సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ సిందూర్: భారత వ్యూహాత్మక స్పష్టత.. తిరుగులేని శక్తి
Posted On:
14 MAY 2025 8:53PM by PIB Hyderabad
పరిచయం:
ఏప్రిల్ 22న, పహల్గాంలో ఉగ్రవాదం చెలరేగింది. పాకిస్తాన్ మద్దతుతో దుండగులు ఒక గ్రామంలోకి చొరబడి, మన పౌరుల మతాన్ని అడిగి మరీ చంపారు, ఫలితంగా 26 మంది మరణించారు. మత హింసను ప్రేరేపించడానికి జరిగిన ఈ స్పష్టమైన ప్రయత్నం, సరిహద్దు దాడుల నుంచి భారత్‌లో అంతర్గత విభేదాలను సృష్టించే వరకు వచ్చిన మార్పును సూచిస్తోంది. ప్రతిస్పందనగా, ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. కాని పాకిస్తాన్ మరింత తీవ్రంగా ప్రతిఘటించింది. తరువాతి వారంలో, మతపరమైన ప్రదేశాలు లక్ష్యంగా డ్రోన్లు, షెల్లింగ్‌లను ప్రయోగించింది. జమ్మూలోని శంభు ఆలయం, పూంచ్‌లోని గురుద్వారా, క్రైస్తవ కాన్వెంట్‌లపై దాడి చేసింది. ఇవి యాదృచ్ఛిక దాడులు కావు. భారత ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రణాళికలో ఇవి ప్రధాన భాగం.
ఆపరేషన్ సిందూర్ ఉద్దేశం:
· ఉగ్రవాదానికి పాల్పడిన వారిని, కుట్రదారులను శిక్షించడం.
· సరిహద్దు వెంబడి ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను నాశనం చేయడం
నిఘా, లక్ష్యాల ఎంపిక:
· ఉగ్రవాద స్థావరాల ఉనికిని గురించి కచ్చితమైన సమాచారం సేకరించడం.
· అనేక ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా శిబిరాలను గుర్తించారు.
కార్యాచరణలో విలువలు, నియంత్రణ:
· సామాన్యులకు జరిగే నష్టాన్ని నివారించడానికి స్వీయ నియంత్రణతో దాడుల నిర్వహణ
· పౌరులకు ఎలాంటి హాని లేకుండా, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేయడం
మే 7న జరిగిన మొదటి విలేకరుల సమావేశంలో, అత్యంత కచ్చితత్వంతో, జాగ్రత్తగా, పరిస్థితిని మరింత తీవ్రతరం చేయకుండా భారత్ తన ప్రతిస్పందనను స్పష్టం చేసింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని ప్రత్యేకంగా ప్రస్తావించింది. భారత సైనిక లక్ష్యాలపై ఏదైనా దాడి జరిగితే తగిన విధంగా జవాబిస్తామని కూడా పునరుద్ఘాటించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, మే 8, 9, 10 తేదీల్లో నిర్వహించిన పలు విలేకరుల సమావేశాల్లో, భారత కార్యాచరణ ప్రణాళికను, పాకిస్తాన్ ఉద్దేశాలను పూర్తి స్థాయిలో వెల్లడించారు.
భారత ప్రతీకార ప్రతిస్పందన: లాహోర్‌లోని రాడార్ స్థావరాలు లక్ష్యంగా భారత్ ప్రతీకార దాడులు నిర్వహించింది, గుర్జన్‌వాలా సమీపంలోని రాడార్ స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
కాల్పుల విరమణ: ఈ భారీ నష్టంతో అవాక్కయిన పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) నేరుగా భారత డీజీఎంవోను ఫోన్ ద్వారా సంప్రదించి కాల్పుల విరమణకు ప్రతిపాదించిన క్రమంలో, మే 10న భారత ప్రామాణిక సమయం ప్రకారం సాయంత్రం ఐదు గంటల నుంచి భూమి, వాయు, నావికా దళాల ద్వారా ఎలాంటి కాల్పులు, సైనిక చర్యలు ఉండకూడదని ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది.
కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ స్పందన: కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా, పాకిస్తాన్ యూఏవీలు, చిన్న డ్రోన్ల ద్వారా భారత పౌరుల నివాసాలు, సైనిక స్థావరాలపై దాడికి యత్నించింది. అయితే భారత్ ఈ డ్రోన్లను విజయవంతంగా నిర్వీర్యం చేసింది.
