ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆదంపూర్ వైమానిక స్థావరం వద్ద ధైర్యవంతులైన వైమానిక యోధులు, సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ తెలుగు అనువాదం

Posted On: 13 MAY 2025 5:38PM by PIB Hyderabad

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

ఈ నినాదం ఎంత శక్తిమంతమైనదో ఇప్పుడు ప్రపంచమంతటికీ తెలిసింది. భారత్ మాతా కీ జై! అన్నది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, భరతమాత గౌరవ ప్రతిష్ఠలను నిలబెట్టడం కోసం ప్రాణం పణంగా పెట్టే ప్రతి సైనికుడూ చేసే శపథం. ఈ నినాదం దేశం కోసం జీవించి అర్థవంతమైన సేవలందించాలనుకునే ప్రతీ పౌరుడి గొంతుక. యుద్ధభూమిలోను, కీలకమైన పోరాటంలోనూ ‘భారత్ మాతా కీ జై’ ప్రతిధ్వనిస్తుంది. భారత సైనికులు ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుంది. భారత డ్రోన్లు శత్రు కోటలను కూల్చేసినప్పుడు, క్షిపణులు కచ్చితత్వంతో దాడి చేసినప్పుడు శత్రువుకు వినిపించే ఒకే నినాదం ‘భారత్ మాతా కీ జై’ . భారత్ అజేయ స్ఫూర్తిని శత్రువుకు చూపేలా- అత్యంత చీకటి రాత్రుల్లోనూ ఆకాశాన్ని దేదీప్యం చేసినప్పుడు శత్రువుకు కనిపించింది ఒక్కటే...  అదే ‘భారత్ మాతా కీ జై!  అణ్వస్త్ర బెదిరింపుల ముప్పులన్నింటినీ భారత బలగాలు నిర్మూలించిన వేళ భూమ్యాకాశాలంతటా ప్రతిధ్వనించే సందేశం – ‘భారత్ మాతాకీ జై’.

మిత్రులారా..

లక్షలాది భారతీయ హృదయాలను మీరు గర్వంతో ఉప్పొంగేలా చేశారు. మీరు చరిత్ర సృష్టించారు. మిమ్మల్ని కలుసుకోవడానికి పొద్దున్నే వచ్చేశా. ధైర్యవంతుల పాదాలు భూమిపై పడినప్పుడు, భూమి ఆనందిస్తుంది. ధైర్యవంతులను చూసే అవకాశం వచ్చినప్పుడు జీవితం ధన్యమవుతుంది. ఇకనుంచి దశాబ్దాలపాటు దేశం ఈ వీరత్వాన్ని కీర్తిస్తుంది. దానికి ముఖ్య సూత్రధారులు మీరు, మీ సహచరులే. మీరంతా దేశంలోని ప్రస్తుత, భవిష్యత్ తరాలకు కొత్త ప్రేరణగా నిలుస్తారు. సాహసికులైన యోధుల గడ్డపైనుంచి పరాక్రమవంతులైన వైమానిక, నావికా దళాలు, సైన్యం, సరిహద్దు భద్రతా దళాల (బీఎస్ఎఫ్) సిబ్బందికి నేను సెల్యూట్ చేస్తున్నా. మీ వీరోచిత పోరాటం వల్ల ఆపరేషన్ సిందూర్ ప్రభావం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ఈ ఆపరేషన్ యావత్తూ ప్రతి భారతీయుడూ మీ వెంటే ఉన్నారు. మీకోసమే ప్రార్ధించారు. నేడు దేశంలోని ప్రతి పౌరుడు తన సైనికులకు, వారి కుటుంబాల పట్ల కృతజ్ఞతతో ఉన్నారు. వారికి రుణపడి ఉన్నారు.

మిత్రులారా..

