శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సీఎస్ఐఆర్- జమ్మూ ఐఐఐఎం మార్గనిర్దేశం చేసిన సోలార్ మెక్ ఇంజిన్‌కు ఆనర్స్ గ్రాడ్యూ- 2025 స్కాలర్ షిప్ పురస్కారాల్లో అగ్రస్థానం
Posted On:
05 MAY 2025 1:11PM by PIB Hyderabad
భారతీయ విద్యార్థి ఆవిష్కరణల్లో ఇదో కీలక విజయం. డల్హౌసీ పబ్లిక్ స్కూలుకు చెందిన 12వ తరగతి విద్యార్థి జప్‌తేగ్ సింగ్ బామ్రా- సోలార్ మెక్ ఇంజిన్ అనే అద్భుతమైన ఆవిష్కరణకుగాను ప్రతిష్ఠాత్మక ‘బిల్డ్ ఎ బెటర్ ఫ్యూచర్’ పురస్కారాన్ని పొంది, ప్రతిష్ఠాత్మక ఆనర్స్‌గ్రాడ్యూ-2025 స్కాలర్షిప్ గెలుచుకున్నాడు.
జిజ్ఞాస హ్యాకథాన్ కార్యక్రమం కింద జమ్మూలోని సీఎస్ఐఆర్- భారత సమీకృత ఔషధ సంస్థ (ఐఐఐఎం) శాస్త్రవేత్త డాక్టర్ నసీర్ ఉల్ రషీద్… ఈ విద్యార్ధికి మార్గ నిర్దేశకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా వేలాదిగా పాల్గొన్న అభ్యర్థుల్లో నుంచి ఎంపిక చేసిన అయిదుగురు విజేతల్లో ఒకరిగా జప్‌తేగ్ నిలిచారు. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ విద్య కోసం 10,000 డాలర్ల స్కాలర్‌షిప్‌తోపాటు తన ఆవిష్కరణను మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లడం కోసం అదనంగా 5,000 డాలర్ల ఆర్ధిక సహాయాన్ని కూడా పొందాడు. ఈ ఏడాది విజేతల్లో ఆయన ప్రాజెక్టు టాప్ టెక్నాలజీగా గుర్తింపు పొందడం గమనార్హం.
విద్యార్థుల నేతృత్వంలో సుస్థిర, ఆవిష్కరణాత్మక ప్రాజెక్టులకు చేయూతనిచ్చే అమెరికా కేంద్రంగా పనిచేసే లాభాపేక్ష లేని సంస్థ ఆనర్స్ గ్రాడ్యుయేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆనర్స్ గ్రాడ్యూ స్కాలర్‌షిప్ అత్యంత పోటీతో కూడుకున్నది. ఏటా ప్రపంచవ్యాప్తంగా అయిదు అవార్డులను మాత్రమే అందిస్తుంది. 2012లో ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ తరఫున ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన తొలి, ఏకైక విద్యార్థి జప్‌తేగ్ కావడం విశేషం. ఇది దేశానికి గర్వకారణమైన క్షణం.
జమ్మూలోని సీఎస్ఐఆర్-ఐఐఐఎంలో ఫిబ్రవరి 22-23 తేదీల్లో జరిగిన జాతీయ స్టార్టప్ ఉత్సవంలో.. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి, సీఎస్ఐఆర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఎదుట జప్‌తేగ్ తన సోలార్ మెక్ ఇంజిన్‌ను ప్రదర్శించారు. 2015లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించి, డాక్టర్ సింగ్ నేతృత్వం వహించిన ‘స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా’ కార్యక్రమం ద్వారా దేశంలో క్షేత్రస్థాయి ఆవిష్కరణలకు పెరుగుతున్న ఆదరణను ఈ ఉత్సవం చాటిచెప్పింది.
గతంలో 2024 సీఎస్ఐఆర్ జిజ్ఞాస హ్యాకథాన్‌ను గెలుచుకున్న సోలార్ మెక్ ఇంజిన్ కేంద్రీకృత ఊష్ణం-శక్తి (సీహెచ్‌పీ) సాంకేతికత ఆధారంగా పనిచేసే ఒక స్వతంత్ర సూర్య తాప వ్యవస్థ. ఉష్ణోగ్రత భేదాల కారణంగా, ఇది వాయు వ్యాకోచ సంకోచ ఆవృత్త సూత్రాలను ఉపయోగించి.. ఉష్ణ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. తక్కువ నిరోధకత ఉన్న జనరేటర్ దీని ముఖ్య లక్షణం. యాంత్రిక శక్తిని నేరుగా విద్యుత్ శక్తిగా మార్చడం కోసం ఇది విద్యుదయస్కాంత ప్రేరణను ఉపయోగిస్తుంది. రివర్సబుల్ హీట్ పంప్ సామర్థ్యంతో పనిచేయడం దీని ప్రత్యేకత. ఇది దీనిని అత్యంత సమర్థవంతమైన, పర్యావరణ హితమైన శక్తి సాధనంగా నిలుపుతుంది.
జప్‌తేగ్ ప్రాజెక్టుకు సీఎస్ఐఆర్-ఐఐఐఎం అందించిన ప్రోత్సాహం, మార్గ నిర్దేశకత్వం.. యువ ఆవిష్కర్తలను సాధికారులను చేసి, వారి ఆలోచనలను ఆచరణాత్మక, అధునాతన సాంకేతికతలుగా తీర్చిదిద్దడంలో సంస్థ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
జప్‌తేగ్ సృజనాత్మక, అకడమిక్ నైపుణ్యాలను గుర్తించిన అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలోని పదికి పైగా అగ్రగామి యూనివర్సిటీలు.. తన అండర్ గ్రాడ్యుయేట్ చదువుల కోసం అదనంగా 16,000 డాలర్ల విలువైన వార్షిక స్కాలర్ షిప్‌తో ఆఫర్లను అందించాయి.
మొత్తం 31,000 డాలర్ల గ్రాంటుతో తన సోలార్ మెక్ ఇంజిన్‌ను మరింత మెరుగుపరచాలని, ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను కొనసాగించాలని జప్‌తేగ్ సింగ్ బామ్రా భావిస్తున్నారు. పాఠశాలలో ఆవిష్కరణల నుంచి అంతర్జాతీయంగా సుస్థిరతావాదిగా ఆయన ప్రస్థానం.. మెరుగైన భవిష్యత్తును నిర్మించడంలో మార్గదర్శకత్వం, దార్శనికత, క్షేత్రస్థాయి ఆవిష్కరణల శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.
***
(Release ID: 2127088)
Visitor Counter : 6