పాకిస్తాన్ చొరబాటు యత్నాలకు భారత సాయుధ దళాలు తగిన సమాధానం ఇచ్చాయి. అంతేగాకుండా, కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరిగితే తక్షణం తగిన చర్యలు తీసుకునే అధికారం ఫీల్డ్ కమాండర్లకు ఇచ్చారు.
అంతేగాకుండా, డిజిటల్ యుద్ధం సంప్రదాయిక యుద్ధాన్ని మించి సాగుతోంది. సైనిక కార్యకలాపాలతో పాటు, ఆన్లైన్లో తీవ్రమైన సమాచార యుద్ధం కొనసాగుతోంది. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తరువాత, భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ అసత్య ప్రచారం దూకుడుగా కొనసాగించింది – అబద్ధాలు, మోసపూరిత సమాచారంతో తప్పుడు వార్తలను ప్రచారం చేసింది. సత్యాన్ని వక్రీకరించడం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా యుద్ధంలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించడం వారి లక్ష్యం. అయితే, భారత్ ముందస్తుగా స్పందించి వాస్తవాలను, పారదర్శకతను, బలమైన డిజిటల్ అప్రమత్తతను ప్రదర్శిస్తూ తప్పుడు సమాచారాన్ని సమర్థంగా అడ్డుకుంది. భావోద్వేగంగా స్పందించే బదులు, ఈ సమాచార యుద్ధానికి భారత్ నేర్పుగా, నిర్ణయాత్మక పద్ధతిలో సమాధానం ఇచ్చింది:
· కార్యాచరణ విజయాన్ని హైలైట్ చేయడం: ఆపరేషన్ సిందూర్ ప్రభావాన్ని సంచలనంగా కంటే వ్యూహాత్మక ఫలితాలపై దృష్టి సారిస్తూ, కచ్చితత్వంతో తెలియజేశారు.
- అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు: పాకిస్తాన్ ఆధారిత ఖాతాలు ప్రచారం చేసిన మోసపూరిత వ్యూహాలను భారత అధికారులు బహిర్గతం చేశారు, వీటిలో చాలా వరకు ఇప్పుడు అంతర్జాతీయ సోషల్ మీడియా వేదికల పరిశీలనలో ఉన్నాయి.
- మీడియా అవగాహనను ప్రోత్సహించడం: నకిలీ వార్తలను ఎలా గుర్తించాలో పౌరులకు అవగాహన కల్పించే ప్రచారాలు మరింత సమర్థమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడ్డాయి.
సైనిక, సైనికేతర మార్గాల ద్వారా శిక్షను పొందిన పాకిస్తాన్
ఆపరేషన్ సిందూర్ భారత సైనిక, వ్యూహాత్మక శక్తిని ఘనంగా ప్రదర్శించింది. ఈ ఆపరేషన్ సైనిక, సైనికేతర మార్గాల సమన్వయంతో నిర్వహించారు. ఈ బహుళ ధశల ఆపరేషన్ ఉగ్రవాదుల దాడులను సమర్థంగా తిప్పికొట్టింది, పాకిస్తాన్ దురాక్రమణను నిరోధించింది, ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించని భారత విధానాన్ని ప్రపంచానికి స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్ అంతర్జాతీయ మద్దతును పొందుతూనే వ్యూహాత్మక సంయమనాన్నీ కొనసాగించింది.
చేపట్టిన సైనికేతర చర్యలు:
- హింసకు తావులేకుండా లక్ష్య సాధన కోసం భారత్ తీసుకున్న చర్యలు వ్యూహాత్మక వాతావరణాన్ని కల్పించడంలో, ప్రజల, అంతర్జాతీయ సమాజ మద్దతును సాధించడంలో కీలక పాత్ర పోషించాయి. వ్యూహాత్మక విధాన రూపకల్పన, సమాచార ఆధిపత్యం, మానసికపరమైన కార్యకలాపాల ద్వారా, భారత్ దేశీయ సంసిద్ధతను, ప్రపంచం మద్దతును బలోపేతం చేసుకుంటూ దౌత్యపరంగా, ఆర్థికంగా పాకిస్తాన్‌ను ఒంటరిని చేసింది.