ఆపరేషన్ సింధూర్ సాధారణ సైనిక కార్యక్రమం కాదు. భారత విధానం, లక్ష్యం, నిర్ణయాత్మక సామర్థ్యాల సమ్మేళనం. బుద్ధుడు, గురు గోవింద్ సింగ్ఇ ద్దరికీ భారత్ నిలయం. सवा लाख सेएक लड़ाऊं चि ड़ि यन तेमबाज़ तड़ुाऊं तबैगु गोबि दं सि हं नाम कहाऊं ।” (లక్షన్నర మందితో పోరాడేలా ఒక యోధుడ్ని తీర్చిదిద్దుతాను. పిచ్చుకలు అస్త్రాలతో పోరాడేలా చేస్తాను. అప్పుడే నన్ను గురు గోవింద్ సింగ్ అని పిలవండి)’’ అని గురుగోవింద్ సింగ్ అన్నారు. ధర్మసంస్థాపనకు, చెడును నిర్మూలించడానికి ఆయుధాలు చేపట్టడం భారత సంప్రదాయం. అందుకే మా సోదరీమణులు, అమ్మాయిల నుదుటి సింధూరాన్ని తుడిచివేసిన ఉగ్రవాదులను భారత బలగాలు వారి స్థావరాల్లోనే మట్టుబెట్టాయి. పరాక్రమశీలురైన భారత సాయుధ బలగాలను సవాలు చేస్తున్న విషయాన్ని మరిచి.. ముష్కరులు పిరికితనంతో రహస్యంగా దాడికి దిగారు. మీరు వారితో నేరుగా తలపడ్డారు. ప్రధాన ఉగ్రవాద కేంద్రాలపై దాడి చేసి నేలమట్టం చేశారు. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. 100 మందికి పైగా కిరాతక ఉగ్రవాదులను తుదముట్టించారు. భారత్‌ను రెచ్చగొడితే ఫలితంగా పూర్తి విధ్వంసమేనన్న విషయం ఉగ్రవాద సూత్రధారులకు ఇప్పుడు అర్ధమై ఉంటుంది! దేశంలో అమాయకుల రక్తం చిందించే ఎలాంటి ప్రయత్నం చేసినా, అది వారి వినాశనానికే దారి తీస్తుంది. ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పాకిస్థాన్ సైన్యాన్ని భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళం నిర్ణయాత్మకంగా ఓడించాయి. ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గధామమేదీ లేదని భారత సాయుధ దళాలు పాకిస్థాన్ కు స్పష్టమైన సందేశాన్ని పంపాయి. వారి సొంత భూభాగంలోనే భారత్ వారిపై దాడి చేస్తుంది. తప్పించుకునే అవకాశం కూడా ఏమాత్రం ఇవ్వదు. భారత డ్రోన్లు, క్షిపణుల్నిచూసి పాకిస్థాన్ వణికిపోయింది. వాటి గురించి ఆలోచిస్తేనే పాకిస్థాన్ కు రోజుల తరబడి నిద్ర పట్టదు. कौशल दि खलाया चाल मउड़ गया भयानक भाल म। नि र्भी क गया वह ढाल मसरपट दौड़ा करवाल म। (ఒక్కసారిగా జూలు విదిల్చి.. భీకరంగా సకిలిస్తూ.. నిర్భయంగా శత్రు స్థావరాల వైపు దూసుకుపోయింది) అంటూ మహారాణా ప్రతాప్ గుర్రం చేతక్ గురించి రాసిన పంక్తులు గుర్తుకొస్తున్నాయి. ఈ మాటలు ఇప్పుడు భారత అధునాతన ఆయుధ సంపత్తికి సరిగ్గా సరిపోతాయి.

ధైర్యవంతులైన నా మిత్రులారా...

“ఆపరేషన్ సిందూర్దే తో మీరు దేశ ఆత్మ విశ్వాసాన్ని పెంచారు. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చారు. భారత సరిహద్దులను కాపాడి దేశ ఆత్మ గౌరవాన్ని పెంచారు.

మిత్రులారా..

మీ కృషి అపూర్వం, అనూహ్యం, అద్భుతం, అసాధారణం. ఎంతో కచ్చితత్వంతో భారత వైమానిక దళం పాకిస్థాన్ లోపల ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యం చేసుకుంది. కేవలం 20-25 నిమిషాల్లోనే భారత దళాలు సరిహద్దులు దాటి పూర్తి కచ్చితత్వంతో దాడులు చేశాయి. ఆధునిక, సాంకేతికంగా సన్నద్ధంగా ఉన్న, అత్యంత వృత్తి నైపుణ్యం కలిగిన దళం మాత్రమే అటువంటి కార్యకలాపాలను నిర్వహించగలదు. మీ వేగం, కచ్చితత్వం శత్రువును పూర్తిగా నివ్వెరపరిచాయి. తమ బలమైన కోటలు రాళ్లూరప్పలుగా ఎప్పుడు మారాయో కూడా ప్రత్యర్థులకు తెలియలేదు.

మిత్రులారా..

