యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను పాట్నాలోని పాటలీపుత్ర స్పోర్ట్‌స్ కాంప్లెక్స్‌లో వర్చువల్ పద్ధతిన ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
* ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు బీహార్ ఆతిథ్యమిచ్చి, ప్రధాని శ్రీ మోదీ క్రీడా దార్శనికతను ఓ మెట్టు పైకి తీసుకువెళ్లింది: డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా
* ఖేలో ఇండియా ఏడాది పొడవునా సాగుతుంది: డాక్టర్ మాండవియా...
‘స్పోర్ట్‌స్ క్యాలెండర్‌లో మరిన్ని గేమ్స్‌కు స్థానం కల్పిస్తాం’
* ప్రతిభను గుర్తించి, 2036 ఒలింపిక్స్ కు విజేతలను తయారు చేయడానికి వారిని తీర్చిదిద్దడం అవసరమని ప్రధానంగా చెప్పిన కేంద్ర క్రీడామంత్రి
Posted On:
04 MAY 2025 8:50PM by PIB Hyderabad
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏడో సంచికను మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ రోజు బీహార్‌లో ప్రారంభించారు. ఈ గేమ్స్‌లో పతకాలను ప్రదానం చేసేందుకు ఉద్దేశించిన 27 క్రీడావిభాగాలతో పాటు ప్రదర్శన పద్ధతి (డెమాన్‌స్ట్రేషన్ స్పోర్ట్)లో మరో క్రీడ భాగంగా ఉంటాయి. ఈ క్రీడలు ఈ నెల 15న ముగుస్తాయి.
ప్రధాని శ్రీ మోదీతో పాటు బీహార్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నీతీశ్ కుమార్, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మాన్య డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర సహాయ మంత్రి మాన్య శ్రీమతి రక్షా ఖడ్సేలతో పాటు బీహార్ ప్రభుత్వానికి, బీహార్ రాష్ట్ర క్రీడా ప్రాధికరణ సంస్థకు చెందిన అనేక మంది ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీహార్ నిర్వహిస్తున్న మొట్టమొదటి ప్రధాన బహు విభాగాల క్రీడా కార్యక్రమమిది. పతకాలను ప్రదానం చేసేందుకు ఉద్దేశించిన 27 క్రీడావిభాగాలను పాట్నా, రాజ్‌గీర్, భాగల్పూర్, గయ, బెగూసరాయి.. ఈ అయిదు నగరాల్లోనూ, న్యూఢిల్లీలోనూ నిర్వహిస్తున్నారు. తొలిసారిగా కేఐవైజీ (ఖేలో ఇండియా యూత్ గేమ్స్) ప్రోగ్రాములో సేపక్ తక్రాను పతక క్రీడావిభాగంగా చేర్చారు. ఇ-స్పోర్ట్‌స్‌ను ప్రదర్శన ఈవెంట్ గా ఏర్పాటు చేస్తున్నారు. కేఐవైజీ 2025లో 6,000 మంది కి పైగా అథ్లెట్లు సహా 10,000 మందికి పైగా పాల్గొంటారు.
ఈ ఏడాది మార్చి నెలలో పాట్నాలో అంతర్జాతీయ సేపక్‌తక్రా సమాఖ్య (ఐఎస్‌టీఏఎఫ్) ప్రపంచ కప్‌లో భారతీయ పురుషుల రెగు (ముగ్గురు ప్లేయర్ల) జట్టు తన మొట్టమొదటి బంగారు పతకాన్ని సాధించిన సంగతిని ప్రస్తావించడం ఈ సందర్భంగా సముచితం.
ఈ విజయం దేశవ్యాప్తంగా ఉత్సవాలకు నాంది పలికింది. మాన్య ప్రధాన మంత్రి తన శుభాకాంక్షలను తెలియజేశారు. పాటలీపుత్ర స్పోర్ట్‌స్ కాంప్లెక్స్‌లో చేజిక్కిన ఈ గెలుపు ఐఎస్‌టీఏఎఫ్ ప్రపంచ కప్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనకు సంకేతంగా ఉంది. ఈ క్రీడాంశంలో నాలుగు ఖండాల నుంచి 21 దేశాలు మొత్తం ఏడు ఈవెంట్లలో పోటీపడ్డాయి.
డాక్టర్ మాండవియా మాట్లాడుతూ ‘‘ఇది బీహార్‌కు చాలా ముఖ్యమైన కాలం. నలందా, విక్రమ్‌శిల ప్రధాన జ్ఞాన కేంద్రాలుగా ఎలా విరాజిల్లాయో చరిత్రను పరిశీలించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇదే గడ్డ మనకు కొత్త క్రీడాభివృద్ధి కేంద్రాలను ప్రసాదిస్తోంది. ఇది బీహార్ ఎంతో గర్వపడాల్సిన విషయం’’ అన్నారు.
ఆయన ఇంకా ఇలా అన్నారు.. ‘‘ప్రధాన ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించగల సామర్థ్యం ఉన్న రాష్ట్రంగా బీహార్ ఇమేజిని తీర్చిదిద్దడానికి ఈ గేమ్స్ ఒక అవకాశాన్ని ప్రసాదిస్తున్నాయి. వికసిత్ భారత్‌లో ‘వికసిత్ బీహార్’ ఒక భాగంగా ఉంటుంది. బీహార్‌లో ప్రతి క్రీడా ప్రతిభాశాలికి ఇక ఒక వేదికతోపాటు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక అవకాశం కూడా అందివస్తుంది. భారత్ నిర్వహించాలని తపిస్తున్న 2026 వేసవి ఒలింపిక్స్‌లో రాణించాలంటే ప్రతిభకు సరి అయిన విధంగా పదును పెట్టడం అనేది కీలకం’’.