- ఆపరేషన్ సిందూర్ కింద భారత్ తీసుకున్న నిర్ణయాత్మక చర్య సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి తన మద్దతును పూర్తిగా ఉపసంహరించుకునే వరకు 1960 నాటి సింధూ జలాల ఒప్పందం తక్షణమే నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఇది పాకిస్తాన్‌కు తీవ్రమైన దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తుంది, ఎందుకంటే దాని 16 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమిలో 80 శాతం, మొత్తం నీటి వినియోగంలో 93 శాతం సింధూ నదీ జలాలపైనే ఆ దేశం ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ ఒప్పందం ఆ దేశంలో 237 మిలియన్ల మందికి ప్రయోజనం కలిగిస్తూ, గోధుమ, వరి, పత్తి వంటి పంటల ద్వారా పాకిస్తాన్ జీడీపీలో నాలుగో వంతును సమకూర్చుతోంది.
- మంగ్లా, టార్బెలా ఆనకట్టల నీటి సామర్థ్యంలో కేవలం 10 శాతం (14.4 ఎమ్ఎఎఫ్) నీటి నిల్వలు మాత్రమే ప్రస్తుతం కలిగి ఉండటంతో, నీటి రాక ఆగిపోతే వ్యవసాయంలో తీవ్ర నష్టాలు, ఆహార కొరత, ప్రధాన నగరాల్లో నీటికి ఇబ్బందులు, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. వస్త్రాలు, ఎరువులు వంటి పరిశ్రమలు పూర్తిగా స్తంభించిపోవచ్చు. ఈ ఘటనలు ఇప్పటికే బలహీనంగా ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి, ఆ దేశాన్ని ఆర్థిక, విదేశీ మారక ద్రవ్య సంక్షోభాల్లో కూరుకుపోయేలా చేస్తాయి.
- సింధూ జలాల ఒప్పందం కారణంగా చాలా కాలంగా జమ్మూ కశ్మీర్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతో ఆటంకం కలుగుతోంది, అనేక ప్రాజెక్టులను ఇది నది ప్రవాహ నమూనాలకే పరిమితం చేసింది. ఈ ఒప్పందం నిలిపివేతతో జీలం, చీనాబ్ వంటి పశ్చిమ ప్రాంత నదులపై భారత్ పూర్తి నియంత్రణను సాధించింది, దీని వలన జమ్మూ కశ్మీర్, లదాఖ్, పంజాబ్, హర్యానాల్లో కొత్త జలాశయాల నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది. ఇది నీటిపారుదల, జలవిద్యుత్ సామర్థ్యాన్ని పెంచింది, దౌత్య సాధనాన్ని అభివృద్ధి ఆస్తిగా మార్చింది. ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా, "రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు." అనే ఒక నిర్ణయాత్మక సందేశాన్ని భారత్ అందించింది.
- అటారీ-వాఘా సరిహద్దును భారత్ మూసివేసింది. అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను సైతం తక్షణం మూసివేసింది. చెల్లుబాటు అయ్యే ఆధారాలతో సరిహద్దు దాటి వచ్చిన వారిని మే 1వ తేదీలోగా ఆ మార్గం ద్వారా తిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని భారత్ పూర్తిగా నిలిపివేసింది. ఉల్లిపాయల వంటి కీలక సరుకుల ఎగుమతులను కూడా నిలిపివేసింది, సిమెంట్, వస్త్రాల దిగుమతులను నిషేధించింది. ఈ చర్యలతో ఇరు దేశాల మధ్య ప్రాథమిక భూ-ఆధారిత వాణిజ్య మార్గం పూర్తిగా మూసుకుపోయింది, దీనివల్ల ఆర్థిక సంబంధాల్లో పెద్ద అంతరాయం ఏర్పడింది.
- ఇప్పటికే తీవ్రమైన ద్రవ్యోల్బణం, రుణ సంక్షోభాలతో పోరాడుతున్న పాకిస్తాన్‌పై ఈ ఒప్పందం నిలిపివేత తక్షణ ఆర్థిక ఒత్తిడిని కలిగించింది. ప్రత్యక్ష సైనిక పోరాటానికి దిగకుండా ఈ ఆర్థిక జీవనాధారాలను అడ్డుకోవడం ద్వారా, భారత్ ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించని తన వైఖరిని మరింత బలంగా చాటిచెప్పింది.
- ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తన దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తూ, పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన వెంటనే తమ దేశంలో నివసిస్తున్న పాకిస్తానీయులందరి వీసాలను రద్దు చేసి, వారిని వెంటనే దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం (ఎస్‌వీఈఎస్) వీసాల ద్వారా పాకిస్తానీ జాతీయులను భారత్‌లోకి అనుమతించకూడదని నిర్ణయించింది.
- పాకిస్తానీ కళాకారులపై పూర్తి నిషేధం విధించడంతో పాటు, ఆ దేశానికి సంబంధించిన అన్ని ప్రదర్శనలు, స్క్రీనింగ్స్, సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక భాగస్వామ్యాలను పూర్తిగా రద్దు చేసింది. ఈ ఆంక్షలను స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకూ విస్తరించింది, భారతదేశంలో పాకిస్తాన్ సాంస్కృతిక ప్రభావాన్ని సమర్థంగా తుడిచివేసింది.
- పాకిస్తాన్ ఉగ్రవాదుల కోసం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ వేదికపై భారత్ బహిర్గతం చేసింది, దౌత్యపరంగా ఆ దేశాన్ని ఒంటరిని చేసింది.
- ఈ చర్యలన్నింటి ఫలితంగా పాకిస్తాన్‌కు ఆర్థికంగా, దౌత్యపరంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ చర్యలతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ మరింత ఒంటరైంది, ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించని వైఖరి పట్ల భారత నిబద్ధతను ఈ చర్యలు మరింత శక్తిమంతం చేశాయి.
- న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లోని రక్షణ/సైనిక, నావికా, వైమానిక సలహాదారులను అవాంఛనీయ సిబ్బందిగా ప్రకటించారు. మరింత మంది సిబ్బందిని తగ్గించడంతో హైకమిషన్స్ మొత్తం సిబ్బంది ప్రస్తుతం 55 నుంచి 30కి చేరింది.
ప్రపంచ స్థాయిలో నాయకత్వాన్ని ప్రదర్శించడం:
ఈ పరిస్థితి నేపథ్యంలో, జాతీయ సంక్షోభం తలెత్తిన సందర్భంలో కేవలం పరిష్కారం మాత్రమే కాదు, అద్భుతమైన నాయకత్వం కూడా అవసరం. ఆపరేషన్ సిందూర్‌లో నిర్ణయాత్మక పాత్ర పోషించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సవాలును సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇటీవలి చరిత్రలో భారత్ చేపట్టిన అత్యంత సాహసోపేతమైన సైనిక ప్రతిస్పందనల్లో ఇది ప్రధానమైనది. ముందుగా నిర్ణయించిన దౌత్య పర్యటనలో భాగంగా విదేశాల్లో ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి తక్షణం రంగంలోకి దిగారు, వ్యూహాత్మక సంయమనాన్ని దృఢమైన చర్యలతో సమతుల్యం చేస్తూ గట్టి ప్రతిస్పందనను రూపొందించారు. త్వరగా స్పందించాలనే అపారమైన ఒత్తిడిలో కూడా ఆయన అద్భుతమైన సంయమనాన్ని ప్రదర్శించారు, సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం నుంచి సైనిక చర్య వరకు ప్రతి అడుగు అత్యంత ప్రణాళికాబద్ధంగా, కచ్చితంగా సమయానికి జరిగేలా అనుక్షణం పర్యవేక్షించారు.
- వ్యూహాత్మక ప్రణాళిక, లక్ష్యాత్మక ప్రతిస్పందన ఈ ఆపరేషన్ విధానాన్ని స్పష్టం చేశాయి. భావోద్వేగపూరితమైన, ప్రతిచర్యాత్మక దాడికి తొందరపడే బదులుగా, పాకిస్తాన్.. దాని ఉగ్రవాద ప్రతినిధులు ప్రతీకారానికి సిద్ధపడకుండా నిరోధించేలా ప్రధానమంత్రి అనూహ్య వ్యూహాలను రూపొందించారు. ఈ దాడులు పూర్తిగా ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని అత్యంత కచ్చితత్వంతో జరిగాయి, లక్ష్యం పట్ల ఇంతటి స్పష్టతను అన్ని పార్టీల నేతలూ ప్రశంసించారు, ప్రతిపక్ష నాయకులు పి. చిదంబరం కూడా, పౌరుల నివాస ప్రాంతాలకు ఎలాంటి హాని లేకుండా ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం పట్ల ప్రధానమంత్రిని ప్రశంసించారు.