పాకిస్థాన్ లోపలి భాగంలో ఉన్న ఉగ్రవాద ప్రధాన కేంద్రాలపై దాడి చేసి, ముఖ్యులైన ఉగ్రవాద కార్యకర్తల నిర్మూలనే మన లక్ష్యం. పాకిస్థాన్ పౌర విమానాలను రక్షణగా ఉపయోగించుకుని తన కార్యకలాపాలు కొనసాగించే ప్రయత్నం చేసినప్పటీకీ మీరు అత్యంత జాగ్రత్తగా, కచ్చితత్వంతో స్పందించారు. అప్రమత్తతతో, బాధ్యతతో మెలుగుతూ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. మీరంతా మీ లక్ష్యాలను పూర్తి కచ్చితత్వంతో, దృఢ సంకల్పంతో నెరవేర్చారు. పాకిస్థాన్ లోని ఉగ్రవాద, వైమానిక స్థావరాలే కాదు.. వారి దురుద్దేశాలు, తెంపరితనాన్నీ కూడా ఈ ఆపరేషన్ అణచివేసింది.

మిత్రులారా..

ఆపరేషన్ సిందూర్ తో తీవ్రమైన నిరాశలో కూరుకుపోయిన పాకిస్థాన్ భారత వైమానిక స్థావరాలే లక్ష్యంగా పలుమార్లు దాడులకు విఫల యత్నం చేసింది. అన్ని దాడులను మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ డ్రోన్లు, యూఏవీలు, విమానాలు, క్షిపణులు అన్నీ శక్తిమంతమైన భారత గగనతల రక్షణ వ్యవస్థ ముందు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. భారత సన్నద్ధత, సాంకేతిక బలం శత్రు దాడులను పూర్తిగా అణిచివేశాయి. దేశ వైమానిక స్థావరాల రక్షణ, దేశాన్ని రక్షించడంలో మీ అద్భుత పనితీరు, అచంచల అంకితభావాన్నినేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.

మిత్రులారా..

 

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ గీసిన లక్ష్మణ రేఖ సుస్పష్టంగా ఉంది.  మరోమారు భారత్‌పై ఉగ్ర దాడి జరిగితే, దేశం నిర్ణయాత్మకంగా, పూర్తి బలంతో గట్టిగా ప్రతిస్పందిస్తుందని ప్రకటించారు. గతంలో సర్జికల్ దాడులు, వైమానిక దాడుల సమయంలో భారత్ దృఢమైన చర్యలు తీసుకుంది. దాడులను ఎదుర్కోవడంలో ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు దేశానికి సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది. నిన్న రాత్రి నేను మూడు కేకల విషయాలు చెప్పా. మొదటిది, భారత్‌పై ఉగ్రవాదానికి పాల్పడితే తన సొంత మార్గంలో, స్వీయ నిబంధనలతో, తగిన సమయంలో బుద్ధి చెప్పేలా గట్టి సమాధానం ఇస్తుంది. భారత్ స్పందిస్తుంది. ఉగ్రవాద మూలాలు బయటపడే ప్రతిచోట కఠిన చర్యలు ఉంటాయి. రెండోది, అణుబాంబు బెదిరింపుల్ని భారత్ ఏమాత్రం సహించదు. మూడోది ఉగ్రవాద తండాలను, వాటిని ప్రోత్సహించే ప్రభుత్వాన్ని భారత్ విడివిడిగా చూడదు. ప్రపంచం ఇప్పుడు ఈ సరికొత్త, దృఢ నిశ్చయంతో ఉన్న భారత్‌ను చూస్తోంది.

మిత్రులారా..

ఆపరేషన్ సిందూర్ భారత సాయుధ దళాల బలం, సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. సైన్యం, నావికాదళం, వైమానిక దళం అసాధారణ సమన్వయంతో పనిచేశాయని నేను విస్పష్టంగా చెప్పగలను. వారి సమష్టితత్వం అద్భుతం.  నావికా దళం సముద్రాలపై పూర్తి ఆధిపత్యం కనబరిచింది. సైన్యం సరిహద్దులను బలోపేతం చేసింది. వైమానిక దళం తనను తాను కాపాడుకుంటూ దాడులు నిర్వహించింది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), ఇతర భద్రతా దళాలు అత్యుత్తమ పనితీరు కనబరిచాయి. భారత సమగ్ర గగనతల, సరిహద్దు రక్షణ వ్యవస్థలు బ్రహ్మానందంగా తమ విధులు నిర్వర్తించాయి.  ఈ స్థాయి సమష్టిత్వం నేడు భారత సైనిక పరాక్రమానికి ప్రతీకగా నిలిచింది.

మిత్రులారా..

ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సైన్యం, అధునాతన సైనిక సాంకేతికతల మధ్య సమన్వయము అద్భుతం. అనేక యుద్ధాల్లో సత్తా చాటిన భారత సంప్రదాయ గగనతల రక్షణ వ్యవస్థలు కావచ్చు... స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఆకాశ్ కావచ్చు.. ఎస్-400 వంటి ఆధునిక, శక్తిమంతమైన వ్యవస్థలు కావచ్చు...తమ అసామాన్య బలాన్ని ప్రదర్శించాయి. భారత దృఢమైన రక్షణ కవచం మన బలాన్ని చాటిచెప్పింది. పాకిస్తాన్ పదే పదే దాడులకు ప్రయత్నాలు చేసినప్పటికీ, భారత వైమానిక స్థావరాలు, కీలకమైన రక్షణ మౌలిక సదుపాయాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. ఈ గొప్పతనం మీ అందరిదీ.. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా.. సరిహద్దుల్లో మోహరించి ఉన్న ప్రతి సైనికుడు, ఆపరేషన్‌లో పాల్గొన్న ప్రతి వ్యక్తికి  ఈ గౌరవం దక్కుతుంది.

మిత్రులారా..

 

పాకిస్థాన్ తో పోల్చడానికి కూడా వీలులేనంత గొప్ప అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం భారత్ వద్ద ఉంది. గత దశాబ్ద కాలంలో  భారత వైమానిక దళం, ఇతర సైనిక విభాగాలు ప్రపంచంలోని అత్యంత అధునాతన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలను సమకూర్చుకున్నాయి. కొత్త సాంకేతికతతో సవాళ్లు కూడా ఎక్కువగానే వస్తాయని మనందరికీ తెలుసు. ఈ సంక్లిష్టమైన, అధునాతన వ్యవస్థలను సమర్ధవంతంగా నిర్వహించడానికి అపారమైన నైపుణ్యంతో పాటు కచ్చితత్వం కూడా అవసరం. వ్యూహాత్మక నైపుణ్యంతో సాంకేతికతను సజావుగా అనుసంధానించి మీరు అది చేసి చూపించారు. ఈ గేమ్ లో నిష్ణాతులమని మీరు ప్రపంచానికి నిరూపించారు. ఆధునిక యుద్ధంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత సాయుధ దళాలను ప్రశంసిస్తూ... భారత వైమానిక దళం ఇప్పుడు ఆయుధాలతోనే కాకుండా డేటా, డ్రోన్‌లతో కూడా ప్రత్యర్థుల భరతం పట్టే కళలో ప్రావీణ్యం సంపాదించింది.

మిత్రులారా..

పాకిస్థాన్ అభ్యర్ధించిన మీదట మాత్రమే  భారత్ తన సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేసింది.  ఒకవేళ పాకిస్థాన్ మరోసారి ఉగ్రవాద కార్యకలాపాలు.. రెచ్చగొట్టే సైనిక చర్యలకు పాల్పడితే, భారత్ పూర్తి స్థాయిలో బదులిస్తుంది. ఆ సమాధానం మనదైన పద్ధతిలో, మన ప్రత్యేకతతో ఉంటుంది. ఈ నిర్ణయాత్మక వైఖరికి దేశ సాయుధ దళాల ధైర్యం, పరాక్రమం, అప్రమత్తతే కారణం. మీరు అదే అచంచలమైన సంకల్పం, ఉత్సాహం, సన్నద్ధతను కొనసాగించాలి. అన్ని సమయాల్లో అప్రమత్తంగా, సంసిద్ధంగా ఉండాలి. ఇది నవ భారతం అని శత్రువుకు గుర్తు చేస్తూనే ఉండాలి. ఈ భారతదేశం శాంతిని కోరుకుంటుంది. కానీ, మానవాళి మీద దాడి చేస్తే యుద్ధరంగంలో శత్రువును ఎలా నాశనం చేయాలో కూడా ఈ భారతదేశానికి బాగా తెలుసు. ఈ సంకల్పంతో, మరోసారి చెప్పుకుందాం...

భారత్ మాతా కీ జై...

భారత్ మాతా కీ జై...

భారత్ మాతా కీ జై...

 

వందేమాతరం... వందేమాతరం..

వందేమాతరం... వందేమాతరం..

వందేమాతరం... వందేమాతరం..

వందేమాతరం... వందేమాతరం..

వందేమాతరం...

కృతజ్ఞతలు..

గమనిక: ఇది ప్రధాని ప్రసంగానికి దాదాపు అనువాదం. వాస్తవానికి ప్రధాని హిందీలో ప్రసంగించారు.

 

****


(Release ID: 2128935)