శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
డీఎస్‌టీ ప్రాజెక్టులపై డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్ష: ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డీప్-టెక్ అంకుర సంస్థలకు మద్దతు ఇవ్వాలని పిలుపు
· సైన్సులో ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్‌ను నడిపించే స్వదేశీ ఏఐ ఓపెన్ స్టాక్ రూపొందించే అంశంలో ఆసక్తి కనబరిచిన మంత్రి
· వైద్య ఆవిష్కరణలను ప్రోత్సహించేలా పరిశోధనా పార్కులను ఏర్పాటు చేయడంలో మెడికల్ కళాశాలలకు సహకరించాలని ఏఎన్ఆర్ఎఫ్‌కు డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి
Posted On:
05 MAY 2025 4:53PM by PIB Hyderabad
సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ)పై ఈ రోజు నిర్వహించిన సమగ్ర సమీక్షకు కేంద్ర శాస్త్ర సాంకేతిక, భౌగోళిక మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయం, అణు ఇంధన, అంతరిక్షం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహించారు. ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డీప్ టెక్ అంకుర సంస్థలు, మెరుగైన మౌలిక వసతుల భాగస్వామ్యంతో సహా సైన్స్ ఆధారిత వృద్ధిలో నూతన పంథాను అనుసరించాలని పిలుపునిచ్చారు.
నూతనంగా ఏర్పాటు చేసిన అనుసంధాన్ నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) పోషిస్తున్న పాత్రను వివరించారు. అలాగే, ప్రస్తుతం కొనసాగుతున్న జియోస్పేషియల్ కార్యక్రమం లాంటి జాతీయ అంశాలపై మంత్రి ప్రధాన దృష్టి సారించారు.
ప్రొఫెసర్ అభయ్ కరాండికర్, ఏఎన్ఆర్ఎఫ్ సంస్థకు సీఈవోగా ఇటీవలే నియమితులైన డాక్టర్ కల్యాణ రామన్‌తో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులతో డాక్టర్ జితేంద్ర సింగ్ విస్తృత చర్చలు జరిపారు. ఏఎన్ఆర్ఎఫ్ లక్ష్యం గురించి డాక్టర్. కల్యాణ్ రామన్ వివరించారు. పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రైవేటు సంస్థలతో కలసి పనిచేయడం, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్), డీఆర్‌పీఏ లాంటి అంతర్జాతీయంగా విజయం సాధించిన సంస్థల వ్యూహాత్మక నమూనాతో రూపొందించిన విధానాల గురించి తెలియజేశారు.
స్వదేశీ ఆవిష్కరణలను పెంపొందించడమే లక్ష్యంగా ‘‘స్మాల్ బిజినెస్ డీప్ టెక్ ఇన్నోవేషన్’’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏఎన్ఆర్ఎఫ్ సన్నద్ధమవుతోంది. ఇది వాస్తవ ప్రపంచ వినియోగానికి తగిన విప్లవాత్మక సాంకేతికతలను రూపొందించేలా అంకురసంస్థలు, ఎంఎస్ఎంఈలకు తోడ్పడుతుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న జాతీయ పరిశోధనా సదుపాయాలను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి, ‘‘క్లౌడ్ ఆఫ్ రీసెర్చి అండ్ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’’ డిజిటల్ వేదికను తయారుచేయడానికి ఏఎర్ఆర్ఎఫ్ రూపొందించిన ప్రణాళికను మంత్రి సమీక్షించారు. ఈ డిజిటల్ వేదిక దేశవ్యాప్తంగా ఉన్న డీప్-టెక్ అంకురసంస్థలు, విద్యాసంస్థలకు ప్రయోగ పరికరాలు, వసతులను ఉపయోగించుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ చర్య పరిశోధన సామర్థ్యాలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి, అత్యాధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులో లేని చిన్న స్థాయి పరిశోధకులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
ఈ సమీక్షలో ఏఎన్ఆర్ఎఫ్ అనుసరిస్తున్న ‘‘ఏఐ-ఫర్-సైన్స్’’ కార్యక్రమం గురించి ప్రధానంగా చర్చించారు. భౌతిక, రసాయన, జీవ శాస్త్రాల్లో పరిశోధనలను వేగవంతం చేయడానికకి కృత్రిమ మేధ వినియోగాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన ప్రాజెక్టులకు ప్రారంభించి, భవిష్యత్తులో కచ్చితమైన ఫలితాలను సాధించాలని మంత్రి ఏఎన్ఆర్ఎఫ్ సిబ్బందిని ఆదేశించారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లలతో కలసి ఏఎన్ఆర్ఎఫ్ లక్ష్యం, సహకార అవకాశాల గురించి అవగాహన కల్పించాలని సీఈవోకు సూచించారు.
తమ సొంత ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేసుకొనేలా వైద్య కళాశాలలకు సహకరించే అవకాశాన్ని అన్వేషించాలని ఏఎన్ఆర్ఎఫ్‌ను డాక్టర్. జితేంద్ర సింగ్ ఆదేశించారు. ఇది వైద్య ఆవిష్కరణలను, స్థానికంగా బయోటెక్ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుంది. అలాగే భారతీయ పరిశోధకుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చేసిన సైన్స్, ఇంజనీరింగ్ విధానాలతో ‘‘ఇండియ ఏఐ ఓపెన్ స్టాక్’’ను రూపొందించాల్సిన ప్రాధాన్యాన్ని సైతం మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇది ఏఐ ఆధారిత అప్లికేషన్లలో అంతర్జాతీయంగా భారత్‌ను ముందంజలో నిలుపుతుందని ఆయన పేర్కొన్నారు.
‘‘డీప్ సైన్స్ – టు – డీప్ టెక్ యాక్సిలరేషన్’’ భావన గురించి సైతం డాక్టర్ జితేంద్ర చర్చించారు. ప్రచురణలు, పేటెంట్లు వంటి విద్యా పరిశోధనలను వాణిజ్య సాంకేతికతలుగా మార్చడంపై దృష్టి సారించాలని ఏఎన్ఆర్ఎఫ్‌కు సూచించారు. ఆవిష్కరణలు ప్రయోగశాలలకే పరిమితమై పోకుండా చూసేందుకు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో కలసి వెంచర్-బిల్డర్ నమూనాలను రూపొందించాల్సిన అవసరాన్ని ఆయన తెలియజేశారు.
వాతావరణ అంచనా, మెటీరియల్ సైన్స్, ఏరో స్పేస్, బయో కెమిస్ట్రీ, ఔషధాలను అభివృద్ధి చేయడం సహా జాతీయ ప్రయోజనాలున్న కీలకమైన అంశాలకు ప్రాధాన్యమివ్వాలని ఏఎన్ఎఆర్ఎఫ్‌ను మంత్రి కోరారు. అలాగే.. ఆవిష్కరణలకు అతీతంగా పరిశోధన, అంకుర సంస్థలు, పరిశ్రమలను ఏకీకృతం చేసే ప్రభావవంతమైన వ్యవస్థ దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
***
(Release ID: 2127221)
Visitor Counter : 8