- పాకిస్తాన్‌తో పరిణామాలు కొనసాగుతున్నంత కాలం, ఉగ్రవాదంపై దృష్టి సారించిన లక్ష్యంలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృఢమైన, స్పష్టమైన ప్రతిస్పందనను తెలపడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ప్రపంచ ముప్పుగా పరిగణించబడుతున్న ఉగ్రవాదంపై ఆయన సుస్థిర ప్రయత్నాలు భారత్ విస్తృత అంతర్జాతీయ మద్దతును పొందడంలో ఎంతగానో సహాయపడ్డాయి. ఉగ్రవాదాన్ని, దానిని ప్రోత్సహిస్తున్న వారిని ఒకే విధంగా చూస్తామనే వైఖరిని ఆయన నాయకత్వంలో భారత్ విస్పష్టం చేసింది.
- పాకిస్తాన్ పదే పదే రెచ్చగొట్టినప్పటికీ, ఆ దేశ పౌరులకు ఎటువంటి హాని జరగకుండా భారత్ నిర్ణయాత్మకంగా, శక్తిమంతమైన ప్రతిస్పందన తెలియజేసింది. భారత సైనిక చర్యలు ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదానికి సహాయపడే నిర్దిష్ట సైనిక శిబిరాలకే పరిమితం అయ్యాయి. జాగ్రత్తలతో లక్ష్యాలను ఎంపిక చేసుకోవడం ద్వారా భారత్ తన సామర్థ్యాన్ని, బాధ్యతాయుతమైన యుద్ధం పట్ల తన నిబద్ధతను ప్రదర్శించింది.
- సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ, సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మక చర్యగా నిలుస్తుంది. ఇది పాకిస్తాన్ ప్రయోజనాలకు హాని కలిగించడంతో పాటుగా భారత్‌కు ఎంతగానో లాభం చేకూర్చింది. భవిష్యత్తులో జరిగే ఏదైనా ఉగ్ర దాడిని యుద్ధ చర్యగానే పరిగణిస్తామనే కొత్త జాతీయ భద్రతా సిద్ధాంతాన్నీ ఆయన స్పష్టం చేశారు. ఇది ఉగ్రవాదులకు, వారిని పెంచిపోషిస్తున్న దేశాల మధ్య ఉన్న ఎలాంటి వ్యత్యాసం ఉండదనే వైఖరిని చాటింది.
మే 12వ తేదీన జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ‘ఆపరేషన్ సిందూర్’ కేవలం ఒక పేరు మాత్రమే కాదనీ, అది దేశంలోని లక్షలాది మంది ప్రజల భావాల ప్రతిబింబం, న్యాయం కోసం చేసిన సమష్టి ప్రతిజ్ఞ అని స్పష్టం చేశారు. “భారతదేశం, దేశ ప్రజల భద్రత కోసం బలమైన చర్యలు తీసుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం. యుద్ధభూమిలో, మేం ఎల్లప్పుడూ పాకిస్తాన్‌ను మట్టికరిపిస్తూనే ఉన్నాం, ఈసారి ఆపరేషన్ సిందూర్ ద్వారా యుద్ధంలో కొత్త కోణాన్ని వారికి పరిచయం చేశాం” అని ఆయన వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్, సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించి ప్రధానమంత్రి ఈ క్రింది అంశాలను వివరించారు.
- మొదటిది, భారత్‌పై ఉగ్రవాద దాడి జరిగితే, గట్టిగా సమాధానం ఇస్తాం.
- రెండోది, భారత్ ఎటువంటి అణు బెదిరింపులను సహించదు. అణు బెదిరింపుల ముసుగులో అభివృద్ధి చెందుతున్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ కచ్చితత్వంతో, నిర్ణయాత్మకంగా దాడి చేస్తుంది.
- మూడోది, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలను, ఉగ్రవాద సూత్రధారులను మేం ఒకే విధంగా చూస్తాం. భారతదేశాన్ని, దేశ పౌరులను ఎటువంటి ముప్పు నుంచైనా రక్షించడానికి మేం నిర్ణయాత్మక చర్యలు కొనసాగిస్తూనే ఉంటాం.
- భారత్ వైఖరి విస్పష్టంగా ఉంది... ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవు... ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి సాగలేవు.... నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు.
