పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ భద్రత దృష్ట్యా సెలెబీ, దాని అనుబంధ సంస్థల సెక్యూరిటీ అనుమతుల రద్దు... బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) నిర్ణయం


* దేశ ప్రయోజనాలు, ప్రజా భద్రతే ముఖ్యం, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు

* ప్రయాణీకులు, సరకు రవాణాకు ఇబ్బందులు ఎదురవకుండా అన్ని ప్రభావిత విమానాశ్రాయాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

* సెలెబీ ఉద్యోగులను, వారి సేవలను కొనసాగించేందుకు చర్యలు: శ్రీ రామ్మోహన్ నాయుడు

Posted On: 15 MAY 2025 9:29PM by PIB Hyderabad

జాతీయ భద్రతకు ప్రాధాన్యమిస్తూ సెలెబీ, దాని అనుబంధ సంస్థలకు ఇచ్చిన సెక్యూరిటీ అనుమతులను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) రద్దు చేసింది.

దేశం, పౌరుల భద్రత కంటే ఏదీ ముఖ్యం కాదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలు, ప్రజా భద్రతే ప్రధానమని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని పేర్కొన్నారు.

అదే సమయంలో ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా, సరకు రవాణా, సేవలు ప్రభావితం కాకుండా అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు పౌర విమానయాన శాఖ కట్టుబడి ఉంది. ప్రయాణీకులు, కార్గో సేవలకు అంతరాయం కలగకుండా అన్ని ప్రభావిత ఎయిర్ పోర్టుల్లోనూ తగిన ఏర్పాట్లు చేశారు.

ఈ పరిస్థితిని మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రవాణాకు ఎటువంటి విఘాతం కలక్కుండా మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు విమానాశ్రయ నిర్వాహకులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తోంది. అలాగే సెలెబీలో పనిచేస్తున్న ఉద్యోగులను కొనసాగించేందుకు, వారి సేవలను ఉపయోగించుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

‘‘కార్యకలాపాలు సజావుగా సాగడానికి, అత్యవసర సమస్యలను సమర్ధంగా పరిష్కరించడానికి ప్రత్యేక బృందాలను పంపిస్తున్నాం. జాతీయ భద్రతకు ప్రాధాన్యమిస్తూ..  దేశవ్యాప్తంగా ప్రయాణ, రవాణా సౌకర్యాలకు ఇబ్బంది కలగకుండా చూస్తాం" అని మంత్రి అన్నారు.

 

***


(Release ID: 2129067)