)