- పాకిస్తాన్‌తో చర్చలు జరిగితే, అవి కేవలం ఉగ్రవాదం గురించి మాత్రమే జరుగుతాయి; పాకిస్తాన్‌తో చర్చలు జరిగితే, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) గురించి మాత్రమే చర్చ జరుగుతుంది.
ఆపరేషన్ సిందూర్ సాధించినవి ఏమిటి
ఆపరేషన్ సిందూర్ ఫలితాలు దాని ప్రభావం గురించి చాలా చెబుతున్నాయి:
1. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం: లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాలు లక్ష్యంగా, పాకిస్తాన్‌లోని, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ (పీఓజేకే) లోని తొమ్మిది ప్రధాన ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను భారత్ విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ చర్యలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
2. సరిహద్దు ఆవల కచ్చితత్వంతో దాడులు: అమెరికా డ్రోన్‌లకు కూడా అనుమతి లేని ప్రాంతాలుగా పరిగణించే పంజాబ్ ప్రావిన్స్, బహవల్పూర్‌లతో సహా పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోకి దూసుకెళ్లి దాడి చేయడం ద్వారా భారత్ ఒప్పంద నియమాలను పునర్నిర్వచించింది. ఉగ్రవాదం అక్కడి నుంచి ఉద్భవిస్తూ ఉంటే ఎల్‌ఓసినీ.. పాకిస్తాన్ భూభాగాన్ని గౌరవించేది లేదని భారత్ స్పష్టం చేసింది.
3. కొత్త వ్యూహాత్మక లక్ష్మణ రేఖ: ఆపరేషన్ సిందూర్ కొత్త లక్ష్మణ రేఖను గీసింది - ఉగ్రవాదం ఆ దేశ విధానం అయితే, దానికి స్పష్టంగా కనిపించే, శక్తిమంతమైన ప్రతిస్పందన లభిస్తుంది. ఇది నిరోధం నుంచి ప్రత్యక్ష చర్యకు మార్పును సూచిస్తుంది.
4. ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్న వారికి సమాన శిక్ష: ఇరువురినీ ఒకేసారి దెబ్బతీసి, ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపబోమని భారత్ స్పష్టం చేసింది. దీంతో ఇన్నాళ్లూ ఉగ్రవాదం గురించి తెలియనట్లు నటించిన పాకిస్తానీ నేతలకూ శిక్ష తప్పదనే హెచ్చరిక చేసింది.
5. పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ బలహీనతలను బహిర్గతం చేయడం: పాకిస్తాన్‌కు చైనా సరఫరా చేసిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత వైమానిక దళం దారిమళ్లించి, వాటిని నిర్వీర్యం చేసింది. రాఫెల్ జెట్లు, స్కాల్ప్ క్షిపణులు, హామర్ బాంబులను ఉపయోగించి కేవలం 23 నిమిషాల్లోనే మిషన్‌ను పూర్తి చేసింది, ఇది భారత సాంకేతిక నైపుణ్యాన్ని ఘనంగా ప్రదర్శించింది.
6. భారత గగనతల రక్షణ వ్యవస్థ ఆధిపత్యం ప్రదర్శించింది: స్వదేశీ ఆకాష్టీర్ వ్యవస్థ సహా భారత బహుళ-దశల గగనతల రక్షణ వ్యవస్థ, వందలాది డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసింది. ఇది అధునాతన రక్షణ వ్యవస్థలను ఎగుమతి చేయడంలో పెరుగుతున్న భారత సామర్థ్యాలను కూడా ప్రదర్శించింది.
7. తీవ్రతరం లేకుండా కచ్చితత్వం: పౌరుల.. ఉగ్రవాదేతర సైనిక శిబిరాలను లక్ష్యాల నుంచి తప్పించింది, పూర్తి స్థాయి యుద్ధంగా మారకుండా పరిస్థితిని అదుపు చేస్తూ ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించని వైఖరిని సంయమనంతో ప్రదర్శించింది.
8. కీలక ఉగ్రవాద కమాండర్ల హతం: భారత మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అనేక మంది హై ప్రొఫైల్ ఉగ్రవాదులను ఒకే రాత్రిలో మట్టుబెట్టారు, ఇది ఉగ్రవాదుల కీలకమైన కార్యాచరణ స్థావరాలను పూర్తిగా దెబ్బతీసింది. యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదస్సిర్ అహ్మద్ వంటి అధిక రివార్డు ఉన్న లక్ష్యాలను హతమార్చింది. ఈ ఉగ్రవాదులు ఐసీ-814 హైజాక్, పుల్వామా పేలుళ్లతో సంబంధం కలిగి ఉన్నారు.
9. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై వైమానిక దాడులు: మే 9–10 తేదీల్లో, ఒకే ఆపరేషన్‌లో అణ్వాయుధ దేశానికి చెందిన 11 వైమానిక స్థావరాలపై దాడి చేసి, పాకిస్తాన్ వైమానిక దళ ఆస్తుల్లో 20 శాతం ఆస్తులను ధ్వంసం చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. భూలారి వైమానిక స్థావరంలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్ మరణం సహా, కీలకమైన యుద్ధ విమానాల ధ్వంసంతో పాటు అధిక ప్రాణనష్టం జరిగింది.
10. త్రివిధ దళాల సమన్వయ చర్య - భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం పూర్తి సమన్వయంతో పనిచేశాయి, నానాటికీ మెరుగువుతున్న భారత ఉమ్మడి సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించాయి.
11. ప్రపంచానికి సందేశం అందించింది - భారత్ తన ప్రజలను రక్షించుకునే విషయంలో ఎవరి అనుమతి అవసరం లేదని ప్రపంచానికి చాటింది. ఉగ్రవాదులు, వారి సూత్రధారులు ఎక్కడా దాక్కోలేరనే ఆలోచనను ఇది బలోపేతం చేసింది, పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటే, భారత్ నిర్ణయాత్మక ప్రతిదాడికి సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేసింది.
12. విస్తృతస్థాయిలో ప్రపంచ మద్దతు - మునుపటి ఘర్షణల మాదిరిగా కాకుండా, ఈసారి పలువురు ప్రపంచ నాయకులు సంయమనం పాటించాలంటూ పిలుపునివ్వకుండా భారతదేశానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. ఈ మార్పు ప్రపంచంలో మెరుగైన భారత స్థితిని, తిరుగులేని నాయకత్వాన్ని ప్రదర్శించింది.
13. కాశ్మీర్ కథనం పునర్లిఖితం - మొదటిసారిగా, భారత చర్యలను పూర్తిగా ఉగ్రవాద వ్యతిరేక చర్యలుగా పరిగణించారు, కశ్మీర్ సమస్య గురించిన అసత్య కథనాలను పూర్తిగా వేరు చేసి అసలు సమస్యను వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ కచ్చితత్వం, స్పష్టత ద్వారానే ఇది సాధ్యమైంది.
ముగింపు:
పహల్గామ్ దాడికి భారత్ ప్రతిస్పందన చట్టపరంగా, నైతికత ప్రాతిపదికన దృఢంగా ఉంది. చరిత్ర దీనిని నాయకత్వం, నీతి, వ్యూహాత్మక కచ్చితత్వంతో రూపొందించిన సూత్రప్రాయమైన, జాగ్రత్తగా ప్రణాళిక చేసిన ప్రతీకార చర్యగా గుర్తుంచుకుంటుంది. ఆపరేషన్ సిందూర్ దక్షిణాసియా భౌగోళిక రాజకీయ, వ్యూహాత్మక దృశ్యానికి కొత్త నిర్వచనమిచ్చింది. ఇది కేవలం సైనిక ప్రచారం కాదు, భారత సార్వభౌమాధికారం, సంకల్పం, ప్రపంచ స్థితి గురించిన బహుమితీయ ప్రకటన. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వంలో, భారత్ ఒక సరికొత్త నమూనాను ప్రదర్శించింది, ఇది సంయమనాన్ని బలంతో.. కచ్చితత్వాన్ని ఉద్దేశంతో మిళితం చేస్తుంది. ఉగ్రవాద నెట్‌వర్క్‌లను, వారికి సహకరిస్తున్న వారిని అపూర్వమైన స్పష్టతతో లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, సరిహద్దులు.. దౌత్య సంక్లిష్టతలతో సంబంధం లేకుండా ఉగ్రవాదంపై వేగవంతమైన, తగిన ప్రతిస్పందన ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని భారత్ అందించింది.
ఆపరేషన్ సిందూర్: భారత వ్యూహాత్మక స్పష్టత, తిరుగులేని శక్తి
***
(Release ID: 2128863)