ఖేలో ఇండియా ప్రోగ్రామ్‌లో బీహార్‌ది ఓ ముఖ్య పాత్ర. దేశం అంతటా 1048 ఖేలో ఇండియా సెంటర్లు ఉంటే, 38 ఖేలో ఇండియా సెంటర్లను బీహార్‌లోని అన్ని జిల్లాలలోనూ ఏర్పాటు చేశారు. ఇదివరకు విజేతలుగా ఉన్న క్రీడాకారులు సారథ్యం వహిస్తున్న ఈ కేంద్రాలు క్రీడల పట్ల ఉద్వేగం కలిగి ఉన్న పలువురికి క్షేత్రస్థాయిలో మార్గదర్శనం చేస్తున్నాయి.
ఈ ఖేలో ఇండియా సెంటర్లు టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, ఫుట్‌బాల్, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్, విలువిద్య, బాక్సింగ్, కబడ్డి, వుషు వంటి అనేక క్రీడాంశాల్లో శిక్షణావకాశాలు కల్పిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో మొత్తం 939 మంది అథ్లెట్లు ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. వారిలో 473 మంది పురుషులు. 466 మంది మహిళలు. అదనంగా, 34 ఖేలో ఇండియా స్టేట్ ఎక్స్‌లెన్స్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు.
క్రీడల్లో బీహార్ క్రమంగా మెరుగైన ఫలితాలను సాధిస్తోందనడానికి ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన నేషనల్ గేమ్సే ఒక సూచిక. ఆ నేషనల్ గేమ్స్‌లో బీహార్ 12 పతకాలు గెలిచింది. వాటిలో ఒక బంగారు పతకం కూడా ఉంది. నేషనల్ గేమ్స్‌లో బీహార్ కనబరచిన అత్యుత్తమ ప్రదర్శన ఇది.
డాక్టర్ మాండవీయ మాటలలో చెప్పాలంటే ‘‘బీహార్ క్రీడారంగంలో మంచి రోజులు మొదలయ్యాయి. ప్రధాని శ్రీ మోదీ కూడా ఇదే సరి అయిన తరుణమని విశ్వసిస్తున్నారు. ఇదంతా సాధ్యమైందంటే అందుకు సువ్యవస్థిత శిక్షణ, క్రీడాకారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, స్థానికంగా అందుతున్న మద్దతు.. ఇవన్నీ కూడా కారణాలే. మనం కాస్తంత ఓపిక పడితే చాలు... ప్రతిభావంతులు కాలక్రమంలో పెద్ద పేరు సంపాదిస్తారు.’’
డాక్టర్ మాండవీయ ‘సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం దేశం నలుమూలల పుంజుకొంటోంది. ఊబకాయం వంటి జీవనశైలి సమస్యలను తప్పించుకోవాలంటే ఫిట్‌నెస్ పట్ల అవగాహన తప్పనిసరి’’ అని పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో ఖేలో ఇండియా క్యాలండర్‌లో కొత్త కొత్త ఈవెంట్లు చోటు చేసుకుంటాయని క్రీడల శాఖ మంత్రి తెలిపారు. ఈ ఈవెంట్లు మరింత మంది పాల్గొనేవిగా ఉంటాయని కూడా ఆయన అన్నారు.
రాబోయే కాలంలో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్, దీవ్‌లో బీచ్ గేమ్స్, దక్షిణ భారతదేశంలో ఖేలో ఇండియా స్వదేశీ గేమ్స్, ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన గేమ్స్ వంటి వాటిని నిర్వహించనున్నట్లు డాక్టర్ మాండవియా తెలిపారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి https://youth.kheloindia.gov.in/ ని క్లిక్ చేయండి.
కేఐవైజీ 2025 పతకాల పట్టిక కోసం https://youth.kheloindia.gov.in/medal-tally ని క్లిక్ చేయండి
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గురించి
‘ఖేలో ఇండియా’ కార్యక్రమంలో ఓ భాగంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను 2017 అక్టోబరు 14న ప్రారంభించారు. ప్రాతినిధ్యాన్నిపెద్ద ఎత్తున పెంచడం, మెరికల్లాంటి క్రీడాకారులను తీర్చిదిద్దడం అనే రెండూ ఖేలో ఇండియా ముఖ్యోద్దేశాలు. క్రీడారంగంలో భారత్ సాఫల్యానికి ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడింది. ఖేలో ఇండియా దన్నుగా నిలిచిన క్రీడాకారులు, క్రీడాకారిణులు ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ సహా అనేక ప్రపంచ ఈవెంట్లలో మన దేశం తరఫున పాల్గొంటున్నారు. బీహార్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏడో సంచికకు ఈ నెల 4 నుంచి 15వ తేదీ వరకు ఆతిథ్యాన్నిస్తోంది. ఈ గేమ్స్‌ను బీహార్‌లోని అయిదు నగరాలతో పాటు ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. మొట్టమొదటి సారిగా ఇ-స్పోర్ట్‌స్‌ను ప్రదర్శన పద్ధతి క్రీడ (డెమాన్‌స్ట్రేషన్ స్పోర్ట్)గా దీనిలో చేర్చారు.
***
(Release ID: 2126911)
Visitor Counter : 14